S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆత్మతత్వం వికార రహితం

ఆత్మ అజం, అవ్యయం అంటే పుట్టుక, క్షయం లేనిది.
‘వేదా వినాశినం నిత్యం య ఏన మజమవ్యయమ్
కథం స పురుషః పార్థ కం ఘాతయతి సంతి కమ్’
వినాశనం లేనిదిగాను, నిత్యమైనదిగాను ఆత్మను దర్శించగలిగితే దేహాతీతంగానే ప్రతి ఒక్కరిని చూడటం జరుగుతుంది. ఆత్మకు స్వవర్గం, వైరి వర్గం అంటూ ఉండదు కాబట్టి అర్జునుడు ఆత్మజ్ఞానంతో ప్రతిపక్షంలోని వారిని చంపటానికీ సిద్ధపడలేదు.. చంపించటానికీ ఇష్టపడలేదు. కారణం ఆత్మ వికారాలకు లొంగేది కాదు. వికారాలే కాదు ఏ కర్మలూ ఆత్మను చేరలేవు. అంటే కర్తృత్వాన్ని ఆత్మకు ఆపాదించటం సాధ్యపడదు.
నిజానికి, కర్తృత్వ భావన కూడా ఒక వికారమే! కాబట్టి వికారాలకు లోను కాకుండటమే అంటే సమంగా స్వీకరించటమే ఆత్మజ్ఞానం. అంటే మనం దేహాన్ని, మనస్సును జ్ఞానపూర్ణంగానే భావిస్తాం కానీ నిజానికి దేహాన్ని, మనస్సును దాటిందే ఆత్మ. కాబట్టి ఆత్మజ్ఞానమే పూర్ణజ్ఞానం. ‘వేదవినాశినం’ అంటే వినాశనం లేనిదని తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానం సంపూర్ణంగా గలవాడు కృష్ణుడు కాబట్టే చంపేది, చంపించేది అన్న భావనను త్రోసిపుచ్చాడు.
‘వాసాంసి జీర్ణాని యథా విహాయ/ నవాని గృహ్ణాతి నరోపరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని/ సంయాతి నవాని దేహీ’
‘వాసాంసి జీర్ణాని’ - పాత వస్త్రాన్ని, ‘యధా’ - ఏ విధంగా, ‘విహాయ’ -త్యజిస్తామో, నవాని - నూతన, గృహ్ణాతి - గ్రహిస్తామో...
పాత బట్టలను అంటే చినిగే దశకు చేరుకున్న వస్త్రాలను కాదనుకుని కొత్త వాటిని ధరిస్తున్నట్లే ఆత్మ శుష్కించిన దేహాన్ని వదలి కొత్త దేహాలను పొందుతుంది.
నిజానికి మన దేహాన్ని మనం ప్రేమిస్తున్నంతకాలం ఈ దేహాన్ని వదలాలనిపించదు. అంటే అటాచ్‌మెంట్ ఉన్నంతకాలం డిటాచ్‌మెంట్ సాధ్యంకాదు. దేహం అని మనం చెప్పుకుంటున్న కోరికలున్నంత కాలం నెరవేరని కోరికలను పట్టుకుని వేలాడుతున్నంత కాలం దేహం కూడా భౌతికంగా కృశిస్తుంటుందే తప్ప ఆత్మ నుండి విడివడటానికి ఇచ్ఛగించదు. ఇక్కడ పాత వస్త్రం అంటే వృద్ధాప్య దశను చేరుకున్న దేహం అని చెప్పుకుంటున్నా ‘వాసాంసి జీర్ణాని’ అంటే చినిగిన వస్త్రం అనే చెప్పుకోవటం సముచితం. వస్త్రం చినగటానికి పాతబడనక్కర్లేదన్నట్లుగా ఆత్మ దేహాన్ని కాదనటానికి దేహం వృద్ధత్వంతో వడలిపోనక్కర్లేదు. కాబట్టి ఈ సందర్భంలో వాచ్యార్థం కంటే అంతరార్థమే ముఖ్యం.
ఆత్మ దేహంలో ఉండాలనుకుంటున్నంత కాలం ఉంటుంది. ఇక ఈ దేహం అవసరం లేదనుకున్నప్పుడు దేహాన్ని విడనాడి మరో దేహాన్ని చేరుకుంటుంది. అదీ ఆత్మతత్వం. కాబట్టి జీవిక గమనం ఆత్మతత్వం కావాలి. గమనం వల్లనే మరో స్థితిని చేరటం సాధ్యవౌతుంది. సామాన్యంగా, ఆత్మ మానవ శరీరాన్ని వదలి మరల మరల ఈ దేహానే్న చేరుతుందనుకుంటుంటాం. కానీ ఆత్మతత్వం ‘గమనం’ అయినప్పుడు గమనం ఒక్క మానవులకనే కాదు సకల ప్రాణి కోటికి సమానం కాబట్టి ఏ ప్రాణినైనా చేరగలదని చెప్పుకోవటం సహేతుకం. కాబట్టి ‘పునరపి జననం పునరపి మరణం’ కేవలం మానవ దేహానికే పరిమితం కదా - ఏ జీవానికైనా చెందుతుంది.
ఆత్మతత్వం పాంచభౌతికతత్వం కాదనే దిశగా-
‘నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః/ న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః’
ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు - అంటే ఆయుధాలు ఏమీ చేయలేవు; అగ్ని దహించలేదు. నీరు తడపలేదు అంటే రూపం లేనిదనే. అలాగే గాలి వీస్తే ఆరిపోయే స్థితీ కాదు. ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవలసిందేమిటంటే దేహం రూపమే అయినప్పటికీ ఆత్మ అరూపమనే.. నిరాకరమనే.. అదృశ్యమనే. ఆత్మ అరూపం, అదృశ్యం కాబట్టే పంచభూతాలు దానిని తాకనైనా తాకలేవు... అంటే పాంచ భౌతికతత్వం ఆత్మను లొంగదీసుకోలేదు. అందుకే పాంచభౌతికమైన ప్రాపంచిక తత్వానికి ఆత్మ సదా అతీతంగానే ఉంటుంటుంది.
ఆత్మ ఎటువంటిదంటే - అచ్ఛేద్యం, అదాహ్యం, అక్లేద్యం, అశోష్యం, అయం, అచలం, నిత్యం, సర్వగతం, సనాతనం, స్థాణువు.
‘అచ్ఛేద్యో యమదాహ్యో యమక్లేద్యో శోష్య ఏవ చ
నిత్యః సర్వగతః స్థాణు రచలోయం సనాతనః’
మన దేహాన్నో, మరో భౌతికతనో ఛేదించగలం, దహించగలం, తడపగలం, శోషింపచేయగలం, చలింప చేయగలం. మొత్తానికి అనిత్యమైందిగాను, అస్థిరమైంది గాను చేసి దాని పురాణత్వం లేకుండా చేయగలం.. ఉనికి, అస్తిత్వం లేనిదానిగా చేయగలం. కానీ ఆత్మపరంగా ఇటువంటి మన ప్రయత్నాలేవీ సఫలం కావు. మనం ఎంత ప్రయత్నించినా ‘ఆత్మ’ ఉనికిని, అస్తిత్వాన్ని ఇసుమంతైనా మార్చలేం. ఎంతటి పదునైన కత్తితోనైనా, ఎంతటి శక్తిమంతమైన అస్త్రంతోనైనా ఆత్మను ఛేదించలేం. అగ్నికి ఆహుతి చేయలేం.. ఎంతటి నీరయినా ఆత్మను కనీసం తాకనైనా తాకలేదు.. ఇక ఆత్మను వాయువు చేతే కాదు.. ఇతరత్రా కూడా శోషింప చేయలేం.
ఇలా ఆత్మ అనాది, నిత్యమైంది, సనాతనమైంది, స్థిరత్వం కలిగినటువంటిది, సర్వవ్యాపి. మొత్తానికి నశించే పాంచభౌతిక తత్వం కలిగినదేదీ ఆత్మను కబళించలేదు. కాబట్టి ఆత్మ విలక్షణమైంది, అద్వితీయమైంది అన్నది స్పష్టం.
ఇంకా ఆత్మను గురించి చెప్పుకోవాలంటే-
‘అవ్యక్తో యమచింత్యో యమ వికార్యో యముచ్యతే
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి’
ఆత్మ అవ్యక్తం, అచింత్యం, అదికార్యం - అంటే, వ్యక్తం అయ్యేది కాదు... ఇంద్రియాలకు అందేది కాదు.. చింతింపశక్యం కానిది. అంటే మన భావనలకు, ఆలోచనలకు అందనిది, ఒక విధంగా మన భౌతిక జ్ఞానానికి అందేది కానిది.

-డా.వాసిలి వసంతకుమార్ 93939 33946