S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉగాది లక్ష్మి వచ్చిందే

వంచిన తల యెత్తకుండా
దీర్ఘాలోచనలో ఉన్నాడు విరించి
విపంచిపై సరిగమలు పలికిస్తూ
క్రీగంట పతిని గమనిస్తూనే ఉంది పలుకులమ్మ
గతంకన్న మిన్నగా తెలుగు లోగిలి వెలగాలని
మనోగతం వెలిబుచ్చాడు బ్రహ్మయ్య
సతిపతులిద్దరొక్కటిగా
నిశ్చయించారు ‘విలంబ’ని భువికి పంపాలని
కమలభవుని నోట మాట రాగానే
తన పరివారాన్ని సిద్ధం చేశాడు వసంతుడు
హర్షాతిరేకంతో వేగం పెంచాడు మలయానిలుడు
వయ్యారంగా తరుల కన్నియలు
బిడియంతో ఆకులు రాల్చాయి
నవకిసలయమ్ముల నగలు తొడిగి
పరాగముతో సరాగము లాడుతున్నాయి
కోకిలమ్మలు గొంతులు సవరించుకున్నాయి
మధుపమ్ములు పరుగందుకున్నాయి
పూదేనియలు మరింతగా తెచ్చి
మధురిమ నిండిన మధువు నందించాలని
పెద్ద ముత్తయిదువులు ప్రేమను రంగరించి
షడ్రుచుల పచ్చడిని సిద్ధం చేస్తున్నారు
తెలుగువారి మదిలో కొంగ్రొత్త ఆశలు మోసులెత్తగ
అడుగుపెట్టింది ‘విలంబ’ వరాల సుధాకలశమ్ముతో
వచ్చిందే! ఉగాది లక్ష్మి వచ్చిందే!
తెచ్చిందే! సకల శుభమ్ములు తెచ్చిందే!
లోకాస్సమస్తా స్సుఖినో భవంతు.

-టి.రామాంజనేయులు 9963066275