S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలుగు అక్షర రక్షకుడు సి.పి. బ్రౌన్

ప్రాచీన కాలంలో తాటాకులు, తాళ పత్రాల్లో నమోదు చేసి భద్రపరిచిన తెలుగు సాహిత్యం అక్షర సంపదంతా నిక్షిప్తమైనటువంటి వందల గ్రంథాలు బొందల్లో సమాధమవుతున్న సమయాన, తెలుగు భాష మట్టిలో కలిసి కనుమరుగయ్యే కాలాన, తెలుగు సాహిత్యానికి పట్టిన చెదలును దులిపించి, తెలుగు వాఙ్మయాన్ని బ్రతికించి రక్షించి దీవించి, తన జీవితంలో తెలుగును ఒక భాగంగా పెంచి పోషించిన మహనీయుడు సి.పి.బ్రౌన్. తేది 10-11-1798లో జన్మించిన బ్రౌన్ అన్యదేశమైనా మన అమ్మ భాష తెలుగు కోసం ఎంతో శ్రమపడి తన వయస్సుని ఆస్తిని వ్యయం చేసిన బ్రౌన్ తన జీవితాన్ని తెలుగుకు త్యాగం చేశాడు. తెలుగు అందాన్ని చూసి ముచ్చటపడి తెలుగు నుడికారానికి గుడికట్టిన అచ్చతెలుగు వాడు బ్రౌన్. తెలుగు సాహిత్యానికి అలనా పాలనా లేని రోజుల్లో అద్భుత తెలుగు కావ్యాలు నిర్లక్ష్యానికి గురవుతున్న సందర్భాల్లో మిణుకు మిణుకుమంటున్న తెలుగు సాహిత్య కుసుమాలను గుదిగుచ్చి అక్షరమాల కట్టిన సాహిత్యోద్ధారకుడు బ్రౌన్. బ్రిటీష్ ఉద్యోగిగా అప్పటి కలకత్తా నుండి 1817లో మన తెలుగు లోగిలికి వచ్చిన బ్రౌన్ మూడేళ్ళ శిక్షణానంతరం 1820లో కడప జిల్లా కలెక్టర్‌కు 2వ సహాయకుడిగా చేరి మొత్తం ఐదేండ్లు కడపలో పనిచేశారు. కడపలో కాలుపెట్టే సమయానికి ఒక్క తెలుగు ముక్క కూడా రాని బ్రౌన్ అంతసేవ చేయగలిగారంటే అది భాషాభిమానమే. కడపలోనే పెద్ద బంగ్లా, తోట కొని అందులోనే సాహిత్య ఉద్యానవన సేవ చేశాడు. బంగ్లాలో కొంతభాగం పండితులకిచ్చి తాళపత్ర పరిశోధన గావించి శుద్ధ ప్రతుల్లో ఆ విజ్ఞానాన్ని నిక్షిప్తం చేయించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న సాహిత్య తాళపత్ర గ్రంథాలు తెప్పించి వాటిని శుద్ధిచేసే ప్రక్రియ చేపట్టారు. తెలుగు సాహిత్యానికి శాశ్వత రూపం ఇచ్చాడు. 1824లో తెలుగు మీద అభిమానంతో బ్రౌన్ తొట్టతొలిగా వేమన శతకాల గొప్పదనం గురించి తెలుసుకున్నాడు. ఆయన శతకాల పద్యాలన్ని తెప్పించుకొని 3000ల పద్యాలను సేకరించి అందులో 693 పద్యాలను నాలుగు భాగాలుగా చేసి ఆంగ్లంలోకి అనువధించి, 1829లో స్వయంగా ముద్రింపజేశాడు. ఆ రకంగా తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఉద్ధారకుడు సి.పి.బ్రౌన్, అలా మొదలైన సాహిత్య సంరక్షణ జీర్ణోద్దరణ కార్యక్రమం నిరాఘాటంగా బ్రౌన్ దొర భవంతిలో సాగుతూనే ఉంది. ఈనాడు మనకు లభిస్తున్న ప్రాచీన సాహిత్య పుస్తక రూపాలు బ్రౌన్ చలవే. ఆయన భాషాభిమానమే. బ్రౌన్ వ్యవహారిక భాషా వాదుల్లో అగ్రగణ్యుడిగా చెప్తారు. 1925లో తెలుగు భారతాన్ని చదవటం మొదలుపెట్టి 18 పర్వాలకు శుద్ధ ప్రతులు చేయించారు. అందుకు అప్పట్లోనే 2,714 రూపాయలు ఖర్చుపెట్టాడు.
ప్రజల నాలుకలపై నిత్యం ఆడే సామెతలు, జాతీయాలెన్నింటినో సేకరించి అక్షరరూపం కల్పించాడు. చాటువులకైతే లెక్కలేదు. 8 కథా, 41 ద్విపద కావ్యాలను సముద్దరించి 84 శతాకాలను సేకరించాడు. వీటిలో 10 శతకాలను ముద్రించారు. వీటన్నింటికన్నా జన బాహుళ్యంలోకి వెళ్ళిన బ్రౌన్ తొలి తెలుగు నిఘంటువు ఒక అద్భుతం. అలాంటి నిఘంటువులు ఐదింటిని సమకూర్చగలిగారంటే బ్రౌన్ తెలుగులో సాధించిన పట్టెంతో అర్థమవుతుంది. అప్పట్లో వ్యవహారికాలను ఆయన రాసిన తెలుగు వాచకాలకు గొప్ప పేరుంది. సంస్కృతంలో ఉన్న ‘‘సౌందర్యలహరికి’’ వ్యాఖ్యానం వ్రాశారు. బ్రౌన్ శిష్ట భాషతోపాటు జానపదుల భాషపై కూడా అవిరళ కృషి చేశాడు. జానపద సాహిత్యాన్ని లిఖిత రూపంలోకి తెచ్చి ప్రాశ్చాత్యుల్లో బ్రౌన్ చెప్పుకోదగిన వాడు. బొబ్బిలి కథ, కుమార రాముని కథ, పల్నాటి వీరగాధలు, కామమ్మ కథలు, కాటమరాజు కథ, జానపద గేయాలు, మంజరీ ద్విపదలో జానపద కథలు, పాటలు, యక్షగానాలు సేకరించారు. ఆంధ్రగీర్వాణ ఛందమును రాశాడు. వేమన, సుమతీ, భాస్కర శతకాలకు ఆంగ్లంలో వాఖ్యానాలు కూడా రాశాడు. మిరాశీ వాదము, తాతాచారి కథలు, కర్ణాటిక్ క్రోనాలజీ తెలుగు - ఇంగ్లీష్, ఇంగ్లీష్ - తెలుగు నిఘంటువులు ఇంకా ఎన్నో గొప్ప గొప్ప తెలుగు గ్రంథాలు రచించి తెలుగు జాతికి అందించాడు.
ప్రస్తుతం బ్రౌన్ గ్రంథాలయంలో 45వేలకు పైగా వివిధ భాషలకు చెందిన పుస్తకాలున్నాయి. 200 వరకు తాళపత్ర గ్రంథాలున్నాయి. తెలుగు భాషను బ్రతికించి భావితరాలకు అందివ్వటం కోసం ఆనాడు సుమారు 60,000/- దాకా అప్పజేసి చివరికి తీర్చినట్టు తన ఆత్మకథలో రాసుకున్నారు. భాషా పిపాసి బ్రౌన్ నివసించిన ఆ సాహిత్య కర్మాగారమే నేడు కడపలో భాషా పరిశోధన కేంద్రంగా మిగిలిపోయింది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తెలుగంటే ఏమిటో తెలియకపోయినా భాషమీద మమకారంతో చచ్చిపోతున్న తెలుగు మనుగడ కోసం, తేట తెలుగు అక్షరాలకు అమరత్వం అందించటం కోసం అక్షర పోరాటం జేసిన సాహిత్య పోరాట యోధుడు మరచిపోకూడని మహనీయుడు బ్రౌన్. వివిధ పదవుల్లో రాణించిన బ్రౌన్ 12-12-1884లో తుది శ్వాస విడిచినా... ఆయన ఏర్చి కూర్చిన ప్రతి కావ్యంలోను జీవించే ఉన్నాడు. తెలుగు భాష కోసం నిరంతరం శ్రమించి అంతర్జాతీయ స్థాయిలో మన అక్షరాలను అలంకరించి గొప్పతనాన్ని తీసుకొచ్చిన బ్రౌన్‌ను తెలుగు వాడిగానే భావించాలి, స్మరించుకోవాలి. తెలుగు కోసం తన జీవితాన్ని అర్పించి బ్రౌన్ దూరకు ఇదే మా అక్షర సమాంజలి.
*

-యడవెల్లి నగేష్ 8096193705