S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్వస్తిశ్రీ వికారి నామ సంవత్సర గోచార ఫలితాలు

మేషం
ఆదాయం -14, వ్యయం -14; రాజపూజ్యం -3, అవమానం -6
మేషరాశి వారికి ఈ సంవత్సరం గురువు గోచారరీత్యా నవంబర్ 4 వరకు అష్టమంలోను తరువాత సంవత్సరాంతం వరకు నవమంలో సంచరిస్తాడు. అష్టమంలో సంచరించడం వల్ల గౌరవ లోపాలకు అవకాశం ఉంటుంది. చేసే అన్ని పనుల్లో పూర్వపుణ్యం అధికంగా ఖర్చవుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ధార్మిక కార్యక్రమాల కోసం ఖర్చు చేయడం మంచిది. సంవత్సరాంతం నుండి గురువు నవమ సంచారం వల్ల ఉన్నత విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. పరిశోధకులు తమ పరిశోధనలను కొనసాగిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతృప్తి లభిస్తుంది. ఆధ్యాత్మిక యాత్రలు, దూర ప్రయాణాలు చేస్తారు. 2020 జనవరి 24 వరకు శని నవమ సంచారం వల్ల కార్యనిర్వహణలో లోపాలు ఏర్పడతాయి. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. అంత తొందరగా లభించకపోవచ్చు. 24 జనవరి 2020 తర్వాత సొంత రాశి దశమంలో సంచారం వల్ల వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేసే పనుల్లో కొంత నెమ్మదితనం ఉంటుంది. రాహువు తృతీయ సంచారం వలన సహకార లోపాలు ఉంటాయి. కమ్యూనికేషన్స్ అంత అనుకూలించవు. దగ్గరి ప్రయాణాల్లో లోపాలు ఉంటాయి. నవమంలో కేతు సంచారం వల్ల ఆధ్యాత్మిక ప్రగతి కుంటుపడుతుంది. సంతృప్తి లోపాలకు అవకాశం. అనుకున్నంత తొందరగా పనులు పూర్తి చేయలేరు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నందున వీరు మంచి పనులకై ఖర్చులు చేయడం మంచిది. దాచుకోవాలని చూస్తే ధనం నిల్వ ఉండదు. ఈ సంవత్సరం అంతా దైవ, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకై ఖర్చులు చేయడం మంచిది. వీరికి హరహర శంకర జయజయ శంకర, దుర్గాస్తోత్ర పారాయణలు శ్రేయస్సును కలిగిస్తాయి.

వృషభం
ఆదాయం -8, వ్యయం -8: రాజపూజ్యం -6, అవమానం -6.
ఈ రాశి వారికి గురువు గోచార రీత్యా నవంబర్ 4 వరకు సప్తమంలోను సంవత్సరాంతంలో అష్టమ సంచారం చేస్తాడు. సామాజిక అనుబంధాలు పెంచుకోవాలనే ప్రయత్నం అధికంగా చేస్తారు. తమకన్నా ఉన్నతులు, గొప్పవారితో పరిచయాలు పెంచుకుంటారు. పెట్టుబడులు విస్తరించే ప్రయత్నం చేస్తారు. తమ స్టేటస్‌ను పెంచుకునే ప్రయత్నంలో అధికంగా ఖర్చులు చేస్తూ ఉంటారు. సామాజిక అనుబంధాలు, వివాహ అనుబంధాల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. భాగస్వాములతో కొంత కలసిమెలసి జాగ్రత్తగా వ్యవహరించాలి. నవంబర్ తర్వాత అష్టమ సంచారం కూడా అంత మంచిది కాదు. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనవసర ఖర్చులు ఉంటాయి. పరామర్శలకు అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. శని అష్టమ సంచారం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. ఆరోగ్య విషయంలో జాగరూకులై ఉండటం మంచిది. జనవరి 2020 తర్వాత శని నవమ సంచారం వలన ఆధ్యాత్మిక ప్రగతి కొంత పెరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. అధిక శ్రమానంతరం సంతృప్తి లభిస్తుంది. రాహువు ద్వితీయ సంచారం వలన మాటల వల్ల జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి మాట్లాడకూడదు. ఎదుటి వారు అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిల్వ ధనాన్ని కోల్పోతారు. అనవసర ఖర్చులు అధికంగా ఉంటాయి. కేతువు అష్టమ సంచారం వల్ల శ్రమ అధికంగా ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోలేరు. నిరాశా నిస్పృహలు అధికంగా ఉంటాయి. పరామర్శలు చేస్తారు. హాస్పిటల్స్ కోసం ఖర్చులు చేస్తారు. వీరు ఈ సంవత్సరం దానధర్మాలకు ఖర్చులు చేయాలి. గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఏ విషయంలోనూ తొందరపాటు పనికిరాదు. గణపతిపూజ, శివారాధన, దత్తాత్రేయ పారాయణం మేలు చేస్తాయి.

మిథునం
ఆదాయం -11, వ్యయం -5; రాజపూజ్యం -2, అవమానం -2.
ఈ రాశి వారికి గురువు గోచార రీత్యా నవంబర్ 2019 వరకు షష్ఠమంలోను నవంబర్ తర్వాత సప్తమంలో సంచారం ఉంటుంది. గురువు షష్ఠ సంచారం వలన పోటీల్లో గెలుపునకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. తనకంటే పెద్దవారితో ఉన్నతులతో పోటీలు ఎక్కువగా ఉంటాయి. దాని వలన మనస్పర్థలు పెరిగే సూచనలు కనపడుతున్నాయి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక వ్యవహారాలు పూర్తి చేసుకుంటారు. తదనంతరం సప్తమ సంచారం వలన సామాజిక అనుబంధాలు అనుకూలిస్తాయి. భాగస్వాములతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. పెట్టుబడుల విషయంలో ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అనారోగ్య సూచనలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. శని 2020 జనవరి 24 వరకు ధనస్సులోను తరువాత తన స్వక్షేత్రమైన మకరంలో సంచరిస్తాడు. శని సప్తమ సంచారం వల్ల అనాలోచిత పనులు చేస్తారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సామాజిక అనుబంధాలు అంతగా విస్తరించవు. వ్యాపారస్తులు జాగరూకులై ఉండాలి. ఆధ్యాత్మిక యాత్రలకు ప్రాతినిధ్యం వహిస్తారు. మోసపోయే అవకాశాలుంటాయి. స్నేహ సంబంధాలు అంత ఎక్కువగా పెంచుకోకూడదు. భాగస్వాములతో ఒత్తిడులు తప్పవు. రాహువు మిథునంలో కేతువు ధనుస్సులో సంచారం వలన అన్నీ తమకే కావాలనే ఆశ పెరుగుతుంది. శ్రమ అధికం అవుతుంది. సమయం, కాలం, ధనం అన్నీ వృథా అవుతాయి. కేతువు వల్ల సామాజిక అనుబంధాల్లో విభేదాలు ఏర్పడే అవకాశం కనపడుతోంది. పెట్టుబడులు విస్తరణ తగ్గుతుంది. వీరు దుర్గాస్తోత్ర పారాయణ, శ్రీరామ జయరామ జయజయ రామ రామరామ జపం మంచిది.

కర్కాటకం
ఆదాయం -5, వ్యయం - 5: రాజపూజ్యం -5, అవమానం -2.
ఈ రాశి వారికి నవంబర్ 4 వరకు గురువు పంచమంలోను తరువాత సంవత్సరాంతంలో గురువు షష్ఠంలో సంచారం ఉంటుంది. వీరికి సంతానం విషయంలో సంతోషం కలుగుతుంది. ఆలోచనలు అనుకూలిస్తాయి. చేసే పనుల్లో ఉత్సాహం, క్రియేటివిటీ పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటారు. కళాకారులకు అనుకూల సమయం. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. నవంబర్ 4 తరువాత అనవసర వత్తిడులు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. శారీరక బలం పెరుగుతుంది. పట్టుదలతో పనులు సాధిస్తారు. 2020 జనవరి 24 వరకు శని షష్ఠంలో తరువాత సప్తమంలో సంచారం ఉంటుంది. వీరు పోటీల్లో గెలుపునకై ప్రయత్నిస్తారు. గౌరవం పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. రాహువు వ్యయంలోను కేతువు షష్ఠంలో సంచారం చేస్తారు. రాహువు వలన అనవసర ఖర్చులు చేస్తారు. విశ్రాంతికై ప్రయత్నం అధికంగా ఉంటుంది. సమయానికి తగిన విశ్రాంతి లభించదు. దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. కొంత డబ్బు ఖర్చు అయినా విదేశాలకు వెళతారు. షష్టంలో కేతువు వలన పోటీల్లో శ్రమకు తగిన గుర్తింపు రాదు. నిరాశ నిస్పృహలు పెరుగుతాయి. శారీరక, మానసిక ఒత్తిడి, చికాకులు పెరుగుతాయి. సంతృప్తి లోపిస్తుంది. వీరు నిరంతరం దుర్గాస్తోత్ర పారాయణలు, దుర్గాపారాయణం చేసుకోవడం మంచిది.

సింహం
ఆదాయం -8, వ్యయం -14; రాజపూజ్యం -1, అవమానం -5
ఈ రాశి వారికి ఈ సంవత్సరం నవంబర్ 4 వరకు గురువు చతుర్థంలో, సంవత్సరాంతం తరువాత గురువు పంచమంలో సంచారం ఉంటుంది. గురువు చతుర్థ సంచారం వలన వీరికి సౌకర్యాలు ఒత్తిడితో పూర్తి చేసుకుంటారు. సౌకర్యాలను పూర్తి చేసుకోవడం కోసం ఖర్చులు పెడతారు. ఈ సౌకర్యాలను పెంచుకోవడం కోసం కొంత అవమానాలను భరిస్తారు. గృహ, ఆహారాదుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రలకై ఖర్చు పెడతారు. వత్సరాంతంలో గురువు పంచమంలో సంచరించడం వలన సంతాన సంబంధ ఆలోచనల్లో అనుకూలత ఏర్పడుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. పెట్టే ఖర్చులు వృథా కాకుండా చూసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతృప్తి లభిస్తుంది. శని 2020 జనవరి వరకు పంచమంలో సంచారం వలన సృజనాత్మకత తగ్గుతుంది. కూర్చుండి చేసే పనుల వైపు ఆలోచన పెరుగుతుంది. ఆత్మీయులు దూరమయ్యే అవకాశం ఉంటుంది. మానసిక వత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం ఉంటుంది. షష్ఠమం సంచారంలో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సేవకజన సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. దగ్గరి ప్రయాణాలు కూడా చేస్తారు. రాహువు లాభంలో సంచారం వలన వీరికి అత్యాశ ఎక్కువగా ఉంటుంది. శ్రమలేని సంపాదనపై దృష్టి పెడతారు. వాటి జోలికి వెళ్లకూడదు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కేతువు పంచమ సంచారం వలన అనాలోచిత ఖర్చులు చేస్తారు. ఆలోచనల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ఏదైనా పని చేసే ముందు ఎదుటివారి సలహా అడిగి పనులు ప్రారంభించడం మంచిది. వీరు దుర్గాస్తోత్ర పారాయణ, శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

కన్య
ఆదాయం -11, వ్యయం -5; రాజపూజ్యం -4, అవమానం -5.
ఈ రాశి వారికి గురువు నవంబర్ 2019 వరకు తృతీయంలోను సంవత్సరాంతంలో చతుర్థంలో సంచారం ఉంటుంది. తమకంటే పెద్దవారి సహాయ సహకారాలు వీరు అందుకుంటారు. పెద్దవారితో స్నేహ సంబంధాలు పెంచుకుంటారు. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. నూతన పరిచయస్తులతో సంతోషంగా కాలం గడుపుతారు. కమ్యూనికేషన్స్ కొంత ఒత్తిడిని కలిగిస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం. దగ్గరి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. వత్సరాంతంలో చతుర్థ సంచారం వలన అనుకోని ఖర్చులు ఉంటాయి.
విందు వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు కొంత శ్రమ. ఒత్తిడి ఉంటుంది. శని జనవరి 2020 వరకు చతుర్థంలో ఉంటాడు. పొట్ట సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో జాగ్రత్త అవసరం. ఒత్తిడితో సౌకర్యాలను పూర్తి చేస్తారు. ధనాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తారు. శని పంచమ సంచారం వలన సంతానం కోసం సమయాన్ని కేటాయిస్తారు. మానసిక వత్తిడి అధికంగా ఉంటుంది. సృజనాత్మకతను కోల్పోతారు. ఏ పని చేసినా సొంత ఆలోచనలతో చేయకూడదు. ఒకరి సలహా పాటించడం మంచిది. రాహువు దశమంలో సంచారం వలన వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి కనిపిస్తుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. ఎంత అనుకూలత, అభివృద్ధి ఉన్నా వాటికి కొంత శ్రమ తప్పనిసరిగా తోడవుతుంది. శ్రమకు తగిన గుర్తింపు రాకపోవచ్చు. కేతువు చతుర్థ సంచారం విద్యార్థులకు కష్టకాలం అవుతుంది. ఎక్కువ శ్రమతో తక్కువ ఫలితాలు వస్తాయి. గౌరవ భంగం సూచితవౌతోంది. వీరు విష్ణు సహస్ర నామ పారాయణ, గణపతి ఆరాధన మంచి ఫలితాలనిస్తాయి.

తుల
ఆదాయం -8, వ్యయం -8; రాజపూజ్యం -7, అవమానం -1.
ఈ రాశి వారికి గురువు సంవత్సరాంతం వరకు ద్వితీయంలో సంచారం ఉంటుంది. వీరి వాక్ చాతుర్యం పెరుగుతుంది. కుటుంబంలో గౌరవాదులు వృద్ధి చెందుతాయి. నిల్వధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. అన్ని పనుల్లో సంతృప్తి లభిస్తుంది. గౌరవాదులు వృద్ధి చెందుతాయి. వత్సరాంతం తరువాత తృతీయ సంచారం వలన తమకంటే ఉన్నతులతో స్నేహానుబంధాలు పెంచుకుంటారు. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. విశ్రాంతికై ప్రయత్నం పెరుగుతుంది. శని 24 జనవరి 2020 వరకు తృతీయంలో సంచారం ఉంటుంది. సేవకజన సహకారం పెరుగుతుంది. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. చిత్త చాంచల్యం తగ్గుతుంది. సంతానం విషయంలో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. సృజనాత్మకతను కోల్పోతారు. జనవరి 2020 తర్వాత చతుర్థ సంచారం ఉంటుంది. పోటీల్లో గెలుపునకై ప్రయత్నిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఏ పనుల్లోనైనా ఒత్తిడి అధికంగా ఉంటుంది. కొంత పనుల్లో ఆలస్యం జరుగుతుంది. పనులను వాయిదా వేయరాదు. రాహువు నవమ సంచారం వలన దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు శ్రమతో ఫలితాలు సాధిస్తారు. సంతృప్తి తక్కువగా ఉంటుంది. ఎదుటి వారిపై విజయం సాధించడానికి చాలా కష్టపడతారు. కేతువు తృతీయ సంచారం వలన సహకారం లభించినా తృప్తి ఉండదు. రచనలపై ఆసక్తి తక్కువగా ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. వీరికి విష్ణుసహస్ర నామ పారాయణ, శివారాధన మంచి ఫలితాలనిస్తాయి.

వృశ్చికం
ఆదాయం -14, వ్యయం -14; రాజపూజ్యం -3, అవమానం -1.
ఈ రాశి వారికి నవంబర్ వరకు గురువు జన్మరాశిలో సంచరిస్తాడు. గురువు జన్మరాశిలో సంచరించడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదులు చేసుకునే వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. స్థాన చలనం తప్పనిసరిగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు రూపకల్పన చేసుకుంటారు. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. నవంబర్ 2019 తరువాత ద్వితీయంలో గురు సంచారం వలన నిల్వధనం పెంచుకుంటారు. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. మాట విలువ పెరుగుతుంది. వాగ్దానాలు నెరవేరుతాయి. మధ్యవర్తిత్వ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. శని ద్వితీయ సంచారం వలన జనవరి 2020 వరకు మాట విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. నవంబర్, డిసెంబర్, జనవరి మూడు నెలలు మాట విషయంలో అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి. కుటుంబంలో గౌరవాన్ని తగ్గకుండా చూసుకోవాలి. వచ్చే సంవత్సరంలో తృతీయ సంచారం వలన సేవక జన సహకారం బాగా లభిస్తుంది. కావలసిన పనులు పూర్తి చేసుకుంటారు. ఆద్యాత్మిక యాత్రలు పూర్తి చేస్తారు. ధార్మిక కార్యక్రమాలకు ధనాన్ని వెచ్చిస్తారు. గౌరవం పెరుగుతుంది. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. రాహువు అష్టమ సంచారం వలన ఊహించని ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. హాస్పిటల్స్ సందర్శనం అధికంగా ఉంటుంది. శ్రమలేని ఆదాయంపై ఊహలు ఉంటాయి. అనవసర ఖర్చులు అధికంగా చేస్తారు. కేతువు ద్వితీయ సంచారం వలన మాటల్లో నిరాశ నిస్పృహలు ఉంటాయి. మాటల లవల్ల కుటుంబ సంబంధాలు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త వహించాలి. వీరు నిరంతరం శ్రీదత్త శ్శరణం మమ, విష్ణు సహస్ర నామ పారాయణ చేసుకోవడం మంచిది.

ధనస్సు
ఆదాయం -2, వ్యయం -8; రాజపూజ్యం -6, అవమానం -1.
ఈ రాశి వారికి గురువు నవంబర్ 2019 వరకు వ్యయంలోను తరువాత సంవత్సరం జన్మరాశిలోనూ సంచరిస్తాడు. ధార్మిక కార్యక్రమాలకు ఖర్చులు చేస్తారు. గృహ నిర్మాణాలకై చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. అనుకోని ఇబ్బందులు, గౌరవ లోపాలకు అవకాశం ఏర్పడుతుంది. దాన ధర్మాలకు ఖర్చు చేయడం మంచిది. నవంబర్ తర్వాత జన్మరాశిలో సంచరించడం వలన ఉద్యోగులకు బదిలీలకు అవకాశం. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం. శ్రమతో కార్యనిర్వహణ, విజయం లభిస్తాయి. ఆలోచనలకు అనుకూలం. సంతానవర్గ అభివృద్ధి. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. పరిచయాలు విస్తరిస్తాయి. అన్ని పనుల్లో సంతృప్తి లభిస్తుంది. దూర ప్రయాణాలకు అవకాశం. శని దాదాపుగా 2020 జనవరి వరకు ఈ రాశిలోనే సంచారం చేయడం వల్ల కొంచెం బద్దకం ఏర్పడుతుంది. అన్ని పనుల్లోనూ ఆలస్యం. నిర్ణయాదులు సమీక్షించుకోవాలి. కార్యక్రమాలన్నీ వాయిదా పడుతుంటాయి. యోగ, ప్రాణాయామాదులు అవసరం. సేవక జన సహకారం లభిస్తుంది. తాము ఇతరులకు సేవాదులు నిర్వహించాలి. పరిచయాలు, భాగస్వామ్యాల్లో లోపాలుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు. శ్రమ అధికవౌతుంది. రాహువు సప్తమంలో సంచారం వలన సామాజిక అనుబంధాలు పెంచుకుంటారు. అనవసర ఖర్చులు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. నూతన పరిచయాల వల్ల జాగ్రత్తగా ఉండాలి. కేతువు తమ రాశిలో సంచారం వలన చేసే పనుల్లో కొంత నిరాశ నిస్పృహలు ఉంటాయి. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. కాలం, శ్రమ, ధనం అన్నీ వృథా అవుతాయి. వీరు గణపతిస్తోత్ర పారాయణ, శివుడికి అభిషేకాలు, హరహర శంకర జయజయ శంకర జపం చేసుకోవడం మంచిది.

మకరం
ఆదాయం -5, వ్యయం -2; రాజపూజ్యం -2, అవమానం -4.
ఈ రాశి వారికి గురువు నవంబర్ 2019 వరకు లాభంలోను 2019 నవంబర్ 4 తరువాత వ్యయంలో సంచారం ఉంటుంది. లాభంలో సంచరించడం వల్ల శ్రమతో లాభాలుంటాయి. వేరువేరు ప్రయోజనాలపై దృష్టి సారిస్తారు. ఇతరుల సహకారం లభిస్తుంది. సోదర వర్గంతో అనుకూలత. దగ్గరి ప్రయాణాలుంటాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. పరిచయాలు విస్తరిస్తాయి. భాగస్వామ్య స్నేహానుబంధాల్లో అనుకూలత. 2019 నవంబర్ తర్వాత వ్యయ సంచారం వలన ధార్మిక ఖర్చులు ఉంటాయి. శుభ కార్యక్రమాల నిర్వహణ ఉపయోగపడుతుంది. అనుకోని ఇబ్బందులు వస్తాయి. గృహ నిర్మాణాలకై ఖర్చు అధికంగా చేస్తారు. పెద్దలతో పోటీలు పెట్టుకోకూడదు. శని వ్యయంలో సంచరించడం వలన విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. నిద్ర పట్టకపోవచ్చు. ఆసుపత్రుల్లో పరామర్శలు ఉంటాయి. వ్యర్థమైన ప్రయాణాలకు అవకాశం. కుటుంబంలో, ఆర్థిక నిర్వహణలో ఇబ్బందులు అధికం. వ్యతిరేకతలను అధిగమిస్తారు. పోటీల్లో విజయం. అసంతృప్తి. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో అనుకూలత. జనవరి 2020 తర్వాత జన్మరాశిలో సంచరించడం వలన కొంత పనుల్లో ఆలస్యం అవుతుంది. ఒత్తిడితో పనులు పూర్తి చేస్తారు. పోస్ట్‌పోన్‌మెంట్ పనికిరాదు. యోగా, ప్రాణాయామాదులు తప్పనిసరిగా ప్రతిరోజూ చేసుకోవాలి. రాహువు షష్ఠ సంచారం వల్ల పోటీలు అధికంగా ఉంటాయి. ఎక్కువ శ్రమతో ఫలితాలు సాధిస్తారు. వ్యతిరేకతలపై విజయం ఉంటుంది. కేతువు వ్యయ సంచారం వలన ఖర్చులుంటాయి. కాలం ధనం వ్యర్థం అవుతాయి. నిద్ర లోపాలు ఉంటాయి. అనవసర ఖర్చులు చేస్తారు. వీరు గణపతి ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం వినడం తప్పనిసరి.

కుంభం
ఆదాయం -5, వ్యయం - 2; రాజపూజ్యం -5, అవమానం -4.
ఈ రాశి వారికి గురువు నవంబర్ వరకు దశమంలోను నవంబర్ 2019 తర్వాత లాభంలో సంచారం ఉంటుంది. గురువు దశమ సంచారం వలన వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు లభిస్తుంది. శ్రమతో ఫలితాల సాధన చేస్తారు. అనేక కార్యక్రమాల భారం పెరుగుతుంది. కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మాట విలువ పెరుగుతుంది. వాహనాలు, గృహ సంబంధాంశాల్లో శ్రమతో ఫలితాలు సాధిస్తారు. పెద్దలతో వ్యతిరేకతలు ఉంటాయి. లాభంలో సంచారం వలన అన్ని పనుల్లో ప్రయోజనాలు ఉంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. పెద్దవారి సహకారం లభిస్తుంది. దైవిక, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. సోదర వర్గం వారితో అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. శని జనవరి 2020 వరకు లాభంలో సంచారం 2020 జనవరి తర్వాత వ్యయ సంచారం ఉంటుంది. శని లాభ సంచారం వలన అన్ని రకాల లాభాలు ఉంటాయి. నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆలోచించాలి. అన్ని పనుల్లో ఆలస్యాలకు అవకాశం ఉంటుంది. ఆలోచనల్లో వత్తిడి ఉంటుంది. సంతాన సమస్యలు ఉంటాయి. శని వ్యయ సంచారం వలన విశ్రాంతి లోపాలకు అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చులు ఉంటాయి. పరామర్శలు చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. రాహువు పంచమ సంచారం వలన ఆలోచనల్లో క్రియేటివిటీ తగ్గుతుంది. సంతానవర్గ సమస్యలు అధికం అవుతాయి. మానసిక ప్రశాంతతకై ప్రయత్నిస్తారు. కేతువు లాభంలో సంచరించడం వలన పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సంతృప్తికర జీవితం గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. దూర ప్రయాణాలు చేస్తారు. వీరు విష్ణు సహస్ర నామ పారాయణ, గణపతి స్తోత్రాలు చదువుకోవడం మంచిది.

మీనం
ఆదాయం -2, వ్యయం -8; రాజపూజ్యం -1, అవమానం -7.
ఈ రాశి వారికి గురువు నవంబర్ 2019 వరకు నవమంలోనూ 2019 నవంబర్ 4 తరువాత దశమంలో సంచారం ఉంటుంది. నవమ సంచారం వలన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది. అన్ని పనుల్లో సంతృప్తి కలుగుతుంది. ధార్మిక కార్యక్రమాలపై దృష్టి అధికంగా పెడతారు. తీసుకునే నిర్ణయాలు అనుకూలిస్తాయి. స్పష్టత ఉంటుంది. నూతన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. నవంబర్ 2019 తర్వాత దశమంలో సంచారం వలన వృత్తి ఉద్యోగాదుల్లో కొంత ఒత్తిడి పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉంటుంది. అధికారిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమతో పనులు సాధిస్తారు. శని 2020 జనవరి వరకు దశమ సంచారంలో ఉంటాడు. దశమంలో సంచారం వలన అధికారులతో పోటీలు అధికంగా ఉంటాయి. బాధ్యతలు పెరిగి ఇబ్బంది పెడతాయి. ఖర్చులు వ్యర్థమైనవి అధికంగా ఉంటాయి. ఆసుపత్రులు, పరామర్శలు తప్పవు. సౌకర్యాల లోపం ఉంటుంది. జనవరి తర్వాత లాభంలో సంచారం వలన నిర్ణయాదులను సమీక్షించుకోవాలి. ఆలస్యాలకు అవకాశం ఉంటుంది. అన్ని పనుల్లోనూ వత్తిడి ఏర్పడుతుంది. అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. రాహువు చతుర్థ సంచారం వలన సౌకర్య లోపాలకు అవకాశం ఉంటుంది. గృహ, వాహనాదుల విషయంలో శ్రమ తప్పదు. ఆహార విహారాల్లో సమస్యలు ఎదురౌతాయి. కేతువు దశమ సంచారం వలన అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. నిర్ణయాదులు పనికిరావు. వీరు విష్ణుసహస్ర నామ పారాయణ, శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744