S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అలుపెరగని ‘కాఫీ యాత్ర’!

ఉదయానే్న కాఫీ తాగడం చాలామందికి అలవాటే. కానీ, కమ్మటి కాఫీకి బానిసైన ఆ యువకుడు ఎప్పుడు పడితే అప్పుడు ‘కుదిరితే కప్పు కాఫీ’ అంటాడు. రుచికరమైన కాఫీని ఆస్వాదించేందుకు ఎక్కడికైనా వెళుతుంటాడు, ఎంతటి ఖర్చుకైనా ‘సరే’ అంటాడు. కాఫీ తాగితే అద్భుతమైన రుచి ఓ మధురానుభూతిలా ఉండాలంటున్న కేరళకు చెందిన 28 ఏళ్ల బిన్నీ వర్గీస్ దేశవ్యాప్తంగా ఎన్నో కాఫీ షాపులను సందర్శించాడు. వివిధ ప్రాంతాలను చుట్టుముట్టి విభిన్నమైన కాఫీ రుచులను ఆస్వాదించడమే తన జీవిత ధ్యేయమని చెబుతున్నాడు. వేలాది కాఫీ షాప్‌లను సందర్శించాలన్న లక్ష్యంతో బైక్‌పై హిమాలయ యాత్ర ప్రారంభించాడు. వివిధ రాష్ట్రాల్లో విభిన్న పద్ధతుల్లో కాఫీ తయారు చేస్తుంటారని, రుచిలోనూ ఎంతో వైవిధ్యం ఉంటోందని వర్గీస్ తన అనుభవాలను వివరిస్తున్నాడు.
అందరి కంటే భిన్నంగా ఏదో ఒక ప్రత్యేకతను సాధించాలన్న తపన బిన్నీ వర్గీస్‌లో చిన్నప్పటి నుంచే ఉండేది. ట్రావెలింగ్, ఫొటోగ్రఫీ అంటే తనకు మక్కువ ఉన్నప్పటికీ, ‘మంచి కాఫీ’ తన జీవితంలో ఓ భాగమైపోయిందని ఆయన గుర్తుచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే విభిన్న రుచుల కోసం తన అనే్వషణ ప్రారంభమైందంటున్నాడు. ఏ ప్రాంతంలో కాఫీ షాప్‌కు వెళ్లినా కాఫీ తాగడంతోనే అతడు సంతృప్తి చెందడు. కాఫీ తయారీకి సంబంధించిన పద్ధతులను ఆయా ప్రాంతాల వారిని అడిగి తెలుసుకుంటాడు. వివిధ ప్రాంతాల్లో కాఫీ తయారీకి సంబంధించి వివరాలను డాక్యుమెంట్ల రూపంలో, వీడియోల రూపంలో భద్రపరచుకోవడం ఇతనికి ఓ హాబీగా మారింది. తాను ప్రారంభించిన హిమాలయ యాత్ర ఇప్పటివరకూ సగం పూర్తయిందని చెబుతున్నాడు. గుజరాత్‌లో ప్రారంభమైన ‘కాఫీ యాత్ర’ ఇంతవరకూ రాజస్థాన్, హర్యానా, దిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, నేపాల్, బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొనసాగింది.
కాఫీ తయారు చేయడంలో ఎంతో వైవిధ్యం ఉన్నట్లు తన పర్యటనలో తెలుసుకున్నానని, ఆ వివరాలు ఎవరికైనా ఆసక్తిని కలిగిస్తాయని బిన్నీ తెలిపాడు. కాఫీ పొడి ఎలా తయారవుతుందన్న విషయం ఇప్పటికీ కొంతమందికి తెలియక పోవడం తనకు విస్మయం కలిగించిందని అంటున్నాడు. కాఫీ పొడి , రుచికరమైన కాఫీకి సంబంధించి తనకు తెలిసిన వివరాలను ఆయన తన పర్యటన సందర్భంగా స్థానికులకు కూడా వివరిస్తుంటాడు. కాఫీ యాత్రలో కొన్ని ప్రాంతాల్లో భిన్నమైన రుచులను ఆస్వాదించానని, ఒక్కో కాఫీ షాప్ ఒక్కో రుచిని అందించడం వింత అనుభూతిని కలిగించిందని వివరిస్తున్నాడు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లోని సాంగ్లాలో కాఫీ రుచి ఓ మధుర జ్ఞాపకం అంటున్నాడు. సాంగ్లాలో ఓ వృద్ధురాలు నడుపుతున్న కాఫీ దుకాణానికి వెళ్లగా యాలకుల పొడి వేసిన కాఫీ రుచి అత్యద్భుతంగా ఉందని బిన్నీ గుర్తు చేస్తున్నాడు. మిల్క్ పౌడర్‌తో చేసిన పాలలో యాలకుల పొడి కలిపితే విభిన్నమైన రుచి రావడం తనకు ఆశ్చర్యం కలిగించిందని అంటున్నాడు. ఆవుపాలు, గేదెపాలు దొరకని చోట్ల మిల్క్ పౌడర్‌తో కాఫీ చేసినా మధురమైన రుచి వస్తుందని తాను తెలుసుకున్నానని తెలిపాడు.
కాలేజీలో చదువుతున్న రోజుల నుంచి బిన్నీలో కాఫీ పట్ల తపన ఉండేది. అనేక దేశాల్లో పర్యటించినపుడు కూడా మంచి కాఫీ కోసం అనే్వషణ అలాగే కొనసాగింది. సౌదీ అరేబియాలో ‘కొపీ లువక్’, వియత్నాంలో మిల్క్‌మెయిడ్, థాయ్‌లాండ్‌లో ఎలెఫంట్ కాఫీ రుచి పరంగా అసాధారణమైనవి వర్గీస్ చెబుతున్నాడు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కాఫీ షాపులను నడిపే ఓ సంస్థలో పనిచేసినపుడు ఇతని అభిరుచిని సహోద్యోగులు తెలుసుకుని, ‘కాఫీ యాత్ర’కు అండగా నిలిచారు. కాఫీ తయారుచేసే వారి మనోభావాలను సైతం ఇతను గమనిస్తుంటాడు. మంచి కాఫీ ఇవ్వాలన్న తపన ఉన్నపుడు రుచి కూడా భిన్నంగా ఉంటుందని తెలిపాడు. కాఫీని ఇష్టపడేవారు కేవలం డికాక్షన్ మాత్రమే తాగాలన్న అపోహ మన దేశంలో కొందరిలో ఉందని అంటున్నాడు. పాలు లేకుండా, పంచదార కలపకుండా చేసినా కాఫీలో రుచులు ఎన్నో ఉన్నాయంటున్నాడు. వ్యక్తుల ఇష్టాయిష్టాల మేరకు కాఫీని తయారుచేసుకోవచ్చని, అయితే ‘రుచికరమైన కాఫీ’ అన్నదానికి ఎలాంటి హద్దులు లేవని చెబుతున్నాడు. మంచికాఫీ తయారు చేయడానికి తగిన అనుభవం, అవగాహన ఉండాలంటున్నాడు. హోటల్‌కు వెళ్లి ‘కాఫీ కావాలంటూ’ సర్వర్‌కు ఆర్డర్ ఇవ్వడంతోనే సరిపోదని, రుచి గురించి కూడా పట్టించుకోవాలని బిన్నీ సలహా ఇస్తున్నాడు. మన దేశంలో ఇంకా ‘కాఫీ సంస్కృతి’ విస్తృతం కావాలని చెబుతున్న ఈ యువకుడు ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా కాఫీషాపుల్లో 353 రుచులను ఆస్వాదించానని ఒకింత గర్వంగా అంటున్నాడు. బ్లాక్ కాఫీలో వెన్న కలిపి తాగడం గొప్ప అనుభూతిని మిగిల్చిందని వివరిస్తున్నాడు. కేరళకు చెందినప్పటికీ ఇతను ప్రస్తుతం ఉద్యోగరీత్యా బరోడా (గుజరాత్)లో ఉంటున్నాడు. ఈ కారణంగానే ‘కాఫీ యాత్ర’ను బరోడాలో ముగిస్తానని తెలిపాడు. బన్నీ తనను తాను బైక్‌పై ‘బరిస్టా’ (కాఫీ తయారీదారు)గా అభివర్ణించుకుంటాడు. కాఫీ అనే్వషణకు సంబంధించి త్వరలోనే అందరికీ పనికొచ్చేలా ఓ పుస్తకం రాస్తానని తెలిపాడు. కాఫీ తాగుతూ ఆ పుస్తకాన్ని అందరూ చదవాలని కోరుకుంటున్నాడు.