గానగంధర్వులు... సంప్రదాయ సంగీత వారధులు (అమృతవర్షణి)
Published Monday, 10 July 2017A Thing of Beauty is Joy forever - అన్నాడో ఆంగ్ల కవి.
చూసే దృష్టిని బట్టే సృష్టి. భౌతికంగా కంటికి కనిపించే అందం వేరు.
రుచిని నాలుకతో చూసి ఆనందిస్తాం. కానీ, కంటితో చూస్తూ మనసులో పుట్టిన అందాల భావాలు మాటల్లో వర్ణించలేం. సాధారణంగా అందాన్ని గురించి మాట్లాడితే వెంటనే గంధర్వులే గుర్తుకొస్తారు. అందాన్ని మనసుతో అనుభవించటం వేరు. ఆనందించటం వేరు. శ్రీరామచంద్రుడు వనవాసంలో గడిపే సమయంలో తన కోసం ఎదురుచూస్తున్న మునులను కలుసుకుని వారికి ఆనందాన్ని కలిగించాడు. రాముడి పుంసా మోహనమైన అందానికీ, ఆయనలో కనిపించిన కల్యాణ గుణాలకూ మునులుప్పొంగిపోయారు.
‘ఏమి సౌందర్యం? యిన్నాళ్లుగా ఎదురుచూస్తున్న మా స్వామి యింత అందగాడా? ఏమి సొగసు? ఏమి లాలిత్యం! ఏమి నడక! ఏమి హొయలు’ అంటూ పరవశించిపోయారు. సమ్మోహనకరమైన సంగీతం కూడా అటువంటిదే.
ఒకప్పుడు మన సంప్రదాయ సంగీతానికి మహారాజ పోషణ తోడై సంగీత రసికులను ఆనందింప జేసింది. సంస్థానాలు, జమీందార్లు రాచకార్యాలతోబాటు సమానంగా సంగీతం వినేవారు. సంగీతానికున్న సమ్మోహన శక్తి అటువంటిది. వారు విన్న సంగీతం క్షణికాకర్షణతో కూడినది కాదు. సుస్వరంతో నిండి రసికులను నాదమయ లోకాల్లో విహరింపచేసిన దివ్యమైన సంగీతం.
రాగ దేవతలను సాక్షాత్కరింప చేయగల గానంతో కీర్తి గడించిన అలనాటి గాన గంధర్వులను సంగీత లోకం గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటుంది.
అందమైన ముఖ వర్ఛస్సుతోబాటు మంత్రముగ్ధుల్ని చేయగల గానం తోడైతే, బంగారానికి పరిమళం అబ్బినట్లే. ఈ రెండూ విధాత యివ్వాల్సినవే.
కర్ణాటక సంగీత రంగంలో అటువంటి స్టార్ సింగర్లు కొందరున్నారు.
ఈ తరం విద్వాంసుల్లో జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం, విదుషీమణులలో శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి చాలామందికి తెలుసు. ఈ ఇద్దరితో సమానమైన పేరు సంపాదించిన మరో గాయనీ గాయకులు ఇద్దర్ని తలుచుకుందాం.
19వ శతాబ్దంలో బాగా పేరున్న అందమైన సంగీత విద్వాంసులలో మధురై పుష్పవనమయ్యర్ (1885-1917) ఒకరైతే, ఎన్.సి.వసంత కోకిలమ్ (1919-1957) మరొకరు.
ఈమె అందమైన సినీ నటి కూడా. సుబ్బులక్ష్మికీ ఈమెకూ పోలికలున్నాయి. వసంత కోకిలమ్ కొంత కాలంపాటు జీవించి ఉండి ఉంటే సుబ్బులక్ష్మి వెలుగులోకి రావటానికి మరి కొంతకాలం పట్టి ఉండేది. కారణం సుబ్బులక్ష్మి గానంలోని మాధుర్యాన్ని సొగసుల్ని వసంత కోకిలం ముందే కైవసం చేసుకుని, తక్కువ కాలమే జీవించి ఎక్కువ పేరు సంపాదించుకుంది. ‘ఎన్ పళ్లి కొండేరయ్యా!’ తమిళంలో మోహనరాగంలో అప్పట్లో వసంత కోకిలమ్ పాడిన కీర్తన దక్షిణాదిలో సంగీతజ్ఞుల్ని ఒక ఊపు ఊపేసింది. ఈ ఇద్దరి కంఠమాధుర్యంలో తేడా కనిపించదు! కర్ణాటక సంగీతంలో వుండవలసిన గమక సౌందర్యం, బరువు, భావం, రాగ సౌందర్యం మొత్తం కలబోసుకున్న గాయని వసంత కోకిలమ్. 1976లో మొదటిసారి ఆమె గ్రామఫోన్ రికార్డులు రేడియో లైబ్రరీలో విన్నాను.
1.ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా! -పంతువరాళి రాగంలోని భద్రాచల రామదాసు కీర్తన
2.ఏలా అవతారమెత్తుకొంటివో- ముఖారి లో త్యాగరాజ కీర్తన.
3.కళ్యాణ వసంతంలో ‘నీ దయ రాదా’
4.ఆందోళికలో ‘రాగ సుధారస పానము చేసి- వంటి ఎన్నో రక్తి ఐన కీర్తనలు పాడి, గ్రామఫోన్ రికార్డులిచ్చిన గాయని. దూరం నుండి వింటే, సుబ్బులక్ష్మి, వసంత కోకిలానికి తేడా తెలియదు. ఆ రోజుల్లో స్ర్తిలు బాహాటంగా బయటకు వచ్చి పదిమందిలో పాడటం చాలా సాహసమైన చర్యగా సంప్రదాయ వాదులు భావించేవారు. కష్టాలు పడ్డారు. చాలామంది విదుషీమణులు ఈ బాధలను తప్పించుకోలేక పోయారు. వారిలో వసంత కోకిలమ్ ఒకరు.
సూర్యుణ్ణి అరచేతితో నిరోధించలేరుగా!
వసంత కోకిలమ్ పూర్తి పేరు నాగపట్టణం చంద్రశేఖరన్ వసంత కోకిలమ్. ప్రసిద్ధమైన త్యాగరాజ కీర్తనలు, దీక్షితుల వారి కృతులు ఆ రోజుల్లో పాడి గ్రామఫోన్ రికార్డులివ్వటమే కాదు, స్వాతంత్య్రోద్యమం తర్వాత జాతీయతా భావాలు ప్రజల్లో నెలకొనేలా తమిళనాడులో ప్రసిద్ధ కవులైన కవి యోగి మహర్షి, శుద్ధానంద భారతి వ్రాసిన అనేక దేశభక్తి పూరితమైన పాటలు ఎంతో రసవంతంగా, భావయుక్తంగా ఆలపించి సంగీత రసికులను మైమరపించిన అద్భుత గాయని. మాధుర్యంతో నిండిన గాత్రం ఆమె సొత్తు. పాటలో మార్దవం, భాషలో స్పష్టత ఒకటేమిటి? జనరంజకమైన లక్షణాలన్నీ వున్న గాయని వసంత కోకిల గానం నిజంగా కోకిల గానమే అంటే ఆశ్చర్యం లేదు. ఆమె స్ఫురద్రూపం చూపరులను ఆకర్షించేది. కమ్మని గానంతోడైతే చెప్పేదేముంది!
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం సినీ రంగంలో ఎంత ప్రసిద్ధులయ్యారో మనకు తెలుసు. ఆ రోజుల్లో స్టార్ సింగర్‌గా కీర్తి గడించిన ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌తో కొన్ని చలనచిత్రాల్లో నటించింది, పాడింది.
జీవించినది చాలా తక్కువ కాలమే అయినా వసంత కోకిలమ్ కూడా స్వల్పకాలంలో అజరామరమైన కీర్తిని సొంతం చేసుకుందంటే ఆశ్చర్యం కాదు. శుద్ధ సంప్రదాయ సంగీతం ఎంత కచ్చితమైన విలువతో పాడి మెప్పించిందో, లలిత శాస్ర్తియ సంగీతం కూడా అంత జనరంజకంగానూ పాడింది. సంప్రదాయ సంగీత విలువలు వదలకుండా సినిమా పాటలు పాడింది. 1936లో మద్రాసు సంగీత ఎకాడమీలో ‘బెస్ట్ సీనియర్ కన్సర్ట్ అవార్డు’ సొంతం చేసుకుని టైగర్ వరదాచారి చేత సత్కారం పొందిన విద్వాంసురాలు. అగ్రశ్రేణి విద్వాంసులతో 1942 నుండి 1951 వరకూ తిరువయ్యార్‌లో జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాలలో క్రమం తప్పకుండా పాడిన ఈ విద్వాంసురాలి సంసారిక జీవితం మాత్రం అస్తవ్యస్తంగానే సాగింది. కట్టుకున్న భర్త తప్ప మిగిలిన సంగీత రసికులంతా ఆమెను అందలం ఎక్కించారు. ఆ పాటకు పరవశించిపోయారు. ఆదరించ వలసిన భర్తకు దూరమై, అనారోగ్యానికి దగ్గరై 32వ ఏటే సంగీత లోకం నుంచి నిష్క్రమించింది. కానీ మాధుర్యం నిండిన వసంత కోకిలమ్ పాట ఎప్పుడు విన్నా ఎం.ఎస్.సుబ్బులక్ష్మినే గుర్తు చేస్తూంటుంది. మరో గంధర్వ గాయకుడు మధురై పుష్పవనమయ్యర్.
కర్ణాటక సంగీత రంగంలో తిరుగులేని విద్వాంసుడై ఆ తరం సంగీత రసికులకు సంప్రదాయ సంగీత మాధుర్యాన్ని రుచి చూపించి మధుర మంజుల గాన గంధర్వుడై ఒక వెలుగు వెలిగిన సంగీత విద్వాంసుడు -మధురై పుష్పవనమయ్యర్.
ఈయన సంగీతం ఈ తరం విద్వాంసులకు రసికులకూ తెలిసే అవకాశం లేదు. ఆ రోజుల్లో ధ్వని ముద్రణా సౌకర్యాలేమీ లేవు కదా!
సుస్వర గానానికి అఖండ స్వర జ్ఞానం తోడై, సంగీత రసజ్ఞులకు నాదానుభూతిని కలిగిస్తూ తనతో సమానులంటూ ఎవరూ లేనంత సాధికారికంగా అమృతమయ సంగీతాన్ని పంచిన పుష్పవనం ఆ రోజుల్లో ఒక స్టార్ సింగర్.
ఈ తరం సంగీత రసికులకు తెలిసిన మధురై మణి అయ్యర్, పుష్పవనమయ్యర్ మేనల్లుడే. కర్ణాటక సంగీత విద్వాంసులందరి కంటే అత్యధిక పారితోషికం పుచ్చుకున్న కర్ణాటక సంగీత విద్వాంసుడు పుష్పవనం ‘తంబురా’ నాదంతో షడ్జం అంటూ రసికులను తన వైపునకు తిప్పేసుకునేవాడట. ప్రక్కవాద్యాలెంత సమర్థులైనా ఆయన పాట ముందు తట్టుకుని వాయించగలిగేవారు కాదు.
‘దేవగాంధారి’ రాగంలో ‘క్షీరసాగర శయన’, ‘కుంతలవరాళి’లో ‘కలి నరులకు’ ‘అభేరి’ రాగంలోని ‘నగుమోము’ వంటి కొన్ని కీర్తనలు పాడటంలో జనరంజకమైన శైలిని సొంతం చేసుకున్న గొప్ప విద్వాంసుడు. ఆ రోజుల్లో బాగా పేరున్న కోనేరిరాజపురం వైద్యనాథయ్యర్, పూచి శ్రీనివాసయ్యంగార్, వయొలిన్ గోవిందస్వామి పిళ్లె, పుదుక్కోటై దక్షిణామూర్తి పిళ్లె, అల్గ నంబి, గోటు వాద్యం విద్వాంసుడైన సఖా రామారావు, వేణుగాన విద్వాంసుడు శరభశాస్ర్తీ వంటి మేరు సమానమైన విద్వాంసులతో సమానంగా కీర్తిని సంపాదించిన యువ గాయకుడు పుష్పవనమయ్యర్‌కి కూడా అతి చిన్న వయసులోనే (32) నిష్క్రమించటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. తక్కువ కాలంలో పాడవలసినదంతా పాడేసి వెళ్లిపోయాడు. విన్నవారు అదృష్టవంతులు.
ఇటువంటి గాన గంధర్వులు కర్ణాటక సంగీతంలోని సిసలైన మాధుర్యాన్ని ఆనాటి సంగీత రసికులకు అలవాటు చేయబట్టే సంప్రదాయ సంగీతం ఈనాటికీ శాఖోపశాఖలుగా విస్తరిల్లుతూ వర్థిల్లుతోంది.
వెనుకటి తరంలో ఎన్నో సంస్థానాలు, జమీందార్లు సంప్రదాయ సంగీతం వినటం ఒక గౌరవంగా భావించేవారు.
వారి కుటుంబాల్లో జరిగే వివాహ శుభకార్యాల్లోనూ, పర్వదినాల్లోనూ, సంగీత కచేరీలే ప్రధాన ఆకర్షణగా నిలిచేవంటే సంగీతంపై వారికి గల గౌరవం ఎంతో ఊహించవచ్చు.
*
హరికథలు చెప్తూ ‘సంగీత ప్రసక్తి వచ్చినప్పుడల్లా తీయని పాట యమకింకరులను కూడా కరిగిస్తుందనేవారట ఆదిభట్ల నారాయణదాసుగారు. అటువంటి వారిలో దక్షిణాదిలో మన కర్ణాటక సంగీత వైభవాన్ని నాలుగు దెసలా విస్తరిల్లజేసిన మహావిద్వాంసుల్లో ప్రముఖులు ఇద్దరున్నారు.
ఒకరు అరియక్కుడి రామానుజయ్యంగార్. మరొకరు జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం.
బాలసుబ్రహ్మణానికి అరియక్కుడి ‘మానసిక’ గురువు. ఆ రోజుల్లో టైగర్ వరదాచారి అనే విద్వాంసుడి శిష్యుడు జి.ఎన్.బి. రాధ, జయలక్ష్మి ఈయన శిష్యురాళ్లే. గంభీరమైన సుందరమైన రవ్వజాతి శారీరము, అతి త్వరితగతిలో బిరకా స్వరసంచారాలు, అత్యంత సునాయాసంగా నాదం కొంచెం కూడా తగ్గకుండా పాడే వీరిని ఆదర్శ గాయకులుగా పరిగణిస్తారు. అన్నిటికంటె పసిడి వనె్నచాయ, సుందర రూపం, జిఎన్‌బి పేరు వినగానే గుర్తుకొచ్చేవి. ‘గాత్ర మాధుర్యానికే విలువ ఎక్కువ. సంగీత పాండిత్య ప్రదర్శనానికి కాదు’ అనేవారట జిఎన్‌బి. గమకపూరితమైన శుద్ధ కర్ణాటక సంగీతబాణీ, కల్పనా సామర్థ్యం, నిత్యనూతనత్వం, రాగభావం, రక్తి కంటే కేవలం తన గాత్రపుష్టితోనే విపరీతమైన క్రేజ్ సంపాదించిన సంగీత విద్వాంసుడు జిఎన్‌బి. ‘వాసుదేవయని వెడలిన’ అనే కల్యాణి రాగకీర్తన, శుద్ధ్ధన్యాసిలో ‘హిమగిరి తనయే హేమలతే’ అనే ముత్తయ్య భాగవతార్ కీర్తన, ‘రాధా సమేతా కృష్ణా’ అనేవి చాలా ప్రసిద్ధమైనవి.
కర్ణాటక సంగీత ప్రపంచంలో స్టార్ సింగర్లైన జిఎన్‌బి, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, చలనచిత్రాల్లో నటించి పాడటం విశేషం. ప్రముఖ గాయని ఎం.ఎల్.వసంత కుమారి బాలసుబ్రహ్మణ్యం శిష్యురాలే.
చిత్రాలు.. మధురై పుష్పవనమయ్యర్
*ఎన్.సి.వసంత కోకిలమ్