S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగిరిపల్లిలో భారీగా పోలీసుల మోహరింపు

విజయవాడ: కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో సోమవారం ఉదయం ఓ ఎస్‌ఐపై, కానిస్టేబుల్‌పై దాడి చేసేందుకు కొందరు రౌడీషీటర్లు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా మోహరించి రౌడీ షీటర్ల ఇళ్లలో సోదాలు చేసేందుకు నిర్ణయించారు.

ఆ దుష్ప్రచారం కొందరిదే: అశోక్‌బాబు

విజయవాడ: అమరావతికి వెళ్లడానికి ఇష్టం లేని కొద్దిమంది ఉద్యోగులు చేస్తున్న దుష్ప్రచారంతో ఉద్యోగుల సంఘానికి సంబంధం లేదని ఎపి ఎన్టీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. ఆగస్టు నాటికి అన్ని ప్రభుత్వ విభాగాలు అమరావతికి వెళ్లాల్సిందేనని అన్నారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవనాలతో పాటు ప్రైవేటు భవనాలలోకి ఎపి కార్యాలయాలు వెళతాయని అన్నారు. హెచ్‌ఆర్‌ఎ, 5 రోజుల పనిదినాలు వంటి విషయాలపై ప్రభుత్వం ఇప్పటికే జీవోలు జారీ చేసిందని ఆయన గుర్తుచేశారు. కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ సిఎం ఆదేశాల మేరకు ఉద్యోగుల తరలింపు పూర్తవుతుందని ఆయన చెప్పారు.

మథుర అల్లర్లపై సుప్రీంలో పిటిషన్

దిల్లీ: యుపిలోని మథురలో గత శుక్రవారం జరిగిన అల్లర్లపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ సుప్రీం కోర్టులో సోమవారం నాడు పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ ప్రారంభిస్తామని వెకేషన్ బెంచ్‌లోని న్యాయమూర్తులు ప్రకటించారు. మథురలో జరిగిన అల్లర్లలో ఐపిఎస్ అధికారి సహా 29 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఒక పార్కును ఆక్రమించిన ముఠా ఈ అరాచకానికి కారణమంటూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, అత్యున్నత స్థాయిలో విచారణ బృందాన్ని నియమించాలని పిటిషనర్ తరఫున హాజరైన న్యాయవాది కోర్టును కోరారు.

షోకాజ్ నోటీసు వారికి ఇవ్వరా?: కోమటిరెడ్డి

హైదరాబాద్: సిఎల్‌పి నేతగా జానారెడ్డి పనికిరాడంటూ గతంలో కొన్ని వందలసార్లు విమర్శించిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, సర్వే సత్యనారాయణలకు పార్టీ హైకమాండ్ ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వలేదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. జానారెడ్డి పనితీరును విమర్శించినందుకు తనకు షోకాజ్ నోటీసు ఇచ్చినవారికి పాల్వాయి, సర్వే చేసిన వ్యక్తిగత నిందలు గుర్తుకురాలేదా? అని ఆయన అన్నారు. కాగా, కృష్ణా బోర్డు నిర్ణయాలు అమలులోకి వస్తే నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు ఎడారిలా మారతాయన్నారు.

మద్యం కంపెనీలకు నీటిని ఆపండి: రేవంత్

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తీవ్ర నీటిఎద్దడి నెలకొన్న దృష్ట్యా మద్యం తయారీ కంపెనీలకు నీటి సరఫరాను నిలిపివేయాలంటూ టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు సోమవారం నాడు జిహెచ్‌ఎంసి, జలమండలి అధికారులకు నోటీసులు జారీ చేసింది. మద్యం కంపెనీలకు నీటి సరఫరా గురించి మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

తుని ఘటనలో పదిమంది అరెస్టు

విజయవాడ: కాపుగర్జన సందర్భంగా ఇటీవల తుని వద్ద జరిగిన విధ్వంసకాండకు సంబంధించి పదిమంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. విధ్వంసానికి సాక్షీభూతంగా నిలిచిన సిసి టీవీ ఫుటేజి, వీడియోలు, ఫొటోల ఆధారంగా నిందితులను గుర్తించారు. కడప, గుంటూరుకు చెందిన కొందరు విధ్వంసంలో పాల్గొన్నట్టు ప్రాథమిక సాక్ష్యాలు లభించాయని తెలిసింది. త్వరలోనే మరికొంతమంది నిందితులను అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

అభివృద్ధిని జీర్ణించుకోలేకే జగన్ వ్యాఖ్యలు

హైదరాబాద్: ఎపి సిఎం చంద్రబాబు సాధిస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకే విపక్ష నేత జగన్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని టిడిపి నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఇక్కడ మీడియాతో అన్నారు. సిఎంను అవమానిస్తే రాష్ట్ర ప్రజలందర్నీ అగౌరవపరచినట్టేనని, సభ్యత మరచిపోయి జగన్ నీచమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రజలందరి శ్రేయస్సు కోసం నవ నిర్మాణదీక్షకు సిఎం పిలుపునిచ్చారని, దీన్ని కూడా అడ్డుకోవాలని జగన్ ప్రయత్నించడం దారుణమన్నారు.

యువకుడి హత్యకేసులో 11 మంది అరెస్టు

రాజమండ్రి: ఇక్కడ గతనెల 26న జరిగిన ధనాల రమేష్ అనే యువకుడి హత్యకు సంబంధించి 11 మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పాతక్షక్షల కారణంగానే రమేష్‌ను అతని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ప్రత్యర్థివర్గానికి చెందినవారు రమేష్‌ను బలవంతంగా ఎత్తుకుపోయి నిర్మానుష్య ప్రదేశంలో హత్య చేసి, మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వెనక పారేశారు. ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలు లభించడంతో 11 మంది నిందితులను అర్బన్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

ఎపి పోలీస్ శాఖలో 6వేల పోస్టులకు అనుమతి

విజయవాడ: రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు పూర్తయినప్పటికీ పోలీసు శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగానే ఉందని ఎపి డిజిపి జెవి రాముడు సోమవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. హైదరాబాద్ నుంచి పోలీసు శాఖలోని పలు విభాగాలను ఇంకా తరలించాల్సి ఉందని, ఎపిఎస్పీకి 3వేల మంది ఇంకా రావాల్సిఉందని చెప్పారు. పోలీసు శాఖలో వివిధ స్థాయిల్లో ఆరువేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.

అరాచకత్వానికి ఆ ఇద్దరిదే బాధ్యత: కేజ్రీ

దిల్లీ: దేశ రాజధానిలో అరాచకశక్తులు పెచ్చుమీరడానికి ప్రధాని మోదీ, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రధాన కారకులని సిఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఆయన సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో ఈమేరకు పలు పోస్టింగ్‌లు చేశారు. దిల్లీలో అత్యాచారాలు, విధ్వంసక సంఘటనలు జరుగుతున్నా పోలీసులపై తమకు అజమాయిషీ లేకుండా పోతోందన్నారు. ఇక్కడి పోలీసులు దిల్లీ ప్రభుత్వానికి బదులు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు లోబడి పనిచేస్తున్నట్టు ఆయన తెలిపారు. దీంతో తాను ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటోందన్నారు.

Pages