S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జీవితాంతం పెరిగే అనకొండ

అమెరికాలోని అమెజాన్, ఒరినాకో అడవులు, నదీ ప్రాంతాల్లో కన్పించే అనకొండ పాములు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. సినిమాల్లో చూపించినంత భయంకరమైన పాములు కాదుకానీ ఆహారాన్ని ఒక్కసారిగా మింగేయడం వాటికి ఇష్టం. వీటికి విషం ఉండదు. ఆహారంగా భావించే వాటిని చుట్టచుట్టేసి, ఊపిరాడకుండా చంపి మింగేయడం వాటికి అలవాటు. ఎక్కువగా నీటిలోపలే ఉండి రాత్రిపూట ఆహారంకోసం వేటాడతాయి. ప్రతి పదినిమిషాలకోసారి నీటి ఉపరితలానికి వచ్చి కేవలం నాసికారంధ్రాలను మాత్రమే బయటకుపెట్టి గాలి పీల్చి నీటి అడుగుకు వెళ్లిపోతాయి. కనీసం 30 అడుగుల పొడవుండటం వీటి ప్రత్యేకత. పదకొండుమంది పిల్లల బరువుతో సమానంగా ఇవి తూగుతాయి. అడపాదడపా భూమిపై సంచరించినా నీటి అడుగునే కాలక్షేపం చేస్తాయి. వీటిలో అతిపెద్దదైన అనకొండ కన్పించడం చాలా అరుదు. అన్నట్లు మగ అనకొండలకన్నా ఆడవి పెద్దవిగా ఉంటాయట తెలుసా.

స్లైస్‌డ్ బ్రెడ్‌ను నిషేధించారు తెలుసా...
ఔను...ప్రపంచంలో కులమతవర్ణ వివక్ష లేకుండా అన్నివర్గాల వారూ అమితంగా ఇష్టపడి తినే బ్రెడ్ తయారీ ఇప్పటిమాట కాదు. ఈజిప్షియన్లు వీటిని బిసి 2500 సంవత్సరం నాటికే తయారు చేసేవారు. అప్పట్లో దీనిని కరెన్సీగా వాడేవారుకూడా. 1943 ప్రాంతంలో స్లైస్‌డ్ బ్రెడ్‌ను అమెరికాలో నిషేధించారు తెలుసా. అయితే ఎందుకలా చేశారో సరైన కారణంమాత్రం ఇప్పటికీ తెలీదు. అయితే రెండువారాల తరువాత మళ్లీ వాడటానికి అనుమతిచ్చారు. ప్రపంచంలో ఎక్కువగా బ్రెడ్ తినడం ఆంగ్లేయులకు ఇష్టం. ఇప్పటికీ బ్రిటన్‌లో సగటున ఒక్కో పురుషుడు 110 గ్రాముల బ్రెడ్ తింటే అక్కడి మహిళలు సగటున 75 గ్రాముల బ్రెడ్ తింటారు.

ముక్కుల రంగే చెబుతుంది...
‘ట్రూపేరట్స్’ విభాగానికి చెందిన ఈ బడ్జీ (ఒకరకం చిలుకలు) పక్షుల ప్రత్యేకత వేరు. ప్రేమపక్షులుగా చెప్పుకునే ఇవి ప్రస్తుతం ఎన్నో రంగుల్లో కన్పిస్తున్నా వాటి సహజమైన రంగు కేవలం ఆకుపచ్చ మాత్రమే. మిగతా రంగులన్నీ ఆ తరువాత సంకరం చేయడంవల్ల వచ్చినవే. ఆస్ట్రేలియాలో కన్పించే ఈ పక్షులు అతితెలివైనవి. మామూలు రామచిలుకలల్నా వేలాది పదాలను ఇట్టే పలకగలగడం వీటి స్పెషాలిటీ..ఈ పక్షుల్లో ఆడమగా చెప్పడం వాటి ముక్కులవల్లే సాధ్యమవుతుంది. మగపక్షుల ముక్కు పైన నీలిరంగు తురాయిలాంటి భాగం ఉంటే, ఆడపక్షుల ముక్కుపైన గోధుమ రంగులో ఉంటుంది. అన్నట్లు వీటి ముక్కు జీవితాంతం పెరుగుతూనే ఉంటుంది. అందుకే అవి ఆనందం వచ్చినా, ఆందోళనకలిగినా, తీరికదొరికినా ముక్కును రాసిరాసి అరగదీస్తాయి. అందుకే ఎంత పెరిగినా ఎప్పుడూ ఒకేస్థాయిలో వాటి ముక్కు ఉంటుంది.

వెనీలా...ఇలా..
ఆహారపదార్థాలు, పెర్‌ఫ్యూమ్స్, మందులు ఇలా ఎన్నో రకాల పదార్థాలు, వస్తువుల్లో రుచి, వాసనకోసం వాడే వెనీలా...తయారీ ఆషామాషీ కాదు. కేవలం 24 గంటలు మాత్రమే వికసించే ఈ ఆర్చిడ్ జాతి పుష్పం ఆ తరువాత చచ్చిపోతుంది. ఈలోగా ఫలదీకరణం చెందితేనే కాయలు, వాటిలో గింజలు తయారవుతాయి. ఆర్చిడ్ జాతి పూలలో వెనీలా పుష్పాలు మాత్రమే కాయలు, గింజలను ఇస్తాయి. బీన్స్ మాదిరిగా ఉండే ఈ పుష్పాలు ఫలదీకరణం కేవలం ఒకతరహా తుమ్మెదలవల్లే సాధ్యమవుతుంది. ఆ తుమ్మెదలు కేవలం మెక్సికోలోనే జీవిస్తాయి. అందువల్ల చాలాకాలంపాటు వెనీలా సాగులో మెక్సికో గుత్త్ధాపత్యం చెలాయించింది. అయితే ఆధునిక పద్ధతుల్లో రైతులే ప్రత్యామ్నాయ విధానాలతో వెనీలా పుష్పాల ఫలదీకరణం జరిగేలా చేస్తూ వీటిసాగును ఇతర ప్రాంతాలకు విస్తరించారు. బీన్స్ తయారయ్యాక, వాటిలోని గింజలను తీసి, ఉడికించి, ఆరబెట్టి, తరువాత వాటిని మగ్గనిచ్చి, పొడిచేసి వినియోగంలోకి తీసుకువస్తారు. ఇదంతా జరగడానికి రెండునెలలపైనే పడుతుంది. అప్పటికిగానీ వాటికి వెనీలా పరిమళం రాదు. ప్రపంచంలో వెనీలా వాడకంలో అమెరికా అగ్రస్థానంలో ఉంటే ఫ్రాన్స్ రెండోస్థానంలో ఉంది. 19వ శతాబ్దం మొదటివరకు మెక్సికోకే పరిమితమైన వెనీలా ఇప్పుడు భారత్‌తోసహా మరో 20 దేశాల్లో సాగవుతోంది.

-ఎస్.కె.కె.రవళి