మంచి రోజు (సండేగీత )
Published Saturday, 11 May 2019సమయం, సందర్భం, ముహూర్తం, వీటిని చాలా మంది పాటిస్తూ ఉంటారు.
రోజు కూడా అంతే!
ఈ రోజు మంచి రోజు.
ఈ రోజు మంచి రోజు కాదు. ఇలా ఎన్నో.
ఏవో కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరుగుతాయి. అప్పుడు మంచి ముహూర్తంలో బయల్దేరలేదని అంటూ వుంటారు.
ఎంతో మంచి ముహూర్తాలు చేసి వివాహాలు జరిపిస్తారు. అయినా చాలామంది విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూనే కన్పిస్తారు.
యవ్వనంలో వీటిని నమ్మని వ్యక్తులు కొంత వయసు మీద పడిన తరువాత విశ్వసిస్తూ ఉంటారు.
ఏ రోజు గొప్ప రోజు?
ఏ సమయం గొప్ప సమయం?
ఎవరూ చెప్పలేరు.
ఇది ఎవరికి వారే చెప్పుకోవాలి. ఎవరికి వారే సృష్టించుకోవాలి.
గొప్ప రోజులు వుండవు.
గొప్ప రోజుని సృష్టించుకోవాలి.
వాతావరణం మన చేతిలో వుండదు. చాలా విషయాలు మన నియంత్రణలో వుండవు.
కానీ
ప్రతి సమయం మీదా
ప్రతిరోజు మీదా
ఆశావహ దృక్పథం ఉండాలి.
అప్పుడు ప్రతిరోజు గొప్ప రోజు అవుతుంది.
అలా లేనప్పుడు
మంచి రోజు కూడా వృథా అవుతుంది.
ఈ రోజు అద్భుతమైన రోజు.
కాదంటారా?