S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మాతో-మీరు - కథ

కథ
‘దాగుడుమూతలు’ కథ - త్రికరణశుద్ధిగా నమ్మి కొలిచే భక్తులను ఆ భగవంతుడు తప్పక ఆదుకుంటాడనీ, వారి బాగోగులను తనే స్వయంగా చూసుకుంటాడన్న అద్భుత సత్యాన్ని చక్కగా ఆవిష్కరించింది. ఆత్మానే్వషణ కోసం ప్రాపంచిక ఆసక్తులు తగ్గించుకొని అంతర్ముఖం కావాలన్న సందేశాన్ని ‘వినదగు’లో చక్కగా వివరించారు. ఆత్మ సంయమ యోగంపై ఇంతటి అద్భుతమైన, విభిన్నమైన వివరణ ఇంతవరకూ చదవలేదు.
-ఎం.కనకదుర్గ (తెనాలి)
భగత్‌సింగ్
ఈ వారం భగత్‌సింగ్ సీరియల్‌లో బిస్మిల్ వీరోచిత గాథను చదివి భావోద్వేగానికి గురయ్యాం. పిరికితనాన్ని కలలో కూడా రానియ్యక చివరి వరకు సాహసోపేత పోరాటం ద్వారా తెల్లదొరలను వణికించిన బిస్మిల్ దేశభక్తి యావత్ దేశానికి స్ఫూర్తిదాయకంగా ఉంది. ఉరికంబం ఎక్కే ముందు కంటతడి పెట్టుకున్న బిస్మిల్‌ను చూసి ఆ తల్లి పలికిన పలుకులు మా హృదయంలో శాశ్వతంగా ముద్రించుకుపోయాయి. ఈ సీరియల్ ద్వారా నిద్రాణమై ఉన్న దేశభక్తిని మేల్కొలిపేందుకు శాస్ర్తీగారు చేస్తున్న ప్రయత్నం అసామాన్యం.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)
ఆస్కార్
సినీ జనాల్లో... అందరినీ ఊరించే అవార్డు.. ఏ కొద్దిమందినో వరించే పురస్కారం.. ఆ అవార్డు కోసం పరితపించే నటులు ఒకవైపు.. పురస్కార ప్రదానోత్సవాన్ని చూసేవారు మరోవైపు.. ఊపిరి బిగబట్టి ఎదురుచూసే ఆ క్షణాన్ని చక్కటి మాటల్లో పొందుపరిచారు ‘ఆస్కారమెవరికి?’లో. అలాగే ‘అవీ-ఇవీ’ లో సంగతులు బాగుంటున్నాయి.
-పట్నాల సూర్యనారాయణ (రాజమండ్రి)
ఆజ్ పహెలీ...
‘ఓ చిన్న మాట’లో జీతాల రోజుని వర్ణించిన తీరు బాగుంది. ఆజ్ పహెలీ తారీఖ్ హై.. అన్న పాటని ఉదయం ఏడున్నర ప్రాంతంలో ప్రసారం చేసేవాళ్లు. నిజంగా ఆ రోజులే వేరు. ముప్పై రోజులు కష్టపడినందుకు జీతం ఇచ్చారు అన్న అనుభూతి లేకుండా పోయిందన్నది వాస్తవం. ఆ రోజు మొదటి తేదీ అని ఉత్సాహపరిచే పాట విన్పించకుండా పోయింది. అలాగే ఈ-28 కూడా మమ్మల్ని గతంలోకి తీసుకెళ్లింది.
-గుండు రమణయ్య (పెద్దాపూర్, కరీంనగర్)
లోకాభిరామమ్
వారం వారం మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శీర్షిక ‘లోకాభిరామమ్’. ‘ప్రయాణంలో పద్ధతులు’ గురించి చెబుతూంటే నవ్వొచ్చింది. ఆయనతోపాటు విజయవాడ ప్రయాణం మేం కూడా చేసినట్టనిపించింది. ఆదివారం అనుబంధంలో మినీ వీక్లీలా ఉంటుంది. ఆయా వయస్సుల వారికి తగ్గట్టు ఒక్కో శీర్షికను చక్కగా నిర్వహిస్తున్నారు. సిసింద్రీలో స్ఫూర్తి కథ చిన్నారులకు స్ఫూర్తిదాయకంగా ఉంటోంది.
-మార్టూరు అజయ్‌కుమార్ (రామచంద్రాపురం, గుంటూరు జిల్లా)
క్రైం
కారులో పోతున్నప్పుడు రోడ్డుపక్కన శవం కనిపించినా మనం పట్టించుకోం. కానీ క్రైం కథలో మనిషి తలను నోట కరచుకొని పారిపోయిన కుక్కను చూసి పోలీసులకు రిపోర్టు చేయాలా వద్దా అని అమెరికన్ జంట పడిన గుంజాటన బాగా వివరించారు. కథ ముగింపు ఊహాతీతంగా ఉండి అలరించింది. ‘వినదగు’ అంటూ ప్రాపంచిక ఆసక్తులు తగ్గించుకోవాలని చెప్పిన వ్యాసం బాగుంది. కాని పాటించేది ఎందరు? ఆస్కార్‌ల గురించి చక్కగా వివరించారు. మన వారికి ఆస్కార్‌లు రావడం లేదని బాధ ఎందుకు? మనకు మన జాతీయ అవార్డులున్నాయి కదా. వారికి ఆస్కార్ ఎంతో మనకు జాతీయ అవార్డు అంత!
-బి.సోనాలి (సూర్యారావుపేట)
అవీ-ఇవీ
స్లైస్డ్ బ్రెడ్‌ని నిషేధించి మళ్లీ అనుమతించడం, జీవులలో కొంత కాలానికి ఆగిపోయే పెరుగుదల అనకొండ విషయంలో జీవితాంతం కొనసాగడం ఆశ్చర్యమే. చిలుకలు, వెనీలా గురించి చెప్పిన విషయాలు ఆకట్టుకున్నాయి. ‘సండే గీత’ రచయిత 30 ఏళ్ల క్రితం ఉండి చదువుకున్న గది అనుభూతులు చెప్తూంటే అక్కడి విద్యార్థులతోపాటు మా హృదయాలూ కదిలిపోయాయి. మంచి అనుభూతినిచ్చాయి.
-సదాప్రసాద్ (గొడారిగుంట, తూ.గో.జిల్లా)
సిసింద్రీ
ఫిబ్రవరి 28, ఆదివారం అనుబంధంలో ‘సిసింద్రీ’ శీర్షికన ప్రచురించిన ‘మేలుకు మేలు’ కథ చాలా బాగుంది. సహాయం పొందడమే కాక, చేయడమూ నేర్చుకున్న వాడే మనిషి అనే చక్కటి నిజాన్ని తెలియజేశారు. ఈ వారం స్పెషల్ ‘ఆస్కారమెవరికి?’ అంటూ ఏటా ఫిబ్రవరి 28న జరిగే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని గూర్చి ఎన్నో విషయాలు తెలుసుకొన్నాం.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)
కథల బడి
‘లోకాభిరామమ్’లో కొత్తగా కథలు రాయడంకన్నా అనువాదాలు చేయడమే బాగుంటుందన్న అభిప్రాయంతో కథకులు పూర్తిగా ఏకీభవించకపోవచ్చు. ప్రపంచంలో కథల మూలం ఒకటే అయినా అవి చెప్పే విధానంలో సామాజిక మార్పులను అన్వయిస్తూ రాసే కథలకు కాళ్లు రావంటారా? ఇన్‌డెసిషనే మూలంగా షేక్స్‌పియర్ హామ్లెట్‌ను రాస్తే - దాని భావానే్న ‘టుబి ఆర్ నాట్ టుబి’ అని గోపాలంగారు ముగించారు. సండే గీత సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను బోధించగా, రాయగలిగినంత కాలం రాస్తూనే ఉండాలని ప్రతిభ ప్రతిపాదించింది.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)