S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అభిమతం తీర్చే అభిషేక ప్రియుడు

ఓంకారం పలికితే సృష్టిలోని సకల జనుల జన్మ సాకారం అవుతుంది. అటువంటి ఓంకారేశ్వరుడే... సృష్టి లయకారుడు, పరమేశ్వరుడు, బోళాశంకరుడు, వైద్యనాథుడు, విశే్వశ్వరుడు, నాగేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, గృశే్నశ్వరుడు, కేదారేశ్వరుడు, త్య్రంబకేశ్వరుడు, భీష్మ శంకరుడు, రామేశ్వరుడు, సోమనాథుడు, మల్లికార్జునుడు. ఇన్ని పేర్లతో పిలువబడే లింగాకారుడు శివుడు. సృష్టిలో శివుడిని లింగాకార రూపంలోనే కొలుస్తారు. ఎందుకంటే ఆ శివుడు పార్వతీదేవిని తనలో సగభాగంగా చేసుకున్నాడు. శివలింగంలోని క్రింది నుండి సగభాగంగా ఉన్న పానవట్టం పార్వతీదేవిగాను, ఆపై ఉన్న సగ భాగం లింగరూపాన్ని పరమేశ్వరుడుగాను పూజిస్తారు. ఇక గంగను తన తలపైనే తన జటాజూటంలో దాచుకున్నాడు.
శివుడు అభిషేక ప్రియుడు. రాగి చెంబుతో కాసిన్ని నీళ్లు పోసి, మారేడు దళం లింగంపై ఉంచి, కొంచెం భస్మం కనుక శివలింగానికి రాసినట్లయితే ఈశ్వరుడు పొంగిపోతాడు. ఎలాంటి వరాలు అడిగినా ఇస్తాడు. అందుకే ఆయనను భోళాశంకరుడు అంటాము. ఎన్ని నీళ్లు తనపై పడితే అంత సంతోషిస్తాడు. శివుడు అందుకే గంగమ్మను తలపై పెట్టుకున్నాడు.
శివుడు లేకుండా పార్వతి, పార్వతి లేకుండా శివుడు ఎక్కడా ఉండరు. శివపార్వతులు సంగమ రూపంగానే వుంటారు. శివలింగం సృష్టి సంకేతం. అన్యోన్య దాంపత్యాన్ని, అనురాగ జీవితాన్ని, శాశ్వత బంధాన్ని కోరుకునేవారు శివపార్వతులను పూజిస్తారు. ఎక్కడా కూడా పార్వతీదేవి ఆలయం వుండదు. పార్వతీదేవికి ఒక్కరికే ఆలయం నిర్మించరు. శివునితో కలిపే శివాలయం ఉంటుంది. పార్వతీ పరమేశ్వరులను ఎక్కడా కూడా ఫొటోల రూపంలోగానీ, విగ్రహాల రూపంలో పూజించకూడదు. శివలింగ రూపంలోనే పూజించడం శ్రేష్ఠం. ఇంకా శివలింగాన్ని పసుపుతోగానీ, పిండితో గానీ, మట్టితోగానీ సృష్టించి పూజించవచ్చు.
లయత్వానికి పార్వతీ పరమేశ్వరులిద్దరూ కర్తలే. అతి తొందరగా కోరిన వరాలు తీర్చేవారే పార్వతీ పరమేశ్వరులు. లయకారకుడైన శివుడు స్థిరస్వరూపుడు. జంబూద్వీప భరతఖండంలో శైవమే పురాతనమనే వాదన ఉన్నది. 1920 నాటి మొహంజొదారో, హరప్పా త్రవ్వకాల్లో శివలింగాలు బయల్పడినాయి. మనం మన కన్నులతో చూస్తున్నటువంటి శివలింగం స్ర్తి, పురుషుల సృష్టి సంకేతం. శివాలయాల్లో ఎక్కడా శివుని విగ్రహాలు ఉండవు. స్ర్తి పురుష సంయోగమే సర్వసృష్టికి మూలం. ఇటువంటి జ్ఞానానే్న మనం శివలింగంలో చూడగల్గుతున్నాం.
ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మాఘ మాసంలో వస్తుంది. మహా శివరాత్రి రోజున ప్రతి ఒక్క శైవ క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. ఇసుకవేస్తే రాలనంత జనం ఉంటారు. అదో పెద్ద కుంభమేళాను తలపిస్తుంది. మహాశివరాత్రి రోజున వేకువ సమయానే్న అభిషేకాలు మొదలవుతాయి. ప్రాతఃకాలం నుండి రాత్రి లింగోద్భవ కాలం వరకు అభిషేకాలు జరుగుతుంటాయి. ఇక ఆ రోజు పరమేశ్వరునికి పట్టలేని సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే క్షణకాలం ఆగకుండా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి కనుక. ఇక ఆ సంతోషంతో భక్తులకు కోరిన వరాలు ప్రస్తాదిస్తాడని చెప్పవచ్చు. శివునికి అలంకారం కంటే అభిషేకాలే ప్రియం. అందుకే శివాలయాల్లో ఎక్కువ సమయం అభిషేకాలు జరుగుతుంటాయి.
ఇంకొక ముఖ్య విషయమేమిటంటే వైష్ణవ భక్తులకు యజ్ఞోపవీతం ఎంతటిదో, శైవ భక్తులకు రుద్రాక్షలు అంతటివి అని చెప్పవచ్చు. బ్రహ్మ యొక్క సంతతిగా చెప్పుకొనే శైవులకు, వైష్ణవులకు రుద్రాక్షలు ధరించటం క్షేమమే. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే ఈ చాతుర్వర్ణాల వారు రుద్రాక్షమాలను ధరించవచ్చు. వైష్ణవ సంప్రదాయాలకున్నటువంటి ఆచారాలు, సంప్రదాయాలు శైవభక్తులకు ఉండవు. భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలను కులాలు, ఆచారాలు అనేవి లేకుండానే ఎవరయినా తమ చేతులతో శివలింగాన్ని తాకి ఆత్మతృప్తిని పొందవచ్చు. ఇది శైవ సంప్రదాయానికి, శివభక్తులకు ఉన్నటువంటి మహాభాగ్యం, అదృష్టమని చెప్పవచ్చు. అందుకే శివలింగానికి పాలు, నీళ్లు, భస్మం, పంచామృతాలతో అభిషేకాలు చేసి ఆ సృష్టికర్తను తాకి సంతృప్తి చెందుతారు.
ఇక విభూతి ధారణలో శైవభక్తులు ఆ జంగమేశ్వరుని మాదిరిగానే ఒంటినిండా విభూదితో నామాలు పెట్టుకుంటారు. శైవ భక్తులు కానీ, శివాలయాలకు వెళ్లినవారు గానీ నుదుటిపై మూడు నామాలు పెట్టుకుంటారు. నుదుటిపై మూడు నామాలు ధరించడాన్ని (శైవులు అడ్డంగా నామాలు పెట్టుకున్నా, వైష్ణవులు నిలువుగా నామాలు పెట్టుకున్నా) భారతీయ తాత్త్వికులు (తత్వశాస్త్రం ప్రకారం) మూడు అనే సంఖ్యను ధార్మిక సంఖ్యగా భావించడమే కారణంగా చెప్పవచ్చు. వైష్ణవుల నామధారణ గానీ, శైవుల విభూతిధారణకు గానీ అర్థం ఒక్కటే. అపమృత్యు దోషాలు తొలగిపోతాయని నమ్మకం.
త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్థనం
ఉర్వారుకమివ బంధనా న్మృత్యోర్ముక్షీయ మామృతాత్‌॥
ఈ మంత్ర ఉచ్ఛారణ ఋగ్వేద ఏడవ మండలంలోనిది. ఈ మంత్రాన్ని పఠిస్తూ విభూతి ధారణను చేయాలని, ఈ మంత్రాన్ని రచించిన వశిష్ఠ మహర్షి తెలిపాడు. ఇది మృత్యుంజయ మంత్రం.
పరమాత్మయే సత్యమని చెప్పడానికి ఒక గీత (అద్వైత), పరమాత్మ, జీవాత్మ ఇద్దరూ సత్యమని చెప్పే ఒక గీత (ద్వైత, పరమాత్మ, జీవాత్మ, సృష్టి ఈ మూడు సత్యమని చెప్పే ఒక గీత (విశిష్టాద్వైతం) ఇదే మూడు నామాల సుగుణాలు. ఈ మూడు నామాలు నిజంగా సుగుణాలు. ఈ మూడు సత్యాలను అంగీకరించడమే నామాల ధారణ ఉద్దేశం.
ఇక ఇంతటి గొప్ప సృష్టికర్త అయిన శివుడు భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పూజలందుకొంటున్నాడు.
మహారాష్టల్రో వైద్యనాథుడు
కాశీ, ఉత్తరప్రదేశ్‌లో విఘ్నేశ్వరుడు
ఓంకార్, మధ్యప్రదేశ్ ఓంకారేశ్వరుడు
ద్వారక, గుజరాత్ నాగేశ్వరుడు
ఉజ్జయిని, మధ్యప్రదేశ్ మహాకాళేశ్వరుడు
గృశే్నశ్వర, మహారాష్ట్ర గృశే్నశ్వరుడు
శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ మల్లికార్జునుడు
కేదారనాథ్, ఉత్తరాఖండ్ కేదారేశ్వరుడు
గుజరాత్ సోమనాథుడు
నాసిక్, మహారాష్ట్ర త్య్రంబకేశ్వరుడు
రామేశ్వరం, తమిళనాడు రామేశ్వరుడు
ఢాకినీ, మహారాష్ట్ర భీష్మ శంకరుడు
ఇన్ని రూపాలు, పేర్లతో పిలుస్తున్నప్పటికీ ఏ ఆలయంలో చూసినా కూడా కనిపించేది లింగరూపమే. ఇక మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి లాంటి పర్వదినాలు కుంభమేళాను తలపిస్తాయి. ఆ ప్రదేశాల్లోని ఆలయాలకు కేవలం అక్కడి ప్రాంతవాసులే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి, ప్రాంతాల నుండి కూడా భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు.
ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రాచుర్యం పొందిన శివాలయాలు ఉన్నాయి. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లాలోని అచ్చంపేట మండలం రంగాపురం గ్రామం సమీపంలో నల్లమల్ల కొండపై ఉన్న ఉమామహేశ్వరాలయం చాలా ప్రాశస్త్యమయినది. ఈ ఆలయానికి దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉందని అంచనా. శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ముఖద్వారంగా వెలసి గొప్ప శైవ క్షేత్రంగా వెలుగొందుతున్నది. మొత్తం ఇక్కడ ఐదు ఆలయాలు, ఐదు లింగాలు, కోనేరు ఉంటాయి. ఇక్కడి కొండల నడుమ 5 చోట్ల నుండి భస్మధార, రుద్రధార, గౌరీమండం, విష్ణుమండం, పాపనాశనం అనే ఐదు ధారలు నిరంతరం జాలువారుతూనే ఉంటాయి.
అదే విధంగా ఓరుగల్లులోని (హన్మకొండ) శ్రీ రుద్రేశ్వర స్వామి వారి వెయ్యి స్తంభముల దేవాలయంలో ఆ పరమేశ్వరుడు శ్రీరుద్రేశ్వర స్వామిగా నిత్యపూజలు అందుకుంటున్నాడు. వెయ్యి స్తంభాల దేవాలయం త్రికూటాలయం. ఈ ఆలయంలో రుద్రేశ్వర స్వామి వారికి ఉత్తర భాగాన విష్ణుమూర్తి ఆలయం, తూర్పున (ఎదురుగా) సూర్యాలయం ఉంటాయి. కాకతీయుల పాలనా సమయంలో రుద్రదేవ మహారాజు నిర్మించడంతో స్వామివారు శ్రీ రుద్రేశ్వర స్వామిగా పూజలందుకొంటున్నాడు. నవాబులతో జరిగిన యుద్ధంలో విష్ణుమూర్తి, సూర్యభగవానుని విగ్రహాలు ధ్వంసమై దొంగిలించబడ్డాయి. ఇప్పుడు కేవలం శివలింగ రూపంలో రుద్రేశ్వర స్వామికి నిత్యం అభిషేకాలు, పూజాదికాలు జరుగుతుంటాయి. వెయ్యి స్తంభాల దేవాలయానికి గొప్ప చరిత్ర ఉంది. ఆలయంలో సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి. దేవాలయం నిత్యం బడిపిల్లలు, యాత్రికులు, విదేశీ యాత్రికులు, భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. ఇక కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాల్లో భక్తులు దాదాపు 500 మీటర్ల నుండి 1000 మీటర్ల వరకు క్యూలో నిలబడి స్వామివారికి అభిషేకాలు జరిపిస్తారు.
కాళేశ్వరంలోని దేవాలయం కూడా చాలా ప్రాముఖ్యత కల్గి ఉంది. అక్కడికి పక్క రాష్ట్రాల నుండి భక్తులు నిత్యం వేల సంఖ్యలో వస్తూంటారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోని పాలంపేట గ్రామంలో ఉన్న పురాతన రామప్ప దేవాలయం కూడా కాకతీయుల కాలంలోనే నిర్మించబడింది. అందులో కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు లింగరూపంలోనే ఉంటారు. రామప్ప దేవాలయం కూడా మంచి సందర్శనా స్థలమే. ఇవే పేర్లతో కాకుండా ఉమారామ లింగేశ్వరుడు, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరుడిగా, పాలకుర్తిలో సోమేశ్వరుడిగా ఎన్నో ప్రాంతా ల్లో అనేక పేర్లతో కొలువబడుతున్నప్పటికీ రూపం మాత్రం లింగాకారమే.
ఏ ప్రాంతంలో ఏ పేర్లతో పిలువబడుతున్నప్పటికీ ఆ దేవాలయాలు కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాల్లో శివనామ స్మరణతో మారుమ్రోగిపోతుంటాయి. శివాలయాల్లో మహాశివరాత్రి రోజున భక్తుల ఓం నమశ్శివాయ నామ స్మరణతో దద్దరిల్లిపోతుంటాయి. భక్తుల కొంగు బంగారమయిన ఆ పార్వతీ పరమేశ్వరుడు ఆ నామస్మరణలు విని దివిలో తాండవం చేస్తూంటాడు. భక్తుల అభిషేకాలు, భజనలు, ఓం నమశ్శివాయ నామస్మరణలు శివరాత్రి పర్వదినాన శైవాలయాల్లో జన జాతరగా, మహాకుంభమేళాగా కనిపిస్తాయి. హన్మకొండలోని సిద్ధేశ్వరుని ఆలయం చాలా ప్రాముఖ్యత గాంచినది. సిద్దేశ్వరాలయంలో శివుడు స్వయంభువు.
పరమేశ్వరునికి బహు ప్రీతికరమయిన మహాశివరాత్రి పర్వదినాన ప్రాతఃకాలం మొదలయిన అభిషేకాలు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో పూజలు జరిగేంతవరకు విరామం లేకుండా జరుగుతూనే ఉంటాయి. శివరాత్రి నాడు శివభక్తులు ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు. శివాలయాల్లో భక్తులు రాత్రంతా భజనలు చేస్తారు. శివరాత్రి రోజున పాలు, నీళ్లు, పంచామృతాలు, భస్మం మొదలైన వాటితో అభిషేకాలు చేసి, మారేడు దళం పెట్టి, ఉపవాసాలు ఉండటం, జాగరణ చేయడం ఇవన్నీ శివునికి ఎంతో ప్రీతికరం.

-పర్వతాల శ్రీనివాస్