S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూపల్లి వర్సెస్ రేవంత్..!

మహబూబ్‌నగర్: మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రసంగానికి టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డుతగలడంతో కాసేపు ఉద్రిక్తత కొనసాగిన ఘటన కోస్గి మండలం బోగారంలో గురువారం జరిగింది. రహదారి పనుల ప్రారంభం సందర్భంగా జరిగిన సభలో జూపల్లి మాట్లాడుతూ, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు ప్రాజెక్టు ఆగదని పరోక్షంగా టిడిపి అధినేత చంద్రబాబును విమర్శించారు. దీంతో రేవంత్ మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. టిడిపి కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

గిరిజనులను వంచించిన కెసిఆర్!

హైదరాబాద్: గిరిజన తండాలను పంచాయితీలుగా మారుస్తామని, వారికి 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన తెరాస అధినేత కెసిఆర్ గత రెండేళ్ల కాలంలో ఏమీ చేయలేదని మాజీ ఎంపి బలరాం నాయక్ అన్నారు. హామీల పేరుతో గిరిజనులు కెసిఆర్
దారుణంగా వంచించారని విమర్శించారు. పదవుల పంపిణీలో కూడా గిరిజనులకు ప్రాధాన్యం లేదన్నారు.

చెరువులో విషం: భారీగా చేపలు మృతి

హైదరాబాద్: గిట్టనివారెవరో చెరువులో విషం కలపడంతో భారీ సంఖ్యలో చేపలు మరణించిన ఘటన రాజేంద్రనగర్ మండలం మద్దిగుంట వద్ద గురువారం జరిగింది. లక్షలాది రూపాయలు వెచ్చించి స్థానిక మత్స్యకారులు చెరువులో చేపలు పెంచుతున్నారు. మృగశిర కార్తె రావడంతో చేపలకు డిమాండ్ పెరగడంతో వారు చేపలను బయటకు తీసేందుకు చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో చేపలు మరణించి ఉండడంతో గిట్టనివారు విషం కలిపి ఉంటారని మత్స్యకారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కెసిఆర్ క్యాబినెట్‌లో సగం మంది తెలంగాణ ద్రోహులే!

హైదరాబాద్: ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేనివారు, తెలంగాణ ద్రోహులకు కెసిఆర్ మంత్రివర్గంలో పెద్దపీట వేశారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జెఎసీ నేత కోదండరామ్‌పై పలువురు మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నా కెసిఆర్ పెదవి విప్పడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా కోదండరామ్‌ను ఎవరైనా విమర్శిస్తే నాలుక కోస్తానన్న కెసిఆర్ ఇపుడు ఎందుకు వౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

ముద్రగడ సహకరించడం లేదు: జిల్లా ఎస్పీ

కాకినాడ: వివిధ కేసులకు సంబంధించి ముద్రగడను అరెస్టు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నా ఆయన మాత్రం సహకరించడం లేదని తూ.గో. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. కిర్లంపూడిలో ముద్రగడ గురువారం ఉదయం ఆమరణ దీక్ష ప్రారంభించాక జిల్లాలో నిషేధాజ్ఞలు విధించామన్నారు. కేసులకు సంబంధించిన పత్రాలన్నింటినీ ముద్రగడ లాయర్‌కు ఇచ్చామని, విచారణ చేపట్టని కేసుల్లో అరెస్టు చేయాలంటూ ముద్రగడ పట్టుబడుతున్నారని ఎస్పీ తెలిపారు. అనుమతి లేకుండా దీక్ష చేస్తున్నందుకు కూడా ఆయనపై కేసు పెడుతున్నామని, జిల్లాలో వ్యాపిస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని ఆయన అన్నారు.

వీణావాణిలకు తెలంగాణ సర్కారు అండ

హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణిలకు అవసరమైన వైద్యసాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి గురువారం తెలిపారు. ప్రస్తుతం వీణావాణి నగరంలోని నీలోఫర్ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. శస్తచ్రికిత్స చేసి వీరిని ఈ వయసులో విడదీయడం ప్రమాదకరమని దిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వీణావాణిల తల్లిదండ్రులు కోరుకుంటున్నట్లు వారి జీవనభృతికి, వైద్యానికి అన్ని విధాలా చేయూతనిస్తామని మంత్రి తెలిపారు. నీలోఫర్ వైద్యుల సిఫారసులను పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యం

నల్గొండ: తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే తన ఏకైక ధ్యేయమని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తాను తెరాసలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. సోనియా గాంధీ నేతృత్వంలో రైతురాజ్యం రావాలన్నారు. రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ప్రచార ఆర్భాటం కోసం తెరాస సర్కారు చేసిన ఖర్చులపై శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎయు వీసీగా ప్రొఫెసర్ గొల్లపల్లి?

విజయవాడ: ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పదవిని భర్తీ చేసేందుకు ఎపి సర్కారు కసరత్తు చేస్తోంది. ఎయులో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గొల్లపల్లి నాగేశ్వరరావును వీసీగా నియమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఆయన నియామకానికి సంబంధించి రెండు,మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలిసింది. ఎయు వీసీ పదవి కోసం చాలామంది ప్రయత్నించడంతో తీవ్రమైన పోటీ నెలకొంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వీసీ పదవులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఉత్తరాంధ్ర ప్రగతికి సూచనలు చేయండి

విశాఖ: అన్ని విధాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగు సూచనలు చేయాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు సుదీర్ఘ లేఖ రాశారు. ఉత్తరాంధ్ర వాసుల ఆశలు ఫలించేలా ఇకనైనా పాలకులు గట్టి ప్రయత్నాలు చేయాలని ఆయన కోరారు.

ఎసిబికి చిక్కిన సీనియర్ అసిస్టెంట్

నల్గొండ: ఇసుక కాంట్రాక్టర్‌కు అనుమతి పత్రాలు ఇచ్చేందుకు మూడువేల రూపాయలు లంచంగా తీసుకున్న ఆలేరు తహశీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ భిక్షపతిని ఎసిబి అధికారులు గురువారం పట్టుకున్నారు. నిందితుడిపై అధికారులు కేసు నమోదు చేశారు.

Pages