S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కనువిప్పు (మాతో-మీరు)

ఈ వారం అనుబంధంలో ‘జాడలేని జలం’ ఈ వారం స్పెషల్ మంచినీటిని వృధా చేసేవారికి కనువిప్పు కలిగించే విధంగా ఉంది. ప్రకృతి వనరులను తన స్వార్థం కోసం నిర్దాక్షిణ్యంగా దుర్వినియోగం చేస్తున్న మానవులు భవిష్యత్తులో ఎంతటి దుష్పరిణామాలు ఎదుర్కొననున్నారో ఈ వ్యాసం కళ్లకు కట్టినట్లు వివరించింది. ప్రస్తుతం నీటి కోసం కన్నీళ్లు పెడుతున్న జనం మున్ముందు నీటి కోసం యుద్ధాలు చేయాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. మానవులు ప్రకృతి వనరులను పొదుపుగా వాడుకుంటూ ప్రకృతితో మమేకమై జీవిస్తే తప్ప భవిష్యత్తులో మనుగడ ప్రశ్నార్థకంగా మారనున్నదన్న నిపుణుల అంచనా నూటికి నూరు శాతం నిజం.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)
అమ్మమ్మ కథలు
పురాణాలలోని నీతి కథలు, ఆనాటి రాజుల సుపరిపాలన పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పిన అమ్మమ్మ, తాతయ్యల కథలు ఈనాడు కనుమరుగయి పోయాయి. రోజుకో కథ విని నిద్రపోయే మనుమలు, మనుమరాళ్లు కాలక్రమేణా టీవీలకూ.. టాబ్‌లకూ.. కంప్యూటర్లకూ అతుక్కుపోయారు. స్మార్ట్ఫోన్ల మాయాజాలంలో పడి ఒకరికొకరు పలుకరించుకోవడం బహు పలుచనై పోయింది. ఎవరి లోకంలో వారుంటున్నారు. ఈ కాలపు తల్లిదండ్రులు కూడా పెద్దవారి అనుభవాలను పెడచెవిన పెడుతున్నారు. వృద్ధాప్యంలో గొడవలెందుకని పిల్లలను సమర్థిస్తూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ‘సండే గీత’ ప్రతీ వారం ఓ గీతోపదేశమే. ఆచరించేవారే అరుదు.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
అబ్బురపరిచాయి
ఒంటి చేత్తో పైన్‌కోన్ తినే ఎర్ర ఉడుతలు, వలస వెళ్లినా పుట్టిన చోటుకే తిరిగొచ్చే సాల్మన్ చేపల విశేషాలు అబ్బురపరిచాయి. నువ్వున్నా, లేకున్నా ప్రపంచం పరిగెడుతూనే ఉంటుంది. అంచనాకు మించి ఊహించుకోకు అంటూ చెప్పిన ‘సండే గీత’ అమోఘంగా ఉంది. తెదేపా తెలంగాణాలో తుడిచిపెట్టుకు పోవడం గురించి ప్రస్తావించారు. అది ఆ పార్టీ నేత వైఫల్యం మాత్రమే కాదు. మరో ముఖ్యాంశమూ ఉంది. ఉద్యమకాలంలోనూ, ఆ తర్వాతా ఆంధ్రులకు వ్యతిరేకంగా తెలంగాణా వారిలో రగిల్చిన ద్వేషభావం ఫలితం. ఆ భావం వైదొలగి మళ్లీ స్నేహ సౌహార్ర్దాలు వెల్లి విరియడానికి కొంతకాలం పడుతుంది. ఇక టాలీవుడ్‌లో రాధికా ఆప్టేకు శృంగార తారగా ముద్ర పడింది గాని మహారాష్టల్రో ఆమె మంచి నటి అని అహల్య షార్ట్ ఫిలిం నిరూపించింది.
-సదాప్రసాద్ (గొడారికుంట, తూ.గో.జిల్లా)
లోకాభిరామమ్
కొత్తవి కొనడానికి, పాతవి వదల్చుకోవడంలోని సమస్యల్ని హాస్య స్ఫూరకంగా ‘లోకాభిరామమ్’లో చక్కగా చెప్పారు గోపాలంగారు. పాత పేపర్లు అమ్మడంలో తూకం మోసాల్ని అధిగమించడానికి వాటిని లెక్కించి పేపర్‌కి ఇంత అనే పద్ధతి వచ్చింది. అనుమానాలు మొదలైతే ఆగవు అని తన గురించి చెప్పుకున్నారాయన. అనుమానం ఆరోగ్యవంతుల, ఆలోచనాపరుల లక్షణం! క్రైం కథల్లో నేపథ్యాల వైవిధ్యం ఆకట్టుకుంటున్నాయి. ‘ఇంటి దొంగ’ కథ చక్కని మలుపులు తిరుగుతూ ఊహాతీతంగా ముగిసి అలరించింది. ఆచితూచి మంచి కథల్నే ఎంచుకుంటున్నామని బడాయిలు పోతారు నటీనటులు. మరి హన్సిక నాకన్నీ గ్లామర్ పాత్రలే వస్తున్నాయని వాపోవడం ఏమిటి?
-ఎస్.కృష్ణ (కొండయ్యపాలెం)
ఓ చిన్న మాట
మంత్రాలున్నాయో లేవో గాని ప్రకంపనాలున్నాయి. అవి మనిషిని తాకితే మంచి జరుగుతుందని చెప్పిన ‘ఓ చిన్న మాట’లో ఎంతో సత్యం ఉంది. చిన్నప్పుడు మా తమ్ముడి నడుం చుట్టూ సప్పి (మశూచి లాంటి పొక్కులు) లేచింది. ఒకాయన మంత్రం వేసి నెమలీకతో ఆ సప్పిని తాకి మూడు రోజులు వట్టి మజ్జిగ అన్నం తినమని చెప్పారు. అంతే. మందులు వాడకుండానే సప్పి మటుమాయమైంది. ఇక ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి చెప్పిన విషయాలు ఆకట్టుకున్నాయి. ఇప్పటికైనా ఆ అవార్డు మనోజ్‌కుమార్‌కి దక్కడం ముదావహం. అమెరికా సుదీర్ఘ నిరశన చేపట్టిన కోనీలాగానే మన దేశంలోనూ షర్మిలా బాను ఈశాన్య రాష్ట్రాల నుంచి సైన్యాన్ని ఉపసంహరించాలని పాతికేళ్ల నుంచి నిరశన వ్యక్తం చేస్తోంది.
-బి.స్నేహమాధురి (పెద్దాపురం)
మీకు తెలుసా?
ఆదివారం అనుబంధంలో ‘మీకు తెలుసా?’ ద్వారా చేప కాని చేపగా పరిగణింపబడి ఎన్నటికీ మరణించని జెల్లీ ఫిష్ గురించి ఎన్నో విశేషాలను తెలుసుకున్నాం. ఇదే శీర్షిక ద్వారా షికాకాయ్ తుమ్మ జాతికి చెందినదని, చెట్ల ఆకులు, బెరడు, కాయలు, గింజలు అన్నీ ఉపయోగకరమైనవే అని.. కాశ్మీరీ దుస్తులను శుభ్రం చేయడానికి షికాకాయ్ రసాన్ని ఉపయోగిస్తారని.. ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం.
-అల్లాడి వేణుగోపాల్ (బారకాసు)
ఎవరిది?
‘కోహినూర్ ఎవరిది’ శీర్షికతో ప్రచురితమైన వ్యాసం ఆసక్తికరంగానూ, ఆలోచనలు రేకెత్తించేదిగాను ఉంది. కోహినూర్ వజ్రం గురించి తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. కోహినూర్ ఎవరిది? మనదే అన్న ఆలోచన పాలక ప్రభుత్వాలు చేసి ఈ అపురూప వజ్రాన్ని తిరిగి భారత్‌కు రప్పించేందుకు కృషి చేయాలి.
-డా.ఆర్.విఠల్‌రావు (విసన్నపేట, కృష్ణాజిల్లా)