S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేడిలో కాదు..వేడిగా!

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యేక హోదా పదేళ్లు ఇవ్వాలని వేడిలో తాను అన్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తిప్పికొట్టారు. విశాఖలో మూడు రోజులపాటు జరిగే ఇండియా, ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన అంశంపై చట్టసభలో చోటుచేసుకున్న పరిణామాలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయని, పరిస్థితి వేడిగా ఉన్నప్పుడే ఎపికి ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో చేర్చి ఉంటే ఇప్పుడీ పరిస్థితి తలెత్తేది కాదన్నది తన ఉద్దేశంగా పేర్కొన్నారు. తన అభిప్రాయాన్ని కొన్ని పత్రికలు వక్రీకరించాయన్నారు.

వీడని పీటముడి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజనపై ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. ఏపీ, తెలంగాణ అధికారులతో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి జైదీప్ గోవింద్ ఆధ్వర్యంలో శుక్రవారం 10వ షెడ్యూల్‌లోని ఉమ్మడి సంస్థల విభజనపై ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు.

ఆంధ్ర, ఉస్మానియాలకు ప్రపంచ ర్యాంకింగ్

హైదరాబాద్, సెప్టెంబర్ 23: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ 2016-17 సంవత్సరానికి ప్రకటించిన ప్రతిష్ఠాత్మక వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడు విశ్వవిద్యాలయాలు, తెలంగాణకు చెందిన ఒక విశ్వవిద్యాలయం స్థానాన్ని దక్కించుకున్నాయి.

టర్నోవర్ కోటిన్నర దాటే సంస్థలపై కేంద్ర, రాష్ట్రాల నియంత్రణ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: ఏడాదికి కోటిన్నరకు పైగా టర్నోవర్ ఉండే వ్యాపారాలు, పరిశ్రమలు, సంస్థలు అన్నింటిపై కేంద్ర, రాష్ట్రాలకు నియంత్రణ ఉంటుందని ఎపి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన ఢిల్లీలో శుక్రవారం కూడా జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం రెండోరోజు జరిగింది. ఈ సమావేశానికి ఏపి తరఫున ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. సమావేశం అనంతరం యనమల మాట్లాడుతూ, ఈ కోటిన్నర టర్నోవర్ వ్యాపారం చేసే సంస్థలపై కేంద్ర,రాష్ట్రాల్లో ఎవరో ఒకరు మాత్రమే పన్ను చెల్లింపుదారుల నుంచి పన్నుల వసూలు చేస్తారని తెలిపారు.

ఇంటర్ బోర్డు పాలక మండలి విస్తరణ

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు పాలకమండలిని విస్తరించారు. అందులో 12 మంది ఐఎఎస్ అధికారులతో పాటు 14 మంది వైస్ ఛాన్సలర్లకు సభ్యత్వం ఇచ్చారు. వీరితో పాటు ఆర్ధిక శాఖ జాయింట్ సెక్రటరీ, భీమునిపట్నం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, కుప్పం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్, విజయవాడ మేరీ స్టెల్లా ప్రిన్సిపాల్, దర్శి ప్రభుత్వ జూనియర్ ప్రిన్సిపాల్‌తో పాటు ప్రైవేటు కాలేజీల ప్రతినిధుల నుండి వైజాగ్ నారాయణ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను నియమించారు. ఈ బోర్డు పదవీకాలం మూడేళ్లపాటు ఉంటుందని ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ చెప్పారు.

స్పోర్ట్స్ కోటా కింద వైద్య సీట్లు ఇవ్వొద్దు

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఈ విద్యా సంవత్సరంలో స్పోర్ట్స్ కోటా కింద ఆంధ్రాలో ఎంబిబిఎస్, దంత వైద్య కళాశాలల్లో సీట్లను కేటాయించవద్దని హైకోర్టు శుక్రవారం ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం జారీ చేసింది. ఈ కేసులో పిటిషనర్ జి తన్మయి తరఫున న్యాయవాది రఘునందనరావు వాదనలు వినిపిస్తూ, స్పోర్ట్స్ కోటా కింద తయారు చేసిన మెరిట్ లిస్టులో అనేక అవకతవకలు ఉన్నాయని తెలిపారు. తక్కువ ప్రతిభ ఉన్న అభ్యర్థిని ఎక్కువ ప్రతిభ కింద చూపెట్టి మెరిట్ లిస్టులో అగ్రస్ధానంలో అవకాశం కల్పించారని ఆయన కోర్టుకు తెలిపారు.

కొత్త సాహితీ సంస్థ ప్రారంభం రేపు

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి సాహితీ మిత్రులు పేరిట గుంటూరు 2/1 బ్రాడిపేటలో కొత్త సాహితీ సంస్థను ఆదివారం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రఖ్యాత కవి, రచయిత డాక్టర్ రావి రంగారావు చెప్పారు. ఈ సందర్భంగా సాహిత్య గోష్ఠి జరుగుతుందని చెప్పారు. కొత్త కవులు, పాతకవుల కలయిక ఉంటుందని, తొలి కార్యక్రమానికి కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధానకార్యదర్శి డాక్టర్ జి వి పూర్ణచంద్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు.

స్టీఫెన్‌సన్‌కు ఊరట!

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఓటుకు నోటు కేసులో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు హైకోర్టు సింగిల్ జడ్జి జారీ చేసిన బెయిలబుల్ వారెంట్ అమలుపై హైకోర్టు ధర్మాసనం స్టే మంజూరు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన వారెంట్‌పై స్టే ఇవ్వాలని కోరుతూ స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ నెల 30వ తేదీలోపల స్టీఫెన్‌సన్‌ను అరెస్టు చేసి ఒక లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తును సమర్పించిన తర్వాత విడుదల చేయాలని, హైకోర్టులో హాజరుపరచాలని సింగిల్ జడ్జి గతంలో ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో పిటిషనర్ తరఫున న్యాయవాది జి విద్యాసాగర్ వాదనలు వినిపించారు.

మంచినీటికే కావేరీ జలాలు!

బెంగళూరు, సెప్టెంబర్ 23: కావేరీ జలాల వివాదం అనూహ్య మలుపు తిరిగింది. ఈ నదీ జలాలను కేవలం తాగునీటికి మాత్రమే వినియోగించాలంటూ కర్నాటక అసెంబ్లీ ప్రత్యేక సమావేశం శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానించింది. తమిళనాడుకు రోజుకు ఆరు వేల క్యూసెక్కుల నీటిని వ్యవసాయ అవసరాల నిమిత్తం అందించాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాన్ని అమలు చేయలేమని స్పష్టం చేసింది. శతాబ్దానికి పైగా కొనసాగుతున్న కావేరీ జలాల వివాదంపై కర్నాటక ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి.

ఇక భారత్ చేతికి ‘రఫాలే’

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత్ ఫ్రాన్స్‌నుంచి 7.87 బిలియన్ల యూరోలు (సుమారు 59వేల కోట్లు) వెచ్చించి 36 రఫాలే యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాలు శుక్రవారం ఇక్కడ సంతకాలు చేశాయి. ఈ యుద్ధ విమానాలకు ఆధునిక క్షిపణులు, ఆయుధ వ్యవస్థ బిగించి ఉంటుంది. దీంతో పాటు భారత్ అవసరాలకు అనుగుణంగా నిర్దిష్టమైన మార్పులు కూడా ఈ విమానాలకు చేసి ఇస్తారు. దీనివల్ల బద్ధ విరోధి పాకిస్తాన్‌కన్నా భారత వాయుసేన సామర్థ్యం ఎన్నో రెట్లు ఎక్కువ అవుతుంది.

Pages