విలంబ సంవత్సర గోచార ఫలితాలు
Published Sunday, 18 March 2018మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 పా):
ఆదాయం-2, వ్యయం -14; రాజపూజ్యం- 5, అవమానం - 7
మేషరాశి వారికి ఈ సంవత్సరం గురువు గోచార రీత్యా అక్టోబర్ 11 వరకు సప్తమంలో సంచరించడం వల్ల సామాజిక అనుబంధాలు విస్తరించినప్పటికీ భాగస్వామ్యాల్లో కొంత శ్రమ తప్పక పోవచ్చు. కార్యనిర్వహణ సజావుగా సాగుతుంది. లాభాలు బాగా ఉన్నా అసంతృప్తి ఉంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది. అక్టోబర్ 11 తర్వాత సంవత్సరాంతం వరకు గురువు అష్టమ సంచారం వల్ల గౌరవ లోపాలకు అవకాశం ఉంటుంది. ధర్మ కార్యాల నిర్వహణ కోసం ఖర్చులు చేయడం మంచిది. కుటుంబ, ఆర్థికాంశాల్లో కొన్ని శుభ ఫలితాలుంటాయి. సౌకర్యాలపై దృష్టి సారించి ప్రయత్నాదులు కొనసాగిస్తారు. ఈ సంవత్సరమంతా శని నవమ స్థానంలో సంచరించడం వల్ల కార్యనిర్వహణలో అసంతృప్తి తప్పక పోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, యాత్రలపై దృష్టి పెట్టడం శ్రేష్ఠం. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వ్యతిరేకతలు అధికంగా ఉన్నా శ్రమతో విజయం సాధించే అవకాశం. మార్చి 8 వరకు రాహువు చతుర్థంలో ఉండడం వల్ల సౌకర్య లోపాలు, తిరగడం తప్పక పోవచ్చు. తరువాత వత్సరాంతం తృతీయ స్థానంలో సంచారం వల్ల ఇతరుల సహకారం లభిస్తుంది. తరువాత వత్సరాంతం వరకు నవమ స్థాన సంచారం వల్ల ఆధ్యాత్మికమైన యాత్రలు, అసంతృప్తి తప్పకపోవచ్చు. ఈ రాశివారు అన్ని కార్యక్రమాల్లో ఆనందంగా గడపడానికి దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, దుర్గాస్తోత్ర పారాయణలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4 పా. రోహిణి, మృగశిర 1,2 పా):
ఆదాయం - 11, వ్యయం -5; రాజపూజ్యం - 1, అవ - 3;
ఈ రాశి వారికి గురువు గోచార రీత్యా అక్టోబర్ 11 వరకు షష్ఠ స్థానంలో సంచరించడం వల్ల పెద్దలతో వ్యతిరేకతలు ఏర్పడతాయి. పెద్దలను గౌరవించడం మంచిది. వృత్తి స్థానంలో శ్రమ ఉన్నా అనుకూలత ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు తప్పకపోవచ్చు. ధార్మిక దానాల వల్ల శ్రేయస్సు, కుటుంబ ఆర్థికాంశాల్లో శ్రమతో అనుకూలత, వివాహాది సంఘటనలకు అవకాశం. అనేక రూపాల్లో లాభాలుంటాయి. ఆత్మ విశ్వాసం, గౌరవం పెంచుకుంటారు. దగ్గర ప్రయాణాల్లో అనుకూలత, పెద్దల సహకారం లభిస్తుంది. శని ఈ సంవత్సరమంతా అష్టమ స్థానంలో సంచరించడం వల్ల అన్ని పనుల్లో ఆలస్యం, బద్దకం పెరగవచ్చు. అనారోగ్య భావనలు బాగా పెంచుకుంటారు. మార్చి 8 వరకు రాహువు తృతీయంలో సంచరించడం వల్ల తిరగడం ఉంటుంది. సహకార లోపాలుంటాయి. ఆ తర్వాత ద్వితీయంలో సంచరించడం వల్ల సంపాదించాలనే కుతూహలం పెరిగి ఏవో పనులు మొదలుపెట్టి కుటుంబంలో ఇబ్బందు తెచ్చుకుంటారు. కేతువు మార్చి 8 వరకు నవమంలో సంచరించడం వల్ల అసంతృప్తి ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలుంటాయి. ఆ తర్వాత అష్టమ స్థాన సంచారం వల్ల ఆరోగ్య లోపాలకు అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలుంటాయి. ఈ రాశి వారు పూర్తి అనుకూలత కోసం దత్తాత్రేయ స్తోత్రం లేదా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయాలి. విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణ కూడా శ్రేయోదాయకం.
మిథునం (మృగశిర 3,4 పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా):
ఆదాయం - 14, వ్యయం - 2; రాజపూజ్యం - 4, అవ -3;
ఈ రాశి వారికి గురువు అక్టోబర్ 11 వరకు పంచమ స్థాన సంచారం వల్ల ఆలోచనలకు రూపకల్పన ఉంటుంది. నూతన కార్యక్రమాలపై దృష్టి, సంతానవర్గ అనుకూలత, సంతృప్తిగా ఉంటుంది. దూర ప్రయాణాలుంటాయి. అనేక రూపాల్లో లాభాలుంటాయి. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అక్టోబర్ 11 తర్వాత వత్సరాంతం వరకు షష్ఠమ స్థానంలో గురు సంచారం వల్ల పెద్దలతో పోటీలు పెరిగి మనస్పర్థలు వచ్చే అవకాశం. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమతో అనుకూలత. అధికారిక వ్యవహారాలుంటాయి. ఉన్నతి కలుగుతుంది. అనుకూలమైన ఖర్చులుంటాయి. ధార్మిక దానాల వల్ల శ్రేయోదాయకం. కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలుంటాయి. శని ఈ సంవత్సరమంతా సప్తమ స్థానంలో సంచరించడం వల్ల భాగస్వామ్యాల్లో ఒత్తిడులు తప్పవు. అనుబంధాల్లో జాగ్రత్త వహించాలి. అసంతృప్తి ఉంటుంది. సౌకర్య లోపాలకు అవకాశం ఉంది. మార్చి 8 వరకు రాహువు ద్వితీయ స్థానంలో సంచారం వల్ల మాట విలువ తగ్గే సూచనలు. కుటుంబ, ఆర్థికాంశాల్లో జాగ్రత్త. తరువాత లగ్నంలో సంచరించడం వల్ల నిర్ణయ లోపాలకు అవకాశముంది. కేతువు మార్చి 8 వరకు అష్టమ స్థాన సంచారం వల్ల అనుకోని సమస్యలకు అవకాశం ఉంది. కాలం, ధనం వ్యర్థం కావచ్చు. తరువాత సంవత్సరాంతం వరకు సప్తమ సంచారం వల్ల స్నేహానుబంధాల్లో లోపాలకు అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు విష్ణుసహస్రనామ పారాయణం, దుర్గాస్తోత్రం, గణపతి ప్రార్థనల వల్ల శుభఫలితాలకు అవకాశం ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4 పా. పుష్యమి, ఆశే్లష):
ఆదాయం - 8, వ్యయం - 2; రాజపూజ్యం - 7, అవమానం - 3;
ఈ రాశివారికి అక్టోబర్ 11 వరకు చతుర్థ స్థానంలో గురు సంచారం వల్ల శ్రమతో సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అనుకోని ఇబ్బందులకు, గౌరవ లోపాలకు అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతికి అవకాశం ఉన్నా శ్రమ తప్పక పోవచ్చు. ధార్మికమైన దానాలు చేయడం వల్ల శ్రేయస్సు. ఆధ్యాత్మిక ప్రయాణాలకు అనుకూలం. అక్టోబర్ 11 నుండి ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ అనుకూలత, అభివృద్ధి, లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత విద్య సంతృప్తిగా గడుపుతారు. అన్ని రూపాల్లో ప్రయోజనాలుంటాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. వ్యవహారాల్లో విజయం. ఈ సంవత్సరం శని షష్ఠ స్థానంలో సంచరించడం వల్ల విజయసాధనపై దృష్టి సారిస్తారు. కార్యక్రమాల నిర్వహణలో అనుకూలత. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటారు. అనుకోని సమస్యలుంటాయి. వ్యర్థమైన ఖర్చులు, కాలహరణం ఉంటాయి. సేవక వర్గ అనుకూలత, సహకారం లభిస్తుంది. రాహువు మార్చి 8 వరకు లగ్నంలో సంచరించడం వల్ల నిర్ణయలోపాలు, వ్యర్థమైన ఆలోచనలు ఉంటాయి. మార్చి 8 తర్వాత ద్వాదశ స్థాన సంచారం వల్ల ఉపయోగరహితమైన ప్రయాణాలు, ఆసుపత్రుల దర్శనం ఉం టాయి. కేతువు మార్చి 8 వరకు సప్తమ స్థానంలో ఉండడం వల్ల భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. మార్చి 8 తర్వాత వ్యతిరేకతలపై విజయం, అనుకూలత లభిస్తుంది. ఈ రాశివారు ఈ వత్సరం దుర్గా, గణపతి, దత్తాత్రేయ స్తోత్రాలను పారాయణం చేయడం వల్ల లోపాలను అధిగమించగలుగుతారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా):
ఆదాయం - 11, వ్యయం - 11; రాజపూజ్యం - 3, అవమానం - 6;
ఈ రాశివారికి ఈ సంవత్సరం అక్టోబర్ 11 వరకు గురువు తృతీయంలో సంచరించడం వల్ల పెద్దల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలకు అనుకూలం. పరిచయాలు విస్తరిస్తాయి. భాగస్వామ్యాల్లో అనుకూలత. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. సంతృప్తి లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అన్ని పనుల్లో లాభాలపై దృష్టి ఉంటుంది. అక్టోబర్ 11 తర్వాత సౌకర్యాదులు, ఆహారంపై దృష్టి పెరుగుతుంది. గృహ, వాహనాలను సమకూర్చుకునే యత్నం. అనుకోని సమస్యలు, ఆర్థిక ఒత్తిడులుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నా శ్రమ తప్పకపోవచ్చు. గుర్తింపు లభిస్తుంది. ధార్మికమైన ఖర్చులుంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలకు అనుకూలం. శని ఈ సంవత్సరం పంచమ స్థానంలో సంచరించడం వల్ల సంతాన విషయాల్లో నిర్ణయాలు ఆలస్యంగా తీసుకుంటారు. సృజనాత్మకత లోపించే అవకాశం. ఆలోచనల్లో ఒత్తిడులు. పిల్లల వల్ల సమస్యలుంటాయి. భాగస్వామ్యాల్లో జాగ్రత్త అవసరం. లాభాలున్నా సంతృప్తి ఉండదు. కుటుంబ ఆర్థికాంశాల్లో జాగ్రత వహించాలి. మార్చి 8 తర్వాత కొంత అనుకూలత. కొన్ని ఊహించని లాభాలుంటాయి. కేతువు మార్చి 8 వరకు షష్ఠంలో సంచారం వల్ల పోటీల్లో విజయం, వ్యవహారాల్లో అనుకూలత ఉంటాయి. ఆ తర్వాత సంవత్సరాంతం వరకు పంచమ స్థానంలో సంచారం వల్ల ఆలోచనల్లో ఒత్తిడులు, సృజనాత్మకత లోపాలుంటాయి. ఈ రాశివారు దుర్గాస్తోత్ర పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, శనైశ్చర స్తోత్ర పారాయణలు చేయడం వల్ల శ్రేయస్సు కలుగుతుంది.
కన్య (ఉత్తర 2,3,4 పా. హస్త, చిత్త 1,2 పా):
ఆదాయం - 14, వ్యయం - 2; రాజపూజ్యం - 6, అవమానం - 6;
ఈ రాశివారికి గురువు అక్టోబర్ 11 వరకు ద్వితీయంలో సంచరించడం వల్ల కుటుంబంలో అనుకూలత, ఆర్థికాంశాలపై దృష్టి, మాటల వల్ల గుర్తింపు కలుగుతుంది. కొన్ని వ్యతిరేకతలు ఇబ్బంది పెట్టినా విజయం వరిస్తుంది. అనుకోని గౌరవ లోపాలకు అవకాశం ఉంది. అనారోగ్య సూచన, రోగనిరోధక శక్తి పెంచుకునే ప్రయత్నం చేయాలి. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులున్నా గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్లుంటాయి. కార్యనిర్వహణలో అనుకూలత ఉంటుంది. అక్టోబర్ 11 తర్వాత తృతీయ స్థాన సంచారం వల్ల దగ్గరి ఆధ్యాత్మిక క్షేత్రాలకు ప్రయాణాలుంటాయి. రచనా వ్యాసంగాలకు అనుకూలం. భాగస్వామ్య, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. అన్ని పనుల్లో లక్ష్యాలను చేరుకునే యత్నం. లాభాలు సంతృప్తినిస్తాయి. పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి. గౌరవం పెంచుకుంటారు. శని ఈ రాశివారికి సంవత్సరమంతా చతుర్థ స్థానంలో సంచారం వల్ల సౌకర్య లోపాలు తప్పక పోవచ్చు. గృహ వాహనాది కొనుగోళ్ల విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యతిరేకతలపై విజయం సాధించే అవకాశం. నిర్ణయాదుల్లో బాగా ఆలస్యం, ఆత్మవిశ్వాస లోపాలుంటాయి. రాహువు మార్చి 18 వరకు లాభస్థాన సంచారం శ్రేయస్కరం. అనేక రూపాల్లో ప్రయోజనాలుంటాయి. తర్వాత సంవత్సరాంతం వరకు వృత్తి సంబంధమైన శ్రమ, గుర్తింపు, బహు కార్యనిర్వహణ భారం ఉంటాయి. కేతువు మార్చి 8 వరకు పంచమ స్థాన సంచారం వల్ల సంతానవర్గ సంబంధమైన లోపాలుంటాయి.
తుల: (చిత్త 3, 4 పా., స్వాతి, విశాఖ 1,2,3పా):
ఆదాయం - 11, వ్యయం - 5; రాజపూజ్యం - 2, అవమానం - 2;
ఈ రాశివారికి గురువు అక్టోబర్ 11 వరకు తమ రాశిలోనే సంచారంవల్ల ఉద్యోగులకు బదిలీలకు అవకాశం. ఆత్మ విశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం. శ్రమతో కార్యనిర్వహణ, విజయం లభిస్తాయి. ఆలోచనలకు అనుకూలం. సంతానవర్గ అభివృద్ధి. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. పరిచయాలు విస్తరిస్తాయి. అన్ని పనుల్లో సంతృప్తి లభిస్తుంది. దూర ప్రయాణాలకు అవకాశం. అక్టోబర్ 11 తర్వాత కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. మాట విలువ పెరుగుతుంది. వ్యతిరేక ప్రభావాలు విస్తరిస్తాయి. తొందరపాటు కూడదు. అనుకోని నష్టాలు, కోల్పోవడాలు, అవమానాలకు అవకాశం. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమతో గుర్తింపు లభిస్తుంది. శని ఈ సంవత్సరమంతా తృతీయ స్థానంలో సంచారంవల్ల సేవక జన సహకారం లభిస్తుంది. సేవాదృక్పథం విస్తరిస్తుంది. ఆలోచనల్లో ఒత్తిడులు. సంతాన విషయాల్లో సమస్యలుంటాయి. వ్యర్థమైన ప్రయాణాలకు అవకాశం. ఆసుపత్రులు, పరామర్శలుంటాయి. రాహువు మార్చి 8 వరకు దశమ సంచారంవల్ల అనేక కార్యక్రమాల నిర్వహణలో తలమునకలు కావడం, శ్రమ తప్పదు. ఆ తర్వాత వత్సరాంతం వరకు నవమ స్థాన సంచారం వల్ల దూర ప్రాంతాలకు, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కేతువు మార్చి 8 వరకు చతుర్థ స్థాన సంచారం వల్ల శ్రమాధిక్యత, సౌకర్య లోపాలుంటాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు దత్తాత్రేయ, గణపతి స్తోత్రాదుల పారాయణంవల్ల శుభ ఫలితాలుంటాయి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ):
ఆదాయం - 2, వ్యయం - 14; రాజ్యపూజ్యం - 5, అవమానం -2.
ఈ రాశివారికి అక్టోబర్ 11 వరకు గురువు వ్యయ స్థానంలో సంచరించడం వల్ల ధార్మికమైన ఖర్చులుంటాయి. గృహ నిర్మాణాదులకు అనుకూలం. దానధర్మాల వల్ల శ్రేయస్సు. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పోటీలు వ్యతిరేకతలను తగ్గించుకోవాలి. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. అనుకోని ఇబ్బందులు, గౌరవ లోపాలకు అవకాశం. అక్టోబర్ 11 తర్వాత కార్యక్రమాల్లో ఒత్తిడులుంటాయి. ఉద్యోగుల బదిలీలకు అవకాశం. శారీరక శ్రమ ఉన్నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు. అలోచనలు విస్తరిస్తాయి. సంతానవర్గ అనుకూలత. భాగస్వామ్యాలు, స్నేహానుబంధాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. అన్ని పనుల్లో సంతృప్తి ఏర్పడుతుంది. శని ఈ సంవత్సరం ద్వితీయ స్థాన సంచారం వల్ల కుటుంబ ఆర్థికాంశాల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు. మాట విలువ కోల్పోయే అవకాశం. సౌకర్య, ఆహార లోపాలుంటాయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. అనారోగ్యాదులకు అవకాశం. అన్ని పనుల్లో జాగ్రత్త. ఊహించని సమస్యలు. కొన్ని లాభాలుంటాయి. పెద్దలతో జాగ్రత్త అవసరం. మార్చి 8 వరకు రాహువు నవమంలో సంచరించడంవల్ల అసంతృప్తి ఉంటుంది. దూర ప్రయాణాలకు అవకాశం. తర్వాత సంవత్సరాంతం వరకు అష్టమ స్థాన సంచారం వల్ల అనుకోని సమస్యలుంటాయి. లోపాలకు, రోగాలకు అవకాశం. కేతువు మార్చి 8 వరకు తృతీయ సంచారం వల్ల సోదరవర్గ అనుకూలత. దగ్గరి ప్రయాణాల్లో శుభపరిణామాలు. తర్వాత వత్సరాంతం వరకు ద్వితీయ స్థాన సంచారం వల్ల మాటల్లో లోపాలు. ఆర్థికాంశాలు, కుటుంబ అనుబంధాల్లో లోపాలుంటాయి. ఈ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం, ఆదిత్య హృదయం, గణపతి ప్రార్థనలు చేసుకోవడం మంచిది.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా):
ఆదాయం - 5, వ్యయం - 5; రాజ్యపూజ్యం - 1, అవమానం -5;
ఈ రాశివారికి గురువు అక్టోబర్ 11 వరకు లాభంలో సంచరించడంవల్ల శ్రమతో లాభాలుంటాయి. వేరువేరు ప్రయోజనాలపై దృష్టి సారిస్తారు. ఇతరుల సహకారం లభిస్తుంది. సోదరవర్గంతో అనుకూలత. దగ్గరి ప్రయాణాలుంటాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ వ్యవహారాల్లో శుభపరిణామాలు. పరిచయాలు విస్తరిస్తాయి. భాగస్వామ్య నిర్వహణలవల్ల మేలు. సౌకర్యాలు విస్తరిస్తాయి. శ్రమతో గృహ వాహనాల కొనుగోలు. వ్యతిరేకతలుంటాయి. పెద్దలతో పోటీలు కూడదు. అనుకోని ఇబ్బందులు, గౌరవ లోపాలకు అవకాశం. అప్రమత్తంగా ఉండాలి. శని ఈ సంవత్సరమంతా తమ రాశిలోనే సంచరించడంవల్ల శని దోషం అధికం. అన్ని పనుల్లో ఆలస్యం ఉంటుంది. నిర్ణయాదులు సమీక్షించుకోవాలి. కార్యక్రమాలన్నీ వాయిదా పడుతుంటాయి. యోగ, ప్రాణాయామాదులు అవసరం. సేవకజన సహకారం లభిస్తుంది. తాము ఇతరులకు సేవాదులు నిర్వహించాలి. పరిచయాలు, భాగస్వామాల్లో లోపాలుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు. శ్రమ అధికవౌతుంది. మార్చి 8 వరకు రాహువు అష్టమ సంచారం వల్ల భాగస్వామ్యాలు, స్నేహాదుల్లో లోపాలుంటాయి. మార్చి 8 వరకు కేతువు ద్వితీయ స్థాన సంచారంవల్ల మాటల్లో నైరాశ్యం ఉంటుంది. ఆర్థికలోపాలు తప్పకపోవచ్చు. తర్వాత వత్సరాంతం సొంత రాశిలో సంచారంవల్ల శారీరక ఒత్తిడులు, అనారోగ్య భావనలు పెరిగే అవకాశం. నిర్ణయలోపాలుంటాయి. ఈ రాశివారు గణపతి, విష్ణు, రుద్ర సంబంధమైన దేవ స్తోత్రాలను పారాయణం చేయాలి.
మకరం: (ఉత్తరాషాఢ 2, 3, 4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా):
ఆదాయం - 8, వ్యయం - 14; రాజపూజ్యం - 4, అవమానం - 5;
ఈ రాశివారికి గురువు అక్టోబర్ 11 వరకు దశమ స్థానంలో సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాదుల్లో గుర్తింపు లభిస్తుంది. శ్రమతో ఫలితాలుంటాయి. అనేక కార్యక్రమాల భారం ఉంటుంది. కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. మాట విలువ పెరుగుతుంది. వాహనాలు, గృహ సంబంధాంశాల్లో శ్రమతో ఫలితాలు సంభవం. పెద్దలతో వ్యతిరేకతలు కూడదు. పోటీల్లో ఓటమికి అవకాశం. అక్టోబర్ 11 తర్వాత లాభస్థాన సంచారం వల్ల అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. పెద్దల శుభాశీస్సులుంటాయి. సంతానవర్గంతో ఉత్సాహం. పరిచయాలు విస్తరిస్తాయి. భాగస్వామ్యాల్లో శుభపరిణామాలు. వివాహాదులకు అనుకూలం. శని ఈ సంవత్సరమంతా 12వ స్థానంలో సంచరించడంవల్ల అనవసరమైన ఖర్చులుంటాయి. నిద్రపట్టక పోవచ్చు. ఆసుపత్రుల్లో పరామర్శలుంటాయి. వ్యర్థమైన ప్రయాణాలకు అవకాశం. కుటుంబంలో, ఆర్థిక నిర్వహణలో ఇబ్బందులు అధికం. వ్యతిరేకతలను అధిమిస్తాయి. పోటీల్లో విజయం. అసంతృప్తి, ఆధ్యాత్మిక వ్యవహారాల్లో అనుకూలత. మార్చి 8 వరకు రాహువు సప్తమ స్థానంలో సంచారం వల్ల పరిచయాలు ఇబ్బంది పెట్టే అవకాశం. అనుబంధాల్లో జాగ్రత్త అవసరం. తర్వాత వత్సరాంతం వ్యతిరేకతలపై విజయం. పోటీల్లో గెలుపునకు అవకాశం ఉంది. కేతువు మార్చి 8 వరకు సొంత రాశిలో సంచారం వల్ల కొంత నిరాశ తప్పక పోవచ్చు. నిర్ణయాదుల్లో జాగ్రత్త వహించాలి. తర్వాత సంవత్సరాంతం వ్యయ స్థాన సంచారం వల్ల అనవసరమైన ఖర్చులుంటాయి. కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు అధికం. ఈ రాశివారు గణపతి స్తోత్రం, శని స్తోత్రం, రుద్రాభిషేకాలు నిరంతరం నిర్వహించుకోవడం శ్రేష్టం.
కుంభం: (్ధనిష్ట 3, 4 పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పా):
ఆదాయం - 8, వ్యయం - 14; రాజపూజ్యం - 7, అవమానం -5;
ఈ రాశివారికి గురువు అక్టోబర్ 11 వరకు నవమ స్థాన సంచారం వల్ల అత్యంత సంతృప్తిగా ఉంటుంది. ఆధ్యాత్మిక జీవనానికి అనుకూలం. ధార్మిక కార్యక్రమాలుంటాయి. నిర్ణయాదుల్లో శుభపరిణామాలు. స్పష్టత అధికం. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. పెద్దల సహకారం, సోదర వర్గ అనుకూలత ఉంటాయి. మనోభీష్టాలు నెరవేరుతాయి. నూతనమైన కార్యక్రమాలకు రూపకల్పన. అక్టోబర్ 11 తర్వాత వృశ్చిక రాశి సంచారం వల్ల వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమతో గుర్తింపు. అధికారిక వ్యవహారాల్లో ఒత్తిడులతో విజయం. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్త వహించాలి. మాట విలువ పెరుగుతుంది. సౌకర్యాలు సమకూర్చుకునే యత్నం. వాహనాలు, గృహాదులపై దృష్టి పరిచయాలు, భాగస్వామ్యాలు విస్తరిస్తాయి. అనుబంధాల్లో కొంత జాగ్రత్త వహించాలి. శని ఈ సంవత్సరం 11వ స్థానంలో సంచరించడంవల్ల అన్ని రకాలైన లాభాలపై దృష్టి ఏర్పడుతుంది. నిర్ణయాదులను సమీక్షించుకోవాలి. ఆలస్యాదులకు అవకాశం. వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. ఆలోచనల్లో ఒత్తిడులు, సంతానవర్గ సమస్యలు, అనుకోని ఇబ్బందులకు అవకాశం. ఆరోగ్య లోపాలు. రాహువు మార్చి 8 వరకు షష్ఠ స్థాన సంచారం వల్ల వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు. పోటీలు ఒత్తిడులున్నా వ్యవహారానుకూలత. తర్వాత వత్సరాంతం సప్తమ స్థాన సంచారం వల్ల పరిచయాలు, భాగస్వామ్యాల్లో సమస్యలకు అవకాశం. స్నేహానుబంధాల్లో లోపాలు. కేతువు మార్చి 8 వరకు వ్యయస్థాన సంచారంవల్ల ఖర్చులుంటాయి. కాలం ధనం వ్యర్థం అవుతాయి. నిద్రలోపాలు. తర్వాత సంవత్సరాంతం వరకు లాభస్థాన సంచారం అన్ని పనులకు అనుకూలం. ఈ రాశి వారు ఈ సంవత్సరం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, గణపతి ప్రార్థన, దుర్గాపూజలు నిర్వహిస్తూ ఉండడంవల్ల శ్రేయోదాయక ఫలితాలుంటాయి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరభాద్ర, రేవతి):
ఆదాయం - 5, వ్యయం - 5; రాజపూజ్యం - 3, అవమానం - 1;
ఈ రాశివారికి గురువు అక్టోబర్ 11 వరకు అష్టమస్థాన సంచారంవల్ల అనుకోని సమస్యలుంటాయి. గౌరవ లోపాలకు అవకాశం. అన్ని పనుల్లో అప్రమత్తంగా మెలగాలి. ఖర్చులు, ప్రయాణాలు అధికం. కాలం వ్యర్థమయ్యే సూచన. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలం. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత అనుకూలత. మాటవిలువలో లోపాలుంటాయి. సౌకర్యాలకోసం తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఆశించిన సౌఖ్యం అందక పోవచ్చు. అక్టోబర్ 11 తర్వాత నవమ స్థాన సంచారం వల్ల అన్ని పనుల్లో అనుకూలత. ప్రయాణ లాభాలు, సంతృప్తి లభిస్తాయి. దైవదర్శనం లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. సోదర వర్గ అనుకూలత. పెద్దల సహకారం లభిస్తుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు. సృజనాత్మకతతో కార్యనిర్వహణ. శని ఈ సంవత్సరమంతా దశమ స్థానంలో సంచారం వల్ల వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు. అధికారులతో జాగ్రత్త అవసరం. బాధ్యతలు ఇబ్బంది పెడతాయి. ఖర్చులు, వ్యర్థమైన ప్రయాణాలు, ఆసుపత్రుల్లో పరామర్శలు తప్పకపోవచ్చు. సౌకర్య లోపాలు, వాహన, గృహ పరమైన ఇబ్బందులు. భాగస్వామ్య సమస్యలుంటాయి. మార్చి 8 వరకు రాహువు పంచమ స్థాన సంచారం వల్ల సృజనాత్మకత ఉంటుంది. తొందరపాటు లేకుండా వ్యవహరించాలి. తర్వాత వత్సరాంతం వరకు చతుర్థ స్థాన సంచారం వల్ల శారీరక, మానసిక ఒత్తిడులు అధికం. కేతువు మార్చి 8 వరకు లాభస్థాన సంచారం అన్ని పనుల్లో లాభం, శుభప్రదం. తర్వాత వత్సరాంతం వరకు వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ ఒత్తిడులు అధికవౌతాయి. ఈ రాశివారు నిత్యము దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా అనుకూలత.