S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రాపంచిక ఆసక్తులు తగ్గాలి! (వినదగు.. )

నేను, ఈ ప్రపంచం, నా చేతలు, ఈ ప్రకృతి - ఒక అద్వైత అస్తిత్వం. పైకి ద్వైతంగా అనిపించే అంటే బహుముఖీనమైన అద్వైత తాత్వికత ఈ దివ్యత్వానిది. ఒక్కటే అయిన దివ్యత్వం అనేక తెరగుల మనల్ని కమ్మేయటానికి కారణం మనం ‘అహం’-కరించటమే! మన మనసు చేసే జిమ్మిక్కులన్నీ ఇహానికి చెందిన ఒక అహంలోంచి పుట్టుకొచ్చినవే!
ఒక విధంగా మన అహంభావాన్ని జ్ఞాన విజ్ఞానాలు కాపలా కాస్తుంటాయి. అంటే జ్ఞాన విజ్ఞానాల మన ‘అహం’ విర్రవీగుతుంటుంది. దీంతో ‘స్వ’స్పృహ వెనకబడుతుంటే ‘పర’స్పృహ ముందడుగేస్తుంటుంది. ఇలా ‘స్వ’ తెరమరుగవటానికి ‘పర’ ప్రభావమే కారణం. అందుకే ‘నేను’ ‘నా చేతలు’ ఈ ప్రపంచ, ఈ ప్రకృతి అధీనాలవుతుంటాయి. మనం మనం కాకుండా పోతుంటాం. కాబట్టి మనం ‘్భగవద్గీత’ను కురుక్షేత్రానికే పరిమితం చేయక, కర్మక్షేత్రానికే అంకితం చేయక, కార్యక్షేత్రానికి అనువదించుకోవాలి.
ఇంతకీ గీత అంటే ‘ది సీక్రెట్ ఆఫ్ యాక్షన్’... అది ‘సీక్రెట్ ఆఫ్ ఆల్ లైఫ్ అండ్ ఎగ్జిస్టెన్స్’. ఆత్మకు అస్తిత్వానికి ఉన్న అవిచ్ఛిన్న స్థితిని ఎరుకపరచే రహస్య పొత్తం. ‘సెల్ఫ్’గా మానవాకృతిలోకి వచ్చిన ఆత్మ ‘స్పిరిట్’గా పరిణమించటానికి గల అవకాశాలను ఆవిష్కరించేదే గీత. అంటే ఆత్మ ఆ పరాప్రకృతి లేదా దివ్య అస్తిత్వ అంశనే అని స్పష్టం చేస్తుంటుంది మన కృష్ణగీత. ‘ఆత్మ’ను అనే్వషణగా ఉసిగొల్పి, దార్శనిక బాటన నిలుపుతూ, పరిపూర్ణత్వంలో భాగస్వామిని చేస్తుంది భగవద్గీత. సడలని కార్యాచరణ ఒక్కటే మనల్ని ఈ దివ్యపథాన నిలపగలుగుతుందని పలుతెరగుల స్పష్టపరుస్తుంటుంది ఈ జీవన గీత.
నేను, నా చేతలు ఈ ప్రపంచానికే పరిమితమైనపుడు ఆత్మ లౌకికమే అనిపిస్తుంటుంది.. లౌకిక భోగ మగ్నమవుతుంటుంది. అయితే ఆత్మ తన స్థిర ఆవాసం అలౌకికంలోనే అన్న స్పృహను వీడనంత కాలం ఆత్మవర్తనం భౌగోళిక భోగం వైపుకాక అలౌకిక సుఖం వైపు మగ్నమవుతుంది. అయితే ఆత్మ లౌకికం కావటంలోను, అలౌకికం కావటంలోను ‘మనసు’దే ప్రధాన పాత్ర.
ఇక్కడ మనసు అంటే స్వభావ, ప్రభావాల సమ్మిళితం అని. స్వభావానికి అనుగుణంగా వర్తించటం, ప్రభావాల కనుకూలంగా వర్తించటం మనసు చేసే నర్తనం. అంటే మన కార్యాచరణ స్వభావ జనితమో, ప్రభావ ఫలితమో అయి ఉంటుంది. ఇంద్రియ వశమైనపుడు లౌకిక లాలసత అధికమవుతుంటుంది. ఇంద్రియ నిగ్రహం సాధ్యమైనపుడు అలౌకిక మగ్నత కలుగుతుంటుంది.
ఇంతకీ అలౌకిక మగ్నత ఎలా సాధ్యం అంటే ఆత్మ సంయమ యోగం వల్లనే. మన మనసు మన వశంలో ఉండటమే యోగం తప్ప ‘పరవశం’ యోగం కాదు. ‘పర’వశం కావటమే ఆత్మ సంయమనం. అంటే మన ఆలోచనలు, మన కార్యాచరణలు మన వశంలో ఉంటాయి. అందుకే
‘యదా వినియతం చిత్తమాత్మనే్య వావ తిష్ఠతే
నిస్పృహస్సర్వ కామేభ్యోయుక్త ఇత్యుచ్యతే తదా’
అని అంటాడు గీతాచార్యుడు. అంటే లౌకికమైన, ప్రాపంచికమైన, దేహపరమైన కార్యాచరణలో ‘నియమితం’ కావాలి. ఈ ‘నియమిత’మే మన వశం కావటం. అంటే ఇంద్రియాలన్నీ దైహిక సుఖం వైపు ఆముఖమై ఉండటం కాక ఆంతరికం కావటం ఆత్మానే్వషణ... అప్పుడు కలిగేదే ఆత్మదర్శనం... ఆ పరిణామంలో సంభవించే స్థితే పరిపూర్ణత్వం.
యోగం లేదా ధ్యానం ద్వారా జరిగే అభ్యాసమంతా ఈ ఆంతరంగిక స్థితిని చేరుకోవటమే. యోగ ధ్యాన సాధనలలో తొలుత ఈ అభ్యాసమంతా ప్రయత్నపూర్వకమే అవుతుంటుంది. అయితే సాధనా పక్వతతో ప్రయత్న అవసరం ఉండదు. అభ్యాసం, సాధన సహజ సిద్ధం అవుతుంది. ఇదే ఆత్మసిద్ధి.
ఆత్మసిద్ధితో మన మనసు గాలిలోని దీపంలా చలించదు.
‘యథా దీపో నివాతస్థో నేంగతే సోపమాస్మృతా
యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః’
ఈ శ్లోకంలో ‘యతచిత్తస్య’ అనే పదబంధం యోగ సాధకులకు ఉండవలసిన నిగ్రహ స్వభావాన్ని సంకేతిస్తోంది. అంటే యోగ సాధన ద్వారా మొదట సాధించవలసింది నిగ్రహత్వాన్ని. ఆ నిగ్రహ స్వభావం ఎటువంటిదై ఉండాలంటే గాలిలేని చోట దీపం ఎలా చలించక ఉంటుందో అలా నిశ్చలం కావాలి మనస్సు. దీపాన్ని గాలి తగలని తావుల ఉంచినట్లే ఈ దేహాన్ని కూడా ఆలోచనలు తాకని స్థితికి తీసుకెళ్లాలి. అదీ యోగం అంటే. ఆత్మయోగికి ఆలోచనల తాకిడి ఉండకూడదని కాదు కానీ, ఆ ఆలోచనల తాకిడితో చలింపకుండాలి. ...అంటే ‘స్థితత్వం’ సాధ్యం కావాలి. అంటే మనసుతో కాక ఆత్మతో సంయోగించటమే యోగం. అదే ఆత్మసంయమ యోగం.
సామాన్యంగా - మనం మనసును వశపరచుకోవటం అంటే చిత్తాన్ని జయించటం అని అనుకుంటుంటాం. చిత్తచాంచల్యం లేకుండటం మన స్వభావాన్ని అర్థం చేసుకోవటమే తప్ప సక్సెస్ కాదు. అది స్థితప్రజ్ఞ. చంచల స్వభావం లేకుండటం వల్ల ఇంద్రియ చాపల్యం తగ్గుతుంది. అంటే మానసిక నిగ్రహం వల్లనే ఇంద్రియ నిగ్రహమూ సాధ్యమవుతుంది.
మనసు, ఇంద్రియాలు మన దేహంలో భాగస్వాములే అయినప్పటికీ వాటి నిగ్రహంవల్ల ప్రాపంచిక ఆసక్తులు తగ్గుతాయి. ఆత్మానే్వషణ సాధ్యమై ఆత్మదర్శనం సాధ్యమవుతుంది... ఆత్మదర్శనంతో పరిపూర్ణత్వ పరిణామానికి ఆధారం దొరికినట్లే.

-డా.వాసిలి వసంతకుమార్ 93939 33946