S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మంచి వ్యసనం

భారతదేశంలో వ్యాపారస్థులకి, వినియోగదారులకి, ఆదాయం కోసం ప్రభుత్వాలకి, ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకి మద్యం ఉపయోగిస్తోంది. ఒకసారి మద్యానికి అలవాటు పడితే ఇక అందులోంచి బయటపడటం కష్టం. భారతదేశంలోని గ్రామాల్లో మద్యం వినియోగం ఎక్కువ. ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం వినియోగం మీద ఎక్సైజ్ శాఖకి కోటా కూడా విధిస్తున్నాయి.
కేరళలోని మరోటిచల్ అనే గ్రామస్థులు కూడా చాలా కాలంగా సారాకి బానిసలు. 1960-70లలో వారు దొంగ సారాని తయారుచేసుకుని తాగేవారు. ఫలితంగా చాలామంది అనారోగ్యానికి గురయ్యారు. సారా అలవాటు వల్ల జరిగే అన్ని అనర్థాలు ఆ గ్రామస్థులకు జరిగేవి. చివరకి ఆ గ్రామస్థులకి తమ అలవాటు వల్ల తమకే ఎంత విరక్తి కలిగిందంటే, వారు అధికారులని పంపి రైడ్ చేయించి లిక్కర్ దుకాణాలని మూసేయించమని, దొంగ సారాని స్వాధీనం చేసుకోమని ప్రభుత్వాన్ని అర్థించారు.
ఆ గ్రామంలోనే పదో తరగతి చదివే విద్యార్థి సి.ఉన్నికృష్ణన్ దినపత్రికలో ఓ రోజు ఓ వార్తని చదివాడు. అమెరికాకి చెందిన 16 ఏళ్ల బాబీ ఫిషర్ అనే విద్యార్థి చదరంగంలో ఛాంపియన్ అన్నది ఆ వార్త. అతనికి కూడా చదరంగం మీద ఆసక్తి కలిగింది. సమీప గ్రామంలో అది వచ్చిన ఒకతని దగ్గరికి వెళ్లి ఆ ఆటని నేర్చుకోసాగాడు. ఆడుతున్న కొద్దీ అతనికి ఆ ఆట మీద వ్యామోహం అధికం కాసాగింది. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా చదరంగం ఆడటానికి ఆ గ్రామానికి విడవకుండా నిత్యం వెళ్లేవాడు. ఓ రోజు అతనికి అనిపించింది. తన గ్రామస్థులంతా సారా వ్యసనంలో పడితే తను చదరంగం వ్యసనంలో పడ్డాడని. మరు క్షణం అతనికి మెరపులా వారి సమస్యకి పరిష్కారం స్ఫురించింది. సారా మత్తులోంచి వాళ్లు బయటపడటానికి ప్రత్యామ్నాయంగా చదరంగం అలవాటు చేస్తే? అన్నది ఆ పరిష్కారం.
ఉన్నికృష్ణన్ ఆ గ్రామంలోని ఆసక్తిగల అందరికీ చదరంగాన్ని నేర్పించసాగాడు. త్వరలోనే మరోటిచల్ గ్రామస్థులందరిలో కార్చిచ్చులా చదరంగం మీద ఆసక్తి వ్యాపించింది. అతను వారిని సారా తాగేబదులు ఆ సమయంలో చదరంగం ఆడి ఆ వ్యసనాన్ని జయించమని కోరసాగాడు. అతని దగ్గర ఆ ఆటలో శిక్షణ పొందిన 600 మంది ఆ గ్రామస్థులు ఒకరితో మరొకరు ఆ ఆటని ఆడుతూ కాలం గడపసాగారు. ఇందుకోసం సారాని తాగడానికి ఉపయోగించే షెడ్‌ని వేదికగా చేసుకున్నారు. ఒకరినించి మరొకరు ఆ ఆటలోని మెళకువలని నేర్చుకోసాగారు.
ఉన్నికృష్ణన్ త్వరలోనే వారి మధ్య చదరంగం పోటీలని నిర్వహించాడు. ఈ 40 ఏళ్లల్లో ఆ గ్రామస్థులు చదరంగం ఆటలో నిష్ణాతులయ్యారు. మగ, ఆడ తేడా లేకుండా 8 ఏళ్ల పిల్లల నించి 80 ఏళ్ల వృద్ధుల దాకా నిత్యం అంతా చదరంగం ఆట కోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు.
ఆగస్టు 2014లో భారతదేశంలో తొలి చెస్ లిటరేట్ గ్రామంగా మరోటిచల్ గుర్తింపబడింది. ఇండియాలోని లక్షలాది గ్రామాల్లోని మరే గ్రామంలో చదరంగం ఆడే ఇంత అధిక సంఖ్యగల గ్రామస్థులు లేనే లేరు. ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ అంచనా ప్రకారం 90% మంది గ్రామస్థులు చదరంగాన్ని ఆడుతున్నారు. భారత ఛెస్ ఛాంపియన్ విశ్వనాథ్ ఆనంద్ ఆ గ్రామస్థుల ఆహ్వానం మీద మరోటిచల్‌ని సందర్శించి వ్యక్తిగతంగా వారిని అభినందించారు. పేంట్, షర్ట్‌లని టక్ చేసుకున్న ఉద్యోగస్థుల నించి, మాసిన చొక్కా, లుంగీలు ధరించే కూలీల దాకా ఆ గ్రామస్థులంతా చదరంగం ఆడతారు. పెగ్స్ బదులు కింగ్స్ వారి జీవితాల్లోకి ప్రవేశించాయి.
ఉన్నికృష్ణన్ నేడు మరోటిచల్ గ్రామంలో ఓ హోటల్‌ని నడుపుతున్నాడు. అక్కడికి ఏదీ తినకుండా కేవలం చదరంగం ఆడటానికే చాలామంది వస్తూంటారు. తన ఇంటి పక్కనే ఓ షెడ్‌ని కూడా వీరి కోసం నిర్మించాడు.
బిబిసి, సిఎన్‌ఎన్ లాంటి అంతర్జాతీయ టీవీ ఛానెల్స్ ఈ గ్రామం మీద డాక్యుమెంటరీలని నిర్మించారు. ఆగస్టు క్లబ్ అనే పేరుతో ఈ గ్రామం సారా నించి చదరంగం మీదకి మళ్లడం మీద 2013లో కెబి అనే దర్శకుడు మలయాళంలో ఓ సినిమాని తీశాడు.
‘చదరంగం నాకు బాగా ఇష్టమైన ఆట. ఓసారి దాన్ని ఆడటం మొదలుపెడితే ఇక సర్వం మర్చిపోయాను. అది నాకు వ్యసనం’ ఉన్నికృష్ణన్ ఓ పత్రికా విలేకరికి చెప్పాడు.
నేడు మరోటిచల్ గ్రామంలోని కొత్తతరం వారకి సారా అంటే ఏమిటో తెలీదు. చదరంగం అంటే అందరికీ తెలుసు. 64 గళ్ల అందమైన జీవితాన్ని వారు గడుపుతున్నారు.

పద్మజ