S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మెదడుకు సానబెట్టండిలా...

ఆధునిక పోకడలతో, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతోపాటుగా మెదడుకు కొంత భారం తగ్గిందనుకొంటున్నారు కదా వాస్తవికంగా ఆలోచిస్తే మెదడులో జరగాల్సిన అభివృద్ధి ఆగిపోతుందేమోననే భయం వేస్తోంది. మెదడును ఎంతగా వాడుకుంటే అంతగా దాని (మెదడు) పనితనం పెరుగుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా తయారవుతున్నాయి. మనిషి శరీరంలోని ఏదైనా అవయవం పని చేయకపోతే నొప్పి, బాధ అనిపిస్తుంది. వెంటనే ఆ అవయవం పూర్తిగా బాగు అయ్యేంతవరకు శ్రద్ధ వహిస్తున్న మనిషి, అదే ఉజ్వలమైన భవిష్యత్తును మన కళ్ల ముందుకు తీసుకువచ్చే ప్రధానమైన అవయవం మెదడును ఎలా వాడుకోవాలో తెలియకనో ఏమో మెదడు పనితీరుపై శ్రద్ధ చూపడం లేదు.. ఒకరోజు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉదయానే్న లేచి ఆఫీసుకు బయలుదేరుదామని సిద్ధమయ్యారు తీరా టై కనిపించడం లేదనీ లేదా వెహికిల్ కీ కనిపించడం లేదనీ, భార్యపైకి చిందులు వేసే సంఘటనలు కోకొల్లలు. జేబులోనే పెన్ను ఉంటుంది కాని పెన్ను కోసం వెతికే వాళ్లు కూడా ఉన్నారు. కిరాణా షాపులోకి వెళ్లి ఏదైనా వస్తువులు కొంటే వెంటనే కాలిక్యులేటర్ తీసుకొని లెక్కచేసి డబ్బులు ఎంత ఇవ్వాలో చెబుతున్నాడు. నోటికి చేయాల్సిన చిన్నచిన్న లెక్కలకు కూడా కాలిక్యులేటర్‌ను ఉపయోగిస్తూ తన మెదడు మొద్దు బారే విధంగా తయారు చేసుకుంటున్నాడు. ఎందుకిలా జరుగుతోంది.. మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి జీవితాలు, జీవన విధానాలలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచాన్ని అరజేతి (మొబైల్ ఫోన్) లోనే వీక్షిస్తున్న మనిషికి అప్పుడప్పుడు విచిత్రమైన కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. సమయానికి గుర్తుకు రాని యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు, సీక్రెట్ కోడ్‌లతో మతిమరపు వచ్చిందేమోనని అనుమానాన్ని కూడా మెదడు గుర్తు చేస్తుంది.
మెదడును చలాకీగా పనిచేయించుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మెదడు సమర్థవంతంగా పని చేయాలంటే ధ్యానం, యోగా, పోషక విలువలు గల ఆహారం, శారీరక మరియు మానసిక వ్యాయామం ఎంతో దోహదం చేస్తాయి.
ఒకప్పుడు మతిమరుపు అనేది తాతలు, అమ్మమ్మలు, బామ్మలు, నానమ్మలు, వృద్ధులలో ఉండేది. కానీ ఇది ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న సమస్య. విద్యార్థులకు పరీక్షలలో ప్రశ్నలకు జవాబులు గుర్తుకు రాక వేదనకు గురయ్యే వారెందరో. వాస్తవానికి గత దశాబ్ద కాలం నుంచి గమనిస్తే మనం మెదడును పూర్తి స్థాయిలో వాడుకోవడం లేదనే చెప్పాలి. ప్రతి అవసరానికి ఏదో ఒక సాధనం మీద ఆధారపడుతూ మెదడు వాడకాన్ని పూర్తిగా తగ్గించేశాం. దీనివల్ల మెదడు పూర్తి స్థాయిలో పని చేయక డిమోన్షియా, అల్జీమర్స్ వంటి తీవ్ర మతిరుపు సమస్యల ముప్పు పెరుగుతోంది.
2015 నాటి ప్రపంచ అల్జీమర్స్ నివేదిక ప్రకారం.. మన దేశంలో 41 లక్షల మంది అల్జీమర్స్‌తో బాధపడుతున్నారు. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా డిమోన్షియాతో బాధపడే వారిలో 50% ఆసియాలోనే ఉంటారని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు మెదడుకు పని చెప్పడం ఉత్తమం.
పాటించాల్సిన పద్ధతులు.. ఒంటికాలు వ్యాయామం: ఏక పాదాసనం ఒక కాలుపై నిలబడి చేసే వ్యాయామాలు శరీర నియంత్రణకు, తూలి కింద పడకుండా ఉండటానికి, జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండటానికి దోహదం చేసే నాడీ కణాలను ప్రేరేపిస్తాయి.
మానసిక వ్యాయామం: మెదడుకు పదును పెట్టే పదకేళీలు, సుడోకు, లాజికల్ సమస్యల సాధన, పజిల్స్, అబ్రివేషన్స్ గుర్తుకు తెచ్చుకోవడం, ధ్యానం లాంటివి చేస్తూ ఉండాలి.
కొత్త విషయాలు అనే్వషిస్తూ నేర్చుకోవడం: మెదడులో సమాచార ప్రసారం ఒక నాడీ కణం నుంచి మరో నాడీ కణానికి ప్రసరిస్తూ ఉంటుంది. కొత్త విషయాలతో నాడీ కణాల మధ్య కొత్త బంధాలు ఏర్పడుతాయి. ఇలాంటి కొత్త బంధాలు మెదడును చురుకుగా తయారుచేస్తాయి. కొత్త భాష, సంగీతం, వంటలు.. మొదలయినవి.
కొత్త వ్యక్తులతో పరిచయాలు: మనకు మనమే ఏదో ఒక పనిని కల్పించుకొని దానిలో నిమగ్నం కావడం, కొత్త వ్యక్తులను కలవడం, పరిచయాలు, ఆలోచనా విధానాలలో మార్పు చేసుకోవడం, సాధారణంగా మనం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తి వారినే కలుస్తూ ఉంటాం. మంచిదే కానీ ఇతర వృత్తుల వారిని కలిస్తే వైవిధ్యభరిత ఆలోచనలు వస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి.
శారీరక వ్యాయామం: రోజూ కనీసం అరగంటసేపు శారీరక వ్యాయామం చేస్తే శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
నిద్ర: రోజులో 6 నుంచి 7 గంటలపాటు నిద్ర పోవడం వల్ల జ్ఞాపకాలు స్థిరపడతాయి. ఏకాగ్రత కుదురుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది.
పై వాటితోపాటుగా జ్ఞాపకశక్తి, ఆలోచనా నైపుణ్యాలను పెంపొందించే జింక్, ఒత్తిడిని తగ్గించే మెగ్నిషియం, మూడ్‌ని ఉత్సాహపరిచే సెరటోనిన్ అధిక మొత్తంలో లభించే గుమ్మడి గింజలు తీసుకోవాలి.
ప్రతీది చేయలేం. కానీ ప్రయత్నిస్తే కష్టంగా అనిపించే వాటిని కూడా పరిష్కరించుకోవచ్చు.

-డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321