ఆశ నిరాశ
Published Saturday, 28 November 2015ఓ తల్లి గర్భంలో ఇద్దరు కవలలు. బహుశా ఏడెనిమిది నెలలు వారికి ఉండవచ్చు. ఆ రెండు కవలల మధ్య సంభాషణ ఈ విధంగా కొనసాగుతోంది.
‘మనం పుట్టిన తరువాత జీవితం ఉంటుందా?’
‘ఎందుకుండదు? ప్రసవం తరువాత ఎంతో కొంత జీవితం ఉంటుంది. ప్రసవం తరువాత మనం ఎలా ఉండాలో దానికి సన్నద్ధం కావడం కోసమే మనం ఇక్కడ వున్నాం’ జవాబు చెబుతుంది పుట్టబోయే మరో బిడ్డ.
‘చెత్త మాట్లాడకు. ప్రసవం తరువాత జీవితం లేదు. ఇంతకీ జీవితం అంటే ఏమిటి?’
‘నాకు తెలియదు కానీ అప్పుడు చాలా వెలుతురు ఉంటుంది. మన కాళ్లతో మనం నడుస్తాం. మన నోటితో మనం తింటాం’
‘అది పూర్తిగా అర్థరహితం. నడవడం అసాధ్యం. నోటితో తినడం అంటే పరిహాసమే!’ కోపంగా అంటుంది. ఇంకా ఇలా అంటుంది.
‘పేగు ద్వారా మనకు ఆహారం అందుతుంది. పోషక పదార్థాలు వస్తున్నాయి. ప్రసవం తరువాత జీవితాన్ని ఊహించలేం. దాన్ని తీసివేయాల్సి ఉంటుంది’
‘ప్రసవం తరువాత ఏదో ఉంటుంది. ఇక్కడికన్నా వేరుగా ఉంటుంది’ మరో కవల జవాబు ఇస్తుంది.
‘అక్కడి నుంచి ఎవరూ తిరిగి రాలేదు. ప్రసవం తరువాత జీవితం లేదు. జీవితానికి చివరి దశ ప్రసవం. ప్రసవం తరువాత వెలుగు కాదు. అంతా చీకటి ఉంటుంది. ఆరాటం, భయం వెంటాడుతాయి. అవి మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్లవు’
‘నాకేమీ తెలియదు. కానీ ప్రసవం తరువాత మనం మన అమ్మని చూస్తాం. ఆమే మన రక్షణని చూస్తుంది’ జవాబు చెబుతుంది.
‘అమ్మా...! అమ్మని నువ్వు నమ్ముతావా? ఇప్పుడు ఎక్కడుంది ఆమె’
‘ఆమె మన చుట్టూ ఉంది. ఆమెలోనే మనం ఉన్నాం. ఆమె లేకుండా ఈ ప్రపంచం మనకుండేది కాదు’
‘ఆమె నాకు కన్పించడం లేదు. ఆమె లేదు. వాదన కోసం నువ్వు చెబుతున్నావు’ మళ్లీ మొదటి కవల అన్నది.
రెండో కవల ఈ విధంగా జవాబు చెప్పింది.
‘నిశ్శబ్దంగా ఆమెను కొన్నిసార్లు నువ్వు వినవచ్చు. ఆమెను స్పర్శించవచ్చు. ప్రసవం తరువాత వాస్తవం ఉంది. దానికి సంసిద్ధులం కావడమే ఇప్పుడు మనం చేస్తున్న పని’
ఇదీ కథ. ఈ కథలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి పుట్టిన తరువాత జీవితం ఉందా? ఉంటే ఎలా ఉంటుంది. గర్భంలో వున్నదానికన్నా మంచి జీవితం ఉండదని అంటూనే అమ్మని చూడవచ్చు. పుట్టిన తరువాత వాస్తవికత ఉంది అన్న ఓ ఆశ. ఆశా నిరాశల నుంచి ఆశతో కథ ముగుస్తుంది.