S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూపల్లి వర్సెస్ రేవంత్

కొడంగల్, జూన్ 9: మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలంలో గురువారం జరిగిన అభివృద్ధి పనుల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సమస్య తీవ్రం కావడంతో ఇద్దరూ వ్యక్తిగత దూషణలు పాల్పడ్డారు. ఈ సంఘటన కోస్గి మండలంలోని బోదారం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే...గ్రామానికి మంజూరైన రోడ్లను పరిశీలించిన మంత్రి జూపల్లి అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గతంలో ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ రాష్ట్ర సాధనకు అడ్డుతగిలారని, ప్రస్తుతం ప్రాజెక్టుల కోసం మళ్లీ అడ్డుతగులుతున్నారని నిప్పులు చెరిగారు.

నల్లగొండ నుంచే ‘విస్తరణ’ వ్యూహం

నల్లగొండ, జూన్ 9: దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించాలన్న బిజెపి లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణలో సైతం ఆ పార్టీ నాయకత్వం పలు వ్యూహాలను అమలు చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బిజెపి దేశవ్యాప్తంగా చేపట్టిన ‘వికాస్ పర్వ్’ కార్యక్రమం ద్వారా తెలంగాణలో బిజెపి విస్తరణకు ఆ పార్టీ ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో ఆది నుండి ఉద్యమాల ఖిల్లాగా పేరొందిన నల్లగొండ జిల్లా నుండే బిజెపి తెలంగాణ విస్తరణ వ్యూహం అమలుకు శ్రీకారం చుట్టింది.

అసమర్థుడి చేతిలో సిఎం పదవి

వరంగల్, జూన్ 9: దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండి, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఒక అసమర్ధుడి చేతిలో ముఖ్యమంత్రి పదవి పెట్టినట్లయిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. గురువారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెండేళ్ల పాలనపై ఆయన మండిపడ్డారు. సిఎం పాలన కొత్త సీసాలో పాత సారాలా ఉందని ఆయన విమర్శించారు. గత రెండేళ్లుగా ప్రజా సమస్యలు ఎక్కడికక్కడే స్తంభించిపోయాయని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఫాంహౌస్‌కే పరిమితమై సచివాలయానికి రాకపోవడంతో ఎక్కడి ఫైల్‌లు అక్కడే మూలుగుతున్నాయన్నారు.

ప్రత్యేక జిల్లా రాదనే వ్యథతో జనగామ యువకుడి హఠాన్మరణం

జనగామ, జూన్ 9: జనగామ జిల్లా రాదనే వ్యథతో ఒక యువకుడు హఠాన్మరణం చెందాడు. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. మృతుని బంధువుల కథనం ప్రకారం... వరంగల్ జిల్లా జనగామ పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన ఎండి. జహంగీర్ (32) గురువారం మధ్యాహ్నం వరకు జనగామ చౌరస్తాలో జరిగిన రాస్తారోకోలో పాల్గొని రాత్రికి ఇంటికి వచ్చాడు. తన దగ్గర మిత్రులతో జనగామ జిల్లా విషయం గురించి చర్చిస్తూనే కిందపడి అక్కడికక్కడే మరణించాడు.

ముంపు గోడు.. దేవుడెరుగు!

సంగారెడ్డి, జూన్ 9: వ్యవసాయం కోసం నీటి ప్రాజెక్టులు, ఉపాధి కోసం పారిశ్రామిక కారిడార్ల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించిన పథకాల్లో వేలాది ఎకరాల భూమి కనుమరుగు కానుండగా, ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారంపై అన్నదాతలు అలకపాన్పునెక్కారు. బాధితుల పక్షాన పోరాటం చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు రంగప్రవేశం చేయడంతో లాభం మాట దేవుడెరుగుకానీ ప్రభుత్వం మాత్రం పిసరంత కూడా స్పందించడం లేదు. గోదావరి జలాలను సాగునీటికి అందించడానికి మెదక్ జిల్లా తొగుట, కొండపాక మండలాల్లో నిర్మించతలపెట్టిన మల్లన్న సాగర్ సాగునీటి ప్రాజెక్టు వివాదాస్పదంగా మారింది.

జూపల్లి కాన్వాయ్‌ని అడ్డుకున్న ఓయు జెఎసి

మహబూబ్‌నగర్, జూన్ 9: టిజెఎసి చైర్మన్ కోదండరాంపై రాష్ట్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఓయూ జెఎసి విద్యార్థులు భగ్గుమన్నారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం బోగారం గ్రామంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కార్యక్రమానికి మంత్రి జూపల్లి వస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఓయూ జెఎసి విద్యార్థులు కొందరు భోగారం గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోకి మంత్రి కాన్వాయ్ రాగానే విద్యార్థులు ఫ్లకార్డులు ప్రదర్శించి టిజెఎసి చైర్మన్ కోదండరాంపై రాష్ట్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, వారు క్షమాపణ చెప్పాలంటూ నిరసనకు దిగారు.

నిజామాబాద్ జైలులో జీవిత ఖైదీ మృతి

వినాయక్‌నగర్, జూన్ 9: కట్టుకున్న భార్యను హత్య చేసిన కేసులో నిజామాబాద్ జిల్లా కారాగారంలో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న రఫీక్ అనే వ్యక్తి గురువారం మృతి చెందినట్లు రూరల్ ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దోమకొండ మండలానికి చెందిన రఫీక్ అనే వ్యక్తికి భార్యను హత్య చేసిన కేసులో 2010లో న్యాయస్థానం జీవితఖైదు శిక్షను విధించింది. ఇందులో భాగంగా జిల్లా కారాగారంలో శిక్షను అనుభవిస్తున్న రఫీక్ గురువారం ఉదయం జిల్లా జైలులో వాటర్ ట్యాంక్‌ను శుభ్రపరుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారిపడంతో మృతి చెందాడు.

మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకం

హైదరాబాద్, జూన్ 9: పలు జిల్లాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్‌గా రణం జ్యోతిని నియమించారు. మిరుదొడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎన్ బాపురెడ్డి, మహబూబ్‌నగర్ చైర్మన్‌గా చెరుకుపల్లి రాజేశ్వర్‌లను నియమించారు. గత మూడు రోజుల నుంచి వరుసగా మార్కెట్ కమిటీల పాలక వర్గాలను నియమిస్తున్నారు. ఆయా నియోజక వర్గాల శాసన సభ్యులు, పార్టీ నాయకుల సిఫారసుల మేరకు ఈ నియామకాలు జరుగుతున్నాయి. తొలిసారిగా మార్కెట్ కమిటీల పాలక వర్గాలకు ఎస్‌సి, ఎస్‌టి, బిసి రిజర్వేషన్లు అమలు చేశారు.

రాజీనామా చేసి తెరాసలో చేరండి

నల్లగొండ, జూన్ 9: పార్టీలు మారే వారంతా తమ పదవులకు రాజీనామాలు చేయాలంటూ నిన్నటిదాకా అందరికీ నీతులు చెప్పిన ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా రేపు పార్టీ మారి టిఆర్‌ఎస్‌లో చేరితే ఎంపి పదవికి రాజీనామా చేయాలని సిఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపి పదవికి రాజీనామా చేశాకే టిఆర్‌ఎస్‌లో చేరితేనే గుత్తా మాటలకు విలువ ఉంటుందని, లేకపోతే ప్రజలు ఆయనను క్షమించబోరన్నారు. ఏనాడూ గాంధీభవన్ మెట్లక్కని గుత్తాను కాంగ్రెస్ రెండు పర్యాయాలు ఎంపిగా చేసిందన్నారు.

తిండి లేక నేలకొరుగుతున్న సైబీరియన్ పక్షులు

హిందూపురం, జూన్ 9: కరవు సీమలో పక్షులకూ ఆహారం కొరత ఏర్పడింది. వేల కిలోమీటర్ల దూరం నుంచి సంతానోత్పత్తి కోసం అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం వీరాపురం చేరుకునే ఎర్రమూతి (సైబీరియన్) కొంగలు తిండి దొరక్క మృత్యువాతపడుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో ఈసారి వీరాపురం చెరువుతో పాటు పరిసరాల్లోని కుంటల్లో నీళ్లు అడుగంటాయి. ఫలితంగా చేపలు పెంచలేదు. దీంతో తినేందుకు చేపలు లేక, తాగేందుకు నీళ్లు దొరక్క కొంగలు ఒక్కొక్కొటిగా చనిపోతున్నాయి. ఇప్పటివరకు సుమారు 25 కొంగలు చనిపోయాయని గ్రామస్తులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు కుంటల్లో నీరు చేరడంతో దాహం తీర్చుకుంటున్నాయి.

Pages