S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రజల్లోకి విప్లవం ( భగత్‌సింగ్-17)

భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, భగవతీ చరణ్, యశ్‌పాల్, ఇంకొందరు కలిసి 1926లో నౌజవాన్ భారత్ సభను లాహోర్‌లో స్థాపించారు. అది విప్లవ పార్టీకి బహిరంగ విభాగం వంటిది. దాని పేరు మీద మీటింగులు పెట్టేవారు. స్టేట్‌మెంట్లు ఇచ్చేవారు. విప్లవ భావాల ప్రచారానికి కరపత్రాలు పంచేవారు.
భగత్‌సింగ్ ఎప్పుడు కాన్పూరు వచ్చినా నౌజవాన్ భారత్ సభ సాహిత్యాన్ని వెంట తెచ్చేవాడు. ఆర్థిక స్వాతంత్య్రం ఉంటేనే సంపూర్ణ స్వాతంత్య్రం సిద్ధిస్తుందని నొక్కి చెబుతూండేవాడు. సోషలిజాన్ని చదవండి, చర్చించండి అని మమ్మల్ని ప్రేరేపిస్తూండేవాడు. ఒక రాజ్యాన్ని ఇంకో రాజ్యం, ఒక మనిషిని వేరొక మనిషి దోపిడీ చేసే విధానం అంతమొందాల్సిన అవసరాన్ని అట్టడుగు స్థాయిలో ప్రజలందరికీ వీలైనన్ని విధాల్లో తెలియజెప్పితే గానీ బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాటం అర్థవంతం కాదని ఎప్పుడూ నూరిపోస్తూండేవాడు. నౌజవాన్ భారత్ సభ నడిపిన ట్రేడ్ యూనియన్లు, ప్రచురించిన కరపత్రాలు, బుల్లెట్లు, పత్రికల్లో వెలువరించిన వ్యాసాలు, లాంతరు షోలు వగైరాలు అన్నీ ఈ దిశలో చేసిన ప్రయత్నాలే.
ఇంత భారీ స్థాయిలో కింది దాకా చొచ్చుకు వెళ్లి, ప్రజలను చైతన్యపరిచే పని చేపట్టిన మొట్టమొదటి విప్లవకారుడు భగత్‌సింగ్.

-అంటాడు సహచరుడు మన్మథ్‌నాథ్ గుప్తా.
జనం మధ్య మసలుతూ, జనాన్ని చైతన్యపరుస్తూ పోలీసుల కట్టెదుటే బహురూపాల్లో పనిచేస్తూనే సర్వశక్తిమంతమైన బ్రిటిషు సామ్రాజ్యాన్ని ఎదిరించి బానిసత్వ శృంఖలాలను తెంచి పరపీడనకు తావులేని సమాజాన్ని స్థాపించాలన్న ఆలోచనే గొప్పది. ఆ బృహత్ యత్నం సరిగా సాగాలంటే చవకబారు రాజకీయాలకు, సాధారణంగా రాజకీయ సంస్థల్లో పొడసూపే దౌర్బల్యాలకు, దగుల్బాజీతనాలకు అతీతంగా ప్రతి ఒక్క కార్యకర్తా సుశిక్షితుడిలా పని చేయాలి. ఎవరూ హద్దు మీరకుండా గట్టి కట్టడి కావాలి.
నౌజవాన్ భారత్ సభలో ఎవరైనా చేరవచ్చు. కాని ఎవరిని పడితే వారిని చేర్చుకోరు. నౌజవాన్ సభ వదులువదులుగా కూర్చబడిందనీ, అందులో వేరువేరు భావజాలాలుగల నాయకులు ఉన్నారనీ ఆ కాలపు ప్రముఖులు కొందరు తమ గ్రంథాల్లో రాశారు. అది సరికాదు. పైకి చూడటానికి అది నానాజాతి సమితిలా కనపడినా, సభకు కట్టుదిట్టమైన నిర్మాణ వ్యవస్థ ఉంది.
అందులో మెంబరుగా చేరేవాడు తన మతవర్గపు సంకుచిత ప్రయోజనాల కంటే దేశ శ్రేయస్సునే మిన్నగా పరిగణిస్తానని ప్రమాణం చేయాలి. పూర్తికాలం పనిచేసి దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైనవాడే ఈ సభలో అడుగుపెట్టాలి. అహింసాయుతంగా ప్రజల మధ్య పని చేస్తూనే అవసరమైతే సాయుధ పోరాటానికీ కార్యకర్తలు సిద్ధపడి ఉండాలి. ఇందులోని మెంబరు జిల్లా ఆర్గనైజరు అనుమతి లేకుండా మరే ఇతర సంస్థలోనూ సభ్యుడుగా ఉండకూడదు.
నౌజవాన్ సభ కార్యకలాపాలను నియంత్రించేది సెంట్రల్ కౌన్సిలు. ఆ గవర్నింగ్ బాడీలో రాష్ట్ర శాఖల ప్రతినిధులుంటారు. ఏకగ్రీవంగానే నిర్ణయాలు జరగాలి. రెండో అంచెలో రాష్ట్ర కమిటీ ఉంటుంది. అందులో ఐదుగురు మెంబర్లు ఉంటారు. ఒకరు ప్రాపగాండా పనిచూస్తారు. ఒకరు ఆర్థిక వనరులను, మరొకరు మానవ వనరులను సమీకరిస్తారు. వేరొకరు ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని రహస్యంగా సేకరించి, పంపిణీ చేసే పనిలో ఉంటారు. ఇంకొకరు బయటి వర్గాలతో, వ్యక్తులతో సంబంధాల సంగతి చూస్తారు. ఇదంతా పోలీసు జాగిలాలు వాసన పట్టలేనంత నేర్పుగా, బయటివారు పోల్చుకోలేనంత గుంభనంగా నడుస్తుంది. మూడో అంచెలో జిల్లా ఆర్గనైజరు ఉంటాడు. అతడిని రాష్ట్ర కమిటీ నియమిస్తుంది. జిల్లాలోని పట్టణాల్లో, గ్రామాల్లో ‘సభ’ శాఖలను ఏర్పరచి, అందరితో సత్సంబంధాలు పెట్టుకుని వివిధ కార్యకలాపాలను సమన్వయం చేయటం అతడి బాధ్యత.
చిత్రమేమిటంటే - తమ ధ్యేయాలను, సిద్ధాంతాలను దాచుకోకుండా నౌజవాన్ సభ బాహాటంగానే ప్రచారం చేసినా.. అహింసావ్రతం మాటున ప్రజల పోరాట పటిమను హరించి ప్రజా పీడకులకు గొడుగుపట్టే కాంగ్రెసు, గాంధి విధానాలను మొగమాటం లేకుండా దుయ్యబట్టినా

సైఫుద్దీన్ కిచ్లూ వంటి పలువురు కాంగ్రెసు ప్రముఖులు ఈ ‘సభ’ కార్యక్రమాల్లో సంకోచించకుండా పాల్గొనేవారు. సైద్ధాంతిక విభేదాల మాట ఎలా ఉన్నప్పటికీ విస్తృత స్థాయిలో ప్రజలను చేర్చుకోవడానికి ఈ సభ ఉపకరిస్తుందని వారు తలిచేవారు. కనీసం పంజాబ్ వంటి కొన్ని రాష్ట్రాల కార్యక్షేత్రంలో నౌజవాన్ భారత్ సభకుగల ప్రజాదరణను దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
కమ్యూనిస్టు పార్టీని బ్రిటిషు ప్రభుత్వం కర్కశంగా అణచివేసిన కాలంలోనే విప్లవాన్ని, సోషలిజాన్ని ప్రబోధించే నౌజవాన్ భారత్ సభను భగత్‌సింగ్ బృందం బహిరంగంగా నడిపించగలగటం విశేషం. విప్లవ భావాలను ప్రచారం చేసేందుకు భగత్ ఎప్పటికప్పుడు విలక్షణ కార్యక్రమాలను తలపెట్టేవాడు. తన అభిమాన విప్లవవీరుడైన గదర్ యోధుడు కర్తార్‌సింగ్ ఆత్మబలిదాన దినాన్ని అతడు జరిపిన తీరు ఇందుకో ఉదాహరణ.
లాహోర్‌లోని బ్రాడ్‌లాఫ్ హాల్‌లో సభ. కర్తార్‌కి సంబంధించిన వివిధ జీవిత ఘట్టాలను బొమ్మలు గీయించి, ఎగ్జిబిషన్ పెట్టారు. వాటిని చూడవచ్చిన వారితో హాలు క్రిక్కిరిసిపోయింది. ఎలా సేకరించాడోగాని కర్తార్‌సింగ్ ఫోటోను భగత్ సంపాదించి దాని ఆధారంగా పెద్ద పటం కట్టించాడు. వేదిక మీద దానిని అమర్చి తెల్లటి ఖద్దరు బట్టను కప్పారు. నిర్ణీత సమయానికి భగవతి చరణ్ భార్య దుర్గాదేవి వేదిక ఎక్కి ఆ వస్త్రాన్ని తీసి చిత్రపటాన్ని ఆవిష్కరించింది. హారతి ఇచ్చి, తన వేలినుంచి నెత్తురు తీసి తిలకం దిద్దింది. దాని తర్వాత భగత్ ఉద్వేగభరితంగా, ఉత్తేజపూరితంగా కర్తార్ శౌర్యాన్ని ఉగ్గడించి, యువతరాన్ని ఉర్రూతలూపాడు. అదే విధంగా కాకోరీ కేసులో ఉరికంబమెక్కిన యోధుల సంస్మరణ దినాలనూ భగత్‌సింగ్ కలకాలం గుర్తుండేలా జరిపించాడు.
‘కాకోరీ డే’ని నిర్వహిస్తున్న సమయంలో భగత్‌కి ఇంకో ఆలోచన వచ్చింది. 1915లో లాహోర్ కుట్ర కేసులో ప్రాణాలు బలి పెట్టిన వీరులు ఉన్నారు కదా, వారికి మాత్రం సముచిత సంస్మరణ ఎందుకు వద్దు - అని! వెంటనే బహు ప్రయాసపడి వారి ఫోటోలను ఏదో ఒక విధంగా సంపాదించి వాటి నుంచి స్లయిడులు చేయించాడు. మాజిక్ లాంతరు ఒకటి సమకూర్చుకుని దాని సాయంతో తెర మీద స్లయిడ్లను ప్రదర్శిస్తూ, ఆ వీరుల శౌర్య, త్యాగాన్ని ప్రచారం చేస్తూ అనేక పట్నాల్లో, పల్లెల్లో అతడు లెక్చర్లు ఇస్తూంటే జనం విరగబడేవారు. యువకులు గొప్ప ప్రేరణ పొందేవారు.
చారచక్షువులైన తెల్ల దొరతనానికి భగత్, అతడు పెట్టిన సభ ఎలా కనపడ్డాయి? 9349 నెంబరు ఫైలులో సిఐడిల రహస్య నివేదిక ఇది:

‘1926 వసంతంలో కొంతమంది తీవ్రవాదుల గుంపు ‘యంగ్ ఇండియా అసోసియేషన్ లేక నౌజవాన్ భారత్ సభ’ను ఏర్పరిచారు. ఖద్దరు ప్రచారం, హిందూ - ముస్లిం ఐక్యత తమ ధ్యేయాలని సొసైటీ చెప్పుకుంటున్నది. కాని వారంవారం దాని సమావేశాలు నడిచే తీరు గమనిస్తే దాని నిలువెల్లా విప్లవ భావాలు నిండి ఉన్నాయని స్పష్టమవుతుంది. ఈ సొసైటీని కడు జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలి. విప్లవ కార్యకలాపాలకు దీన్ని రహస్య కేంద్రంగా వాడుకునేందుకు ఆస్కారం ఎంతైనా ఉంది. భగత్‌సింగ్ దీనికి కార్యదర్శి. అతడి ముఖ్య సహచరులందరూ దీనిలో మెంబర్లుగా ఉన్నారు.’

నౌజవాన్ సభ వెనుక దాగిన విప్లవ స్వభావాన్ని పసిగట్టాక బ్రిటిషు పాలకులు జాగు చేయలేదు. దాని రెక్కలు కత్తిరించడానికి చేయగలిగినవన్నీ చేశారు. సదరు సభ అసలు ఉద్దేశాలు అనుమానాస్పదంగా ఉన్నందున మీ కాలేజిల్లో గాని, హాస్టళ్లలో గాని దీనికి సంబంధించిన వారిని చేరదీయకండి. ఏ విధంగానూ ప్రోత్సహించకండి. మీ సిబ్బందిలో ఎవరినీ దీని కార్యకలాపాల్లో పాల్గొననీయకండి. ఈ సూచనను పాటించకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని గ్రహించగలరు -అంటూ లాహోర్ లాంటి అనేక నగరాలూ, పట్టణాలలోని కళాశాలలకు ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక చేసింది. దీంతో నౌజవాన్ సభ ముందుకు సాగటం కష్టమైంది. ముమ్మరమైన పోలీసు నిఘాకు చిక్కకుండా, చట్టానికి దొరకకుండా పని చేయటానికి చాలా అవస్థలు పడవలసి వచ్చింది.
మొదట్లో భగత్‌సింగ్ పంజాబ్, యు.పి., ఢిల్లీ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తిరుగుతూ నౌజవాన్ సభను చక్కగా ఆర్గనైజ్ చేయగలిగాడు. దసరా బాంబు కేసులో అనుమానం మీద తానే అరెస్టు అయి, అతికష్టం మీద భారీ జామీను మీద బయటికి వచ్చిన తరవాత సభ బాధ్యతలు నిర్వహించడం అతడికి మరీ కష్టమైంది. అనుక్షణం తనను ఒక కంట కనిపెట్టి ఉండే పోలీసుల చేతిలో పడకుండా జాగ్రత్త పడుతూ తాను నేరుగా రంగంలో కనపడకుండా, వెనక ఉండి సహచరుల చేత కథ నడిపించేవాడు. అత్యధిక కాలం ఇంటి పట్టునో, లైబ్రరీలోనో ఉండి పాల వ్యాపారం చేసుకుంటూనే నౌజవాన్ సభ దీపం కొడిగట్టకుండా కాపాడటానికి తన శక్తియుక్తులన్నీ కేంద్రీకరించేవాడు. బెయిలు బాధ తప్పి స్వేచ్ఛా వాయువులు పీల్చాక నౌజవాన్ సభ మీద పూర్తిగా కాలం వెచ్చించి బాహాటంగా పని చేయసాగాడు.
ఆ రోజుల్లోనే భగత్‌సింగ్‌కి సోహన్ సింగ్ ‘జోష్’ పరిచయమయ్యాడు. కమ్యూనిస్టు పార్టీని నిషేధించిన తరవాత కమ్యూనిస్టులు స్థాపించిన వర్కర్స్ అండ్ పెజెంట్స్ పార్టీలో ఆయన ముఖ్యుడు. పంజాబ్‌లో ఆ పార్టీ విభాగాన్ని లాహోర్ కేంద్రంగా ‘కీర్తి కిస్తాన్ పార్టీ’ పేర నడుపుతున్నాడు.
ఆ పార్టీ అమృత్‌సర్‌లో నిర్వహించిన జలియన్ వాలాబాగ్ మృతుల సంస్మరణ కార్యక్రమంలో భగత్‌సింగ్ పాల్గొన్నాడు. అతడి విప్లవ దీక్షకు, కార్యదక్షతకు ముగ్ధుడైన సోహన్ సింగ్ తన పార్టీ ద్వారా నౌజవాన్ భారత్ సభకు అండదండలందించాడు. ఆ పార్టీ నడిపే ‘కీర్తి’ (అంటే ‘కార్మికులు’) పత్రికలో భగత్‌సింగ్ కొంతకాలం సబ్ ఎడిటరుగా పని చేశాడు. ‘విద్రోహి’ అన్న కలం పేరుతో చాలా వ్యాసాలు రాశాడు. పేరు లేకుండానూ చాలా వౌలిక రచనలు చేశాడు.
నౌజవాన్ సభకు, కిసాన్ కీర్తి పార్టీకి సోషలిజం సమానాంశం అయినా వాటి తత్వాలు వేరువేరు. భగత్ ‘సభ’కు దేశభక్తి మూలకందం. ఆ కాలంలో సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో యువనేతల్లా సోషలిజం, విప్లవ భావుకత్వం కలగలిసిన పోకడ దానిది. సోషన్‌సింగ్ జోష్ పార్టీ ఏమో సోషలిస్టు రష్యాకు వీర విధేయమైన కమ్యూనిస్టు గుడారం. దానిలో జాతీయత పాలు తక్కువ. అందువల్ల రెండు శిబిరాలూ మనస్ఫూర్తిగా ఎక్కువకాలం కలిసి పని చేయలేకపోయాయి.
పైగా భగత్ కూడా పంజాబ్‌కి మాత్రం పరిమితమై, నౌజవాన్ సభే జీవిత సర్వస్వంగా కాలక్షేపం చేసే రకం కాదు. కాకోరీ కేసు అనంతరం స్తబ్దమైన హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ పార్టీని తిరిగి ఎలా పట్టాలు ఎక్కించాలా అని అతడు చాలాకాలంగా ఆలోచిస్తున్నాడు. కాన్పూరు వగైరా ప్రాంతాల్లోని సహచరులనూ ఈ విషయమై సంప్రదిస్తున్నాడు. తనకంటూ ఒక స్పష్టత వచ్చాక దేశమంతటి నుంచీ విప్లవకారులను కూడగట్టి భవిష్య ప్రణాళిక రూపొందించేందుకు ఆయత్తమయ్యాడు.
ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల గ్రౌండ్‌లో 1928 సెప్టెంబర్ 8, 9 తేదీల్లో భగత్‌సింగ్ ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేశాడు. పంజాబ్, యు.పి., బిహార్, రాజస్థాన్‌ల నుంచి వివిధ విప్లవ గ్రూపులకు చెందిన సుమారు 20 మంది దానికి హాజరయ్యారు. చంద్రశేఖర్ ఆజాద్, రాజగురు, యశ్‌పాల్, భగవతీ చరణ్, జైదేవ్‌గుప్తా, శివవర్మ, జతీంద్రనాథ్ దాస్ ప్రభృతులు వారిలో ఉన్నారు. బెంగాల్ నించి మాత్రం ఏ కారణంవల్లో ప్రాతినిధ్యం లేదు.
ఢిల్లీలో చడీచప్పుడు కాకుండా జరిగిన రెండురోజుల సమావేశం చిన్నదే. కాని భారత విప్లవోద్యమ చరిత్రలో దాని ప్రాధాన్యం పెద్దది. పంజాబ్, యు.పి., బీహార్, రాజస్తాన్‌లలో అప్పటిదాకా విడివిడిగా పని చేస్తున్న గ్రూపులు ఒక్క తాటి మీదికి వచ్చాయి. ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ పునర్వ్యవస్థీకరణ అయింది. చంద్రశేఖర్ ఆజాద్ సెక్యూరిటీ కారణాలవల్ల సమావేశానికి హాజరు కాలేదు. ఆయనను పార్టీకి కమాండర్ ఇన్ చీఫ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భగత్‌సింగ్, సుఖదేవ్, ఆజాద్ సహా ఏడుగురితో కేంద్ర కమిటీ ఏర్పాటైంది. పార్టీ సిద్ధాంతకర్తగా, తెలివితేటలతో అందరినీ కలుపుకుని పోయే సమన్వయకర్తగా భగత్‌సింగ్ అందరి మన్నన పొందాడు.

రహస్య సమావేశంలో భగత్ చర్చకు పెట్టిన అంశాలివి:
1.సోషలిజాన్ని అంతిమ లక్ష్యంగా ప్రకటించాలి.
2.అది అందరికీ తెలిసేట్టుగా పార్టీ పేరును మార్చాలి.
3.ప్రజల అవసరాలూ, సెంటిమెంట్లకు నేరుగా సంబంధంగా ఉన్న కార్యకలాపాలను మాత్రమే చేపట్టాలి. చిన్నాచితకా పోలీసు వాళ్లను, ఇన్ఫార్మర్లను చంపి మన శక్తిని వృధా చేసుకోకూడదు.
4.ఖర్చుల కోసం ప్రభుత్వ సొమ్ము మీదే దృష్టి పెట్టాలి. ప్రైవేటు వ్యక్తుల జోలికి వెళ్లకూడదు.
5.సమిష్టి నాయకత్వ సూత్రాన్ని కచ్చితంగా పాటించాలి.
రెండు రోజులపాటు తీవ్ర తర్జనభర్జనల అనంతరం ఏకాభిప్రాయం కుదిరింది. భగత్ ప్రతిపాదనలు మెజారిటీ వోటుతో ఆమోదం పొందాయి. హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ పేరు ‘హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషను’ (హెచ్.ఎస్.ఆర్.ఎ.)గా మారింది. త్వరలో రానున్న సైమన్ కమిషన్‌ను బహిష్కరించాలని ఏకగ్రీవంగా నిర్ణయమైంది.
భగత్‌సింగ్ జీవితం కొత్త మలుపు తిరిగింది.
*

మేము మళ్లీ పుడతాం
‘అమ్మా నా మనసు నీకు బాగా తెలుసు. నీ కోసం నేను ఏడుస్తున్నానని ఎలా అనుకున్నావు? రేపు ఉరి తీస్తారని ఏడుస్తున్నా ననుకుంటున్నావా? చావంటే నాకు దుఃఖం లేదు. నేతికి నిప్పు సెగ చూపిస్తే అది కరుగుతుంది. అది దానా స్వభావం. భౌతిక సంబంధం వల్ల నిన్ను చూడగానే రెండు మూడు కన్నీటిబొట్లు రాలాయి. అంతే. నా మృత్యువంటే నాకు ఎంతో తృప్తిగా ఉంది’ అంటూ బిస్మిల్ అన్న మాటలు వింటూంటే ఒళ్లు పులకించింది. ఇటువంటి త్యాగధనుల త్యాగాలవల్ల స్వాతంత్య్రాన్ని సాధించుకొని ప్రస్తుతం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామా? అన్న సందేహం కలుగుతోంది.
-పి.కళ్యాణి (సికిందరాబాద్)

ఎం.వి.ఆర్.శాస్ర్తీ