S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతు బజారులో ఉల్లిగడ్డలు అమ్ముకోవచ్చు..

కడప,(కల్చరల్)సెప్టెంబర్ 23: రైతులు తమ ఉల్లి పంటను రైతు బజారులో అమ్ముకోవచ్చని మార్కెటింగ్ సంచాలకులు బి.శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లాలో ఉల్లిసాగు విస్తీర్ణం 1765 హెక్టార్లలో సాగుచేయడంతోపాటు పొరుగు రాష్టమ్రైన మహారాష్ట్ర, పొరుగు జిల్లా కర్నూలు జిల్లా నుంచి అధికమొత్తంలో ఉల్లి దిగుమతి అవుతోందని అందువల్ల కడప జిల్లాలో ఉల్లిరైతులకు డిమాండ్ లేకపోవడంతో ఉల్లి ధరలు గణనీయంగా తగ్గాయని ఉల్లి రైతులు నష్టపోకుండా ప్రభుత్వమే మొదటి రకం రూ.8లు, రెండవ రకం రూ.7లు, మూడవ రకం రూ.6లుతో రైతుల పొలాల వద్దే కొనుగోలుచేసి రైతు బజారులో అమ్ముకునేందుకు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

పట్టణ సుందరీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి

కడప,సెప్టెంబర్ 23: పట్టణసుందరీకణ కోసం కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలతో కూడిన ప్రతిపాదనలు తయారు చేయాలని మేయర్ కె.సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా పేర్కొన్నారు. శుక్రవారం కార్పొరేషన్ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్యం లోపించడం వల్ల జ్వరాల బారిన ప్రజలు పడుతున్నారని, అదేవిధంగా ప్రజల సమస్యలు పరిష్కారానికి ప్రణాళికలు తయారుచేసి ప్రణాళికల ప్రకారమే అంచలంచలుగా పనులు చేపట్టాలని కేటాయించిన లక్ష్యాలను అధిగమించాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు.

జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ..

రాయచోటి, సెప్టెంబర్ 23: జిల్లాలో డెంగ్యూ, మలేరియా తదితర జ్వరాలు ప్రబలుతున్న నేపత్యంలో కలెక్టర్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించినట్లు జిల్లా మలేరియా అధికారి త్యాగరాజు అన్నారు. రాయచోటి పీపీ యూనిట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో జనవరి నుండి జ్వరబాధితుల నుండి 3,09,264 మందికి రక్తనమూనాలను సేకరించినట్లు తెలిపారు. జిల్లాలో మలేరియా నిర్ధారణ కేసులు 589 నమోదయ్యాయని, ఈ నెల 19 నుండి ఐదు రోజులుగా రాయచోటి పట్టణంలో డెంగ్యూ, మలేరియా ప్రత్యేక సంచార బృందం స్థానిక పీపీ యూనిట్ సిబ్బందితో కలిసి దోమల లార్వా సర్వే, జ్వరాల సర్వే కోసం 6,396 గృహాలు సందర్శించినట్లు తెలిపారు.

అంచనాలకు అందని వరద నష్టం

గుంటూరు, సెప్టెంబర్ 23: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా గడిచిన మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీవర్షాలతో సంభవించిన వరద నష్టం అంచనాలకు మించుతోంది. ప్రధానంగా సత్తెనపల్లి, చిలకలూరిపేట, క్రోసూరు, అచ్చంపేట, అమరావతి, బాపట్ల, రేపల్లె తదితర మండలాలను వరద ముంచెత్తడంతో వివిధ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పల్నాడు ప్రాంతంలో ఒకేరోజు 20 నుండి 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం, నల్లమడ వాగు పొంగిపొర్లడం తదితర కారణాలతో సుమారు జిల్లావ్యాప్తంగా 41 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి.

వరదల్లో కొట్టుకుపోయిన రైల్వేలైన్

సత్తెనపల్లి, సెప్టెంబర్ 23: వరద బీభత్సంతో రైల్వేశాఖకు అపార నష్టం వాటిల్లింది. సత్తెనపల్లి-పిడుగురాళ్ళ మధ్య పలుచోట్ల రైల్వేట్రాక్ కొట్టుకుపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనితో గుంటూరు-సికింద్రాబాద్, గుంటూరు- మాచర్ల మధ్య నడిచే అన్ని రైళ్ళను రద్దుచేశారు. ఈ మార్గంలో దూళ్లిపాళ్ళ, రెడ్డిగూడెం, అనుపాలెం గ్రామల సమీపాన సుమారు 3 కిలోమీటర్లవరకు రైల్వేలైన్ కొట్టుకుపోయింది. శుక్రవారం రైల్వే అధికారులు సంఘటనా ప్రదేశానికి చేరుకొని యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. కనీసం వారం రోజుల వ్యవధిలో రాకపోకలకు లైన్ క్లియర్ ఇవ్వవచ్చునని చెబుతున్నారు.

నేడు దోమలపై దండయాత్ర-పరిసరాల పరిశుభ్రత

గుంటూరు, సెప్టెంబర్ 23: ఆరోగ్యవంతమైన సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఈనెల 24వ తేదీన దోమలపై దండయాత్ర - పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కోరారు. శుక్రవారం కార్యక్రమ నిర్వహణపై కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. దోమల నివారణకు, ప్రజ ల ఆరోగ్యం కోసం గతంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినా ప్రస్తుత కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు.

డ్రైనేజీ అధికారుల వైఫల్యమే...

పెదనందిపాడు, సెప్టెంబర్ 23: డ్రైనేజీ అధికారుల వైఫల్యం కారణంగానే రైతాంగం ఇక్కట్లకు గురవుతున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ఆరోపించారు. నల్లమడ వాగు పరివాహక ప్రాంతాల్లో వరదముంపునకు గురైన ప్రాంతాలను మంత్రి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పెదనందిపాడు వంతెన వద్ద ఆయన మాట్లాడుతూ అతివృష్టి సమయాల్లో ముంపు తప్పడం లేదన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమార్గాన్ని కనుగొనాల్సిన అధికారులు తమ బాధ్యతను విస్మరించడంతో వాగు పరివాహక ప్రాంత రైతాంగానికి కడగండ్లు తప్పడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు.

ప్రకాశం బ్యారేజ్ నుండి లక్ష క్యూసెక్కుల నీరు విడుదల

తాడేపల్లి, సెప్టెంబర్ 23: కృష్ణా, గుంటూరు సరిహద్ధులోని ప్రకాశం బ్యారేజ్ నుండి లక్ష క్యూసెక్కుల నీరును అధికారులు దిగువకు విడుదల చేశారు. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద సందర్శకులు కృష్ణమ్మ జలకళను చూసేందుకు భారీగా తరలివచ్చారు. కొద్ది రోజుల క్రితం ముగిసిన కృష్ణాపుష్కరాలకు ప్రకాశం బ్యారేజ్ దిగువన అంతంత మాత్రంగా ఉన్న నీటిని చూసిన తమకు వరద పరవళ్ళతో కలకలలాడుతున్న కృష్ణానదిని చూస్తే ఎంతో ఆనందదాయకంగా ఉందంటున్నారు.

మునిగిన పంట పొలాలు

కాకుమాను, సెప్టెంబర్ 23: భారీవర్షాలు, వరద భీభత్సం కారణంగా పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. 15 వేలపై చిలుకు ఎకరాల్లో వరి, ప్రత్తి, మిరప తదితర పంటలు నీటమునిగి జలాశయాలుగా మారాయి. వరద నీటి ఉద్ధృతికి కొల్లిమర్ల డ్రెయిన్ పలుచోట్ల కట్టలు తెగాయి. గరికపాడు, అప్పాపురం గ్రామాల మధ్య కొమ్మమూరు కాల్వకు రెండు భారీ గండ్లు, గార్లపాడు-కొండపాటూరు మధ్య నల్లమడ డ్రెయిన్‌కు ఒక గండి పడి వరదనీరు పొలంపైకి భారీగా చేరింది. ఓ వైపు వర్షం పడుతూ పొలాల్లో నీరు నిలుస్తుండగా, బయటకు వెళ్లేందుకు వీలుపడని రీతిలో డ్రెయిన్లు పొంగిపొరలుతుండటంతో పూర్తిగా జలాశయాలుగా మారాయి.

పొంగిపొర్లుతున్న కొండవీటి వాగు

అమరావతి, సెప్టెంబర్ 23: అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీవర్షాల మూలంగా అమరావతి-విజయవాడ రహదారిలో పెదమద్దూరు వద్ద గల కొండవీటి వాగు గురువారం రాత్రి నుండి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఈ మార్గంలో రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. విజయవాడ బస్సులు పెదమద్దూరు వరకు వచ్చి వెనుదిరుగుతున్నాయి.

Pages