S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మీకు తెలుసా?

-ఎస్.కె.కె.రవళి
-------------------
డేగ అరుపును అనుకరించే పక్షులు
ఉత్తర అమెరికా, కెనడాల్లో కన్పించే అందమైన ఈ పక్షుల పేరు బ్లూజె. వీటి కూత ‘జె..జె’ లా విన్పిస్తుంది. అయితే ఇవి మంచి అనుకరణ శక్తిగల తెలివైన పక్షులు. వీటి ప్రధాన శత్రువు డేగ. వాటిని గందరగోళంలో పడేయడానికి, తమ జాతి పక్షులను అప్రమత్తం చేయడానికి అప్పుడప్పుడు డేగల్లా అరుస్తాయి. ఒక్కోసారి డేగలుకూడా ఈ కూత విని తత్తరపడతాయి. మనుషులు, మరికొన్ని జంతువుల అరుపులనూ ఇవి అనుకరిస్తాయి. ఇవి నీలంగా కన్పించినప్పటికీ వీటి రంగు నీలంగా ఉండదు. నిజానికి వీటి ఈకలు ముదురు సిమెంటు రంగులో ఉంటాయి. ప్రత్యేక నిర్మాణంతో ఉండే వీటిపై సూర్యరశ్మి పడినప్పుడు విభిన్నమైన నీలిరంగు ఉన్నట్లు గోచరిస్తుంది. అదే వీటి స్పెషాలిటీ. ఇక ఇవి మైదానాల్లో దాచిపెట్టిన ఆహారాన్ని ఎవరూ లేనప్పుడు తవ్వితీసి తింటాయి. మనుషులు ఉంటే వారు వెళ్లిపోయేవరకు వేచిచూసి ఆ తరువాతే తింటాయి. వలస వెళ్లేటప్పుడు 250 పక్షులు ఒక బృందంగా వెళతాయి. అన్నట్లు ఇవి శరీరానికి ఇనె్ఫక్షన్స్ సోకకుండా చీమలను చంపి ఈకలకు రుద్దుకుంటాయి. చీమల్లో ఉండే రసాయనం వీటికి రక్షణగా నిలుస్తుందన్నమాట. ఈ ప్రక్రియనే ‘యాంటింగ్’ అంటారు. వీటి తలపై ఉండే శిఖ వాటి మూడ్‌నుబట్టి ముందుకు, వెనక్కు, చదునుగా మార్చుకుంటూంటుంది.

బార్లీ.. ఒకప్పుడు కరెన్సీ
మంచి ఔషధ గుణాలు, పోషక విలువలు ఉన్న బార్లీ గింజలను ఒకప్పుడు కరెన్సీగాకూడా వాడేవారు. అంటే ఏవైనా కొనుగోలు చేసేటపుడు డబ్బుకు బదులు బార్లీపంట ఇచ్చేవారు. ఒట్టమాన్ సామ్రాజ్యంలో ఈ పద్ధతి ఉండేది. పదహారవ శతాబ్దం వరకు బార్లీకి తిరుగులేదు. గోధుమ, వరి, మొక్కజొన్న తరువాత ప్రపంచంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న ఆహారధాన్యం ఇదే. ప్రస్తుతం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న బార్లీలో 50 శాతం పశువుల దాణా తయారీకే వాడుతున్నారు. బీరు, విస్కీ తయారీలో ప్రధాన ముడిసరుకుగా దీనినే ఎక్కువ వాడేవారు. వెనిగర్, బ్రెడ్, ఉపాహార పదార్థాల తయారీకి బార్లీయే ఉపయోగిస్తున్నారు. మందులు, బ్రెడ్, పానీయాల తయారీకి దీనిని వినియోగిస్తారు. రష్యా, కెనడా, ఉక్రెయిన్ ఇప్పుడు బార్లీ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి.

ఈ సుద్దలన్నీ ఒకటి కావు
బ్లాక్‌బోర్డుపై మనం రాసేందుకు వినియోగించే సుద్దముక్కలు, టైలర్‌లు బట్టలపై మార్కింగ్ చేసేందుకు వాడే చాక్‌పీస్, అందరూ పిలిచే సుద్ద (చాక్) నిజానికి ఒకటి కావు. ఇవి మూడూ వేర్వేరు పదార్థాలు. అసలు సుద్ద కాల్షియం కార్బొనేట్‌తో తయారవుతుంది. ఇది నీటిని నిక్షిప్తం చేసుకోగలుగుతుంది. ఇది ఒకరకం లైమ్‌స్టోన్. సాధారణంగా సముద్రాలు, సరస్సులను ఆనుకుని లేదా దగ్గర్లోను ఈ గనులు లేదా కొండలు (క్లిఫ్) ఉంటాయి. వాతావరణం వేడెక్కితే వీటిలోంచి నీరు బయటకు రావడం గమనించొచ్చు. ఇక బ్లాక్‌బోర్డుపై వాడే సుద్దముక్కలు నిజానికి జిప్సమ్‌గా భావించాలి. అది కాల్షియం సల్ఫేట్‌తో తయారవుతుంది. ఇక టైలర్ చాక్ మెగ్నీషియం సిలికేట్‌తో తయారవుతుంది. దీనికీ, సుద్దకు అసలు సంబంధమే లేదు. ఇది ఒకరకం ‘టాక్’ ఖనిజం. అన్నట్లు అసలు సుద్ద గ్రీజువంటి పదార్థాలను శుభ్రం చేయడంలో బాగా పనికొస్తుంది.

ధ్రువపు ఎలుగు బొచ్చు తెల్లగా ఉండదు
అంటార్కిటికా, సైబిరియా, అలస్కా వంటి మంచు ప్రాంతాల్లో కన్పించే ధ్రువపు ఎలుగుబంట్లు తెల్లనిబొచ్చుతో అందంగా కన్పిస్తాయికదా...కానీ నిజానికి వాటిబొచ్చు తెల్లగా ఉండదు. వీటికి ఉండే ‘హాలోహెయిర్’కు ప్రత్యేకమైన రంగే ఉండదు. నల్లని చర్మంతో ఉండే వీటి శరీరంపై కొవ్వుపొర పేరుకుని ఉంటుంది. శరీరానికి వేడిని, చలిని తట్టుకునే శక్తిని ఇచ్చే ఆ పొరపై ఉండే బొచ్చుపై సూర్యకాంతి పడినప్పుడు ఈ లేత పసుపు, లేదా తెలుపురంగులో అవి కన్పిస్తాయి. నీరు అంటుకోకుండా ఉండే వీటి వెంట్రుకలు నిజానికి గుల్లగాఉండే సన్నని తీగల్లా ఉంటాయి. ఆహారాన్ని తిన్నాక శరీరాన్ని శుభ్రం చేసుకునేందుకు, శరీరాన్ని చల్లబరుచుకునేందుకు ఇవి మంచులో దొర్లుతూంటాయి. అన్నట్లు అవి నిరంతరం మంచులోనే ఉన్నా వాటి శరీర ఉష్ణోగ్రత తరచూ పెరిగిపోతూంటుంది. అది తగ్గించుకునేందుకు మంచులో దొర్లుతాయి. అన్నట్లు ఇవి మంచి ఈతకొట్టగల జంతువులు. గంటకు 6 కి.మి వేగంతో ఏకధాటిగా 100 కి.మీ. ఈతగొట్టగలగడం వీటి ప్రత్యేకత. అయితే సాధారణంగా అవి ఆ పని చేయవు. పుట్టినపుడు కేవలం 12 సెంటీమీటర్లు సైజులో అరకేజీ బరువుతో ఉంటాయి. ఎదిగిన తరువాత ఇవి 12 అడుగుల ఎత్తు, 700 కేజీల బరువుంటాయి. వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. వీటి ప్రధాన శత్రువు వాతావరణ మార్పులే.
*