S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ధ్యానంతో పరమాత్మ సన్నిధికి.. (రాస క్రీడాతత్త్వము-8)

భావం: వ్రజ గ్రామాలలో వుండే పురుషులంతా కృష్ణమాయలో పడి, తమ తమ ఆడవారంతా తమ ఇళ్ళలోనే ఉన్నారని భావించారు. అందువల్ల బాలకృష్ణుడు తమ ఆడవారిని ఆకర్షిస్తున్నాడని ఎవరూ భావించలేదు. అందుకే ఆయన మీద అసూయపడలేదు.)
ఈ శ్లోకంవల్ల వ్రజగ్రామాలలో ఏ రకమైన కల్లోలమూ జరగలేదని స్పష్టమవుతోంది. కనుక, వెనుకాల చెప్పుకున్న శ్లోకంలో ఇంటి పెద్దలు నివారించినా ఆడవారు ఆగలేదు అన్న చోట, ఆగకుండా లేచిపోయారని అర్థం చెప్పే వీలు లేదు. కనుక, ఆ యా బంధువులు పరవశ స్థితిలో వున్న ఆడవారి శరీరాలను దయతో జాగ్రత్త చేసుకోగా, గోపికలు సూక్ష్మశరీరాలతో స్వామి దగ్గరకు పరుగులు తీశారు-అని చెప్పక తప్పదు.
గోపికల ఆధ్యాత్మిక స్థాయి :-
అంతే గాకుండా, పైన చెప్పిన అంతర్గృహ గతాః కాశ్చిత్ గోప్యో - అనే శ్లోకం తరువాత భాగవతంలో మరో రెండు శ్లోకాలున్నాయి.
దుస్సహప్రేష్ఠవిరహ తీవ్ర తాపధుతాశుభాః
ధ్యాన ప్రాప్తాచ్యుతాశే్లష నిర్వృత్యా క్షీణమంగళాః ॥
తమేవ పరమాత్మానం జారబుద్ధ్యాపి సంగతాః
జహు ర్గుణమయం దేహం సద్యః ప్రక్షీణబంధనాః ॥
(శ్రీమద్భాగవతం, స్కం-10, అ-29, శ్లో-10,11)
అప్పటి దాకా సంసారులుగా వుంటూ, ఏదో కొంత కొంత కృష్ణ్ధ్యానం చేసినంత మాత్రాన, ఆ గోపికలకు సరాసరి స్థూలదేహాల్ని వదిలిపెట్టి, సూక్ష్మశరీరాలతో ప్రయాణం గలిగేటంతటి శక్తి ఎలా వచ్చింది? - ఈ సందేహం మనకు కలుగక మానదు. దీనికి సమాధానంగానే శుకహర్షి పై రెండు శ్లోకాలనూ చెప్పాడు.
జీవులు తమ స్థూలశరీరాలను పట్టుకుని వ్రేళ్ళాడేటట్టు చేసేవి రెండే రెండు. ఒకటి పాపం, మరొకటి పుణ్యం. కష్టాలనుభవిస్తే పాపాలు పోతాయి. సుఖాలనుభవిస్తే పుణ్యాలు పోతాయి. సామాన్య జీవులెవరికీ కూడా అవి ఒకే సమయంలో సున్నా స్థాయికి సామాన్యగా చేరవు. పరమాత్మ కృపకు నోచుకున్న ఈ గోపికల విషయంలో ఏమి జరిగిందంటే-
వారు ఎన్నో జన్మలనుంచీ విరహభక్తి మార్గంలో స్వామిని ఉపాసిస్తున్నారు. కనుక, ఇప్పుడు స్వామి ప్రస రింపజేస్తున్న వేణునాదాల ద్వారా, ‘‘ఈ నాదాలను ప్రసరింపజేసేవాడు మా స్వామే’’ -అని గుర్తుపట్టగలిగారు. అలా గుర్తుపట్టడంవల్ల, వారికి జన్మజన్మలనుంచీ అత్యంతప్రియుడైన ఆ స్వామితో ఏర్పడిన విరహమంతా ఒకే సారి గుర్తుకు వచ్చి, నరకయాతనలను మించిన దుఃఖం పొందారు. ఇలా పూర్వ దుఃఖాన్ని ఒకే సారి అనుభవించడంవల్ల, వారికి గల పాపాలన్నీ ఒకే సారి ఖర్చయిపోయాయి. ఈ భావానే్న ‘‘దుస్సహ ప్రేష్ఠవిరహ తీవ్రతాపధుతాశుభాః’’ అనే వాక్యం వివరిస్తోంది.
ఇక వారి పుణ్యాలు మిగిలి వున్నాయి. పైన చెప్పుకున్న బాధవల్ల వారి మనసులు ఒక్క సారిగా శ్రీకృష్ణ్ధ్యానంలోకి ప్రవేశించాయి. ఆ ధ్యానంలో వారికి తమ ప్రియతముడైన పరమాత్మ యొక్క ఆలింగనం దొరికింది. దానివల్ల కలిగిన ఆనందం ఎంత తీవ్రమైనదంటే, ఆ ఆనందానుభవంవల్ల వారికి గల పుణ్యాలన్నీ పూర్తిగా ఖర్చయిపోయాయి. ఈ భావానే్న ‘‘్ధ్యనప్రాప్తాచ్యుతాశే్లష నిర్వృత్యా క్షీణ మంగళాః’’ అనే వాక్యం చెపుతోంది.
ఆ విధంగా ఆ గోపికల పుణ్యాలూ, పాపాలూ, రెండూ కూడా సున్నా స్థాయికి వచ్చేసరికి, వారి మనస్సులో శ్రీకృష్ణుడి మీద పరమాత్మ అనే భావన సాక్షాత్తుగా లేకపోయినా, జారత్వబుద్ధితో ఆయన దగ్గరకు చేరి నప్పటికీ కూడానూ, పుణ్య పాపాలు రెండూ క్షీణించిపోవటం వల్ల, వారి బంధాలన్నీ వెంటనే తెగిపోయి (సద్యః ప్రక్షీణబంధనాః), తమోగుణమయమైన దేహాన్ని, అంటే స్థూలదేహాన్ని వదిలివేశారు (జహుర్గుణమయం దేహం).
ఈ విధంగా వారికి గల పాపపుణ్యాలన్నీ దుఃఖ సుఖ అనుభవాల ద్వారా తీరిపోయాయనీ, వారు ధ్యాన విధానంతో పరమాత్మను చేరుకున్నారనీ ఎంత చెప్పినా, జారభావంతోనే అలా చేశారని చెప్పారు కనుక, ‘‘జా రత్వం అనేది అధర్మం కనుక, అధర్మం ద్వారా ఉపాసన చేయడం మంచిదా?’’ - అని కొందరు సందేహిస్తూ వుంటారు. ఈ సందేహాన్ని వివరించడం కోసమే శుకమహర్షి పై శ్లోకంలో అచ్యుత అనే పదాన్ని వేశాడు. (అచ్యుతాశే్లష నిర్వ ృత్యా). అచ్యుతుడు అంటే ఒక వ్యక్తి కాదు. సర్వవ్యాపి అయిన పరమాత్మ. ఒకడు ఇదేదో మామూలు మజ్జిగ అనుకుని అమృతం తాగాడు అనుకోండి. వాడికి అమృతం పనిచేయడం మానేస్తుందా? వస్తువులో స్వతస్సిద్ధమైన శక్తి వుంటే, అవతలవాడి భావన ఎలా వున్నా, దానితో నిమిత్తం లేకుండానే ఆ వస్తువు తన శక్తిని చూపించి తీరుతుంది. అలాగే, గోపకాంతలు జారబుద్ధితో చేరినా, పరమాత్మనే చేరారు. అందుకే, వారికి దేహబంధం వదిలిపోయంది- అని అచ్యుత పదం చేత... శుకమహర్షి సూచన చేస్తున్నాడు.
(ఇంకా వుంది)

- కుప్పా వేంకట కృష్ణమూర్తి.. 9866330060