S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాసక్రీడ శృంగారం కాదా? (రాస క్రీడాతత్త్వము)

ఇది శ్రీమద్భాగవతానికి గుండెకాయ వంటి ఘట్టం. అనేక మంది కవులూ, గాయకులూ, భక్తులూ ఈ ఘట్టానే్న పెంచి పెంచి చిలవలు పలువలుగా కథలల్లి, భక్తిరస తన్మయులై ధన్యులైనారు.
కానీ, సరీగా తత్త్వం గ్రహించని కొందరి కవులవల్లా, సినిమాలవల్లా, టీవీలవల్లా, కృష్ణుడు జారుడనే అపప్రద వచ్చిన ఘట్టం కూడా ఇదే.
శ్రీకృష్ణుడు యమునా తీరంలో గోపికలందరితో కలిసి, యథేచ్చగా క్రీడించాడనేది పామరుల దృష్టిలోని కథ. ఈ పామర దృష్టిని సవరించడం కోసమే లీలాశుకుడు కృష్ణకర్ణామృతంలో ఇలా అన్నాడు.
జగదాదరణీయ జారభావం
జలజాపత్యవచోవిచారగమ్యమ్
తనుతాం తనుతాం శివేతరాణాం
సురనాథోపల సుందరం మహు నః ॥
(శ్రీకృష్ణ కర్ణామృతము, శ్లో-17)
(్భవం : ఇంద్రనీల మణికాంతులను వెదజల్లే సుందరమైన తేజస్సు ఒకటి ఉంది. ఆ జ్యోతి జారత్వం చేస్తూ ఉంటుంది. కానీ, ఆ జారత్వం లోకాల న్నిటికీ ఆదరణీయం. ఆ జ్యోతి ఎవరో తెలియాలంటే వేదాంతవాక్యాలను బాగా విచారణ చేయాలి. అట్టి ఆ జ్యోతి మా అశుభాలను తొలగించుగాక.)
ఈ రోజుల్లో శ్రీమద్భాగవతంలోని రాసక్రీడా ఘట్టాన్ని గురించి అనేకమంది అనేక ప్రశ్నలను గుప్పిస్తూనే వున్నారు. అనేకమంది పురాతన వ్యాఖ్యాతలు ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పే వున్నారు. అయినా, ఆ విమర్శ్ఱలోకి పోవలసిన అవసరం లేదు. భాగవతంలో ఏమి వుందో, దాన్ని జాగ్రత్తగా చదువుకుంటే చాలు. అన్ని సందేహాలూ తొలగిపోతాయి. అయితే చదివే విధానం చేతకావాలి.
శ్రీమద్భాగవతంలో ఈ ఘట్టం మొత్తానికి ‘‘పంచాధ్యాయి’’ అని ప్రసిద్ధి. దశమస్కంధంలో 29వ అధ్యాయం నుంచీ ఈ ఘట్టం ప్రారంభమవుతుంది. ఈ పంచాధ్యాయిలోని ఒక్కొక్క శ్లోకానికీ రోజుల తరబడి వ్యాఖ్యానం చేసే విధానం ఇప్పటికీ ఉత్తరదేశంలో వుంది.
భక్తి విధానాలలో ‘‘మధురభక్తి’’ అని ఒక విధానం వుంది. రాసక్రీడా కథలోకి వెళ్ళే ముందు, ఈ మధురభక్తిని గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. పరమ విరహభక్తినే మధురభక్తి అంటారు. దీని గురించి ఈ ఘట్టం చివరిలో స్వయంగా శుకమహర్షి వివరించాడు. అక్కడ ఆ వివరాలన్నీ చెప్పుకోవచ్చు. సంగ్రహంగా ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకోండి.
జీవులందరూ స్ర్తిలే. ఈ జీవులు పురుషులలోనూ, స్ర్తిలలోనూ, వున్నా కూడా స్ర్తిలే. పరమాత్మ ఒక్కడే పురుషుడు. ఆయనే జీవులందరికీ భర్త. ఆయనలో ఐక్యం కావటమే సంయోగం. ఆ సంయోగానికై పరితపించాలి. ఈ పరితాపం పేరే మధురభక్తి.
కామవిజయ ప్రదర్శన :- లోకంలో భక్తి మార్గాలు అనేకం వున్నాయి. అన్ని మార్గాలూ చేర్చే గమ్యం ఒకటే అయినా, అన్ని మార్గాలూ అందరికీ సరిపోవు. ఒకరి మార్గం అపమార్గమని తేల్చి నిందించడం, ఏ మార్గంలోనూ లేనివారు మాత్రమే చేస్తారు. మధురభక్తికి పరాకాష్టదీ వంటిదైన ఈ ఘట్టాన్ని ప్రవేశపెట్టడంలోనూ, ముగింపు చేయటంలోనూ కూడా, వ్యాసభగవానుడు ఒక అపూర్వమైన శైలిని ఉపయోగించాడు. ఎలాగంటే-
(జ) ఈ ఘట్టాన్ని ప్రవేశపెట్టడం శృంగారమయంగా ప్రవేశపెట్టాడు. కానీ, ప్రప్రథమంలోనే ‘‘్భగవంతుడు ఇలాంటి శృంగార చేష్టలు చెయ్యవచ్చునా?’’ అని ఒక ప్రశ్నను పరీక్షిత్తు ద్వారా లేవనెత్తాడు. లేవనెత్తి కూడా ఆ ప్రశ్నకు శుకమహర్షి ద్వారా తృప్తికరమైన సమాధానం చెప్పించలేదు.
(ఇంకా వుంది)

- కుప్పా వేంకట కృష్ణమూర్తి.. 9866330060