S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైళ్ల ద్వారా ప్రభుత్వానికే నిధులు

సంగారెడ్డి, జూన్ 5: ప్రభుత్వం అందించే నిధుల కోసం ఎదురు చూడకుండా స్వశక్తితో ఆర్థిక వనరులను కల్పించే కొత్త పారిశ్రామిక విధానం ద్వారా జైళ్లను అభివృద్ధి చేసి భవిష్యత్తులో ప్రభుత్వానికే నిధులు సమకూర్చే విధంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు జైళ్ల శాఖ డిజి వికె.సింగ్ పేర్కొన్నారు. సంగారెడ్డిలో ఆదివారం జైలు మ్యూజియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిజి మాట్లాడుతూ, తమ శాఖను అన్ని విధాలుగా అమలు చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు.

చెరువులకు మహర్దశ

హైదరాబాద్, జూన్ 5: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ఫలాలు అందనున్నాయి. రాష్ట్రంలోని 45వేల చెరువులను దశలవారీ పునరుద్ధరించాలని ప్రభుత్వం మిషన్ కాకతీయ ప్రారంభించింది. గత రెండేళ్ల నుంచి మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పూడిక తీసి చెరువును పునరుద్ధరిస్తున్నారు. అయితే రెండేళ్ల నుంచీ వర్షాలు లేకపోవడంతో చెరువుల పూడిక తీసివేత పనులు చురుగ్గా సాగినా నీరు చేరలేదు. ఇప్పుడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో చెరువుల్లోకి నీరు చేరుతోంది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

పచ్చటి భూముల్లో ప్రాజెక్టులొద్దు

తొగుట, జూన్ 5: నదులమీద నిర్మించాల్సిన రిజర్వాయర్లను బహుళ పంటలు పండే పచ్చటి భూముల్లో నిర్మిస్తూ గ్రామాలను ముంపునకు గురిచేయడం సరికాదని తెరవే (తెలంగాణ రచయతల వేదిక) అధ్యక్షుడు జయధీర్ తిరుమలరావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా తొగుట మండలంలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామం ఏటిగడ్డకిష్టాపూర్‌లో గ్రామస్థుల దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. చిన్నచిన్న రిజర్వాయర్లతో గ్రామాలు ముంపునకు గురిచేయకుండా సాగునీరు అందించే కార్యక్రమాన్ని చేపట్టకుండా ప్రభుత్వం ఏకంగా 50 టిఎంసిల మేర ప్రాజెక్టు నిర్మించాలనుకోవడం దారుణమన్నారు.

కెసిఆర్ పచ్చి మోసగాడు

వరంగల్, జూన్ 5: కాంగ్రెస్‌లో నాయకులకు, కార్యకర్తలకు కొదవ లేదని టిపిసిసి ఉపాధ్యక్షుడు, మెదక్ ఎంపి నంది ఎల్లయ్య అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా డిసిసి భవన్‌లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా మాట్లాడుతూ, పార్టీలోని లోపాలను సరిదిద్దుకొని 2019లో తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త సైనికునిలా పని చేయాలన్నారు. పార్టీలోని నాయకుల, కార్యకర్తల మధ్య ఉన్న విబేధాలను పక్కనపెట్టి ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. సిఎం కెసిఆర్ తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.

భూగర్భ జలాల అభివృద్ధితో నీటి సమస్యకు చెక్

ఎల్‌ఎన్ పేట, జూన్ 5: భూగర్భ జలాలు అభివృద్ధి చేయడం ద్వారా నీటి సమస్యను పరిష్కరించవచ్చని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా, ఎల్‌ఎన్ పేట మండలంలోని సవరకొత్తబాలేరు గిరిజన గ్రామంలో ఆదివారం నీటిగుంతలు, కోయిలాంలో ఇంకుడు గుంతలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సునీత మాట్లాడారు. భవిష్యత్‌లో నీటి సమస్య లేకుండా ముందుచూపుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు పథకాలను ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. ఇంకుడు గుంతల నిర్మాణం, పంట సంజీవిని, నీటిగుంతలు, వీటితో పాటు చెరువుల అభివృద్ధికి నీరు-చెట్టు పథకాలను అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

ఒక్కొక్కరూ పదేసి మొక్కలు నాటుదాం

విజయవాడ, జూన్ 5: ప్రతిఒక్కరూ పది మొక్కలు నాటాలని, రాష్ట్రంలోని 5కోట్ల జనాభా ఒక్కొక్కరూ పది మొక్కలు నాటితే 50కోట్ల మొక్కలు పెరుగుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని గొల్లపూడి మార్కెట్ యార్డు ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల చేత మొక్కలు నాటించారు.

అభివృద్ధికి అడ్డంకులు

విజయవాడ, జూన్ 5: రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తాను యజ్ఞం చేస్తుంటే కొందరు రాక్షసుల మాదిరిగా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని, వాళ్ల వయస్సు తన అనుభవమంత లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నవ నిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా ఆదివారం విజయవాడ ఎ కనె్వన్షన్ సెంటర్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాధించిన ప్రగతి, భవిష్యత్ ప్రణాళికపై ఆయా రంగాలకు చెందిన అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో పెనుమార్పులు వచ్చాయని, వాటికి అనుగుణంగా రైతుల్ని మలచుకోవాలన్నారు.

బాపట్లలో మానవ వనరుల అభివృద్ధి కేంద్రం

హైదరాబాద్, జూన్ 5: రాష్ట్రప్రభుత్వ వివిధ శాఖల్లో పనిచేసే ఉన్నతాధికారులు, ఉద్యోగులకు ఎప్పటికప్పుడు శాఖపరమైన నైపుణ్యతపై శిక్షణ ఇచ్చేందుకు బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్ధను అన్ని హంగులతో తీర్చిదిద్దాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం షెడ్యూల్ 10లో హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్ధను చేర్చారు. ఈ సంస్ధను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు పది సంవత్సరాలు ఉమ్మడిగా వినియోగించుకోవచ్చు. కాని డాక్టర్ ఎంసిహెచ్‌ఆర్‌డిని తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా తన ఆధీనంలో తెచ్చుకోవడంతో ఏపి ప్రభుత్వం ఇక్కట్లపాలైంది.

నెల్లూరులో ముగిసిన ప్రజా సంకల్ప యాత్ర

నెల్లూరు టౌన్, జూన్ 5: బిసి యువజన సంఘం ఆధ్వర్యంలో గత నెల 28న ఎన్‌టిఆర్ వర్ధంతి రోజు ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర చివరి మజిలీ నెల్లూరుకు ఆదివారం చేరుకుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇంటి ముందు సంకల్ప యాత్ర సభ్యులు ప్రదర్శన నిర్వహించి ఆయన కుటుంబ సభ్యులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బిసి యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ గత పది రోజులుగా ఈ యాత్ర రాష్ట్రంలోని 36 నియోజకవర్గాల మీదుగా నెల్లూరుకు చేరుకుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే లక్ష్యంగా తాము ఈ యాత్ర చేపట్టామన్నారు.

షార్‌కు చేరిన కార్డోశాట్-2సి ఉపగ్రహం

సూళ్లూరుపేట, జూన్ 5: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసింది. అగ్రరాజ్యాలకు దీటుగా ఒకేసారి 22 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు శ్రీకారం చుట్టింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి ఈనెల 20న పిఎస్‌ఎల్‌వి-సి 34 రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఇస్రో సన్నాహం చేస్తోంది. ఈ రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపే మన దేశానికి చెందిన ప్రధాన ఉపగ్రహం కార్డోశాట్-2సి ఆదివారం బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుండి రోడ్డుమార్గాన భారీ భద్రత నడుమ షార్ చేరింది.

Pages