S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వెన్నముద్దలలో...

అది బృందావనము. వన రాజముల తలదన్ను సౌభాగ్యమొందిన రాణి వనము.
వురవళ్ల పరవళ్ల యమున
తా తగ్గి కదలని తరంగములే
కనులై నలు దిక్కుల చూచు చుండెను
గోపికలు తెచ్చిన నీటి కుండలు అదేమి చిత్రమో గాని నీటిలో మునిగి వుండీ ఎంతవరకూ నీరు నింపుకోవాయే.
భానుడు, నేనింక రాకుండా ఉండలేను, మీ స్నానాదికములు కానింపుము త్వరపడి యన్ననూ కదలరాయే భామలు.
గోప బాలురూ పశుసంపద
తోనొచ్చి అల్లంత ఎడమున వేచి వుండిరి, వీరు వెడలవలే, వారు రావలె కదా...
బలరాముడునూ తమ పాడియావులతో వొచ్చెను.
మరి... మరి..
మురళీ కృష్ణుడు ఏడి.
ఏడీ ఆ మువ్వగోపాలుడు..
ఆ ముగ్ధ మోహనుడు ఏడీ..
ఏడీ, ఏడీ, యెచ్చట..
ప్రకృతి, పశువులు, పడతులు, పొద్దుగూకులూ తోడు వుండు స్నేహితులు...
అందరూ వేచి నది మరి ఆ ముఖారవిందము చూసి మురియుటకే నాయే..
అసలే, నల్లని వాడు ఆయే, యే చెట్టు నీడలో నక్కి దాక్కున్నాడో..
ఇంతలో, సన్నగా, లీలామాత్రంగా వేణు రాగం. ఎప్పుడూ మనస్సును బ్రహ్మ లోకాలకు కొంపోయి విహరింప జేసి ఆ వేణు నాదం ఈ పూట ఎందుకో కంటనీరు పెట్టిస్తోంది.
ఒక్క ఉదుటున లేచారు అందరూ తాము వున్న చోటు నుంచి..
ముందుగా నుంచుని వున్నవారు.. వారికన్నా ముందుగా వేగంగా లేగదూడలూ.. వీరందరితోపాటు యమునా తన ప్రవాహ దిక్కుని కదల్చటానికి శ్రమ పడుతోంది.
చెట్ల కొమ్మలు, ఆకులూ అటు దిశగానే..
పైన నుంచి ఈ విచిత్రం చూసిన దేవేంద్రుడు, ఇది యేమి వైపరీత్యం, అదీ తను నిర్దేశించింది కాదు, తనకు తెలియకుండా ఎలా జరుగుతోంది ఇలా, అని సంభ్రమపడుతూ దేవతలకు, బ్రహ్మకు, పరమేశ్వరునికి అందరికీ, ఈ వనంలో ఇక్కడ అద్భుతం ఏదో జరుగుతోంది, మన సృష్టికి విరుద్ధంగా అంటూ కబురు చేశాడు.
‘నారాయణ, నారాయణ’ అంటూ నారదుడు భూమి వైపు కదిలాడు. త్రికాల జ్ఞానిని ననే్న మాయ చేస్తున్నావు, యేమి ప్రభూ’ అనుకుంటూ...
అక్కడ ఆ బృందావనిలో..
అఖిల ప్రకృతి, పశు పక్ష్యాదులు, గోపికలు, గోప బాలురు.. ఎందుకో తెలీదు కంటనీరు, వేణునాదం వినిపించిన వైపు పరుగు...
ఇంకో విచిత్రం.. అటు పల్లెలో వున్న వారికి ఎవరికీ తెలీదు. ఇక్కడ ఈ యమునా తీర ప్రాంతం వైపున యేమి జరుగుతోందో..
పసిపిల్లలకు అద్దం చూపించరు సాధారణంగా. పళ్లు రావనో ఏమో ఓ నమ్మకంతో. ఫలితంగా ఆ పసి ప్రాణికి తన ఆకారం అసలు తెలీదు. ఎలా వుంది, యే పరిమాణంలో వుంది అని.
కానీ ప్రక్కనే ఇంకో పసి ప్రాణిని వుంచండి. ఎంత తొందరగా వారు ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులయ్యి, స్నేహితులు అవుతారో..
అదే పిల్లలు కాక పెద్దవారు అంటే అంత తొందరగా చొరవ తీసుకోరు..
ఎందుకు.. పరీక్ష చేసి, గమనించి చూడండి, దీనిలో నిజానిజాలు..
పైన చెప్పింది సబబు అని అంగీకరిస్తే, కారణం ఏమిటీ అని ప్రశ్నించుకుంటే, బ్రహ్మ జ్ఞానం కలగటం అక్కడ మొదలవుతుంది.
పాప పుణ్యాలు అనేవి తెలీని ప్రాణులు దైవ సమానులు. దైవం ఇంకో దైవంతో ఎప్పుడూ సన్నిహితమే.. అదే జ్ఞానం ఏర్పడుతూ, కొద్దికొద్దిగా ఈ ప్రపంచంలోకి వస్తున్న కొద్దీ ఆ దైవత్వం కనుమరుగు అయి, సిగ్గు, బిడియం వగైరాలు ప్రారంభం అవుతుంది.
ఓ ఆరేడు అడుగుల ఎత్తు బండరాయి మీద కూర్చుని ఉన్నాడు కృష్ణయ్య, జగన్నాటక సూత్రధారి.
ఇంకా ఉదయించని బాలభానుడి ఎరుపుతనం తన బుగ్గల్లో నింపుకుని.
మిగతా వదనం మామూలుగా, ప్రకృతిలోని శోకం ఆ వదనంలో మచ్చుకూ లేదు. అలా ఆగి ఆగి ఓ చిన్న రాగం వినిపిస్తున్నాడు, వేణువుపై.
ముందు అక్కడకు చేరుకున్న లేదూడలు, ఓ క్షణం ఆ కృష్ణయ్యను చూసి, యేమీ పట్టనట్లు, అటూ ఇటూ తిరుగుతూ, చిన్నచిన్న గడ్డి పరకలను కొరుకుతూ వుండిపోయినయి. ఆ బండరాయి ఎదురుగా మోకాళ్ల మీద కూర్చుని దీక్షగా ఆ మొహం వైపే చూస్తున్నాయి.
ముందుగా బలరాముడు చేరుకున్నాడు అక్కడికి.
‘కన్నయ్యా, యేమి అయిందిరా, ఏమిటి ఇవాళ ఈ తీరు?’
ఆ అన్నకి మెల్లిమెల్లిగా తెలుస్తోంది. అమ్మో, ఈ తమ్ముడు మామూలు వాడు కదా, మహాచతురుడు, పైన కనిపించేది ఒకటి, లోపల ఎన్ని అర్థాలో, మాయలో అని.
ఆనాటి మనుజ లోకంలో కృష్ణుడి గురించి బలరామునికి ఉన్న అవగాహన, ఇంకెవరికీ లేదు. కానీ మానవుడికి ఉన్నందుకు కొన్ని ప్రశ్నలు, అదీకాక తనకు నిర్దేశించిన పని చేయటం తన ధర్మం.
అన్న అడిగిన ప్రశ్నకు సమాధానంగా తల అటు నుంచి ఇటు ఒకసారి అడ్డంగా తిప్పాడు మోహనుడు. కళ్లు క్రిందకి వాల్చి మళ్లీ ఓ చిన్న ఆరునొక్క రాగం వేణువు మీద.
అంత తెల్లవారే సమయానా అమావాస్య చీకటి అందరి మొహాల్లో.
ఇహ ఆగలేక ప్రతి ఒక్కరూ...
చెప్పు కన్నయ్యా, ఏమయింది కృష్ణా, ఎందుకు ఇలా వున్నావు, ఎవరు ఏమన్నారు నిన్ను.. రకరకాల ప్రశ్నలు. ఆఖరికి గోవులు కూడా ముట్టె పైకెత్తి దీనంగా చూస్తూ.. ప్రపంచంమే తల్లడిల్లిపోతోంది అన్నట్లు.
‘అమ్మ...’ అన్నాడు, అతి మెల్లగా.
‘అమ్మా, అమ్మ నిన్ను ఒక్క మాట అనని అమ్మ కదరా కన్నా. ఈ పూట ఏమిటి కొత్తగా...’ బలరామయ్య.
‘నీ ముందెగా..’
‘నా ముందు కూడానా.. నన్నూ చేర్చావూ..’
‘నిన్న రాత్రి..’
‘ఏమయింది నిన్న రాత్రి, చక్కగా నన్ను ఎక్కిరిస్తూ అమ్మ పక్కకు చేరి నిద్ర పోయావుగా’
‘అంతకు ముందు...’
‘ఆ, అంతకు ముందు.. చక్కగా బ్రతిమలాడి మరీ గోరుముద్దలు పెట్టింది కదరా అయ్యా..’
‘అదే...’
‘ఏమిటీ అదే, నీవు వద్దు అంటున్నా బ్రతిమిలాడి పెట్టిందనా నీ కోపం’
‘నేను ఎందుకు వద్దు అన్నా..?’
‘వెన్న ముద్ద కలపలేదని..’
‘అదే మరి...’
ఈ సంభాషణ వింటున్న గొల్లభామలు, ఇహ ఆగలేక, ‘కిట్టయ్యా, నీకు వెన్న ముద్దలు పెట్టకుండా ఎవరు ఉండగలరు. అయినా నీకు ఒకరు పెట్టేది ఏముందీ, మా అందరి ఇళ్లలోన వెన్నకుండలు నీ చేతివాటం ఎరిగినవే కదయ్యా’
‘అదే.. నాకు తెలీకూడదని మీరు దాచుకుంటారు. నాకేమో మీరు దాచుకున్న విషయాలే తెలుస్తాయి అయ్యో, నేనేమి చెయ్యను, అవి అందరికీ చెప్తాను. అంతే.’
‘అంటే, ఈ పల్లెలో ఎవరు ఏది దాచుకున్నా నీకు తెలుస్తుందా, కన్నయ్యా. మరీనూ సుతారం కబుర్లు’ గద్దింపుగా అన్నది ఓ భామ.
‘మరి. మీ బావ నిన్ను చీకట్లో నీకేమి ఇచ్చాడో చెప్పనా, ఇప్పుడు’
ఆ భామ వదనం చూడాలి ఆ క్షణాన్న.
‘కిట్టయ్యా, ఇదేమి పద్ధతి కిట్టయ్యా, మా గుట్టులన్నీ రట్టు చేస్తున్నావు’
‘మరి నువ్వు చేసింది మాత్రం బాగుందా, నీ మొగుడు తెచ్చిన తాయిలం అంతా దాచుకు తిన్నావు, ఒక్క ముక్క మీ అత్తకు పెట్టకుండా...’
‘పోనీయి కన్నయ్యా, ఈ ఆడపిల్లల మాటలు మనకెందుకు...’
‘నువ్వు మాత్రం సాంబయ్యా, మీ అమ్మ ఇచ్చిన లడ్డూను యెక్కడ దాచిపెట్టుకున్నావో చూపించు ఇప్పుడు’
ఇహ నోరు ఎత్తే ధైర్యం ఎవరికి వుంటుంది.
యేమి మాట్లాడితే, ఎక్కడ యే బండారం బయటపడుతుందో...
‘కన్నా, నిన్న రాత్రి అన్నావు, అమ్మ అన్నావు, వెన్న ముద్ద పెట్టలేదు అన్నావు.. బానే వుంది. కానీ వీరందరి గుట్టు, విషయాలు నీకు ఎందుకురా అయ్యా, బయటపెట్టి తంపులు ఎందుకురా నలుగురిలో?’
ఈ ప్రశ్నకు ఆ చిన్ని కృష్ణుడు ఇచ్చిన సమాధానం. ఆ పల్లెలో ప్రతివారికీ, ప్రతి ఇంట్లో వినిపించింది. యశోదమ్మకు, నందుడికీ తప్ప.
‘అన్నా, వీరందరూ నా దగ్గర దాపరికం చూపే విషయాలు నాకు తెలిసిపోతాయి. ఆ దాపరికం వద్దు, వ్యర్థం. ఇక ముందు దాచి లాభం లేదు అని నేను అనేక విధాలా సూచించినా, వీరు వినరు, నేనేమి చేసేది’
‘బాగుంది, బాగుంది, నీకూ వారికీ వున్న బాంధవ్యం మధ్యలో నాకు ఎందుకు కానీ, ముందు నిన్నటి విషయం చెప్పు. ప్రొద్దునే్న మళ్లా ఓ లీల మొదలెట్టావు కదా, అదీ కానివ్వు’ ఈ చివరి మాటలు కేవలం కృష్ణుడికి మాత్రమే వినిపించేటట్లు.
‘అది కాదు అన్నా. మొన్న ఓ రోజు ఈ గొల్ల పడతులు, వీరి అమ్మలు, అత్తలు అందరూ అమ్మ దగ్గరకు వచ్చి ‘పోయేదమెక్కడి కయినను, మా యన్నల సురభు లాన..’ అంటూ బెదిరించారు కదా.
మరి అమ్మ కూడా, పాపం వీరందరూ పోవటం కన్నా నేనే వెన్న దొరికే చోటుకు వెళ్దాం అనుకున్నా. ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తుంటే, అమ్మ నాన్న నీవు వీరు అందరూ గుర్తుకు వచ్చారు. మీ అందరినీ ఎట్లా వదిలిపోవాలో అని బాధగా ఇక్కడ కూర్చున్నా’
అప్పుడు చూడాలి, ఆ పల్లెలో, ప్రతి వారిలో కదిలిన కదలిక. పిల్లలు, పెద్దలు, అందరూ పరుగులే పరుగులు. కొద్దిసేపట్లోనే మొత్తం గొల్ల వాడలో ఉన్న వెన్న కుండలు ఒక్కటే కాదు, ఇంకా కాచని పాలు, ఇత్యాది ఆ రాతి బండ చుట్టూ నిండిపోయినయి.
ఒక్క మాట లేదు, ఒక్కరి నోటా, కృష్ణయ్య వైపు చూడటం మినహా.
అదిగో, ఆ క్షణంలో కుచేలుని వెంట అక్కడకు వచ్చింది, యశోదమ్మ.
‘ఆహా ఏమి గొప్పవారు మీరు. నా కొడుకుని వెన్నదొంగ అని నింద మోపి, నా దగ్గరకు వచ్చి సాడీలు చెప్పారు. ఇప్పుడు.. మొత్తం వెన్న కుండలు ఆ పసివాడి ముందర పెట్టారు. వాడు అసలు అంత వెన్న తినగలడా? అయినా మీరు పెట్టినప్పుడే తినాలా, ఇదేమి చిత్రం, వాడికి ఆకలి వేసి తినాలన్నప్పుడే తింటాడు. అదీ ఎక్కడి, ఎవరింట్లో అంటే వాళ్లింట్లో.
ఇష్టం అయితే చెప్పండి, లేకపోతే నా కొడుక్కి వెన్న దొరికే ఇల్లు దొరకకపోదు...’
ఎవరు జవాబు చెప్పే సాహసం చేయగలరు.
వెళ్లి యశోదమ్మకు మొరబెట్టుకున్నందుకు, మంచి గుణపాఠమే చెప్పాడు ఈ కన్నయ్య... పైగా హెచ్చరిక.. నా ముందు ఏదీ దాగదు.. జాగ్రత్త అంటూ.
కృష్ణుడు.. వెన్నముద్దలు.. ఈ రెంటికీ ఏమిటి సంబంధం, సాన్నిహిత్యం.
వెన్నముద్ద స్వచ్ఛతకు సంకేతమైన తెలుపు. అతి మెత్తన, సున్నితం. ఒకో అప్పుడు చేతి వేళ్ల మధ్య నుంచి జారిపోతూ.
యే ఆకారంలోకి మలుస్తే ఆ ఆకారం దాలుస్తూ.. కలుషితం చేస్తే మలినం చూపుతూ.
చిలికి చిలికి తీయాలి, కాచిన పాలు, తోడుకున్న పెరుగు, ఆ తరువాత వెన్న.
అదే మానవ మనసు.
యెటు మళ్లిస్తే అటు, భగవంతుని వైపు అన్నా, భాగినిపై కోరిక అయినా, భోగ వైభోగాల వైపు అన్నా. ముందర స్వచ్ఛమే అదీను, కలుషితం చేయటం, చేయక పోవడం మన చేతిలో వుంది.
తన మనస్సు వెన్న అనీ, మెత్తన (కరుణ) అనీ, తన భక్తులందరికీ దానిలో చోటు వుందనీ పంచి ఇచ్చాడు ఆయన.
ఇహ సంగ్రహించడము.. కృష్ణం వందే జగద్గురుం.. అని కదా. వారు సంకేతం ద్వారా చూపింది, మీ మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోండి, చాలు, ఇంకేమీ వద్దు, మీ దగ్గర ఎన్ని వజ్ర వైఢూర్యాలు, యెనలేని సంపద వున్నా నాకు అవసరం లేదు. మీ దేహ, భౌతిక వాంఛల నుండి చిలికి చిలికి వేరు చేసి, స్వచ్ఛంగా నాకు సమర్పించండి. నిస్సందేహంగా నాలో ఐక్యం చేసుకుంటాను, అని నేరుగా ఓ సూచన ఇవ్వటం.
మీ మనస్సు నాకు ఇవ్వండి, మిమ్ముల నేను స్వీకరించి, మీ బాగోగులు నేను చూసుకుంటాను అని.
పూజలు, పునస్కారాలూ, యజ్ఞాలు యాగాలు, నైవేద్యాలు, గుడులూ గోపురాలు.. వీటన్నిటి కంటే ముందర, మీ మనస్సును, చిత్తాన్ని నా యందు నిలపండి, చాలు. నాకు ఇంకేమి వలదు... అని సూచించడానికే.
జగన్నాటక సూత్రధారి నేర్పిన మొదటి పాఠం ఇది.
అతి సులభం, సరళం అయినది.. అదే ప్రేమ తత్వం...
(ఎప్పటికీ సశేషమే)

-నండూరి రామచంద్రరావు.. 9949188444