S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సెంటిమెంట్

మనిషికి సెంటిమెంట్లు ఎక్కువ. సెంటిమెంట్లు లేని వ్యక్తి ఎవరూ వుండరు. విప్లవవాదులకి సెంటిమెంట్ మరీ ఎక్కువ. వాళ్లు ఈ విషయాన్ని ఒప్పుకోకపోవచ్చు. కానీ ఇది నిజం. అమరవీరుల స్థూపాలే అందుకు నిదర్శనం.
నేను నిజామాబాద్‌లో పని చేస్తున్నప్పుడు మా అటెండర్ వచ్చి ఫలానా న్యాయమూర్తి కొడుకు వచ్చాడని చెప్పాడు. వాళ్ల నాన్నగారు నాకు బాగా తెలుసు. ఇద్దరం కలిసి ‘లా’ చదివాం. అతన్ని లోపలికి పిలిచి కాస్సేపు మాట్లాడిన తరువాత, వాళ్ల నాన్నగారి గురించి అడిగిన తరువాత ఏం పని మీద వచ్చావని అడిగాను.
‘పనేం లేదు అంకుల్. ఈ క్వార్టర్‌లో నాలుగు సంవత్సరాలు వున్నాం. నా చిన్నతనం ఇక్కడ గడిచింది. ఓసారి చూసి పోదామని వచ్చాను. అంతే!’ అన్నాడు.
ఆ తరువాత ఇల్లంతా కలియదిరిగాడు. నాతోపాటూ టిఫిన్ చేసి వెళ్లిపోయాడు.
మా పిల్లలు చిన్నగా వున్నప్పుడు మేం ఓ మూడు సంవత్సరాలు వెస్ట్‌మారేడ్‌పల్లిలోని జడ్జెస్ క్వార్టర్స్‌లో వున్నాం. ఆ మధ్య మా పిల్లలు కూడా అలా వెళ్లి అప్పుడు మేం వున్న క్వార్టర్స్‌ని చూసి వచ్చారు. ఇదంతా ఓ సెంటిమెంట్. అక్కడ ఏవో జ్ఞాపకాలు వుంటాయి. కాలం గడిచిన కొద్ది ఆ జ్ఞాపకాలు మధుర స్మృతులుగా మారిపోయాయి.
ఈ పిల్లలనే కాదు. చాలామంది పెద్దవాళ్లని కూడా చూశాను. ఆ మధ్య నిజామాబాద్‌లో ఓ ఇంట్లో వున్నప్పుడు ఓ వ్యక్తి వచ్చి అలాగే ఇల్లంతా చూసి వెళ్లాడు.
కిరాయి ఇంటి విషయంలోనే ఇలాంటి ఫీలింగ్ వుంటే స్వంత ఇంటి మీద ఎలా ఉంటుంది? ఇంకా ఎక్కువ అటాచ్‌మెంట్ ఉంటుంది.
ఓ 17 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో ఓ ఫ్లాట్ కొనుక్కున్నాను. మా పిల్లల బాల్యం అక్కడే గడిచింది. కానీ కాలక్రమంలో ఇల్లు చిన్నగా అయిపోయింది. ఇల్లు ఎప్పుడు చిన్నగా అవుతుందో, ఎప్పుడు పెద్దగా మారబోతోందో చెప్పలేం.
ఇల్లు సరిపోవడం లేదు
పిల్లలు ఎగిరి
మంచు నీడలో నివసిస్తున్నప్పటికీ
ఇల్లు సరిపోవడం లేదు
ఆర్టీసి బస్సులోని ప్రయాణీకుల్లా
ఇల్లు క్రిక్కిరిసిపోయింది పుస్తకాల్తో
మహా రచయితలు కవులూ
చరిత్రకారులు కొలువుతీరి
ఇల్లు ఇల్లంతా ఆక్రమించేశారు
ఎక్కడో
లైబ్రరీలో వున్నట్టు
పుస్తకాల మధ్య బతుకుతున్నట్టు
ఇల్లు మారుదామని నిర్ణయం తీసుకున్నాం. ఓ విల్లాకి మారిపోదామని నిర్ణయించుకున్నాం. ఈ ఫ్లాట్ ఏం చేద్దామని ప్రశ్న వచ్చింది. దాన్ని అమ్మడానికి మా అబ్బాయి ఇష్టపడలేదు.
‘మా బాల్యంతో ముడిపడి ఉంది. అది అలాగే వుండనీ నాన్నా’ అన్నాడు మా అబ్బాయి.
అదే జరుగుతుంది.
ఎవరి సెంటిమెంట్లు వాళ్లవి.
వాటిని గౌరవించాల్సిందే!

జింబో 94404 83001