S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పువ్వులు

ప్రభాత సమయంలో
లేలేత రవి కిరణాల స్పర్శతో
రేకులు విప్పుకుని
సుగంధాలను వెదజల్లుతాయి
సుమ బాలలు!
ఆయుర్దాం ఒక్కరోజే అయినా
అందం, ఆకర్షణ, సౌకుమార్యం, సౌరభం
అన్నిటితో మురిపిస్తాయి
మనసును పరవశింపజేస్తాయి
పొదలలో ముళ్లున్నా తమ
ఎదలో మధువును నింపుకుని
తుమ్మెదలకు కమ్మని విందునిస్తాయి!
మాల కట్టిన దారానికి సైతం
తమ తావిని తగిలిస్తాయి
మరునాటికి ముకుళించినా
రేకులు రాల్చినా
మన మదిలో మధురోహలను
పొందుపరుస్తాయి
పరమాత్మ పాదాల చెంతకో
పడతి సిగలోనికో
గాలికి రాలి నేలకు ఒరిగేందుకో
ఆకతాయి చేతిలో చదిమివేయబడేందుకో
తెలియకపోయినా
తెలతెల వారేసరికి
పచ్చటి కొమ్మ మీద విచ్చుకుని
ముచ్చటగా తలఊపుతూ
ఉషోదయాన్ని ఉత్సాహంగా
స్వాగతిస్తుంటాయి!
జలజల రాలే జాజులు
మత్తెక్కించే లిల్లీలు, మల్లెలు
గులాబీ బాలల గుబాళింపులు,
సంపెంగల సోయగాలు
మందారాల అందాలు
మొగలిపూల పొదలు
నందివర్థనాల నయగారాలు
పున్నాగల పరిమళాలు
కనకాంబరాల కమనీయం
చామంతులు, పూబంతుల హొయలు
పారిజాతాల సుకుమారం
కలువపూల కళకళలు
ప్రతి ఒక్కరినీ పలకరిస్తాయి
మదిమదినీ పులకరింపజేస్తాయి
దోసిలి నిండా పుష్పాలు
దేవునికి అర్పించినా
ఒక్క కుసుమాన్ని
పాదాల చెంత ఉంచినా
భక్తి మాత్రమే ప్రధానం
మనస్సనే పుష్పం మరింత ముఖ్యం!
వర్ణాలు వాసనలు ఎన్నున్నా
పువ్వులన్నీ ఒక్కటే!
మతాలు, అభిమతాలు వేరయినా
మానవులంతా ఒక్కటే!
మానవత్వం అనే పరిమళాన్ని
వ్యాపింపజేద్దాం!
మాధుర్యం అనే ప్రేమను
పంచి పెడదాం!
పువ్వులా, పసిపాప నవ్వులా
జీవిద్దాం.

-అబ్బరాజు జయలక్ష్మి