S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శిల్పాల సమాహారం ( పర్యాటకం)

చక్రవర్తులు, రాజులు, సామంత రాజులు, సంస్థానాదీశులు, దేశ్‌పాండేలు తదితరుల నేతృత్వంలో సాగిన పాలనల్లో మెదక్ జిల్లా అల్లాదుర్గం సంస్థానం ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఆయా సంస్థానాల మాదిరిగానే అల్లాదుర్గం సాదాసీదా ఏ మాత్రం కాదు. అనేక ప్రత్యేకతలను సంతరించుకున్న గొప్ప సామ్రాజ్యం. గ్రామంలో ఆధ్యాత్మికత అడుగడుగునా ఉట్టి పడుతోంది. ఈ గ్రామ పరిసరాల్లో ఇళ్లు, ఇతరత్ర నిర్మాణాల కోసం ఎక్కడ నేలను తవ్వినా తప్పకుండా ఏదో ఒక శిల్పం బయల్పడటం పరిపాటిగా మారింది. మొదట్లో గ్రామస్తులు ఆశ్చర్యపోయినా తరతరాలుగా ఇలాంటి తంతే ఉండటంతో మామూలుగా మారిపోయింది. ఇక గ్రామంలో ఎక్కడ చూసినా వందల కొద్ది శిల్పాలు దర్శనమిస్తున్నాయంటే అతిశయోక్తికాదు. తవ్వకాల్లో లభించిన శిల్పాలను తీసుకువెళ్లి ఆయా గ్రామాల్లో ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. మరికొన్ని శిల్పాలు అలాగే గ్రామంలోని వివిధ కూడళ్లు, మందిరాల వద్ద ఆరుబయట వదిలిపెట్టారు. కర్నాటక, మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల నుంచి వందల మంది భక్తులు బేతాళ స్వామి జాతర ఉత్సవాలకు వచ్చి తరించడం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుంది. బేతాళ స్వామి మందిరం గ్రామానికి దక్షిణం దిశలో ఉంది. పునాదులు, గోడల నిర్మాణం లేకుండానే నిలువు, అడ్డం రాతి స్తంబాలపై పైకప్పుగా నిర్మించి బేతాళ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ గుడికి గోపురం కూడా లేదు. వేలు, లక్షల మంది భక్తులు దర్శించుకుంటున్నా దేవాలయాన్ని మార్చకుండా నాటి నిర్మాణాన్ని పరిరక్షిస్తుండటం విశేషం. ఈ మందిరంలో నిర్వహించే ఉత్సవాలకు గ్రామానికి చెందిన దొరల కుటుంబమే నేటికి అన్ని సమకూర్చడం ఆనవాయితి. గ్రామానికి పశ్చిమ దిక్కులో వెలసిన రేణుకా ఎల్లమ్మ దేవి ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో వందలాది మంది భక్తులకు దర్శనమిస్తోంది. జమదగ్ని, రేణుకాదేవి కుమారుడు పరుశ రాముడు తన తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలుపాలని తల్లిని వేధింపులకు గురి చేయడంతో అమ్మవారు పాతాళంలో దాగివున్నట్లు, అక్కడి నుంచి పారిపోతుండగా అడుగుల గుర్తులను బట్టి పరుశ రాముడు వెంబడించినట్లు భక్తులు చర్చించుకోవడం విశేషం. మందిరానికి దక్షిణం దిశగా ఉన్న పెద్ద బండరాయిపై శాసనం సైతం లిఖించి ఉంది. రాతిపై ఉన్న శాసనాన్ని భక్తులు మాత్రం వింతగా చెప్పుకుంటారు. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ కాలజ్ఞానాన్ని రచించారంటూ పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామం నడిబొడ్డున నిర్మించిన వీరభద్ర స్వామి ఆలయం పర్యాటకులను మంత్రముగ్దులను చేసేలా మందిర నిర్మాణం దర్పం పడుతుంది. ఆలయం అంతర్భాగంలో నిర్మాణ శైలీ అత్యంత అద్భుతంగా కనిపిస్తోంది. మందిరంపైకి ఎక్కితే సమాంతరంగా కనిపిస్తుండగా గర్భ గుడిలో ఉన్న వీరభద్ర స్వామి వారికి గోపురం నిర్మించి అందులో ఒక చిన్న శివ లింగాన్ని ప్రతిష్టించారు. ఆలయంలో స్వామి వారికి అభిముఖంగా ఉన్న నంది విగ్రహం శోభాయమానంగా కనిపిస్తుంది. నంది మెడకు చెక్కిన నగషీలు శిల్పకారుడి నైపుణ్యతను చాటి చెబుతుంది. డంగు సున్నంతో రాతి కట్టడం నేటికి చెక్కు చెదరడం లేదంటే నాటి పనుల నాణ్యత ఏమిటో అర్థమవుతోంది. వీరభద్ర స్వామి మందిరానికి కొద్ది దూరంలోనే శ్రీ వీరాంజనేయ శివ పంచాయతన దేవాలయ నిర్మాణం నయానందకరంగా కనిపిస్తోంది. రాతి స్తంభాలకు చెక్కిన శిల్ప సంపద విశేషాన్ని సంతరించుకుని వివిధ పర్యాటక స్థలాలను గుర్తు చేస్తోంది. ఆంజనేయ స్వామిని మద్యస్తమంగా ఐదుగురు దేవతా మూర్తులతో ఈ మందిరాన్ని నిర్మించారు. అల్లాదుర్గంలో హన్మకొండలోని వెయ్యి స్తంభాల మందిరాన్ని పోలిన గుడి ఇక్కడ ఉందని గ్రామస్తులు నేటి విశ్వసిస్తున్నారు.
శిలం కోటగా ఎందుకు పిలుస్తారు?
విశేషమైన శిలా సంపద భూగర్భం నుంచి లభించడం వల్లనే శిలం కోటగా పిలుస్తారని అల్లాదుర్గం గ్రామానికి చెందిన అనుభవజ్ఞుడైన విశ్రాంత ఉపాధ్యాయుడు పూజారి రామకృష్ణ అభిప్రాయ పడుతున్నారు. అజంతా గుహలు, ఎల్లోర శిల్పాలను 9, 11వ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్పారు. ఎల్లోర శిల్పాలకు, తంజావూర్, మదురై మందిరాల నిర్మాణాలకు దగ్గరి పోలికలున్నట్లు స్పష్టం చేసారు. యాదవులు, పల్లవులు, హోయసలలు, ద్రవిడుల పాలనలో మహారాష్టల్రోని బీడ్ జిల్లాలో ఎల్లోర శిల్పాలు, అజంతలోని గుహలను కట్టించిన కాలంలో తమిళనాడుకు చెందిన శిల్పకారులను మహారాష్టక్రు తీసుకువెళ్లినట్లు చెప్పారు. రవాణ వ్యవస్థ అంతంత మాత్రంగా ఉన్న నాటి సమయంలో వందల మైళ్లు కాలినడకతో ప్రయాణించడం వల్ల అల్లాదుర్గం ప్రాంతంలో కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకునేందుకు విడదిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అల్లాదుర్గం పరిసర ప్రాంతం చిన్నపాటి గుట్టలతో ఉండటం, ఇక్కడి గుట్టళ్లో ఉన్న రాళ్లు మెత్తగా శిల్పాలను చెక్కడానికి అనుకూలంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. విశ్రాంతి తీసుకునే శిల్పకారులు ఎల్లోరలో చెక్కాల్సిన శిల్పాల నమూనాలకు ఇక్కడ పదును పెట్టుకున్నారనే ప్రచారం ఉంది. అద్భుతమైన ఎల్లోర శిల్పాల పోలికలే అల్లాదుర్గంలో లభించే శిల్పాలకు కలిగివుండటం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. శిల్పాకారులు తక్కువ కాలం ఇక్కడ బస చేయడం వల్ల 3 నుంచి 4 శాతం శిల్పాలు పూర్తి స్థాయి రూపురేఖలను సంతరించుకోగా మిగిలినవి అసంపూర్తిగా ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శిల్పకారుల రాకపోకల అనంతరం ఇక్కడ గ్రామం ఏర్పాటైనట్లు తెలుస్తోంది. అందుకే శిలల కోట (శిలం కోట)గా నామకరణం చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నేటికి గ్రామస్తులు కోట, పేటగా రెండు ప్రాంతాలను పిలుచుకుంటారు. దొరల భవంతి ఉన్న ప్రాంతాన్ని కోటగా, దక్షిణం వైపు ఉన్న ప్రాంతాన్ని పేటగా పిలుచుకుంటుండటం విశేషం.
అల్లాదుర్గంగా ఎలా మారింది?
యావత్ భారతదేశంపై బ్రిటీష్ వారి పరిపాలనలో ఉన్నా హైదరాబాద్ నవాబులు మాత్రం తాము పాలించే ప్రాంతాలపై వారికి ఆధిపత్యం కల్పించలేదు. నిజాం ప్రభువు తెల్లదొరలకు కప్పం కట్టి తన సామ్రాజ్యాన్ని తానే పరిపాలించుకున్నాడు. స్వాతంత్రం సిద్ధించడానికి కొద్ది సంవత్సరాలకు ముందుగా సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు నాటి నవాబు అలి నవాబ్ జంగ్ బహదూర్ మంజీర నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అదే నిజామాబాద్, మెదక్ జిల్లాల సరిహద్దులో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులను 1923లో ప్రారంభించి 1932లో పూర్తి చేసి నిజామాబాద్ జిల్లాలోని వేలాది ఎకరాలకు సాగునీటిని నేటికి అందిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పనులను పర్యవేక్షించేందుకు నవాబు అల్లాదుర్గం మీదుగా తరచూ రాకపోకలు కొనసాగించే వారు. ఆ సమయంలో అల్లాదుర్గం గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో విశ్రాంతి భవనాన్ని నిర్మించారు. నవాబు విశ్రాంతి తీసుకుంటూ నిద్రలోకి జారుకున్న సమయంలో దేవుడు ప్రత్యక్షమై ‘అల్లా హై దుర్గంమే’ అంటూ వ్యాఖ్యానించినట్లు గ్రామ ప్రజలు చెప్పుకుంటారు. నాటి నుంచి అల్లాదుర్గంగా రూపాంతరం చెందివుండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాల క్రమంగా అన్ని రికార్డుల్లో కూడా అల్లాదుర్గం గ్రామంగా స్థిరపడి ఉండవచ్చు.
కోటకు మరో ప్రత్యేకత
సంస్థానాదీశులు కొలువుదీరిన కోటకు నేటికీ ప్రత్యేకత కొనసాగుతుంది. వందల సంవత్సరాలు ఈకోట నుండి పాలన సాగించిన దొరల భవన నిర్మాణ శైలీ అద్భుతంగా ఉంది. గ్రామీణ వాతావరణంలో ఉన్న ఈ కోటలో సినిమా షూటింగులు కొనసాగుతున్నాయి. విక్టరి వెంకటేష్ నటించిన తులసి సినిమా షూటింగ్ ఏకంగా 32 రోజుల పాటు నిరాటకంగా కొనసాగించారు. సినిమా షూటింగ్‌లకు ఉపయుక్తంగా ఉన్న ఈ భవనం ప్రత్యేకత ఏమిటో అర్థమవుతుంది. తమిళ సినిమా కొరివి, మావూరు, ఇతర డాక్యుమెంటరీలను ఈ అందమైన భవనంలో చిత్రీకరించారు. వెంకటేష్, సుమన్, త్రిష, తమిళ హీరో విజయన్, తమిళ విలన్లు ఈ కోటలో నిర్వహించిన షూటింగులకు హాజరు కావడం విశేషం.

-తమ్మలి మురళీధర్