S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపు మహా సంకల్పం

కాకినాడ, జూన్ 6: నవ నిర్మాణ దీక్షలో భాగంగా ఈ నెల 8న జిల్లా స్థాయిలో మహాసంకల్పం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ చెప్పారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. నవనిర్మాణ దీక్ష సందర్భంగా వివిధ శాఖల ప్రగతిని సూచించే ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. సంకల్ప సభకు జిల్లాలోని జన్మభూమి కమిటీ సభ్యులందరూ హాజరవుతారన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సహా జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్టు తెలిపారు.

రూసా పథకం కింద రాష్ట్రానికి రూ.168 కోట్లు

హైదరాబాద్, జూన్ 6: రాష్ట్రీయ ఉచ్ఛాతార్ శిక్షా అభియాన్ (రూసా) పథకం కింద రాష్ట్రానికి రూ.168 కోట్లు మంజూరైనట్టు కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎ వాణి ప్రసాద్ చెప్పారు. డిగ్రీ కాలేజీల్లో సౌకర్యాలను కల్పించడంతో పాటు ఉన్నత ప్రమాణాలను నెలకోల్పేందుకు అన్ని చర్యలూ చేపట్టామని ఆమె సోమవారం నాడు పాత్రికేయులకు వివరించారు. కాలేజీయేట్ ఎడ్యుకేషన్‌లో ఇటీవలి కాలంలో చేపట్టిన సంస్కరణలను ఆమె వివరించారు.

పుదుచ్ఛేరి మంత్రివర్గంలో మల్లాడి

యానాం, జూన్ 6: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి రాష్ట్ర కేబినెట్‌లో యానాం శాసనసభ్యుడు మల్లాడి కృష్ణారావుకు స్థానం దక్కింది.. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు పుదుచ్చేరిలో రాష్ట్ర నూతన లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆయన మంత్రివర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నారాయణస్వామి మంత్రివర్గంలో పిసిసి అధ్యక్షుడు ఎ నమశ్శివాయ, ఎం కందసామి, ఆర్ కమలకన్నన్, ఎంఒహెచ్‌ఎఫ్ షాజహన్, మల్లాడి కృష్ణారావులు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావుకు రెవెన్యూ, టూరిజం, ఎల్‌ఎడి, ఎక్సైజ్, ఫిషరీస్, నౌకాయాన శాఖలను కేటాయించారు.

అసమర్థ పాలన

నిజామాబాద్, జూన్ 6: రాష్ట్రంలో తెరాస అసమర్థ పాలనకు జెఎసి చైర్మన్ కోదండరామ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమనిని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. తెరాస రెండేళ్ల పాలనపై నిర్వహించిన సదస్సులో ప్రొఫెసర్లు కోదండరామ్, హరగోపాల్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీవ్ సద్భావన యాత్రలో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న విహెచ్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తిలోదకాలిస్తూ ప్రజలను మోసం గిస్తున్నాయని దుయ్యబట్టారు.

చౌటుప్పల్‌లో ఉపగ్రహ ఆధారిత వర్షపాత నమోదు కేంద్రం

చౌటుప్పల్, జూన్ 6: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో గంటగంటకు వర్షపాతం, ఉష్ణోగ్రతలు, తేమ శాతం తెలిపే ఉపగ్రహ ఆధారిత నమోదు కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం వాతావరణ శాఖ ఆధ్వర్యంలో 1350 ఉపగ్రహ ఆధారిత వర్షపాత నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా రాష్ట్రంలో ఎనిమిది ఏర్పాటు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్, యాదగిరిగుట్ట, మెదక్ జిల్లా నంగనూర్, మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టు, రంగారెడ్డి జిల్లా హయాత్‌నగర్, కరీంనగర్ జిల్లా వేములవాడ, హుస్నాబాద్, హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉపగ్రహ ఆధారిత వర్షపాత నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

రామిరెడ్డి స్ఫూర్తితో టీచర్లు పనిచేయాలి

హైదరాబాద్, జూన్ 6: అమరజీవి డి రామిరెడ్డి ఆదర్శప్రాయుడని, త్యాగభరితమైన జీవితాన్ని గడిపారని, ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉపాధ్యాయులు పనిచేయాలని శాసనమండలి చైర్మన్ డాక్టర్ ఎ చక్రపాణి పేర్కొన్నారని యుటిఎఫ్ నేతలు ఐ వెంకటేశ్వరరావు, పి బాబురెడ్డిలు చెప్పారు. సోమవారం నాడు నిర్వహించిన సంస్మరణ సభలో ఆయనతో పాటు ఎస్‌టిఎఫ్‌ఐ ఉపాధ్యక్షుడు కె.రాజేంద్రన్, సిపిఎం పోలిట్‌బ్యూరో నేత బి వి రాఘవులు, ఎస్‌టిఎఫ్‌ఐ నేత ఎన్ నారాయణ, ఎమ్మెల్సీలు వై.శ్రీనివాసులు రెడ్డి, బి.నాగేశ్వరరావు, రాము సూర్యారావు తదితరులు మాట్లాడారని వారు పేర్కొన్నారు.

నా కంటే ఎక్కువ పాల్వాయి తిట్టారు

హైదరాబాద్, జూన్ 6: కాంగ్రెస్‌లో నాయకులు, కార్యకర్తలు పరస్పరం విమర్శించుకోవడం సహజమేనని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. లోగడ తన కంటే ఎక్కువగా పార్టీ ఎంపి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విమర్శలు చేశారని ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ గుర్తు చేశారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డిని తమ పార్టీ ఎంపి పాల్వాయి గోవర్దన్ రెడ్డి వంద సార్లు తిట్టి ఉంటారని ఆయన తెలిపారు. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్‌పై కూడా విమర్శలు చేశారని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌లో ఇటువంటివి సహజమేనని అన్నారు.

టిడిపిది అబద్ధాల ప్రభుత్వం

గుంటూరు, జూన్ 6: దేశంలో, ప్రపంచంలో నిత్యం అబద్ధాలతో పాలిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ప్రతి ఒక్కరికీ టక్కున గుర్తొచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. సోమవారం అరండల్‌పేటలోని వైసిపి నగర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్నారన్నారు.

కోటి ఎకరాల్లో పంటల సాగుకు ప్రణాళిక

హైదరాబాద్, జూన్ 6 : తెలంగాణ రాష్ట్రంలో 100 లక్షల ఎకరాల్లో పంట సాగు చేసేందుకు ప్రణాళిక రూపొందించామని వ్యవసాయ శాఖ కమిషనర్ జి.డి. ప్రియదర్శిని తెలిపారు. సోమవారం ఇక్కడ ఆమె ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, పంటల సాగుకు సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను పుస్తక రూపంలో రూపొందించామన్నారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈ పుస్తకాన్ని త్వరలో ఆవిష్కరిస్తారని వివరించారు. 2016 ఖరీఫ్ సాగుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని, నైరుతీ రుతుపవనాల వల్ల వచ్చే వర్షాలు ప్రారంభం కాగానే విత్తనాలు వేయడం మొదలవుతుందన్నారు.

టిఆర్టీసి కార్మిక సంఘాలకు జూలై 13న ఎన్నికలు

హైదరాబాద్, జూన్ 6: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కార్మిక సంఘాలు ఎన్నికలకు సన్నద్ధమయ్యాయి. జూలై 13న ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను ఖరారుపై యాజమాన్యంతో చర్చలు జరిపాయి. ఎన్నికల షెడ్యూల్, సమ్మె తదితర అంశాలపై ఆర్టీసి యాజమాన్యంతో కార్మిక శాఖ చర్చలు జరిపింది. దీంతో ఆర్టీసిలో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈనెల 13వ తేదీ వరకు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇవ్వాలని టిఎస్‌ఆర్టీసి యాజమాన్యానికి కార్మిక శాఖ సహాయ కమిషనర్ గంగాధర్ ఆదేశించారు.

Pages