నీడ
Published Sunday, 18 June 2017నిలువెత్తు నీడ
నాకు తోడొస్తుంది
ఎంతెత్తు కట్టడాలనైనా
చిటికెలో అధిగమించేస్తుంది
కడలి సుడుల అడుగు
అగాధంలో సైతం
సంవత్సరాల తరబడి
‘శ్వాస’ పీల్చకుండా
సాహసయానం చేస్తుంది
అందరినీ అలరించి
ఆశ్చర్యంలో ముంచెయ్యాలని
ఎన్ని అద్భుతాలు చేసినా
తనని ఎవరూ గుర్తించలేదని
‘మాట’ మానేసి వౌనంగానే
తన సాహసాలను సాగిస్తుంది
బహుశా సూర్యుడంటే భయమేమో!
వాడు నడినెత్తికొచ్చేసరికి
నా నీడ పాదాలలోకి ఒదిగిపోతుంది.