S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాజకీయ ఆదిత్యుడు!

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ఉదాత్త ఆశయాలకు ఊతం కావాలి. అప్పుడే వాటిని సాధించడం, సాకారం చేసుకోవడం సాధ్యమవుతుంది. సామాజిక రుగ్మతలు తొలగించాలన్న ఆశయం ఉంటే సరిపోదు. దశాబ్దాల తరబడి వైషమ్యమయంగా సాగిన రాజకీయాలకు పాతర వేయాలంటే.. కేవలం నిబద్ధత ఉంటే సరిపోదు. అందుకు తగిన అధికార బలం కూడా కావాలి. దాన్ని సదాశయంతో ఉదాత్త విలువలతో వినియోగించుకోగలగాలి. అప్పుడే అది రాణిస్తుంది. అందరి మెప్పూ పొందుతుంది. ప్రత్యర్థుల్ని సైతం ఆకర్షిస్తుంది. విమర్శకుల నోళ్లు మూయిస్తుంది. మంచి చేయక పోవచ్చు కాని ఆ మంచి చేస్తామనే వారిని ఎవరూ వ్యతిరేకించరు. వ్యతిరేకించినా అది జనం మెచ్చేది ఎంత మాత్రం కాదు. ఆ ఆకర్షణకు, ఆ రాణింపునకు మరోపేరు యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ పేరు ఇవాళ దేశవ్యాప్తంగా మారుమోగి పోతోంది.
ఆయన చేపట్టే ప్రతి చర్యా సంచలనం అవుతోంది. విపక్షాలు సైతం ముక్కున వేలేసుకునే రీతిలో సాగుతున్న ఆయన పాలన చర్చనీయాంశంగా మారుతోంది కూడా! అడుగేస్తే సంచలనమన్న రీతిలో సాగుతున్న ఆయన పాలన 20కోట్ల మంది యూపీ ప్రజల్నే కాదు 130 కోట్ల మంది భారతీయుల్నీ ఆకర్షిస్తోంది. ఆకట్టుకుంటోంది కూడా. కారణం.. ఆయన తీసుకున్న చర్యలు సామాన్యమైనవి కాదు. ముట్టుకుంటే ఎక్కడ ఓట్లు కోల్పోతాయోనని రాజకీయ పార్టీలు భయపడి చచ్చినవే..వాటి జోలికెళితే జన్మలో అధికారం రావడం కల్ల అని ప్రతి నాయకుడూ భావించినవే! ‘కాకులు దూరని కారడవి..చీమలు దూరని చిట్టడవి..అన్న చందంగా ఎవరూ ఊహించని, సాహసించని చర్యల్ని ఆదిత్య నాథ్ అలవోకగా చేపట్టారు. తనకు ఎలాంటి స్వార్థం లేదన్న వాస్తవాన్నీ ప్రతి చర్య ద్వారా రుజువు చేసుకున్నారు. సమత, సామరస్య దృక్పథంతో ముందుకెళితే విపక్షాలూ దాసోహమంటాయని చెప్పడానికి యోగి చేపట్టిన విప్లవాత్మక చర్యలకు సర్వత్రా మద్దతు రావడమే నిదర్శనం. ఆయనో సంచలనం..దేశ రాజకీయాల్లో ఎవరికీ రాని పేరు, ఖ్యాతిని అతి తక్కువ వ్యవధిలోనే సాధించారు.
యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్‌సింగ్. కాషాయం ధరించినా అన్నీ వదిలేసిన సర్వసంగ పరిత్యాగి కాదు. వ్యక్తిగతంగా గృహస్థాశ్రమానికి, ఇతర సుఖాలను త్యజించినా సమాజానికి పూర్తిగా దూరమైన వ్యక్తి కాదు. పెద్ద వయసేమీ కాదు.. 44 ఏళ్లు పూర్తిగా నిండనైనా లేదు. ఇప్పటికి పూర్తిగా సన్యసించటానికి, జీవితం, సంసారం మిథ్య అనుకునే రకమూ ఎంతమాత్రం కాదు. సమాజంలో నిత్యం జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఇతర సాధుసంతుల్లాగా ధర్మపన్నాలు పలికే సాత్విక స్వభావం ఉన్నవాడు కానే కాదు. దేశంలో విశిష్టమైన నాథ సంప్రదాయాన్ని అనుసరిస్తూనే, తాను ఏదైతే అనుకున్నాడో, తనకు ఏదైతే మంచి అని అనిపిస్తుందో నిస్సంకోచంగా చెప్పగలిగిన వాడు. తాను అన్న మాట మీద నిలబడగలిగిన వాడు. అతణ్ణి కొందరు ఫైర్‌బ్రాండ్ అన్నారు. మరికొందరు అత్యంత వివాదాస్పదుడన్నారు. కానీ, ఒకటిన్నర దశాబ్ది కాలంగా తాను ప్రతినిధిత్వం వహిస్తున్న పార్లమెంట్ నియోజక వర్గ ప్రజలు మాత్రం ఆయన్ని ఎం.పిగానే చూస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఏ ఎం.పికి ఇవ్వని ఆదరణ ఇస్తున్నారు. 50శాతం కంటే ఎక్కువ ఓట్లతో తిరుగులేని రీతిలో గెలిపిస్తున్నారు. అతని ధర్మం తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే, సమాజంలో ప్రజల మధ్యన ఉంటూ, ప్రజాజీవితంలో ఉంటూ తాను నమ్మిన అభివృద్ధి మార్గాన్ని కొనసాగించటం. ఆయన వ్యాఖ్యలు, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే వ్యక్తిత్వం చూసిన వాళ్లకు దేశంలోనే అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని ఎవరూ ఊహించి ఉండరు. కానీ మోదీ-అమిత్‌షా ద్వయం అందరి అంచనాలను, లెక్కలను తారుమారు చేస్తూ యోగికి పీఠం కట్టబెట్టారు. ఊహించినట్లే ప్రమాణ స్వీకారం అనంతరం సంతకం చేసిన క్షణం నుంచీ ఆయన పని చేస్తూనే ఉన్నారు. దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రీ తీసుకోనంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ, అమలు చేస్తూనే ఉన్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిరోజూ చర్చనీయాంశమే అవుతున్నాయి. ఇవన్నీ ఆయన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. హిందూ రాష్ట్రంగా భారత దేశాన్ని రూపాంతరం చెందించటంలో యోగి ఆదిత్యనాథ్‌ను యూపి లాంటి భిన్న మతాలు, కులాలు, జాతులు అత్యధికంగా ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయటం తొలి అడుగు అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అటు ఢిల్లీలో మోదీ కానీ, ఇటు లక్నోలో ఆదిత్యనాథ్ కానీ వీటికి స్పందించే స్థితిలో లేరు. తామనుకున్న పనులు ఎవరు ఏమి అనుకున్నా చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నారు. యుపిలో ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రి చేయటంతో ఆ రాష్ట్రంలో హిందూ ఓట్ బ్యాంక్‌ను ఏకత్రితం చేయటంలో మోదీ పూర్తిగా సఫలమయ్యారనే చెప్పాలి. యుక్త వయసులోనే ఇంటిని వదిలి, వ్యక్తిగత సుఖాలను పూర్తిగా వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన ఆదిత్యనాథ్ ఆ రాష్ట్రంలో అత్యధిక సామాన్య ప్రజల ఆకర్షణను పొందిన నేత. హిందీ, ఆంగ్ల భాషల్లో ధారాళంగా మాట్లాడగలిగిన యోగి, మోదీ చేతిలో బాణంగా మారారు. మోదీ, ఆదిత్యనాథ్‌లలో కొన్ని సారూప్యతలు, అంతరాలూ ఉన్నాయి. సిద్ధాంత పరంగా ఇద్దరూ ఒకే దారిలో నడుస్తున్నారు. కానీ, మోదీ రాజనీతిజ్ఞతతో వ్యవహరిస్తే, ఆదిత్యనాథ్ కుండబద్దలు కొట్టేస్తారు. మోదీ ఆర్.ఎస్.ఎస్ శాఖల్లో శిక్షణ పొందిన స్వయం సేవకుడు. పూర్తికాలం ప్రచారక్‌గా పనిచేసిన వాడు. ఎన్నికల్లో ఒక్కసారిగా పోటీ చేయకపోయినా అక్టోబర్ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి బిజెపి ఆయన్ని ఎంచుకుంది. ఆ తరువాత ఆయన ఈ రోజు వరకూ వెనక్కి చూసుకోలేదు. ఆదిత్యనాథ్ ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నారు. యూపిలో ఆయన కాషాయం ధరించిన ఓ పూజారి. మహంత్. బిజెపి నాయకత్వం ఆయన్ని ఒక ‘బయటి వ్యక్తి’గానే పరిగణిస్తూ వచ్చింది. 1998నుంచి గోరఖ్‌పూర్ నుంచి పార్టీ టిక్కెట్‌పైనే అయిదుసార్లు గెలుస్తూ వస్తున్నప్పటికీ ఆయన బిజెపితో పూర్తిగా మమేకం కాలేదు. కొన్ని సందర్భాల్లో పార్టీలో తిరుగుబాటు నేతగా కూడా పేరు తెచ్చుకోవటానికి కారణం ఆయనలోని అతివాద ధోరణే. ఎన్నికల రాజకీయాల్లో అధికార ప్రస్థానంలో వివిధ వౌలిక అంశాలపై బిజెపి అనుసరిస్తూ వచ్చిన రాజీ ధోరణిని ఆయన ఏనాడూ సమర్థించలేదు. 1990ల నుంచి ఆయన గురువు మహంత్ అవైద్యనాథ్ కానీ, ఆయన శిష్యుడిగా ఆదిత్యనాథ్ కానీ తమ అతివాద హిందూ జాతీయ వాద వైఖరిని ఏనాడూ దాచుకోలేదు. 2017లో జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి ప్రచార సామగ్రిపై ఆయన చిత్రం కానీ, ఆయన ప్రస్తావన కానీ చాలా చాలా తక్కువగా కనిపించిందంటే బిజెపి ఆయన్ను ఎంత తక్కువగా తన సొంతం చేసుకుందో అర్థమవుతుంది. 1970లో ఒకసారి, ఆ తరువాత 1989 నుంచి మూడు సార్లు మహంత్ అవైద్యనాథ్ గోరఖ్‌పూర్ నుంచి ఎం.పిగా గెలుపొందారు. ఆ తరువాత ఆయన వారసుడిగా అటు గోరఖ్‌పూర్ మఠం అధిపతిగా, లోక్‌సభ స్థానం ప్రతినిధిగా కూడా ఆదిత్యనాథ్ కొనసాగుతున్నారు. ఏ విధంగా చూసినా ఈయన రాజకీయ ప్రస్థానంపై బిజెపి ప్రభావం లేనే లేదని చెప్పాలి. కేవలం వ్యక్తిగత ప్రజాదరణతోనే ఆయన విజయపరంపర కొనసాగుతూ వస్తోంది. గోరఖ్‌పూర్ నియోజక వర్గంలో 1998నుంచి ఇప్పటి వరకూ అయిదుసార్లు ఆదిత్యనాథ్ సొంతంగా గెలుస్తూ వస్తున్నారు. పార్టీ తరపున ఓ సీటు గ్యారంటీ అన్న ఒక్క కారణంతోనే బిజెపి ఆ స్థానంలో మరొకరి గురించి ఆలోచించలేదు. ఈ విజయం కూడా అంత ఆషామాషీ కాదు. ఉత్తర ప్రదేశ్‌లో ముస్లిం మైనార్టీల జనాభా చాలా ఎక్కువ. సమాజ్‌వాది పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ముస్లిం ఓటర్లు వ్యవహరిస్తూ వచ్చారు. గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజక వర్గంలో మాత్రం ఈ పరిస్థితి లేదు. గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం పరిధిలో తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే మొత్తం జనాభా 37.70 వేలు అయితే అందులో పదిశాతం అంటే దాదాపు 3.5లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇతర మతాలు, దళితులు, ఇతర వెనుకబడిన వర్గాల వారు 50శాతం మేర ఉన్నారు. అయినప్పటికీ, ఈ నియోజక వర్గంలో మహంత అవైద్యనాథ్ నుంచి యోగి ఆదిత్యనాథ్ వరకు తిరుగులేని మెజారిటీతో ఓటర్లు గెలిపిస్తున్నారు. అది కూడా 51శాతానికి పైగా ఓట్లు సాధించటం మరో విశేషం. ఇదంతా వ్యక్తిగత ప్రజాదరణే తప్ప మరేమీ కాదన్నది నిర్వివాదాంశం.
ఎన్నికల రాజకీయాల్లో ఉంటూనే హిందూ యువవాహిని సంస్థను ఏర్పాటు చేసి యువతకు గోసంరక్షణ, ఘర్‌వాపసీ, లవ్ జిహాద్ ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. 16వ లోక్‌సభలో హిందూ సంబంధిత అంశాలను తరచూ ప్రస్తావించి వాటిపై తప్పనిసరిగా చర్చ జరిగేలా చేయటంలో సఫలమయ్యారు. ఆదిత్యనాథ్ రాజకీయ ప్రస్థానంలో ఇతర బిజెపి నేతల మాదిరిగా ఎలాంటి ముసుగు కప్పుకోలేదు. సెక్యులర్ చొక్కా తొడుక్కోలేదు. దాదాపు రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో తాను చెప్పదలచుకున్నది పదే పదే ఒకే వైఖరితో చెప్పుకుంటూ వచ్చారు. ఆయన అతివాద వైఖరిని విద్వేష ప్రసంగాలుగా సమాచార మాధ్యమాలు, రాజకీయ ప్రత్యర్థులు, మతపెద్దలు వ్యాఖ్యానించినా తాను మాత్రం వెనుకడుగు వేయలేదు. ఆయన ఎన్నికల విజయాలకు ఇవేవీ అడ్డం రాలేదు. ఏ అంశాలను ప్రస్తావిస్తే రాజకీయంగా తమకు భవిష్యత్తే లేకుండా పోతుందని నేతలు భయపడ్డారో, అధికారంలోకి రావటం కోసం ప్రధానమైన సైద్ధాంతిక అంశాలను బిజెపి పూర్తిగా అటకెక్కించినా ఆదిత్యనాథ్ మాత్రం వాటిని ప్రస్తావించటంలో, ప్రజల్లో చర్చకు తీసుకురావటంలో జంకలేదు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు బిజెపిని సైతం ఆశ్చర్యపరిచాయి. మెజారిటీకి దగ్గరలోనో, బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి వస్తామనుకున్న బిజెపి ఏకంగా నాలుగింట మూడొంతుల భారీ మెజార్టీని సాధించటం యావద్దేశాన్ని నివ్వెర పరిచింది. ఆ తరువాత ముఖ్యమంత్రి ఎన్నిక కూడా అదే విధంగా ఆశ్చర్యపరిచింది. ఏ ఎన్నికల పండితుడికీ, రాజకీయ విశే్లషకుడికీ అంతుపట్టని రీతిలో బిజెపి అధిష్ఠానం ఆదిత్యనాథ్‌ని ముఖ్యమంత్రి పదవికి ఎంచుకుంది. ఈ పరిణామం మొత్తం మన దేశానే్న కాదు.. ప్రపంచ దేశాలను
కూడా ఒకవిధంగా షాక్‌కు గురిచేసింది. వామపక్ష భావజాల
నాయకులు, ప్రత్యర్థి దేశాలు, ఆర్థిక వేత్తలు అయ్యో దేశం ఏమైపోతుందేమోనని వలవలా ఏడ్చేశారు. నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకు అడుగు పడిందంటూ విమర్శించారు. మన దాయాది దేశం పాకిస్తాన్ అయితే ఇక మన దేశంలో ముస్లింలకు, మైనార్టీలకు ఏదో అయిపోతుందోనని విలవిల్లాడిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. పాక్ మీడియాలో కుప్పలు తెప్పలుగా మోదీ-యోగి వ్యతిరేక వార్తాకథనాలు, సంపాదకీయాలు వచ్చిపడ్డాయి.
అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ఆదిత్యనాథ్ పరిపాలన దూకుడుగా మొదలైంది. పని ప్రదేశాల్లో పాన్ గుట్కాల వినియోగాన్ని తక్షణ ప్రాతిపదికన నిషేధించారు. రాష్ట్రంలో అక్రమంగా ఉన్న కబేళాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మొదటి గంటలోనే తన కేబినెట్‌లోని మంత్రులంతా పదిహేను రోజుల్లోగా తమ ఆదాయ వివరాలను వెల్లడి చేయాలని ఉత్తర్వులిచ్చారు. అవినీతి, శాంతిభద్రతల విషయంలో ఎట్టి పరిస్థితిలోనూ రాజీ పడే ప్రశే్న లేదని స్పష్టం చేశారు. అధికారులు కూడా పనిచేస్తే 18 నుంచి 20 గంటలు పనిచేయాలని, లేకుంటే సెలవుపై వెళ్లిపోవాలని కాస్త గట్టిగానే చెప్పారు. రోడ్డు రోమియోల భరతం పట్టేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. యాసిడ్ దాడి జరిగిన ఓ అమ్మాయి వద్దకు తానే స్వయంగా వెళ్లి పరామర్శించి లక్ష రూపాయలు సహాయం చేసి వచ్చారు. గోరఖ్‌పూర్, ఝాన్సీలలో మెట్రో రైల్ ప్రాజెక్టులను ప్రకటించేశారు. యూపిలో రోడ్లన్నింటినీ జూన్ 15లోగా గుంతలు లేకుండా చేయాలంటూ అధికారులకు స్పష్టమైన డెడ్‌లైన్ విధించారు. ప్రాంతీయ మాండలికాలకు ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే యోగాలోని సూర్య నమస్కారాలు, నమాజ్ ప్రార్థనలోని వివిధ అంశాలు ఒకే విధంగా ఉంటాయంటూ సరికొత్త వ్యాఖ్యానం చేశారు. యుపి ముఖ్యమంత్రిగా తాను ఏ బాధ్యత నుంచి పారిపోనని, కఠిన నిర్ణయాలు తీసుకోవటంలో వెనుకాడేది లేదని, తాను సంతుష్టీకరణ రాజకీయాలు చేయబోనని కూడా స్పష్టం చేశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు తన దగ్గర పరిష్కారం ఉందని ఆయన తేల్చి చెప్పారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రెండు రోజుల తరువాత పార్లమెంట్‌లో యోగి ఆదిత్యనాథ్ ఎం.పి హోదాలో మాట్లాడారు. ఆ ప్రసంగం పూర్తయిన తరువాత ఒక సీనియర్ బిజెపి ఎం.పి మాట్లాడుతూ ‘‘ఆయన (ఆదిత్యనాథ్) ఎంత హుందాగా మాట్లాడుతున్నారో పరిశీలించండి. తనను విమర్శించే వారికి ఆయన తన పనితనంతో కచ్చితంగా సమాధానం చెప్తారు. ఒక మఠం అధిపతి రూపంలో ఉన్న వ్యక్తి సరికొత్త రాజకీయ మూర్తిమత్వంగా ఎదుగుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది.’’ అని అన్నారు.
**
యోగి ఆదిత్యనాథ్, అజయ్‌సింగ్ పేరుతో ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో ఉన్న ఒకప్పటి ఉత్తరప్రదేశ్‌లోని పౌరిగడ్వాల్ జిల్లా పాంచుర్‌లో ఓ రాజ్‌పుత్ కుటుంబంలో 1972 జూన్ 5న జన్మించారు. హేమవతి నందన్ బహుగుణ గర్‌వాల్ విశ్వవిద్యాలయంలో బిఎస్సీ(గణితశాస్త్రం)లో 1992లో పట్ట్భద్రులయ్యారు. ఆదిత్యనాథ్ మంచి బాడ్మింటన్ కళాకారుడు, గజ ఈతగాడు కూడా. 1993లో ఎంఎస్సీలో చేరిన తరువాత గోరఖ్‌నాథ్ గురువు గురించి పరిశోధిస్తూ గోరఖ్‌పూర్ వచ్చిన ఆయన గోరఖ్‌నాథ్ మఠ్ అధిపతి మహంత్ అవైద్యనాథ్‌ను కలిశారు. అక్కడే ఆయన నాథ సంప్రదాయానికి సంబంధించి దీక్ష తీసుకున్నారు. 1994లో పూర్తి సన్యాసిగా మారారు. అజయ్‌సింగ్ నుంచి యోగి ఆదిత్యనాథ్‌గా మారారు. మహంత్ అవైద్యనాథ్ అనంతరం మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అదే సమయంలో అవైద్యనాథ్ అప్పటివరకూ ప్రతినిథిత్వం వహిస్తున్న గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గాన్నీ వారసత్వంగా ఎంచుకుని రాజకీయాల్లో ప్రవేశించారు.
**

2001లో గుజరాత్‌కు మోదీని ముఖ్యమంత్రిగా పంపించేముందు ఆర్‌ఎస్‌ఎస్ కానీ, బిజెపి కానీ సాహసం చేస్తున్నామని భావించాయి. కానీ, తనను తాను మంచి పరిపాలకుడుగా, సుపరిపాలన అందించిన నేతగా మోదీ ఎదిగిపోయారు. ఇవాళ ప్రధానమంత్రిగా తిరుగులేని స్థానంలో నిలిచారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఎంపికతో మోదీ-షా ద్వయం అంతకంటే పెద్ద రిస్కే తీసుకున్నారు. కానీ, ఆదిత్యనాథ్ పరిపాలన తీరు తెన్నులు దేశంలోని అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో పెద్ద మార్పునకు శ్రీకారం చుడుతుందన్న భావన పరివారంలో బలపడుతోంది. హిందూ ఓట్ బ్యాంక్ ఏకత్రితం చేసేందుకు ఈ పరిణామం దోహదపడుతుందని విశ్వసిస్తోంది. అయితే ఆదిత్యనాథ్ తనపై ఉన్న అతివాద హిందూ ముద్ర నుంచి, సుపరిపాలకుడిగా ఏవిధంగా మారతారన్నది వేచి చూడాలి.
**
నాథ
సంప్రదాయం
అంటే ఏమిటి?
ఆదిత్యనాథ్ అనుసరిస్తున్న సంప్రదాయం నాథ సంప్రదాయం. దీని గురువు మత్స్యేంద్రనాథుడు. ఆయన శిష్యుడు గోరఖ్‌నాథుడు దీనికి ఒక వ్యవస్థను కల్పించాడు. యోగ విద్యలను ఈ సంప్రదాయంలో ప్రధానభాగంగా చేర్చాడు. నాథసంప్రదాయం భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, ఇతర ఆసియా దేశాల్లో విస్తృతంగా వ్యాపించింది. ఈ సంప్రదాయంలో 84మంది సిద్ధులు ఉన్నారు. బౌద్ధ ధర్మంలో మాదిరిగానే ఈ సంప్రదాయంలోనూ గురుశిష్యులను మహా సిద్ధులుగా మహా యోగులుగా కీర్తిస్తారు. వీరు దేశమంతా పర్యటించి అంతిమకాలంలో ఒక ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ స్థిరపడి అఖండ ధునిని వెలిగిస్తారు. లేకపోతే హిమాలయాల్లోకి వెళ్లి అదృశ్యమైపోతారు. వీరు ప్రధానంగా హఠయోగాన్ని సాధన చేస్తారు.
నవనాథులు
నాథ సంప్రదాయంలో నవనాథులు ప్రధానమైన వాళ్లు. వీరు పరమేశ్వరుడైన మహాదేవుడి ప్రతిరూపాలు.
1. ఆదినాథ (ఓంకార స్వరూపం/జ్యోతి స్వరూపం)
2. ఉదయనాథ (పార్వతి స్వరూపం)
3. సత్యనాథ (బ్రహ్మ స్వరూపం).. 4. సంతోషనాథ (విష్ణు స్వరూపం)
5. అచల అచంబనాథ (ఆకాశ/ఆదిశేషు స్వరూపం)
6. గజబెలి గజకంథరనాథ (గజ స్వరూపం)
7. చౌరంగినాథ (చంద్ర, వనస్పతి రూపం)
8. మత్స్యేంద్రనాథ (మాయా స్వరూపం)
9. గోరక్షానాథ (శివస్వరూపం)

-కోవెల సంతోష్‌కుమార్