S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమలలో ప్రయోగాత్మకంగా ప్రహరీ ఉద్యానవనాలు

తిరుమల, జూన్ 2: తిరుమల శ్రీవారి ఆలయం వద్ద గురువారం ప్రయోగాత్మకంగా ప్రహరీ ఉద్యానవనాలను ప్రారంభించారు. తొలివిడతలో ఆలయ మహాద్వారానికి ఇరువైపులా 2500 కుండీల్లో ఫోలియేట్ జాతి మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కలకు ఆటోమేటిక్ డ్రిప్ విధానం ద్వారా నీటిని అందిస్తారు. రెండో విడతలో వైభవోత్సవం మండపం, సహస్ర దీపాలంకార సేవ మండపం వద్ద కూడా ఈ ఉద్యానవనాలను ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఈప్రహరీ ఉద్యానవనాలను హైదరాబాదుకు చెందిన హర్ష బయోఫామ్ సంస్థ ఒక సంవత్సరం పాటు నిర్వహించనుంది. ఇందుకు రూ.30 లక్షలు వ్యయం కానుంది. హర్ష బయోఫామ్ సంస్థ భరించనుంది. సంస్థ ప్రతినిధులు టిటిడి ఉద్యానవన సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వనున్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఘర్షణ

ఖమ్మం, జూన్ 2: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్స 2వ వార్షికోత్సవ సంబురాలు సందడిగా జరిగిన నేపథ్యంలో ఖమ్మంలో మాత్రం అపశృతి చోటు చేసుకుంది. ఒక దశలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడులో టిఆర్‌ఎస్, సిపిఐ కార్యకర్తలు గొడవలకు దిగడంతో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయాల పాలయ్యారు. గ్రామంలో ఒక వైపు ఆవిర్భావ దినోత్సవాలు మరో వైపు సిపిఐ నేత శ్రీనివాస్ సంస్మరణ సభ జరుగుతుండగా ఇరు వర్గాల మధ్య ఏర్పడిన చిన్న వివాదంతో పరస్పరం రాళ్ళు రువ్వుకున్నారు. ఈ క్రమంలో టిఆర్‌ఎస్‌కు చెందిన కత్తి సంగం(60) గాయాలు పాలుకాగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు.

ఎడ్ సెట్ లో 96శాతం ఉత్తీర్ణత

తిరుపతి, జూన్ 2: ఎస్వీ యూనివర్శిటీ గత నెల 23న రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 27 సెంటర్లలో నిర్వహించిన ఎపి ఎడ్‌సెట్- 2016 పరీక్షల్లో స్ర్తి,పురుష అభ్యర్థులు పోటాపోటీగా ఉత్తీర్ణత సాధించారు. పురుషులు 96.36శాతం ఉత్తీరణ సాధించగా మహిళలు 96.06శాతం ఉత్తీర్ణత సాధించారు. గురువారం ఎస్వీయూ విసి చాంబర్‌లో విసి ఆవుల దామోదరం పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. 11,705 మంది దరఖాస్తు చేసుకోగా 9,561 మంది పరీక్ష హాజరయ్యారు. వీరిలో 9,194మంది ఉత్తీర్ణత సాధించి 96.16 శాతం నమోదైంది. బయాలజీ సైన్స్‌లో పురుషులు 578మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 462 మంది పరీక్షకు హాజరవగా 451 మంది ఉత్తీర్ణులై 97.62శాతం నమోదయింది.

2020 నాటికి ఏపి అగ్రగామి: యనమల

కాకినాడ, జూన్ 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విజన్ 2020 డాక్యుమెంట్ కింద అభివృద్ధిచేసి అతి త్వరలో దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిచేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. విభజన నష్టాలను, సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కోవడం ద్వారా ఆదాయ వనరులను సమకూర్చుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో ముందుకు తీసుకువచ్చి, పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో గురువారం నవ నిర్మాణ దీక్షను నిర్వహించారు.

జనాన్ని మభ్యపెట్టడానికే బాబు దీక్ష

మడకశిర, జూన్ 2 : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో దోషులు, ఆర్థిక నేరస్థులను పార్టీలోకి చేర్చుకుని వారితో డబ్బులు దండుకుని ఎమ్మెల్యే టికెట్లు, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారని, ప్రస్తుతం రాజ్యసభ సీట్లను కూడా అదే తరహాలో డబ్బు తీసుకుని ఇచ్చారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో గురువారం రఘువీరా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయాల్లో ఆర్థికంగా ఉన్న వారికి పదవులు ఇవ్వడం వల్ల పేద వర్గాలకు అవకాశాలు లేకుండా చంద్రబాబు అపకారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజుపై భూ ఆక్రమణ కేసు

విశాఖపట్నం, జూన్ 2: మాజీ ఎమ్మెల్యే, ఎపి పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్‌పై పెందుర్తి పోలీసులు భూ ఆక్రమణ కేసు గురువారం నమోదు చేశారు. స్థానిక లక్ష్మీపురం గ్రామంలో ఒక దగ్గర సుమారు పదకొండు సెంట్లు స్థలం ఉంది. ఈ స్థలంలోకి గురువారం ద్రోణంరాజు శ్రీనివాస్ తన అనుచరులతో వెళ్లి మొక్కలు నాటేందుకు ప్రయత్నించారు. దీంతో తమ భూమిలోకి ద్రోణంరాజు దౌర్జన్యంగా ప్రవేశించారంటూ స్థల యజమానులు తిరుమలరాజు, నర్సింహరాజు కలిసి అడ్డుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిఐ జె.మురళీ వివాదాస్పద స్థలం వద్దకు వెళ్లి విచారణ జరిపారు. స్థలానికి సంబంధించి ఇరువురి డాక్యుమెంట్లను తీసుకురావాల్సిందిగా ఆయన చెప్పారు.

గుంటూరులో పెనుగాలుల బీభత్సం

గుంటూరు, జూన్ 2: గుంటూరు నగరంతో పాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. కుంభవృష్టితో ఈదురుగాలులు వీయడంతో పెద్ద పెద్ద వృక్షాలు నేలకూలాయి. నగరంలో 200కు పైగా విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో జనజీవనానికి అంతరాయం కలిగింది. బాపట్లలో చెత్తను తొలగిస్తున్న ఓ అవుట్‌సోర్సింగ్ కార్మికుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం సాయంత్రానికి గానీ పునరుద్ధరణ చర్యలు కొలిక్కిరాలేదు.

506.2 అడుగులకు సాగర్ నీటిమట్టం

విజయపురిసౌత్, జూన్ 2: నాగార్జున సాగర్ జలాశయం నీటిమట్టం గురువారం సాయంత్రానికి 506.2 అడుగులకు చేరుకుంది. ఇది 125.8 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుండి నాగార్జున సాగర్ జలాశయానికి నీటి చేరిక పూర్తిగా నిలిచిపోయింది. సాగర్ జలాశయం నుండి ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి నీటి చేరిక నిలిచిపోవడంతో సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 775 అడుగుల వద్ద కొనసాగుతుంది. ఇది 18.54 టీఎంసీలకు సమానం.

చెరువులో మునిగి ఇద్దరు మృతి

రావికమతం, జూన్ 2: విశాఖ జిల్లా రావికమతం మండలం గుడ్డిపలో గురువారం పశువులను చెరువులో కడుగుతూ ఇద్దరు అనుకోని రీతిలో మృత్యువాత పడ్డారు. గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి ఇందలి సతీష్(11), పాల సేకరణ కేంద్రంలో సహాయకుడిగా పని చేస్తున్న గల్లా శ్రీను(33) ఈ ప్రమాదంలో మరణించారు. మొదట చెరువులో గేదెలను కడిగేందుకు దిగిన సతీష్ లోతు తెలియక మునిగిపోవడంతో అతడ్ని రక్షించబోయి గల్లా శ్రీను కూడా చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. సమీపంలో వారు గుర్తించి చెరువులోకి దిగి గాలించి శ్రీను, సతీష్ మృతదేహాలను బయటకు తీసారు.

ఎసిబి వలలో టిపిఎస్

విజయనగరం,జూన్ 2: విజయనగరం మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న సిహెచ్‌వి నారాయణరావు లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ గురువారం అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. పట్టణానికి చెందిన మురళి అనే బిల్డర్ జి- ప్లస్ 4 భవన నిర్మాణానికి సంబంధించి విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) నుంచి అనుమతులు పొందారు. అయితే పట్టణ ప్రణాళిక విభాగం నుంచి భవన నిర్మాణానికి సంబంధించిన ఎండార్స్‌మెంట్ పత్రాలు తీసుకోవలసి ఉంది. ఈ పత్రాల కోసం టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ నారాయణరావును మురళి సంప్రదించగా, ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారు.

Pages