S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భగత్‌సింగ్ (మాతో-మీరు)

‘భగత్‌సింగ్’ సీరియల్ చదువుతూంటే ఆయా సంఘటనలు కళ్లకు కట్టినట్లు కనపడుతున్నాయి. భగత్ తల్లి జ్యోతిష్యుని మాట విని.. హతాశురాలవటం.. ‘దేశాన్ని ఏలుతాడు.. లేదా ఉరికంబమెక్కుతాడు’ అనటంతో ఆ తల్లి ఎంత వేదన చెందిందో? దేశం కోసం తమ ప్రాణాల్ని సైతం త్యాగం చేసి.. స్వాతంత్య్రాన్ని రప్పిస్తే.. ఇప్పటి పరిస్థితిని తలచుకుంటే వొళ్లు గగుర్పొడుస్తోంది.
-ఎ.వి.సోమయాజులు (కాకినాడ)
ఈ వారం స్పెషల్
ఈ శీర్షికన ప్రచురించిన ‘ప్రజా దర్బారుకు కొత్త రూపు’ వ్యాసం ఆలోచింపజేసేదిగా ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న భారత్‌లో ఆధునిక దేవాలయం లాంటిది మన పార్లమెంటు భవనం. దీనిని కూల్చి, అదే చోట కొత్తగా అధునాతన పార్లమెంటు భవనాన్ని నిర్మించాలన్న కేంద్ర ప్రభుత్వ యోచన భద్రత రీత్యా సరైనదే. అయితే - ఎనిమిది దశాబ్దాలకు పైబడి చట్టసభలకు ఆతిథ్యమిస్తున్న అపురూప కట్టడాన్ని ‘చారిత్రక’ సౌధంగా అలాగే ఉంచటం సబబు. ఇక సిసింద్రీలో స్ఫూర్తి, కథ మాకెంతో నచ్చాయి.
-బి.విజయలక్ష్మి (శ్రీకాకుళం)
చైతన్య స్ఫూర్తి
చైతన్య స్ఫూర్తి.. సంక్రాంతి దీప్తి వ్యాసంలో పండుగల ఉద్దేశాన్ని చక్కగా వివరించారు. నీకు దొరికిన వజ్రం నీదే అన్న సూత్రంతో నడుస్తున్న వజ్రాల గని ఉదంతం అబ్బురపరచింది. ‘స్ఫూర్తి’ కథలో మనసు ఆకలి తీర్చే సరైన భోజనం భగవద్గీత పఠనం అని విశే్లషించడం బాగుంది.
-బి.సోనాలి (సూర్యారావుపేట)
రణక్షేత్రం
చక్కటి మలుపులతో.. ఎంతో చక్కటి శైలితో సాగుతున్న ‘రణక్షేత్రం’ సీరియల్ బాగుంటోంది. సిసింద్రీలో ‘అపకారికి ఉపకారం’ కథ బాగుంది. జంతువులలో అలా ఉన్నాయి గానీ మనుషులలో కొంచెం కష్టమే. డార్విన్ సిద్ధాంతం గురించి చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన పాఠం గుర్తుకు వచ్చింది. ‘నన్ను ఏడ్వనీ’ కవిత బాగుంది.
-డి.వి.తులసి (విజయవాడ)
అక్షరసత్యం
చాలామంది ఆలోచించడానికి ప్రయత్నించకుండా తమ పక్షపాత వైఖరికే వేలాడుతుంటారని శర్మగారు చెప్పింది అక్షర సత్యం అని నేటి మన నేతల్ని, కుహనా మేధావుల్ని చూస్తే అర్థమవుతుంది. కొన్ని పత్రికలు సర్వేలు నిర్వహించామంటూ నటీనటులకు, ప్రముఖులకు ఇచ్చే ర్యాంకులు పనీపాటా లేనివారి కొక కాలక్షేపం. అంతే. పన్నుపోటుకి భయపడి చాలామంది ముఖ్యంగా చిత్రరంగ ప్రముఖులు తమ నిజ ఆదాయాన్ని వెల్లడించరు. పైగా పాపులారిటీని నిర్ణయించేందుకు సరియైన కొలమానాలు లేవు. మరి ఆదాయ ఆదరణల ర్యాంకులు ఎలా నిర్ణయిస్తారు? కేవలం అంచనాలతోనే. కాజల్ అందర్నీ మించిపోయిందన్న సర్వే ర్యాంక్ ఆమెకు, ఆమె అభిమానులకు ఆనందాన్ని ఇవ్వొచ్చు. కానీ ఇతర పత్రికల సర్వేలు ఇంకెవరికో పట్టం కట్టొచ్చు.
-కె.సుధీర్ (శ్రీనగర్, తూ.గో.జిల్లా)
మీకు తెలుసా?
కోడిపిల్లలకు ఎంత తెలివి! గోరింకల్లా గోల చేసే కిల్‌డీర్‌కి ఎంత నటన! చదివి ఆశ్చర్యపోయాం. జీవితాన్ని మించిన బీభత్సం, విచిత్రం అద్భుతం మరేదీ లేదు. ఒక్క క్షణాన్నీ వృధా చేయవద్దంటూ చెప్పిన ‘సండే గీత’ నూతన సంవత్సర సందేశంలాగ అలరించింది. బాల నేరస్తుల చట్టం ఆలస్యం అయిందని చింత ఎందుకు? ఉన్న చట్టాల ప్రకారం అయినా సత్వర న్యాయం అందుతున్నదా?
-పి.చంపక్ (మాధవనగరం)
లోకాభిరామమ్
దారి చూపేవాడు గురువు అంటూ ‘లోకాభిరామమ్’ ప్రారంభించి గోపాలంగారు తన గురువుల గురించి చెప్పింది చదువుతూంటే మాకు మా గురువులు జ్ఞాపకం వచ్చిరు. అది బంగారు కాలం. ఇప్పుడలాంటి గురువులు అరుదు. ఇప్పుడున్నది జీతం కోసం పనిచేసే ఉద్యోగులు మాత్రమే! ఇక - అవడానికి క్రైం కథే అయినా ‘మనస్సాక్షి’ తమాషా ఉత్కంఠతతో సాగి ఒక సత్యాన్ని చెప్పింది. ప్రజలు తాము నమ్మిందే పరమ సత్యం అనుకుంటారు గాని అసలు నిజం బయటపడినా నమ్మలేదు అన్నదే ఆ సత్యం. అందరికీ ఒకే రకం నైపుణ్యం ఉంటే ప్రపంచం ఒకే రంగుతో గీసిన బొమ్మలా ఉంటుంది. అందుకే ఒక్కొక్కరికి ఒక్కో రకం నైపుణ్యం ఇస్తాడు భగవంతుడు అని చెప్పిన స్ఫూర్తి కథ ‘రంగు పెన్సిళ్లు’ చాలా బాగుంది.
-ఆర్.సత్య (కరప, తూ.గో.జిల్లా)
వినదగు
జనవరి 17, ఆదివారం అనుబంధంలో ‘వినదగు’ శీర్షికన అందించిన ‘ఎదిగేది ఆత్మ.. తరిగేది తనువు’ ఎంతో బాగుంది. స్పిరిట్యుయలిజమ్ పరంగా మనల్ని మనం ఉద్ధరించుకోవటం అంటే మానవ సంక్షేమాన్ని కాంక్షించటం.. హిత స్వభావమే ఆత్మ పరిణతికి హేతువు కావటం.. సహజీవన సౌభాగ్యాన్ని అనుభవించటం. నిజానికి ఆత్మ జాగృతమయ్యేది హిత కాంక్షతోనే. అంటే మానవ తత్వాన్ని త్యజించి కేవలం దివ్యత్వం వెంటపడ్డా ఆత్మజ్ఞత సాధ్యంకాదు... అంటూ సందేశాన్నీ.. గురుతః బోధించినట్టుంది. అలాగే ‘నమ్మండి నిజం’ నిజంగానే నమ్మశక్యం లేదు.
-గుగ్గిలం లక్ష్మి (వేటపాలెం, ప్రకాశం జిల్లా)