S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గానకళాతృష్ణ!.. బాలమురళీకృష్ణ!!

‘అదిగో భద్రాద్రి’ ‘నగుమోము..’ ‘ఎక్కడి మానుష జన్మంబెత్తితే..’ వంటి కీర్తనలు వింటున్నప్పుడు శ్రోత మనసు గాలిలో తేలిపోతుంది. ‘పిబరే రామరసం..’ ‘స్వర వారం వారం..’ పాటలకు కట్టిన వరసలని ఉచ్చరిస్తుంటే తాదాత్మ్యంలోంచి తొంగి చూసిన అనుభూతి ఆనంద తరంగాల డోలికల్లో ఊగిసలాడుతుంది. ‘బృహదీశ్వర మహాదేవ’ అనే కృతిని పాడినా.. వందేమాతరం, గీతం ఆలపించినా కలిగే గాఢానురక్తి శబ్ద నాదంలో స్వరఝరిగా మారి గుండెలోతుల్లోంచి దూసుకుపోతుంది. ఈ రస స్ఫూర్తి అందించిన కంఠస్వరం రాగ మాధుర్యంతో తొణికిసలాడుతుంటే.. ఆ సంగీత మణిపూసకి పర్యాయ పదమే మంగళంపల్లి బాలమురళీకృష్ణ. స్వర - లయ జ్ఞానాలతో శ్రుతిబద్ధతను పాటిస్తూ.. రాగం తానం పల్లవులలో చూసిన ఒడుపులు, ఒద్దికలు జన్మతః ఆ కళాభిజ్ఞుడు గానకృష్ణకు అబ్బిన రాగాల పరుసవేది విద్య. మందర గాంధారం నుండి తారా షడ్జమం దాకా స్థారుూ విన్యాసాలను ప్రదర్శించడం ఆ రాగాల బాలుడికే చెల్లింది. కీర్తనల్లో సమ్మోహనత్వం.. గానాలాపనలో మృదుత్వం.. గొంతులో ఉప్పొంగే మార్దవం.. స్వరకల్పనలో బహుముఖ ప్రజ్ఞ.. విజ్ఞులనే కాదు.. రసజ్ఞులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. రస వాహినిలో ఓలలాడిస్తాయి. ఆనంద పారవశ్యంలో విహరింపజేస్తాయి. రసిక మనోరంజకంగా.. అలంకారమయంగా.. వర్ణ రంజితంగా.. తాత్వికుడి గుంభనపు నవ్వుతో రస తృప్తిని కలిగిస్తాయి. ముఖ కవళికల్లో కదలాడే రసార్ద్ర భావం.. గళంలోకి వొలికించి పలికించే గాన శైలీ విన్యాసం శ్రవణేంద్రియాల్ని మేల్కొలిపే రాగ నాదవేదం ఈ గాన గంధర్వుడికే సొంతం. భక్తిప్రపత్తులతో కళ్లల్లో ఆరాధనా భావాన్ని ప్రదర్శించే నేర్పరితనం.. భావితరాలకు ఆదర్శ దిశా నిర్దేశనం, ధాతు, మాతు రచనలో తనదైన విలక్షణ ముద్ర.. ఈ సంగీత పుంభావ సరస్వతి బాలమురళి. ఈ సంగీత సర్వస్వంతో ముఖాముఖి..

గేటు దాటగానే ముందు వాకిలిలో పూల మొక్కల మధ్య ఊయల చిరుగాలికి నెమ్మదిగా తనంత తానే ఊగుతున్నట్టు. ఆ ఇంటి గృహలక్ష్మి అన్నపూర్ణమ్మగారు.
‘బాగున్నావా? ఎప్పుడు రాక?’ అంటూ హాయిగొలిపే పలకరింపు. వారితోపాటుగా ఇంట్లోకి వెళ్లగానే సోఫాలో చిరునవ్వులు చిందిస్తున్న బాలకృష్ణుడు. కుశల ప్రశ్నల అనంతరం ఈసారైనా నాకు ఆంధ్రభూమి తరఫున ఆర్టికల్ రాసే అవకాశం ఇవ్వాల్సిందే అని చనువుగా అర్థింపు. హాయిగా నవ్వేస్తూ...
‘ఏం అన్నపూర్ణా!’ అంటూ వారు అంగీకారంగా తల ఊపగానే ‘సరే మరి’ అన్నారు. చెవుల్లో అమృతం. ‘గానసుధారసమే పరమానంద దాయకము...’
‘మీరే చెప్పేస్తే రాసేసుకుంటాను. నాకేం చేతనవును మిమ్మల్ని ఏం అడగాలో?’ అన్నాను.
‘అలా వద్దు. నువ్వు ప్రశ్నలడుగు నేను చెప్తా’ అన్నారు. మర్నాడు పొద్దున మొదలైంది ముఖాముఖి.

మీ బాల్యం ఎలా గడిచింది? సంగీతపరమైన మూల బీజాలు మీకు అప్పుడే పడ్డాయా?
(చిన్న నవ్వు)
నేను పుట్టింది సంగీత వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న సంప్రదాయక కుటుంబంలో. తోటి పిల్లలతో ఆడుకునే స్వేచ్ఛాపూరిత వెసులుబాటు నాకు అక్కడ లభించలేదు. నన్ను చాలా గౌరవభావంతో చూసి నా ఈడు వాళ్లంతా దూరంగా జరిగిపోయేవారు. సంగీత కచేరీలు, అభినందనలు, సన్మానాలతో నా బాల్యం గడిచిపోయింది.
ఆ అపురూప ఘడియల్ని ఇప్పుడు నా మనుమలు, మనుమరాళ్లతో నెమరువేసుకుంటూ పంచుకుంటున్నాను. అప్పటి అల్లరి సరదాలను వీళ్లతో ఇప్పుడు తీర్చుకుంటున్నాను. సంగీతం విషయానికొస్తే నాకు తొలి గురువు మా నాన్నగారైన పట్ట్భారామయ్యగారే! మా అమ్మ సూర్యకాంతంగారు స్వతహాగా మంచి వైణిక విద్వాంసురాలు. అలాంటి కళాత్మక పరిసర వాతావరణంలో క్రమశిక్షణతో పెరిగి పెద్దవాడినయ్యాను. ఆ క్రమంలో పారుపల్లి రామకృష్ణయ్యగారి శిష్యరికంలో సంగీత సాధన చేస్తూ దినదిన ప్రవర్థమానమై ఎదుగుతూ వచ్చాను.

ప్ర: అతి చిన్న వయసులోనే సంగీత కచేరీ చేసిన బాల గంధర్వుడిగా, ఏకసంథాగ్రాహిగా ముద్రపడ్డారు. ఆ అనిర్వచనీయమైన అనుభవం ఎలాంటిది?
జ: ఏడేళ్ళ ప్రాయంలో 1939 జూలై 6న త్యాగరాజ ఆరాధనోత్సవాల ప్రారంభం రోజున, సంగీత విద్వాంసుల మధ్య తొలి సంగీత కచేరీ చేసిన అనుభవం నాది. ‘ఈశ మనోహరి’ రాగంలో ‘మనసా శ్రీరామచంద్రుని’ అనే కీర్తనని ఆలపించి శ్రోతలకి వినిపించాను. అపూర్వ స్పందన వచ్చింది. అప్పటి నుంచి వేదికలపై నా సంగీత కచేరీ ప్రస్థానం మొదలయ్యింది.
ప్ర: సంగీత పరంగా మీరు ఎలాంటి శిక్షణని తీసుకుని సాధన చేశారు? ఆ వివరాలు తెలుసుకోవాలని..
జ: నేను ఒక పద్ధతి ప్రకారం ఎవరి దగ్గరా నేర్చుకోలేదు. మా నాన్నగారి ఏకైక సంతానంగా, గారాల ముద్దు బిడ్డగా ఆయన పక్కనే ప్రతి రాత్రి పడుకుని సంగీత విద్యని అభ్యసించేవాడిని. సరళీస్వరాలు, జంట స్వరాలు, వర్ణాలు, కీర్తనలు అలా అలవోకగా అవలీలగా నా నోటికి వచ్చేశాయి. వేదవిద్యను పోలిన శ్రుత పాండిత్యమది. అలా మూడేళ్ల చిరుప్రాయంలోనే సంగీత పాఠాలు నేర్చుకోవడం ప్రారంభించాను. నా ఏడవ ఏట గురువుగారు రామకృష్ణయ్య గారి వద్దకి తీసుకెళ్లారు. గురువుల వద్ద నాకు శిక్షణ నామమాత్రమే! స్వశక్తితో అంకితభావంతో బాల్యదశ నుండే సాధన మొదలయ్యింది.
ప్రశ్న: పలు రకాల వాయిద్య పరికరాలు పలికించడంలో మీరు మంచి దిట్టని విన్నాను...
జ: చిన్నప్పుడూ ఒకసారి వయొలిన్ తీసి వాయించాను. అది చూసి మా పెద్దమ్మ సుబ్బలక్ష్మి, మా నాన్నగారు ముచ్చటపడ్డారు. నేను పుట్టిన 15 రోజులకే మా అమ్మగారు సూర్యకాంతమ్మ కాలం చేశారు. దానితో మా పెద్దమ్మ కంటికి రెప్పలా నన్ను కాపాడుకుంటూ వచ్చారు. ఆ దశలో సంగీత పరికరాలను వాయించి పలికించడం నేర్చుకున్నాను. తొమ్మిదేళ్లు వచ్చేసరికి వయొలిన్, మృదంగం, కంజీర, వీణ వంటివి నేర్చేసుకున్నాను. మరోవైపు గాత్రం. నాది సహజ పాండిత్యం. డిగ్రీలు చదవలేని విద్వత్తును మిగిల్చింది.
ప్ర: ‘పిట్ట కొంచెం - కూత ఘనం’ అన్నట్టుగా మొదలైన మీ గాత్ర స్వరం కోకిల సుస్వరంగా మారి చిరుప్రాయంలోనే కొత్త పుంతలు తొక్కించింది అనడానికి ఏవైనా ప్రయోగాత్మక సంగీత రచనలు చేసి, ఆలపించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారా?
జ: నా పధ్నాల్గవ ఏటనే జనక రాగాలలో ‘రాగంగా రవళి’ని స్వరబద్ధం చేసాను. 430 బాణీలతో 72 మేళకర్త రాగాలకు ఒక్కో కృతిని సమకూర్చుతూ కీర్తనలను రాసి స్వరపరిచాను. ‘జనకరాగ కృతి మంజరి’ పేరిట గ్రంథంగా ప్రచురించి గానం చేశాను. అవన్నీ కవిత్వ ప్రధానం కాకపోయినా రాగప్రధానమైనవే. గతంలో ఎవ్వరూ పాడని విధంగా సంగతులు ఉంటాయి వాటిలో. ఆ విధంగా రాసుకుంటూ వచ్చాను. స్వీయకృతుల్ని ‘సూర్యకాంతి’ అనే పుస్తక రూపంలో విడుదల చేశాను.
ప్ర: మీ కచేరీలు ఎనభై ఐదేళ్ల వయసులోనూ... ఇప్పటికీ శ్రోతలను గానంతో రంజింపజేసి, ఉర్రూతలూగించి మంత్రముగ్ధుల్ని చేస్తాయి కదా? వీటి వెనుక దాగి ఉన్న విజయ రహస్యాన్ని చెబుతారా?
జ: ఎనిమిదిన్నర దశాబ్దాల నా సంగీత యాత్రలో రాగం, స్వరం, తాళం, లయ అన్నింటి మీదా అధికారంతో కూడిన పట్టు సాధించాను. స్వరకర్తగా సంగీతకారుడిగా అన్ని పార్శ్వాలలోను సొంత ముద్ర వెయ్యడానికి ప్రయత్నించాను. ఇందులో తెచ్చి పెట్టుకున్నది ఏదీ లేదు. ఇప్పటికి 27 వేలకి పైగా కచేరీలు చేశాను.
ఎలాంటి రాగం పాడినా అందులో కొత్తదనం ధ్వనిస్తుంది. నా కీర్తనల్లో కవిత్వముంటుంది. గాన రీతిలో కానీ స్వర కల్పనలో కాని, రాగాలాపనలో కాని స్వతంత్ర శైలిని ప్రదర్శించడానికి ఇష్టపడతాను. ఇవన్నీ సహజంగా అబ్బిన లక్షణాలే. సంగీతం పాడడం, వినడం మూలంగా ఆరోగ్యం చేకూరుతుంది. జీవితమంతటా లయ ఉంటుంది. రాగం ఇలా ఉందని చెప్పడానికి నేను సంగీతం ద్వారా ప్రయత్నిస్తాను. పరిమితులు లేని భావ ప్రకటనలను అందించాలని నా తాపత్రయం. సంగీతంలో సాహిత్యం ప్రధానం కావాలి అన్న భావనని నేనే పరిచయం చేశానేమో? నాకు సంగీతం తెలియదు. కాని సంగీతానికి నేను తెలుసు. నా జీవితం సంగీత సర్వస్వం. చిత్తశుద్ధి, కృషిలను మించిన ప్రత్యామ్నాయ శక్తులు లేవు. సంగీతంలో నవరసాలు భక్తిలో విలీనమవుతాయి. దాని అంతిమ పరమార్థం కూడా ఇదే. ఇలాంటి ఉదాత్తమమైన ఉత్తమ ఆదర్శం ఇంకే దేశంలోనూ కనిపించదు.
ప్ర: స్వర కల్పనల విషయంలో అప్పటికప్పుడే వేదికపై సిద్ధపడతారని తెలిసింది. అదెలా సాధ్యం?
జ: కచేరీ చేయడానికి వేదికపైకి వెళ్లాక ఆశువుగా సంగీతాన్ని పాడటం అలవాటు చేసుకున్నాను. దీని కోసం ప్రత్యేక సాధన చెయ్యను. ‘ముక్తాయి’ వేద్దామని గతంలో ఒకసారి ప్రయత్నిస్తే జ్ఞాపకం ఉండట్లేదు. ఇక అప్పట్నించి ఎలా వస్తే అలా పాడడం అలవాటయిపోయింది.
ప్ర: పరాయి భాషల్లో సంగీత కచేరీలు చెయ్యడం అంత తేలికైన విషయం కాదు.
జ: నదులు వాలును బట్టి ప్రవాహ గతిని మార్చుకుంటాయి. అలాగే సంగీత సాహిత్యాలూనూ. ఇతర భాషలలో గానం చేసేటప్పుడు సాహిత్యం మీద దృష్టి పెడతాను. అలాంటప్పుడు సంగీతానికి - సాహిత్యానికీ అవినాభావ సంబంధం లేకుండా ఎలా పోతుంది? భాష ముఖ్యం కాదు. మూలాధారం ఎక్కడుంది? ఏ స్థాయిలో పాడాలో తెలుసుకుంటాను.. సంగీతం ఉంటే ఏ భాష
లోనైనా పాడవచ్చు. హిందీ, బెంగాలీ, ఆంగ్లం, తమిళం, సంస్కృతం ఇలా ఎన్నైనా పాడి మెప్పించవచ్చు. వ్యక్తిగత అనుభవం, దాని లోతు, భావం ముఖ్యం. విషయ పరిజ్ఞానం లేనిదే ఏ విషయాన్నీ విమర్శించకూడదు. ఇది నా వ్యక్తిగత తాత్విక భూమిక.
ప్ర: కర్ణాటక సంగీతంలో ‘జుగల్‌బందీ’ని ప్రారంభించిన ఘనత మీది. మరి కర్ణాటక - హిందుస్తానీ సంగీతాల మధ్య సారూప్యం ఎలాంటిది?
జ: భీమ్‌సేన్ జోషి, కిశోరీ అమాంకర్, హరిప్రసాద్ చౌరాసియాలతో కలిసి ఈ ‘జుగల్‌బందీ’ ప్రదర్శనలిచ్చాను. ప్రాచీన సంప్రదాయాల్ని సజీవంగా నిలుపుతూనే, ఆధునిక ధోరణులలో కొత్త రాగాల్ని స్వరపరచి వినిపించగలగాలి. కర్ణాటక సంగీతంలోని ప్రౌఢత్వం, హిందుస్తానీ బాణీలోని ‘రక్తిమ’లను జోడించి పాడగలగాలి. ఈ రకమైన కొత్త ఒరవడులు సంగీత కచేరీకి ప్రయోగాత్మకంగా నిలుస్తాయి. శాస్ర్తియ సంగీతానికి దగ్గరవుతాయి. సాహిత్య ప్రధానమైన సంగీతానికి ప్రాధాన్యతనిస్తే అది సంప్రదాయం కాదనీ, అది కర్ణాటక సంగీతం కాదనీ, ఆచార వ్యవహారాలను తారుమారు చేస్తున్నానని చాలామంది భ్రమపడ్డారు. దేనినైనా శాస్ర్తియ దృష్టితో చూడడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు కర్ణాటక సంగీతం పేరుతో ఉన్న సంగీతం త్యాగరాజ సంగీతమే!
ప్ర: గురువు చెప్పిన విషయాలతోపాటు కొత్త రూపాన్ని అందివ్వడం శిష్యుడి కర్తవ్యమేకదా? సొంత బాణీలో పాడడానికి మధ్య తేడా ఏమిటి?
జ: ఏ బాటలో నడవాలో నేర్పించేది గురువైతే విభిన్నత్వాన్ని వినూత్న కోణంలో ఆవిష్కరించడం శిష్యుడి బాధ్యత. త్యాగరాజు పాడిన సంగతులు పూర్తయ్యాక, మిగతా పాటకి మార్పుల చేర్పులతో కొత్తదనాన్ని ఆపాదించి పాడడం నేను చేసే ప్రయోగ ప్రయత్నాలలో ఒకటి. అందులో శాస్ర్తియ దృష్టి ప్రతిఫలించాలి. అలా చేయడం వల్ల మనలోని సృజనాత్మక శక్తి బయటికి వస్తుంది. వేరొకర్ని అనుసరించి పాడడంలో మన సొంత గొంతు వినిపించదు. స్వతంత్ర శైలిలో సొంత బాణీలో పాడితే దాని ప్రత్యేకత వేరు. ద్వారం వెంకటస్వామి నాయుడు, రామానుజయ్యంగార్, మహారాజపురం విశ్వనాథయ్యర్ వంటి లబ్దప్రతిష్టులు, వేరొకరిలాగా పాడలేదు. స్వయంగా తమకు నచ్చిన రీతిలో ఆలపించేవారు. అలా సొంత గొంతుకతో విశిష్ట వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి వాళ్లు భవిష్యత్తులో గొప్ప వాళ్లవుతారు. గానం బాగున్నట్టయితే అది పాటగా విస్కృతి చెందుతుంది. లేకపోతే నశించిపోతుంది. ఈ తేడాని గమనించి యువ గాయకులంతా మసలుకోవాలి. ఇలాంటి కొత్త మార్గాల అనే్వషణ వాళ్లలో జిజ్ఞాసను రేకెత్తించి సృజనాత్మకతకు దారి తీయిస్తుంది.
ప్ర: మీపై వచ్చే పరోక్ష విమర్శలను ఎలా స్వీకరిస్తారు?
జ: నా పట్ల సద్విమర్శ చేసేవారంటే అపారమైన గౌరవం నాకు. అలాంటి విమర్శలను ఆలోచించి సరిదిద్దుకుంటాను. వ్యక్తిగత కృషికి, ఎదుగుదలకు ఆత్మ విమర్శ చాలా అవసరం. నేను చేసేది సరైనదనిపిస్తే ఎలాంటి వారు చెప్పినా వినిపించుకోను. వ్యక్తిగత అభిరుచి, నిస్వార్థ లక్ష్యం, సాధనతో కూడిన ప్రజ్ఞగా సంగీతం నా జీవితంలోకి ప్రవేశించింది.
ప్ర: సంగీత సాధన ఏ రకమైన దృష్టితో కొనసాగించాలని మీ అభిప్రాయం?
జ: ఏ వ్యక్తిగత ప్రయోజనం కోసమో, లబ్ధి కోసమో కాక, మానసికోల్లాసానికి, స్వీయ తృప్తిని పొందడానికి మాత్రమే పరిమితం చెయ్యాలని మా గురువుల ఉవాచ. ఉపాధిని, ప్రతిఫలాన్ని ఆశించని విద్య కళాత్మకంగా, శోభాయమానమై విరాజిల్లుతుందని నా సంగీత జ్ఞానం నాకు చెప్పిన మొదటి పాఠం.
ప్ర: ఒకప్పటి సంప్రదాయక కర్ణాటక సంగీతం ఆధునిక, శాస్ర్తియ సంగీతంగా మీలో మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఏమిటి?
జ: పారుపల్లి రామకృష్ణయ్యగారి ఆధ్యాత్మిక గురువులైన విమలానంద భారతీస్వామి గారు ఓసారి నాకు కబురు పంపి పిలిచారు. త్యాగరాజుకి పూర్వ సంగీతాన్ని, సంగీతంలో ఆయన తొక్కిన కొత్త పుంతలు, చేసిన కొత్త రాగాల వివరాలు, పాడిన తీరు, ఆయనని వాగ్గేయకారునిగా మలచిన వైనం, చరిత్రలో నిలిచిపోయిన విధానాన్నీ ప్రశ్నించి ప్రస్తావించారు. అలా నేను రూపుదిద్దుకోవాలని ఆశీర్వదించి పంపారు. ఆ ఉద్దీపన మేలుకొలుపుతో 16 ఏళ్ల ప్రాయంలోనే సరికొత్త అడుగులు వెయ్యడం ప్రారంభించాను. నాలో అంతర్లీనంగా దాగి ఉన్న వాగ్గేయకారుడిని చైతన్యంతో తట్టి లేపి స్ఫూర్తిదాయకంగా మలిచి పైకి తీసుకొచ్చిన ఘనత విమలానంద భారతీస్వామి గారిదే!
ప్ర: మీరు సృష్టించిన రాగాల్లో విలక్షణత ఉట్టిపడుతుందంటారు. మచ్చుకు కొన్ని చెప్తారా?
జ: త్రిశక్తి, ఓంకారి, లవంగి, రోహిణి, కాళిదాస, సర్వశ్రీ, తరణి, పుష్కర గోదావరి, మనోరమ, ప్రతిమాధ్యమావతి, సుముఖం, వల్లభి, జనసమ్మోదిని, మహతి రాగాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. నా కీర్తనల్లో రాగం, భోగం, స్నేహం, మోహం దోబూచులాడుతూ ఉంటాయి. వీటిలో ఆరాటం, ఆవేదన, ఆకాంక్ష, ఆర్తి, తపన కొట్టొచ్చినట్టు కనపడతాయి.
ప్ర: ఇంకా మీరు రాసి, మరికొన్నింటిని స్వరపరచినవి చాలా మిగిలే ఉంటాయి. వాటిని గురించి?
జ: లేకేం? చాలా ఉన్నాయి. జయదేవుని అష్టపదులు, స్వాతితిరునాళ్ రచనలు, అన్నమయ్య పదాలు, సంగీత త్రిమూర్తుల కృతులు, గాయత్రీ రామాయణం, సదాశివ బ్రహ్మేంద్ర, అమరనారాయణ కీర్తనలు, తత్వాలు.. ఇలా అన్నింటినీ గౌరవిస్తూ ఆ పాటలకు జీవం పోశాను.
ప్ర: ఆకాశవాణితో మీకు ఉన్న ప్రత్యేకత అనుబంధం ఎలాంటిది? ఇందులో కూడా కొత్త ప్రయోగాలు చేసి శ్రోతలను అలరించారని ప్రతీతి.
జ: 22 ఏళ్లకే ‘ఆకాశవాణి’లో సంగీత పర్యవేక్షక ఉద్యోగం చేశాను. నేను అప్పట్లో రూపొందించిన ‘్భక్తి రంజని’ కార్యక్రమం బహుళ ప్రజాదరణ పొందుతూ వచ్చింది. అందులో పాడిన ప్రయోగ రంగదాసు కీర్తనలు సంప్రదాయ వారసత్వానికి ప్రతీకగా నిలిచినవే. ఇంకా ‘ఏమి సేతురా లింగా’ వంటి తత్వాలు, వింజమూరి శివరామారావుగారి శ్రీరామ కథాగానం బాగా ఆకట్టుకొన్నాయి. కాబట్టే అఖిల భారత రేడియో సంస్థ ఉన్నత కళాకారుడిగా నన్ను ప్రత్యేకంగా గుర్తించింది.
ప్ర: త్యాగరాజస్వామికి ఐదవ తరం వారసునిగా ఆరున్నర దశాబ్దాలుగా దేశ విదేశాలలో సంగీత ఝరితో ప్రవహిస్తున్న మీ భారతీయ స్వరానికి మూల చైతన్య కేంద్ర బిందువు ఎక్కడుంది?
జ: మానవ శరీరంలో సంగీతం ఉంది. గుండె చప్పుడు లయ, ఉచ్ఛ్వాస నిశ్వాసలే దీనికి శ్రుతి. మనసే ఒక చైతన్య కేంద్ర బిందువు. నా ఉద్దేశంలో లలిత, శాస్ర్తియ సంగీతాలు వేర్వేరు కాదు. రెండింటికీ ఆత్మ ఒక్కటే - సంగీత సాహిత్యాల్లాగ. ఈ ఎనిమిది దశాబ్దాలలో ఐదు వందలకు పైగా సమ్మేళ రచనలు చేశాను. ‘మురళీగానసుధ’ పేరిట కృతుల సంపుటి వచ్చింది. సంగీతాన్ని అందుబాటులోకి తేవడానికి ‘మురళీ రవళి’ అనే సంస్థను స్థాపించాను. 1939 నుండి నేటి దాకా దేశ విదేశాల్లో కచేరీలు చేస్తూనే ఉన్నాను. అష్టపదులు, జావళీలు, హిందుస్తానీ భజనలు, తిల్లానాలు, లలిత గీతాలు ఏవి పాడినా సొంత గొంతుకతో నాదైన ముద్రతతో సృజనాత్మకతకు ఊపిరి పోస్తూనే వస్తున్నాను.
ప్ర: మీ పూర్తి పేరులో కొంత సర్దుబాటు జరిగిందంటారు. ఏమిటా కథ?
జ: 1939 జులైన నా తొలి కచేరీ జరిగింది. ఆ సందర్భంలో ‘మురళి’ని వాయించిన మా నాన్నగారు నాకు ‘మురళీకృష్ణ’ అని నామకరణం చేశారు. ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ నా పేరుకి ముందు ‘బాల’ని చేర్చారు. అలా నేను ‘బాల మురళీకృష్ణ’ని అయ్యాను.
ప్ర: లబ్దప్రతిష్టులైన సంగీత విద్వాంసులు పరచిన సంప్రదాయ శైలిని మీ బాణీలోకి మలచుకుని ఉత్తేజం పొందిన సంఘటనలు, సందర్భాలు ఏవైనా ఉన్నాయా?
జ: ప్రేరణ ఎక్కడైనా ఒక్కటే. ఎవరి నుంచి ఎలాంటి స్ఫూర్తి పొందినా అది సంగీతమయమే అవుతుంది. సంగీత ప్రతిభావంతులు మనకు చాలామందే ఉన్నారు. చెంబై వైద్యనాథ భాగవతార్, సెమ్మంగూడి శ్రీనివాసయ్యర్, జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం, ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్ వంటి గాన కళాకోవిదులు తమ సొంత మార్గాల్ని అనుసరించారు. నేను వీళ్లందర్నీ అధ్యయనం చేశాను. వాళ్లు గుర్తించి కొనసాగించిన పద్ధతులను, అంశాలను నా గానంలోకి స్వీకరించి ఆస్వాదించాను. వీళ్లల్లో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన విలక్షణత గల శైలి ఉచ్ఛారణలో వైవిధ్యం కనిపిస్తుంది. వీటన్నింటిని స్థూల దృష్టితో చూసి సూక్ష్మదృష్టితో పరిశీలించినప్పుడే మనదైన ప్రత్యేకత ఏర్పడుతుంది. ఈ నేర్పుని కొత్తదనంతో అంది పుచ్చుకోవాలి. ప్రతిభావంతులంతా ఈ కోవలో ప్రయాణించి మార్గ దిశా నిర్దేశం చేసుకున్నవాళ్లే!
ప్ర: మీరు చేసిన స్వీయ రచనలు సంగీత ప్రియులకు ఎలాంటి రాగాలను అందించాయి?
జ: తన హితమే (శుద్ధ్ధన్యాసి), అమ్మ ఆనందదాయిని (గంభీర నాటవర్ణం), చలముజేసి (రామప్రియ వర్ణం), అఖిలాండేశ్వరి (కర్ణాటకకాపి), గణాధిపం (నాట), సదా తవపాద (షణ్ముఖప్రియ), గాన రసిక (హిందోళం), సరగున (తోడి వర్ణం) ఇత్యాదులు చాలా ఉన్నాయి. ఇంకా వందకు పైగా కృతులు, థిల్లానాలు, రాగమాలికలు, పద వర్ణాలు ఉన్నాయి. రాగం పూర్తిగా గాయకుడి ద్వారానే వికాసం పొందుతుంది. కాబట్టి అది కూడా అతని స్వంతమేనని అనుకోవాలి. ఇదీ నా అభిప్రాయం.
ప్ర: సంగీత ప్రపంచంలో కొత్తదనానికీ, బాణీలకు మీరిచ్చే విలువ ఎలాంటిది?
జ: శ్రోతలే సరైన న్యాయనిర్ణేతలు. సంగీతం మహా సముద్రం లాంటిది. తప్పొప్పుల్ని మనం నిర్ణయించలేం. నా వరకూ సృజనాత్మకతతో పోటీ పడుతూనే ఉంటా!
ప్ర: భారతప్రభుత్వం, దక్షిణ భారత సంగీతం పట్ల సహాయ సహకారాల విషయంలో మీరు సానుకూల దృక్పథంతో ఉన్నారా?
జ: వాటి పని చేసుకుపోతున్నాయి. ఇందులో రాజకీయ కలుషితం లేనంత వరకూ ఫరవాలేదు.
ప్ర: సాధారణంగా మీ కచేరీ ప్రదర్శనల్లో కొన్ని కట్టుబాట్లలో కూడిన పరిమితులు ఉంటాయి. దీని వెనుక ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
జ: నా వరకూ నా ప్రదర్శనలపై, సామర్థ్యంపై విశ్వాసం ఉంది. భావితరాలు కూడా వీటిన ఆస్వాదిస్తూ అనుభూతించగలగాలి.
ప్ర: సినిమా సాహిత్యం మీకు అపూర్వమైన గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టల్ని తీసుకొచ్చింది. ఆబాలగోపాలాన్ని అలరించే ఆ చలనచిత్రాల గీతాల విశేషాల్ని, వాటి నేపథ్య సంగీత దర్శకత్వ బాధ్యతల్ని, నటించిన పాత్రల్ని, స్వరపరచిన బాణీలని కొంచెం విడమర్చి విశే్లషిస్తారా?
జ: చెప్పడానికైతే చాలా విషయాలు, విశేషాలున్నాయి. ‘ఉయ్యాలజంపాల’ చిత్రంలోని ‘ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు’ పాటతోపాటు ‘నర్తనశాల’లో ‘సలలిత రాగ సుధారస సారం’ గీతం ఉంది. ‘శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు’ సినిమాలో ‘వసంత గాలికి వలపులు రేగ’ పాటను పాడాను ‘కర్ణ’ చిత్రంలో ‘నీవూ నేనూ వలచితిమి’ గీతం ‘గుప్పెడు మను’లో ‘వౌనమే నీ భాష ఓ మూగ మనసా!’ వంటి పాటలు ఆలపించాను. ‘్భక్తప్రహ్లాద’ చిత్రంలో పాడిన అన్ని గీతాలూ తృప్తినిచ్చాయి. ‘పలుకే బంగారమాయేనా.. అందాల రామా’ వంటి పాటలు కూడా ప్రసిద్ధి పొందాయి.
‘సంధ్య గిదేన సింధూరం’ అనే మలయాళ చిత్రంలో కథానాయకుడిగా.. ‘్భక్తప్రహ్లాద’లో నారదుడిగా నటించిన పాత్రలు చాలా మంచివి. ‘సంధ్యారాగ’ కన్నడ సినిమాకి 1974లో ఉత్తర సంగీత దర్శకుడిగా ప్రాంతీయ బహుమతి లభించింది. సినిమా గాయకుడిగా ‘హంసగీతే’ కన్నడ చిత్రానికి 1975లోనూ, ‘మధ్వాచార్య’ చిత్రానికి 1986లో సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు పొందాను. ‘ఆదిశంకరాచార్య (1983), రామానుజాచార్య (1989) చిత్రాలకు సంగీత దర్శకత్వం చేశాను. సినిమా అనగానే తమిళ ప్రేక్షకులకి ‘తిరువివైయాడల్’ చిత్రంలోని ‘ఒరునాల్ పోదుమా’ పాట గుర్తుకొస్తుంది. ‘తలలై వనుక్కోరుతలైవి’ అనే పాటకు సంగీత దర్శకత్వం వహించాను. నటించిన ‘నవరత్నం’ చిత్రానికి కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చాత్య బాణీలతోపాటు జానపద వరస అవసరమైంది.
* * *
చిరునవ్వుల రేడు.. సంగీత సామ్రాట్టుతో కబుర్లు పూర్తయ్యాక ఆ దంపతులకు నమస్కరించి మళ్లీ వస్తానంటూ సెలవు తీసుకుని బయటికి వచ్చాను... గేటు వరకు వచ్చి జాగ్రత్తగా వెళ్లమని చెప్తున్నప్పుడు ఆ ఆప్యాయతకు కళ్లల్లో సన్నటి నీటిపొర. కొంత దూరం వచ్చాక వెనుతిరిగి చూశాను.. ఒక పాట మహాద్భుతంగా.. నాతోపాటుగా.. ‘ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు.. ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు’
.. ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా.. సొంత ఊరు.. అయిన వారు అంతరాన ఉందురోయ్!

**************************

నాద బ్రహ్మోపాసనలో తన కంఠస్వరంలో రసస్ఫూర్తిని జ్ఞానాన్ని ఏకకాలంలో అందించిన స్వరబ్రహ్మ మంగళంపల్లి.
సంగీతమే అభ్యాసంలో శాస్త్రం, ప్రయోగంలో కళ, శాస్త్ర జ్ఞానానికి బుద్ధి, కళారూపానికి హృదయం.. ఈ రెండింటినీ ఆత్మజ్ఞానంతో ఆవిష్కరించిన సంగీత శిల్పకారుడు బాలమురళి. ప్రపంచంలో అందరూ శాస్త్రం ఆధారంగా పాండిత్యాన్ని సముపార్జిస్తారు. బాలమురళి మేళకర్త రాగాల సృష్టికర్త. శాస్త్రాన్ని కొత్తరీతిలో ఆవిష్కరించి సప్త స్వరాల్లో నవరసాలు అందించిన జ్ఞాని. ప్రస్తుత ప్రపంచంలో కళాస్వరూపి. వాగ్గేయకారుడు.
రాగాల సృష్టిలో వీరిది వినూత్న శైలి. ఎదురీత పద్ధతి. సంగీత శాస్త్రంలో చెప్పిన ప్రకారం అయితే రాగానికి అయిదు స్వరాలుండాలి. బాలమురళి అదేం పట్టించుకోకుండా నాలుగు, మూడు స్వరాలతో కూడా రాగాలను సృష్టించి పాటలను రాసి, అద్భుతంగా పాడి విన్పిస్తారు కూడా. సుముఖం, లవంగి (సాక్షాత్తు ఈ రాగం పేరే వీరి ప్రియ మనవరాలి పేరు), మహతి (వారి ఇంటికి పేరదే) మొదలైనవి. నాలుగు స్వరాలతో ఉండే సర్వశ్రీలో మూడే (సమ/ప) అయినా వీటి ఆలాపనలో గాని కృతుల రచనలో గాని ఏ లోటు ఉండదు.

**********************************

సహజ గాన కవితాంకృతులగు వాగ్గేయకారుడు మంగళంపల్లి ఉద్భవించి జనకరాగ కృతి మంజరి అనే గ్రంథాన్ని రచించి లోకానికి మహోపకారం చేసిన వ్యక్తి. ఈ గ్రంథంలో డెబ్బై రెండు మేళకర్త రాగాలలో 72 కృతులు రాయబడ్డాయి. ఈ గ్రంథ పూర్వభాగం, ఉత్తరభాగంగా ఒకే సంపుటము. శుద్ధ మధ్యమ ప్రధానమైన 36 కృతులు, ప్రతిమధ్యమ ప్రధానము 36 ఉన్నాయి. ఇవి అమ్పుర్ణ రాగములు అవడం చేత సరళంగా మాధుర్యంగా స్ఫురిస్తాయి.
* మధుర శబ్దాలను ఉపయోగించే కవితా శక్తిలో ప్రతిభ, కవి భావన విశేషం కనిపిస్తుంది. కొన్ని కృతులలో రాగాల పేర్లనే రాయడం, గాయకులూ ఆ రాగాలతో పాడడం విశేషం. జనకరాగ కృతి గ్రంథం నుండి 14వ కృతి వకుళాభరణ రాగం, 17వ కృతి సూర్యకాంత రాగము, 57వ కృతి సింహేద్ర మధ్యమము, 62వ మేళకర్త రిషభ ప్రియ.. ఇంకా ఈ కృతి రాసినప్పుడు నందీశ్వర స్తుతి చేయడం.
* పూర్వభాగములో తాన వర్ణములో, ఆలసింప సొంపా మురళీధర.. అన్నప్పటి సొగసు, 16వ మేళకర్తలో భుజంగా సహిత నీలకంఠలోని రమ్యత, 36లో ఐ లబిల సఖ, 38లో మనోన్మని, 64వ మేళకర్తలో నతా వరప్రదా, పాండిత్య స్ఫోరకాలుగా రచింపబడ్డాయి.
* 25 మేళకర్త సంస్కృత భాషలో వ్రాయబడి తృతీయా విభక్తులు చివరిదాకా సమర్థింపబడి శ్రీకృష్ణుని మా రంజిత మాన సేన అనే మాట సుకుమారంగా కనపడుతుంది.

**************************************

పరిచయం.. అద్భుతం
స్వర సమ్మోహన లోకాలకు తెర తీయగా రాదా అని రసజ్ఞులు పారవశ్యంతో వేడుకుంటే చాలు ఆయనకే సొంతమైన అపూర్వ గాత్రం నుంచి అలవోకగా పంచరత్నాలు రాలుతాయి. కురంజిలో సీతా కళ్యాణ వైభోగ ఘట్టాన్ని కళ్లకు కటిటనట్టు వీనులకు విందుచేస్తూ ఆలపించినా.. పాపి రామ ప్రభో అని శ్రీరాముడిని స్తుతిస్తూ మధ్యమావతి మాధుర్యాన్నీ మనకు అందించడం అది ఆ మహానుభావునికే చెల్లింది.
నేటికీ.. 85 వసంతాలు దాటినా నిరంతరం ఎక్కడో ఒకచోట విశ్వమోహనంగా వినిపించే బాలమురళి గొంతులో ఎన్ని సంగతులు సునాయాసంగా పలికి, లక్షలాది రసికులలో రసానందం చిలికి అద్భుత రాగాల వాయులీనంలో భారతీయ సంగీత వైభవాన్ని ఖండాంతాలకు వ్యాపింపజేసాయో చరాచర సృష్టిలోని ప్రకృతికి మాత్రమే తెలుసు.
‘్భగవంతుడు నన్ను పనికిరానివాడుగా కాక సంగీత పరికరంగా వినియోగించాడు ’ అని కర్నాటక సంగీత సార్వభౌముడిగా ఉన్నత శిఖరాలు చేరుకున్న తరువాత కూడా వినయంగా పలికిన మహానుభావుడు బాలమురళి.
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి శంకర గుప్తంలో ఒక బ్రాహ్మణ పండిత కుటుంబంలో 1930 జులై 6న జన్మించిన ఈ సంగీతఖని గోదావరి తరంగాల నుంచి కృష్ణా తరంగాల మీదుగా తమిళనాడులోని త్యాగరాజ స్వామి బాటలో స్థిరపడి ఖండాంతరాలలో సాగర సంగీతంలో మమేకమై విశ్వజనీన సంగీత మహోదరిగా విస్తరించి ప్రభవించినది. దాదాపు ఐదు తరాల సంగీత కోవిదులను, రసికులను ప్రభావితం చేస్తూ ఇప్పటికీ గానామృతధారల్ని నిఖిల జగతికి పంచి పెడుతూనే ఉంది. ఈ అనంత సృజనాత్మక రాగవాహినిలో తడిసి పరవశించని రసికులు లేరు.
నాలాంటి సామాన్యురాలిని... అత్యంత ఆదరణతో ఆహ్వానించి చక్కని చిరునవ్వుతో నా క్షేమ సమాచారాల్ని.. అడుగుతూ.. మా పిల్లలతో ఫోన్లో మాట్లాడి ఈ మారు అమ్మతో రండి అని చెప్పడం వారి నిరాడంబరతకి చిహ్నం. శ్రీమతి అన్నపూర్ణగారి చల్లని పలుకులు మరువలేనివి. ఆ ఆదిదంపతులకి పాదాభివందనాలు సమర్పిస్తూ... అడిగిన వెంటనే.. వారి సంగీత యాత్రను ఓపికగా తెలియజెయ్యడం నా పూర్వజన్మ సుకృతం.. చక్కని చిరునవ్వు బాలమురళీకృష్ణ గారి శోభాయమానమైన సంగీతాభరణం.

*************************************

మంగళంపల్లి బాలమురళీకృష్ణ కొన్ని దశాబ్దాలుగా దేశ విదేశాలలో ప్రవహిస్తున్న భారతీయ ప్రవాహం. 25,641కి పైగా సంగీత కచేరీలు నిర్వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. సర్వశ్రీ, లవంగి, మహతి, ప్రతిమధ్యమావతి వంటి అపురూప రాగాల స్రష్ట. ఉత్తమోత్తమ పరిశోధకులు. మూడుసార్లు ఉత్తమ చలనచిత్ర సంగీత దర్శకత్వానికి బహుమతులందుకున్న ప్రతిభాశాలి. పాడిన ప్రతి పాటకు ఒక మనోహర శిల్పాన్ని మలచగల నేపథ్య గాయకుడు. వీరు అధిరోహించని కీర్తి శిఖరం లేదు. భారత ప్రభుత్వ విశిష్ట పురస్కారం పద్మ విభూషణ్, ఫ్రెంచి ప్రభుత్వపు ప్రతిష్టాత్మక పురస్కారం ‘పెషలియర్’ వంటివి ఆయనని వెదుక్కుంటూ వచ్చాయి.

***************************************

నేనేం చేశానంటే...
‘‘సంగీతంలో నేనేం చేసానంటే చేతనైనంత మట్టుకు వడపోశానంతే!.. క్లీన్‌గా ఇచ్చాను వాటర్. అంతే తప్ప నేను కొత్తగా పెద్దగా సృష్టించాననటం లేదు. అదే ఒక సృష్టి. తర్వాత నాకు తెలియకుండానే వాగ్గేయకారత్వం మా తాతామహులు తాతగారి వద్ద నుంచి వచ్చింది. మీరు కీర్తనలు ఎందుకు రాయాలి? అలా రాయవలసిన అవసరం ఏమొచ్చింది? అంటే దానికో కథ ఉంది... నేను అస్సలు చదువుకోలేదు. మా గురువుగారి ఆధ్యాత్మిక గురువు విమలానంద భారతీస్వాముల వారి దగ్గరికి నన్ను తీసుకెళ్తూండేవారు. ఆయనకి నా పాటంటే ఇష్టం. ఒకసారి చాతుర్మాస్య దీక్ష కోసం బెజవాడలో మా ఇంటి ఎదురుగా సత్రంలో ఉన్నారు. ఓ రోజు మధ్యాహ్నం నన్ను ‘రావోయ్ మురళి’ అని పిలిచారు.. నాకు 15 ఏళ్లు అప్పుడు. త్యాగరాజుకి ముందు సంగీతం ఎలా ఉండేది? పాడితే ఏం పాటలు పాడేవారు? త్యాగరాజ కీర్తనలు ఎక్కువ ప్రచారంలోకి రావటానికి కారణం ఏమిటి? ఆ గొప్పదనమేమిటి? లాంటి ప్రశ్నలడిగితే.. ఆయన చాలా రాగాలు సృష్టించాడు. రాగాలయితే పేపర్లలో పుస్తకాల్లో ఉన్నాయి. కానీ అవి ఎలా ఉంటాయో ఎవరికీ తెలీదు. ఏ రాగమైనా మనకి తెలియాలంటే ఆ రాగంలో ఒక రచన ఉండాలి. కీర్తన ఉండాలి. లేకపోతే రాగం తెలియదు. అటువంటి అనేక రాగాలను త్యాగరాజుకి పూర్వం ఎవరికీ తెలియనివి పుస్తకాల్లో మాత్రమే ఉన్నాయి. వాటికి రూపకల్పన కల్పించి... సాహిత్యానికి అన్వయించి రామభక్తుడు కాబట్టి రాముడి మీద కీర్తనలు రాసి పాడాడు. అదే త్యాగరాజ సంగీతమై పోయింది. ఇప్పుడు కర్ణాటక సంగీతమనే పేరుతో ఉన్నది త్యాగరాజ సంగీతమే అన్నాను.
ఓహో! త్యాగరాజు కొత్త సృష్టి చేశాడంటావు. నువ్ కూడా ఏదైనా చేయి. ఆయన పేరులాగే నీ పేరు నిలబడుతుంది. లేకపోతే అందరిలాగే పాఠకుడిగా ఉండిపోతావు అన్నారు. అదీ నా మనసులో నాటుకుపోయి ఏం చేయాలి అనుకున్నాను. ఏవేవో ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఈలోగా ఒకరోజు తెల్లవారుజామున ఐదింటికి అప్పయ్య శాస్ర్తీగారు వారింటికి తీసుకెళ్లి క్లుప్తంగా యతి అంటే ఏమిటి? ప్రాస, గణం లాంటివి కొన్ని చెప్పారు. అంతకు ముందు నేను రాసిన కీర్తనలు పరిశీలిస్తే తప్పులు లేవని గ్రహించాను. ఆ తర్వాత 72 మేళకర్తలలో కీర్తనలు రాశాను. ఇది వరకున్న కీర్తనలలో కవిత్వ దారిని తక్కువ సంగీతం ప్రధానంగా పెట్టి మాటల్లో పాడాలి గనుక కవిత్వం ఉండాలని అనిపించి దాని మీద దృష్టి పడి నా పాటలో ఒక మెరుపు సాహిత్యంలో, కవిత్వంలో రాగంలో ఉండేలా చూసుకున్నాను. ఇదివరకు ఎవరు పాడిన రాగమైనా ఒక పాడని సంగతి ఉంటుంది నా పాటలో... ఆ విధంగా రాసుకుంటూ వచ్చాను.’’

************************

పల్లకిలో...
శిష్యులు, పరోక్ష ప్రత్యక్ష శిష్యులు వేలకు వేలు ఉన్నారు. ఇతర దేశస్థులు కూడా. వారిలో ఒకరిద్దరు ప్రిన్స్ వర్మ, మోహనకృష్ణ యోగ్యులు. వీరి శిష్యులలో కళలకు పుట్టినిల్లయిన విజయనగరానికి చెందిన గంటి మురళి ఆత్రేయ స్మారక కళాపీఠం తరఫున నిర్వహించిన సభలో.. బాలమురళిని ముత్యాలతో అలంకరించిన పల్లకిలో ఊరేగింపులో కళాశాల బాలికలు, యువతులు మోయడం విశేషం.. అంటారు. ఆ పల్లకి చూసి బాలమురళి అవాక్కయ్యారట. ఆనంద భాష్పాలు వచ్చాయట. సీతాకోక చిలుకలల్లే ఆడపిల్లలు ముందుకొచ్చి పల్లకీ మోయడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది తన జీవితంలో మరపురాని ఘటన అన్నారట.

ఇంటర్వ్యూ -బులుసు సరోజినీదేవి 9866190548