S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడకు రైళ్ల రాకపోకలు బంద్

విజయవాడ, సెప్టెంబర్ 23: దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో విజయవాడ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న రూట్ రిలే ఇంటర్ లాకింగ్ పనులు రాత్రి, పగలు శరవేగంతో ముందుకు సాగుతున్నాయి. గురువారం వరకు పాక్షికంగా మూడు ప్లాట్‌ఫారాల్లో రైళ్ల రాకపోకలు సాగగా శుక్రవారం అన్ని ప్లాట్‌ఫారాల్లోను రైళ్ల రాకపోకలను నిలిపివేసి శరవేగంగా పనులు నిర్వహించారు. ఒకటి నుంచి 5వ నెంబర్ ప్లాట్‌ఫారం వరకు క్రాస్ ఓవర్ పాయింట్లను తొలగించి కొత్తవాటిని ఏర్పాటుచేసారు. దీనికి సంబంధించిన సిగ్నల్ పాయింట్లను అధికారులు తనిఖీ చేసారు. దాదాపు 2వేల మంది కార్మికులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు.

పట్టిసీమ ‘వట్టి’సీమ కాదు

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 23: గోదావరి నది నుండి ఈ ఏడాది ఇప్పటివరకు రెండు వేల టిఎంసిల నీరు వృథాగా సముద్రంలో కలవగా, అందులో 21 టిఎంసిలను పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు అందించగలిగామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. దీనివల్ల సుమారు 10 లక్షల ఎకరాల్లో పంట సాగు జరుగుతోందన్నారు. ఇప్పటివరకు పట్టిసీమ పథకాన్ని అనవసరమైనదిగా విమర్శలు చేసిన నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ గోదావరి నదిలో వృథాగా పోయే జలాలను పట్టిసీమ ద్వారా సకాలంలో సద్వినియోగం చేసుకోగలిగామన్నారు.

చంద్రబాబుకు పాస్‌పోర్ట్

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా పాస్‌పోర్ట్ తీసుకున్నారు. ఇదివరకే హైదరాబాద్ చిరునామాలో సికిందరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి 2014 నవంబర్‌లో డిప్లమాటిక్ పాస్‌పోర్ట్ పొందిన చంద్రబాబు చిరునామా మార్పుతో కొత్తగా పాస్‌పోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. తన పాస్‌పోర్ట్ చిరునామాను ఉండవల్లికి మార్చుకున్నారు. ఇప్పటికే చిరునామా మార్పుకోసం చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు. అంతర్జాతీయ సీ ఫుడ్‌షో ప్రారంభించేందుకు విశాఖ వచ్చిన ఆయన పాస్‌పోర్ట్ కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కొత్తగా పాస్‌పోర్ట్ తీసుకున్నారు.

పారాలింపిక్స్ విజేతలకు పద్మ అవార్డులు!

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: రియోలో ఇటీవల ముగిసిన పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు పద్మ అవార్డులు లభించే అవకాశాలు మెరుగుపడ్డాయి. పురుషుల హై జంప్ విభాగంలో తంగవేలు మరియప్పన్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, వరుణ్ సింగ్ భాటీ కాంస్య పతకం సాధించాడు. జావెలిన్ త్రో ఈవెంట్‌లో దేవేంద్ర ఝజారియాకు స్వర్ణ పతకం లభించింది. మహిళల షాట్‌పుట్‌లో దీపా పాలిక్ రజత పతకాన్ని అందుకుంది. ఈ నలుగురికీ పద్మ అవార్డులు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్టు కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ ట్వీట్ చేశారు. వాస్తవానికి ఒలింపిక్స్ విజేతలకు భారత క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డు లభిస్తుంది.

భారత బౌలింగ్ వెలవెల

కాన్పూర్, సెప్టెంబర్ 23: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత బౌలింగ్ వెలవెలబోతున్నది. వర్షం కారణంగా చివరి సెషన్ రద్దయిన రెండో రోజు ఆటలో కివీస్ బ్యాటింగ్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయిన ఆ జట్టు 152 పరుగులు చేసింది. టీమిండియా కంటే ఆ జట్టు ఇంకా 166 పరుగులు వెనుకంజలో నిలిచింది. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి. తొమ్మిది వికెట్లకు 291 పరుగుల స్కోరువద్ద రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ 318 పరుగులకు ఆలౌటైంది. 27 బంతులు ఎదుర్కొని 9 పరుగులు చేసిన ఉమేష్ యాదవ్‌ను వికెట్‌కీపర్ వాల్టింగ్ క్యాచ్ పట్టగా నీల్ వాగ్నర్ అవుట్ చేశాడు.

జపాన్ సూపర్ సిరీస్ శ్రీకాంత్ నిష్క్రమణ

టోక్యో, సెప్టెంబర్ 23: భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ ఇక్కడ జరుగుతున్న జపాన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్‌లో ఓటమిపాలై నిష్క్రమించాడు. దీనితో ఈ టోర్నీలో భారత్ పోరాటానికి తెరపడింది. జర్మనీకి చెందిన మార్క్ వీబ్లర్‌తో శ్రీకాంత్ చివరి వరకూ హోరాహోరీగా పోరాడాడు. ఈ మ్యాచ్‌కి ముందు అతనితో మూడు పర్యాయాలు తలపడిన శ్రీకాంత్ రెండు విజయాలను నమోదు చేశాడు. దీనితో విజయావకాశాలు శ్రీకాంత్‌కే ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, వీబ్లర్ చివరి వరకూ పోరాడి, 21-18, 14-21, 19-21 తేడాతో విజయం సాధించాడు.

భారత బాక్సింగ్ సమాఖ్య ఎన్నికలకు పరిశీలకుడిగా టన్నర్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎస్‌ఎఫ్) ఎన్నికలు ఈనెల 25న జరగనుండగా, పరిశీలకుడిగా ఎడ్గర్ టన్నర్‌ను పంపాలని అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఐఎబిఎ) నిర్ణయించింది. ఆస్ట్రేలియాకు చెందిన టన్నర్ ఐఎబిఎకు విదేశాల్లో ఎన్నికల పరిశీలక కమిటీకి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. బిఎస్‌ఎఫ్ ఎన్నికలను పర్యవేక్షించడానికి అతను శనివారం భారత్ చేరుకుంటాడు. నాలుగేళ్ల కాలంలో మూడో బాక్సింగ్ సమాఖ్యకు ఎన్నికలు జరగనుండడం గమానార్హం. మొదట్లో అఖిల భారత బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) ఉండేది. అయితే, అవినీతి, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎఐబిఎను రద్దు చేసింది.

టోరే పాన్ పసిఫిక్ ఓపెన్ ఫైనల్‌కు సానియా జోడీ

టోక్యో, సెప్టెంబర్ 23: చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బొరా స్ట్రికోవాతో కలిసి మహిళల డబుల్స్ విభాగంలో పోటీపడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇక్కడ జరుగుతున్న టోరే పాన్ పసిఫిక్ ఓపెన్ టోర్నమెంట్ ఫైనల్ చేరింది. సెమీ ఫైనల్‌లో సానియా, స్ట్రికోవా జోడీ 6-2, 6-2 తేడాతో గాబ్రియేల డబ్రోవ్‌స్కీ (కెనడా), మరియా జోస్ మార్టినా సాంచెజ్ (స్పెయిన్) జోడీపై సునాయాసంగా గెలిచి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. గత నెల వీరు సిన్సినాటి ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. మరో టైటిల్‌ను అందుకుందుకు ఒక విజయం దూరంలో నిలిచారు.

బిసిసిఐ లాభం రూ. 111 కోట్లు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) 2015-16 ఆర్థిక సంవత్స రంలో 111.83 కోట్ల రూపాయలు లాభాన్ని ఆర్జించింది. ఇది భారీ మొత్తమే అయనప్పటికీ, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 55 కోట్ల రూపాయలు తక్కువ. ఖర్చుల కంటే రాబడి గత ఏడాది 166.87 కోట్ల రూపాయలుకాగా, ఈసారి లాభం తగ్గిందని బిసిసిఐ కోశాధికారి అనిరుద్ధ్ చౌదరి తెలిపాడు. బోర్డు ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని అన్నాడు. అంతేగాక, సభ్య సంఘాలకు చెల్లించే మొత్తాన్ని పెంచామని, చాంపియన్స్ లీగ్ టి-20 రద్దయన కారణంగా, ఆ ఆదయానికి గండిపడడం కూడా లాభం తగ్గడానికి కారణాలని పేర్కొన్నాడు.

వికారాబాద్ జిల్లా కేంద్రం కాకపోతే రాజీనామా చేస్తా

వికారాబాద్, సెప్టెంబర్ 23: వికారాబాద్ జిల్లా కేంద్రం కావడం ఖాయమని, జిల్లా కేంద్రం కాకపోతే రాజీనామా చేస్తామని వికారాబాద్ శాసనసభ్యుడు బి.సంజీవరావు ప్రకటించారు. శుక్రవారం విదేశాల నుండి తిరిగి వచ్చి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కేంద్రాన్ని ప్రకటించారని, దానిపై ప్రజల నుండి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారని మూడురోజుల్లో తుది నిర్ణయం వెలువడనుందని చెప్పారు.

Pages