S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీటి వాటాను సాధిస్తాం: కడియం

హైదరాబాద్: నీటివనరుల కేటాయింపుల్లో తెలంగాణకు సమైక్యపాలనలో తీరని అన్యాయం జరిగినందునే ఇరిగేషన్ ప్రాజెక్టులకు రీ-డిజైనింగ్ చేస్తున్నామని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. నదీ జలాల్లో న్యాయమైన వాటా కోసం తాము పోరాడతామని, న్యాయబద్ధంగా రావాల్సిన నీటివాటాను సాధించి, కోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తామని తెలిపారు. ప్రాజెక్టులపై ఎపి సర్కారు అభ్యంతరాలను ఎదుర్కొంటామన్నారు.

రాజకీయాల్లో హుందాతనం అవసరం: బాబు

విజయవాడ: తన రాజకీయ అనుభవమంత వయసు కూడా లేని విపక్ష నేత వైఎస్ జగన్ హుందాతనం మరచి మాట్లాడుతున్నట్లు ఎపి సిఎం చంద్రబాబు మీడియాతో అన్నారు. జగన్ వ్యాఖ్యల్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. తన సుదీర్ఘ రాజకీయాల్లో ఇలాంటి విపక్ష నాయకుడిని ఇంతవరకూ చూడలేదన్నారు.

జగన్‌కు మహిళలు గరిటెలతో వాతలు పెట్టాలి!

కర్నూలు: నోటిదురుసుతో మాట్లాడుతున్న వైకాపా అధ్యక్షుడు జగన్‌కు మహిళలు గరిటెలతో వాతలు పెట్టాలని డిప్యూటీ సిఎం కెఈ కృష్ణమూర్తి అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ జరిగిన నవనిర్మాణ దీక్షలో మాట్లాడుతూ, సంస్కారం లేని జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలుతున్నందున ఇక మహిళలే అతనికి బుద్ధి చెప్పాలన్నారు.

న్యాయవాదుల ఆందోళన తీవ్రతరం

హైదరాబాద్: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదులు ఆందోళనను తీవ్రతరం చేశారు. న్యాయాధికారుల నియామకాల్లో అక్రమాలను అరికట్టాలని, హైకోర్టును విభజించాలని, ఇళ్లస్థలాలు ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టు వద్ద సోమవారం ఉదయం లాయర్లు ఆందోళనకు దిగారు.

‘అమరావతి’ బస్సుల్లో నచ్చిన చానెల్ చూడొచ్చు!

విజయవాడ: ఆక్యుపెన్సీ రేటును పెంచుకుని తద్వారా ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు ఆ సంస్థ అధికారులు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఎపిఎస్ ఆర్టీసీ నడుపుతున్న ‘అమరావతి’ ఏసీ బస్సుల్లో ఇక ప్రయాణీకులు వారికి నచ్చిన టీవీ చానెల్ చూడొచ్చు. బస్సుల్లో టీవీ పెట్టి ఒకటో,రెండో సినిమాలు వేయడం, ఉచితంగా వైఫై సౌకర్యం కల్పించడం వంటి ఏర్పాట్లకు భిన్నంగా ఇపుడు ఆర్టీసీ ప్రతి సీటుకూ ఒక చిన్న టీవీని అమరుస్తోంది. ఆ టీవీల్లో నచ్చిన చానెల్ చూసేందుకు ప్రతి ప్రయాణీకుడికీ ఒక రిమోట్ ఇస్తారు. ఈ సౌకర్యాన్ని సోమవారం ఉదయం ఇక్కడ ఎపి సిఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు.

దిల్లీ చేరిన హరీష్ బృందం

దిల్లీ: ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఎపి అభ్యంతరాలపై తమ వాదన వినిపించేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో ప్రత్యేక బృందం సోమవారం ఇక్కడికి చేరుకుంది. ఈరోజు సాయంత్రం ఈ బృందం కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతిని కలుస్తుంది. హరీష్ రావు వెంట తెలంగాణ ఎంపీలు, నీటి పారుదల శాఖ నిపుణులు ఉన్నారు.

పంజాబ్‌లో రాష్టప్రతి పాలన విధించాలి

చండీగఢ్: హింసాత్మక సంఘటనలతో అరాచకత్వం పెచ్చుమీరుతున్నందున పంజాబ్‌లో తక్షణమే రాష్టప్రతి పాలన విధించాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమరేందర్ సింగ్ సోమవారం డిమాండ్ చేశారు. ఇటీవలి విధ్వంసకాండలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లూధియానాలో గత నెల 17న జరిగిన దాడుల్లో మరణించిన భూపేందర్‌సింగ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అరాచక శక్తుల విధ్వంసానికి సిఎం ప్రకాష్‌సింగ్ బాదల్ నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని ఆయన అన్నారు.

బెజవాడ బస్ స్టేషన్‌లో మల్టీప్లెక్స్ ప్రారంభం

విజయవాడ: దేశంలోనే మల్టీప్లెక్స్ థియేటర్‌ను కలిగిన తొలి బస్ స్టేషన్‌గా విజయవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ బస్ కాంప్లెక్సు అవతరించింది. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు విరామ సమయంలో సినిమాలు చూసి కాలక్షేపం పొందేందుకు ఇక్కడ ‘వై స్క్రీన్స్’ పేరిట ఏర్పాటు చేసిన మల్టీప్లెక్స్ థియేటర్‌ను సోమవారం ఉదయం ఎపి సిఎం చంద్రబాబు ప్రారంభించారు. మల్టీప్లెక్స్ కారణంగా తమ సంస్థకు ఆదాయం పెరుగుతుందని ఎపిఎస్ ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్‌ను ఏర్పాటు చేసినందుకు ఆర్టీసీ అధికారులను సిఎం అభినందించారు.

అయోమయంలో ఎపి సచివాలయ ఉద్యోగులు

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఎపి సచివాలయ ఉద్యోగుల తరలింపులో ప్రస్తుతం అయోమయ పరిస్థితి నెలకొందని ఎపి సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ అన్నారు. ఈ నెల 27 నాటికి ఉద్యోగుల తరలింపు ప్రక్రియ పూర్తవుతుందని సిఎం చెబుతున్నారని, వివిధ శాఖల ఉద్యోగుల తరలింపుపై నిర్దిష్ట విధానాన్ని ఈరోజు ప్రకటిస్తారని వార్తలు వెలువడుతున్నాయని దీంతో గందరగోళం నెలకొందని ఆయన అన్నారు. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు చాలామంది తమ పిల్లలను అమరావతి ప్రాంతంలోని విద్యాసంస్థల్లో చేర్పించారని, ఇళ్లకు అడ్వాన్సులు కూడా చెల్లించారని ఆయన అన్నారు.

పుదుచ్చేరి సిఎంగా స్వామి ప్రమాణ స్వీకారం

పుదుచ్చేరి: పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి నారాయణ స్వామి సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో అయిదుగురు మంత్రుల చేత గవర్నర్ కిరణ్ బేడీ ప్రమాణం చేయించారు. ఇటీవల జరిగిన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-డిఎంకె కూటమి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని నారాయణ స్వామి సిఎంగా బాధ్యతలు చేపట్టినందున ఆరు నెలల్లోగా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావల్సి ఉంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి డిఎంకె నేత స్టాలిన్, కాంగ్రెస్ పరిశీలకులు గులాం నబీ ఆజాద్, ముకుల్ వాస్నిక్ హాజరయ్యారు.

Pages