S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తంబుచెట్టి వీధి.. మనదేనోయ్!

అరవైల్లో నేను మద్రాసులో అడుగుపెట్టాను. జార్జిటౌన్‌లో తంబుచెట్టి వీధిలో - నాన్నగారి బస ఆఫీసూ రెండూ వున్న ఆంధ్రా ఇన్‌స్యూరెన్స్ బిల్డింగ్‌లో, నెంబర్ 337 - దానికి కొంచెం ఐమూలగా, ఎదురుగా వున్న ఆంధ్రపత్రిక బిల్డింగు - ఆరు, ఏడు నెంబర్లు రెండూ కలిపిన భవనం - ఆనక నెంబరు పనె్నండు. ఆనందవాణి కాళిదాసుగారి కార్యాలయం, ప్రెస్సూ - ఆఫీసూ రెండూ అవే నాకు తెల్సు. నువ్వో అందుకు పోస్తున్నావు - అంటే, నేనొకందుకు తాగుతున్నాను అన్నట్లు - వెతుక్కుంటూ వచ్చి పెద్దాయన పిలిచాడు. రాజాజీ, ఖాసా సుబ్బారావుల మన్నన, పొందూ పొందిన ఆనందవాణి కాళిదాసుగారు కేవలం నా రచనలను బట్టి - నా ‘టేలంట్’ని నిర్ధారించుకొన్నాడు. ఓ అప్లికేషన్ లేదు - ఇంటర్‌వ్యూ, అప్పాయింట్‌మెంటూ, ఆర్డర్ లేని జాబు - పైగా ఎడిటింగ్ ఉద్యోగం. ప్రూఫ్ రీడింగ్‌లంటే ఇప్పటికీ నాకు భయమే గానీ ‘ఎడిటింగ్’ అంటే, అబ్బో! నాకు మా స్కూలులోనే బోలెడు అనుభవం వుంది. (ఈ మాటలు తల్చుకుంటే నాకు ఇప్పుడూ నవ్వొస్తుంది.)
అమ్మ దగ్గర్నుంచి నాన్నగారి దగ్గరకు వెళ్లడమేగా! మద్రాస్ సెంట్రల్ స్టేషన్ మా వూరి (బెజవాడ) స్టేషన్‌కన్నా చిన్నది అనిపించింది. పైగా, వంతెనలు లేవు. సాపుగా బయటకు వచ్చేసి, ఆటో ఎక్కేసి - ‘తంబుచెట్టి మొదల్లే ఆపోజిట్టా హైకోర్టు చైనా బజార్‌లో’ దిగిపోవడమే.
ఆ ఏరియా అంతా ‘చరిత్ర కంపు’ కొడుతోంది ఆనక తెలిసింది. నే దిగినది పారిస్ (కార్నర్) ప్రాంతమని. టాప్ ఫ్లోర్ నాన్నగారి ఆఫీసు కమ్ రెసిడెన్స్ రూమ్ నెంబర్ 19, లిఫ్ట్ వుంది. మునిస్వామి అడిగాడు, అప్పుడే లిఫ్ట్ తెరుస్తూ - ‘యార్ వేణుమ్?’ - చెప్పాను.
బొజ్జా, దాని మీద యూనిఫామ్ కోటూ, వెత్తలపాకు (తమలపాకు) కిల్లీ నవ్వుతో - మంచివాడు అనిపించిన మునిస్వామి - ‘అప్పా చెప్పి ఐందిలే నాకు’ అన్నాడు. తలుపు తీసి ‘టాప్’లోకి వెళ్లమని సైగ చేశాడు.
ఆ గదిలో నుంచి, మడత తలుపుల కిటికీ తెరిస్తే, ఎదురుగ్గా లైట్ హవుస్ ‘హలోవ్’ అంటూ కనపడ్డది. మాయాబజార్‌లో ఘటోత్కచుడిలాగా అనిపించింది. ‘సత్తి’ వచ్చాడు. ఆంధ్రా బీమా కంపెనీ భవనం సెక్యూరిటీ నర్సయ్య చిన్నకొడుకు సత్యన్నారాయణ - గానీ, ‘నీ పేరేమిటి?’ అనడిగితే ‘సత్తి’ అనే అంటాడు. ఆ సత్తి, నా మొదటి ‘గైడు’. నాన్నగారూ, వాళ్ల ఛెయిర్మెన్ రామకృష్ణగారి ఆఫీసుకు వెళ్లాలి. ‘నువ్వు మధ్యాహ్నం ఫ్రాన్సిస్ జోసెఫ్ వీధిలోని విజయా లాడ్జిలో భోజనం చెయ్యి. ఇదుగో టిక్కెట్’ అంటూ దారి వివరం చెప్పారు నాన్నగారు. నేను ఆనందవాణి ఆఫీసుకి చేరేసరికి - కాళిదాసుగారు టిప్‌టాప్‌గా తయారై, ‘ఇస్ర్తి మడత’ లాగా వున్నా - ఎందుకో, కొంచెం కంగారుగా, అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు.
‘టిఫిన్ చల్లారిపోతోంది. అందుకనీ’ అన్నాడు ఎర్రగా, ఎత్తుగా వున్న ఆయన - నాన్నగారి ఈడు వాడే అయి వుంటాడు. (విజయనగరంలో ఎలిమెంటరీ స్కూలుమేట్స్ వాళ్లు ఇద్దరూ) తానే పొట్లాలు విప్పి, ఇడ్లీ, వడా - చిన్న కప్పులో సాంబారు సర్ది పెట్టి - ‘ఈట్ ఇట్ ఫర్ ఆనందవాణి సేక్, దెన్ వుయ్ టాక్’ అన్నాడు. ‘అదీ మద్రాసు ‘ఆరంగేట్రం’!
మద్రాసు సామీ అది! ‘ఇడ్లీ వడా దోసై ఏదో వొకటి సాంబారులో ముంచి వేసై - పొట్టలో హ్యాపీగా వుంటుంది’ అంటూ, ఆ తర్వాత పొయిట్రీ రాశాను నేను.
పెద్ద నుదురు, విశాలమైన కళ్లు, సినిమా తార ఆశాపరేఖ్ నవ్వులాగా వెడల్పయిన నవ్వు - చాలా ‘ఇంప్రెస్సివ్ పెర్సనాలిటీ’ సారుది. ఆత్మీయతా, వాత్సల్యం చూపించటంలో ఆయనకు ఆయనే సాటి!
ఇంతకీ పగలు పనిలేదు నాకు. ఇతర ప్రెస్సులో (ఆంధ్రపత్రిక సహా) పగలు పనిచేసి, రాత్రి కిరాయికి వచ్చే వర్కర్‌లు రావాలి. కాకపోతే ‘ఇదిగో ఇది ‘శ్రీశ్రీ, ఇది ఆరుద్ర, ఇది వాకాటి’ అంటూ ఎందరో మహానుభావులు కూర్చొని అక్కడ పని చేసిన, కుర్చీలు చూపించాడాయన సగర్వంగా. వ్రాతప్రతులు రెండు వేపులా నిండుగా వున్న ప్రెస్సు అవీ ఆకళింపు చేసుకున్నాను.
1960ల నాటి తంబుచెట్టి వీధి - జార్జిటౌన్ మద్రాసు సంగతులు ఇప్పుడు నేను చెప్పబోయేది. చెన్నై అన్నది నేటి పేరు. కానీ, నాడది మద్రాసు. ఈ తంబు చెట్టి వీధి చాలా పాతది. చరిత్ర వున్నది. సన్నగా, పొడుగ్గా, సోలగొట్టం లాగ - హైకోర్టుకీ, లైట్‌హవుజ్‌కీ అభిముఖంగా ఉంటుంది. అసలు మద్రాసు ఈ ఏరియానే అంటారు. ‘పారిస్’ అని ఇక్కడో ఏరియా ఉంది. ఇక్కడికి రాని బస్సు ఉండదు. ఏ ప్రాంతం నుంచయినా ‘పారిస్ కార్నర్’కి వచ్చేయడం సుళువు.
నాకు ఈ తంబు చెట్టి స్ట్రీట్ బాగా అచ్చొచ్చింది. బోసు రోడ్డు మెయిన్ రోడ్డే గానీ, దాన్నంతా ‘చైనా బజార్’ అనే అంటారు. ఫుట్‌పాత్ మార్కెట్‌కి అది పెట్టింది పేరు. అటు సైంట్ జార్జ్ - కోట, లైట్‌హవుస్, హైకోర్టు, లా కాలేజీ - ఇలా వుండగా, ఈ కాంప్లెక్స్‌కి అభిముఖంగా, మొత్తం చెట్టియార్ల స్ట్రీట్‌లు. మధ్యలో దాన్ని ‘బ్రాడ్వే’ అంటారు. ఇలా బీచ్‌లైన్ ఒకటి దాకా - వరుసగా ఉన్న వీధుల్లో - ‘చరిత్ర’ కులుకుతూ ఉంటుంది.
నేను మద్రాసులో అడుగెడుతూనే - తంబుచెట్టి స్ట్రీట్‌లోనే పడ్డాను. తంబుచెట్టి గారు తెలుగువాడే. తిరిగి అయిదేళ్ల తర్వాత, ఆ విశాలమయిన పారిస్ కార్నర్ అంటారు గానీ, కార్నర్ కాదు - ఆ ప్రాంతాన్ని ఆ సెంటర్ని అతి భారంగా వదిలిపెట్టాను. కానీ తప్పదు.
ఆంధ్ర పత్రికతో పాటు మా వూరు విజయవాడకి వచ్చేశాను. ‘ఇన్‌గేట్ ఆంధ్రా యూ’ నుంచి వెళ్లి, ఔట్‌గేట్ ‘ఆంధ్రా యూ’ ద్వారా బయటపడ్డట్లే. తిరిగి వెళ్లనక్కర లేకుండా బయలుదేరి పోయాను. 1965లో.
‘విరోధాబాస’ ఏమిటంటే తంబు చెట్టి స్ట్రీట్ కూడా వన్ వే రోడ్డు ఒకటి నుంచి నాలుగో నెంబర్ భవనం - మోడరన్ కేఫ్ పెద్ద హోటల్ వుంది. ఆనక, ఆరు ఏడు కలిపిన భవనం చరిత్ర సృష్టించి - చరిత్ర గర్భంలో కలిసిపోయిన ఆంధ్రుల అభిమాన పత్రిక ఆంధ్ర పత్రిక యొక్క కార్యాలయం - ముందుకు పోతే - నెంబర్ పనె్నండు బిల్డింగు. ఆనందవాణి కార్యాలయం అక్కడ నుంచి కాళికాంబాల్ దేవాలయం దర్శించి, తిరుగు ముఖం పట్టి లైట్‌హవుస్‌కి అభిముఖంగా వస్తూంటే ‘3’ నెంబర్‌తో, ఆ వీధి చైనా బజార్‌లోకి అంటే సుభాష్ చంద్రబోస్ మెయిన్‌రోడ్డులో కలుస్తుంది. ‘అసలు మద్రాసు’ ఇదేట. ఈ ప్రాంతం మొదట్లో ‘ముత్యాలపేట’గా వాసికెక్కింది. తెలుగు వాళ్లే అంతా - కొంతమందే అరవ్వాళ్లు కానీ పదహారు వందల నలభైలో బ్రిటీష్ వాళ్లొచ్చి - ఇండియన్స్ వున్న ఏరియా కనుక - ‘బ్లాక్‌టౌన్’ అంటూ నిక్‌నేమ్ ఇచ్చారు - నల్లని నగరం అని అర్థం.
ఐతే, 1911లో, కింగ్ జార్జ్ చక్రవర్తిగా పట్ట్భాషిక్తుడైనప్పుడు, రుూ ముత్యాలపేటను జార్జ్‌టౌన్‌గా పేరెట్టి - బ్రహ్మాండమైన జార్జ్ విగ్రహాన్ని కూడా స్థాపించారు. ఈ జార్జ్‌టౌన్ కూడా ‘పారిస్’ అంత ఫేమస్‌గా వాసికెక్కింది. మద్రాసు అంటే తెలిసిన వారికి ‘పారిస్’ (కార్నర్) కూడా తెల్సు. అయితే, ఆ పేరెలా వచ్చిందో మాత్రం తెలియదు.
అన్ని సిటీబస్సులు, రూట్ బస్సులూ చేరుకొనే ఈ ‘కార్నర్’ అనబడే సెంటరు ‘్థమస్ ప్యారీ’ అనే వేల్స్ వర్తకుడి పేరు మీద ప్రసిద్ధమైంది. 1787లో ఆయన ఇక్కడ బ్రిటీష్ వారి కోసం ఇ.ఐ.డి. - ప్యారీ డిస్టిలరీస్ - అనే కంపెనీని స్థాపించాడు. దీని చుట్టూరా లైట్ హవుస్, ‘లా’ కాలేజీ వగైరా అన్నీ అద్భుతంగా ఉద్భవించాయి. సెయింట్ జార్జ్ కోట మద్రాసుకి తలమానికం! ఇది హార్బర్ నియోజకవర్గంలో ఎందరో తెలుగు వారుండే భాగం. కానీ, మన ప్రకాశంగారు అక్కడ ఎన్నికల్లో వోడిపోవడంతో కూవ్‌మ్ రీవర్ ఇవతల మాది అన్న తెలుగు వారి ఆశ అడుగంటి పోయింది. మద్రాసు మనది కాకుండా పోయి, కర్నూలు రాజధానిగా- దరిమిలా ఆంధ్రా స్టేటు (1953)లో ఏర్పడ్డది. ఆంధ్రకేసరి మీద ఓ స్కూలు విద్యార్థిగా నేను విరుచుకుపడ్డాను - అచ్చు అంటే అచ్చు. కేసరి మంత్రి పదవి తోటే గర్జనలన్నీ సరి’ అని అక్కసు తీరా రాశాను కూడానూ. పత్రికలు అన్నింటిలోనూ - అప్పుడు. అద్సరే-
తంబు చెట్టి, లింగ చెట్టి, కాసి చెట్టి, నారాయణ మొదలియార్ - సప్ప చెట్టి, అంకుప్ప నాయకన్ - ఇలా అవన్నీ తెలుగువారి వీధుల పేర్లు కాగా - బీచ్ లైన్ నెంబర్ వన్‌కి తర్వాత ‘రాజాజీ శాలై’ అన్న పేరెట్టుకున్నారు. ప్రకాశం రోడ్డు, బందరు రోడ్డూ కూడా వుండేవిట! కాగా - ఈ ప్రాంతానికి - బ్రిటిష్ వారి హయాంలోనే - ఆర్మేనియా నుంచి రష్యన్లు - పోర్చుగీసులు యూదులు ఇక్కడికి పగడాల వ్యాపారం చేస్తూ వచ్చారు - దానే్న ‘కోరల్ వీధి’ అన్నారు. ఆర్నేనియా స్ట్రీట్‌లో పెద్ద చర్చి ఇప్పటికీ ఫేమస్సే! కేథలిక్ సెంటర్ చాలా పెద్దది.
ఉత్తర భారతం నుంచి రుూ సంపన్న రేవు పట్టణానికి - రాజస్థాన్, సౌరాష్ట్ర ప్రాంతాల వాసులు వ్యాపార నిమిత్తం వచ్చి, సెటిల్ అయిపోయారు. ఒక రకంగా ఈ పాత మద్రాసు అంతర్జాతీయ సంస్కృతికి, జైన్‌మందిరాలకీ కూడా ఆలవాలమై పోయింది. ‘తెలింగి తెరియాదు’ అనేవారు. అందరికీ తెలుగు వచ్చును. పట్టుచీరెలు, వడ్డాణాలు, పలకసరులు, వజ్రాల ఉంగరాలు, పగడాల మధ్య ముత్యాలున్న హారాలు - ధరించిన సంపన్న స్ర్తిలు సంప్రదాయ నోములూ, వ్రతాలూ చేస్తూ కనపడతారు.
శివాజీ గణేశన్ నుంచీ మన నటుడు పద్మనాభం నాటకం ట్రూపు - ‘్భక్తకన్నప్ప’ నాటక ప్రదర్శనలకి ప్రేక్షకులు కిటకిటలాడేవారు. సావుగారుపేట ఉత్తరాది వాణిజ్యవేత్తలదయితే - మిగతాదంతా తెలుగు వారిదే. శనివారం రాత్రి వస్తే, ఎక్కడా హోటల్స్‌లో ‘అన్నం’ దొరికేది కాదు. అంతటా కంజీవరం ఇడ్లీ, ‘ఊతప్ప’ ‘అక్కిరొట్టె’ తినవల్సిందే. ‘ఒంటిపూట’ మస్టు. మార్కెట్‌లో కూరగాయలు, పండ్లే తప్ప - బిర్యానీలూ, పలావ్‌లూ లేవు.
మా తంబుచెట్టి వీధి వాసులకు ‘రామా భవన్’ ఇడ్లీ అంటే పడి చచ్చేవాళ్లం. అలా అనుకుంటే చాలదు - ఎక్కడెక్కడి నుంచో - శనివారం శనివారం, ఈ ‘రామా’ భవన్‌కి - కారులు, బేబీ టాక్సీలు - సిటీ బస్సులలో - ‘జంటలు’గా వచ్చేవారు. ఇడ్లీ పెట్టి - బకెట్‌లతో పల్చని, వేడివేడి (ఔనండీ.. ఔను!) కొబ్బరి చెట్నీ - అలా గరిటలకొద్దీ పోస్తూ వుంటే - జుర్రేసేవాళ్లు అందరూ.
మా నాన్నగారికి ‘సత్తి’గానీ, ‘వెంకటి’గానీ వెళ్లి ‘తనీగా’ అంటే ‘విడిగా’ - చిన్న పొట్లంలో మలవాలప్పొడి అంటే ఇడ్లీ కారం తెచ్చేవారు. ఇడ్లీతోపాటు - అదో ‘సాపాటు’.
ఆనందవాణిలో ఎడిటింగ్ రాత్రి గడిచేది. పగలు రాధాకృష్ణ గారితో అమృతాంజన్ ఆఫీసుకి సరదా ట్రిప్పులు - రూమ్‌లో నాన్నగారి బల్ల మీద ఫోనుండేది. ఆనందవాణి ప్రెస్సు కార్యాలయంలో బల్ల మీదా కూడా ఫోనుండేది. అదో ప్లస్ పాయింటు - నాన్నగారికి ‘వర్రీ’ లేకుండా ఫోన్ మీద మాట్లాడుకునేవాళ్లం.
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com