భయాలు
Published Saturday, 9 February 2019భయం’ అనేది అందరికీ వుంటుంది. కొన్ని అనవసర భయాలు ఎక్కువ మందిని వెంటాడుతుంటాయి. భయాలను ఎలా ఎదుర్కోవాలో చెప్పే కథ ఒకటి ఇంటర్నెట్‌లో చదివాను. నాకు బాగా నచ్చింది. ఆ కథ ఇలా కొనసాగుతుంది.
ఓ అడవి బర్రెకి ఓ చిన్న బర్రె (గేదె) పుట్టింది. ఆ చిన్నది కాస్త పెద్దగా అయిన తరువాత తల్లి దగ్గరకు వచ్చి ఇలా అడిగింది.
‘మనం దేని గురించి భయపడాల్సి ఉంటుందీ?’
‘ఒక్క సింహం గురించే మనం భయపడాల్సి ఉంటుంది’ తల్లి జవాబు చెప్పింది.
‘ఓ! అలాగా, సింహం నాకు ఎదురుపడితే దానికి అందకుండా నేను పరుగెడతాను’ అంది పిల్ల.
‘అది తప్పు. అంతకన్నా పెద్ద తప్పు మరేం ఉండదు’ అంది తల్లి.
‘ఎందుకని, అలా చెయ్యకపోతే నన్ను చంపేస్తుంది కదా’ అంది పిల్ల.
‘నువ్వు పరుగెడితే సింహం నిన్ను వెంటాడి వేటాడుతాయి. నీ వీపు మీద దాడి చేసి చంపేస్తాయి.’
‘మరి నేనేం చెయ్యాలి?’ అడిగింది పిల్ల.
‘సింహం నీకు ఎదురుపడితే నువ్వు అక్కడే నిలబడు. భయపడనట్టుగా అక్కడే నిల్చో. సింహం అక్కడ నుండి కదలకపోతే నీ కొమ్ములతో పొడిచే విధంగా చూపించు. నీ గిట్టలతో భూమి మీద గట్టిగా నేలపై కొట్టు. అప్పుడు కూడా అది కదలకపోతే, దాని వైపు నీ కొమ్ములు చూపిస్తూ నడువు. నీ శక్తి మేరకు దాని మీద దాడి చెయ్యి. అంతే!’
‘నువ్వు చెప్పేది వింతగా ఉంది. నాకు భయంగా ఉంది. అది నా మీద దాడి చేసి చంపేస్తుందేమో!’ భయపడుతూ చెప్పింది పిల్ల.
‘మేమందరం వున్నాం. నీకు సహాయం చెయ్యడానికి. మేం లేని పక్షంలో కూడా నువ్వు ఎదుర్కోవాల్సిందే. భయపడితే చచ్చిపోతావు. పరిగెడితే కూడా చచ్చిపోతావు. తిరగబడితే బతికే అవకాశం ఉంది.’
పిల్ల గట్టిగా శ్వాస పీల్చింది. దానికి ధైర్యం వచ్చింది.
మన ప్రపంచంలో కూడా సింహాలు వుంటాయి.
ఎన్నో విషయాలు మనల్ని భయపెడతాయి.
వెంటాడుతాయి. భయపడి పారిపోతే ఎందుకూ పనికిరాకుండా పోతాం.
ఎదుర్కొంటేనే నిలుస్తాం.
మనం శక్తివంతులమని చెప్పడానికి ఎదురు నిలవాలి. ధైర్యంగా ఎదుర్కోవాలి.
అంతే!