S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కథకుడి పరిజ్ఞానం

కథలు వ్రాసేవాడు (కథకుడు) కళ్లు పెట్టుకు చూడాలి. చెవులు విప్పుకుని వినాలి. పంచేంద్రియాలతోను పరిసరాలను పరికించుకోగలగాలి. ఇంద్రియాలతో చూచినదంతా వెంటనే పనికి రాకపోవచ్చును. మనస్సులో మటుకు నిక్షిప్తంగా వుంటుంది. ఎప్పుడో దాగుడుమూతలు ఆడుతున్నట్లుగా ముందుకు వచ్చి ‘నన్ను ఉపయోగించుకో’ అని అంటుంది.
కథకుడి మనస్సే అతని కంప్యూటర్. జ్ఞాపకాల పెట్టె. సంవత్సరాల తరబడి అతని మనస్సులో మూలుగుతూ వున్న విషయం ఎప్పుడో ఒకప్పుడు బయటకు రాక తప్పదు. అది సాహిత్యం కావచ్చును, కాకపోవచ్చును. బయటకు రావడం మటుకు తథ్యం. కొందరు తమ జ్ఞాపకాలను, అనుభూతులను, ఆలోచనలను పుస్తకం పేజీలలో తెల్లకాగితాల మీద భద్రంగా దాచుకుంటారు. మనస్సు మీద ‘నమ్మకం’ లేకపోవడం, అవసరానికి గుర్తుందేమోనన్న ఆదుర్దా యిందుకు కారణం. బయటకు చెప్పవలసిన అవసరం వుంటే- అది ఎలాగయినా బయటకు వస్తుంది.
కొన్ని భావాలు పదిలంగా కూర్చుంటాయి.
1. అర్ధరాత్రి అయినా బయటి యింటి పడక గది/ హాలులో దీపం యింకా దేదీప్యమానంగా వెలిగిపోతూ వుండడం.
2.అంగడివాడి అలముక మాటలు యేదో వేదాంతాన్ని సూచించినట్లుగా అనిపించడం.
3. హోటల్‌లో పనిచేసే అమ్మాయి కొత్త రకం దుస్తులు ధరించి, తనను ఎవరో వరించి వస్తారని ఎదురుచూడడం.
ఇలా ఎన్నయినా సందర్భాలు ఎదురుకావచ్చును.
తరువాత కథలుగా విస్తరణ పొంది ముద్రణ భాగ్యం పొందవచ్చు.
అలాగే కథలకు కావలసిన పాత్రలు ఎక్కడయినా దొరకవచ్చు.
1. వార్తా పత్రికలో చదివిన ఒక కథనంలో మనుషులు
2. ఉభయ కుశలోపరి సంభాషణలలో అలవోకగా మాట్లాడే మనుషులు
3. చదువుతున్న పుస్తకంలో యిదివరకే కనిపించిన పాత్రల కొత్త రూపాలు
4. కుటుంబ వాతావరణంలో విచ్చలవిడిగా వుండే సభ్యులు.
5. దొంగతనం చేస్తూ పట్టుబడిపోయిన మనుషులు
6. తెలివితేటలుగా మాట్లాడుతున్నాం అనుకునే తెలివితక్కువ వాళ్లు
జీవితాన్ని అనవరతము ఆశ్రయించుకు వర్తించే మనిషి. తన తెల్లకాగితాల మీద ఆధారపడనక్కర్లేదు, మనసు పొరలు విస్తరించుకుంటే చాలు.
జీవితాన్ని గురించి ఆదర్శాలు కొన్ని స్థిరపరచుకున్న కథకుడు తనకు కనిపించిన ప్రతి మనిషినీ తన అంచనాలతో బేరీజు వేసుకుంటాడు.
ఈ సందర్భంలో నేనయితే ఎలా ప్రవర్తిస్తాను-అనేది సూత్రప్రాయమయిన ఆలోచన ధోరణి.
తను చూచిన సంగతులు తిరిగి చెప్పేటప్పుడు ‘నాటకీయత’ ప్రదర్శించడం రచనయి వుండాలి. తనకు తెలియని విషయాలను గురించి రాసేటప్పుడు, వాటిలో నిజానిజాలు, సందర్భశుద్ధీ సరిగా వున్నవాకదా అని సరిచూచుకోవాలి. తెలియని వాటిని గురించి రాయకుండా వుండడం శ్రేయస్కరం అయిన పని. కథకుడు తాను చెప్పదలుచుకున్నదంతా కథ మొదట్లోనే చెప్పి వేయడు. అలాగని కథాంతం కోసం ఎదురుచూడడు. కథ మధ్యలోనే తాను కాకుండా- యితర మనుషులచేత ‘అన్యాపదేశం’గా చెప్పేస్తాడు.
పాత్రలు చెప్పే మాటలన్నీ కథకుడు ఉద్దేశించినవే అయినా, అవన్నీ అతని ఉద్దేశాలు అని అనుకుందుకు వీలులేకుండా బహుజాగ్రత్తగా ప్రవర్తించాలి. పాత్రల ఖండన మండలాలలో కథకుడి వ్యక్తిత్వం బయటపడుతుంది గాని అతని అభిప్రాయాలు యధాతథంగా మిళితం కావు.
‘కథకు బీజం’- అని ఒకటుంటుంది. అది కథ మధ్యలో వుంటుంది గాని, ఆకుల్లోను- వేరుల్లోను వుండదు. చెట్టుకు ‘పండు’లానే బలంగా దృఢంగా వుంటుంది.
జీవితాన్ని గురించి ఒక దృక్పథం వుంటుంది కథకుడికి. అందుకు విభిన్నమయిన దృక్పథం వున్నవాళ్లు అతని కథల్లో పాత్రలు అవుతారు.
1. ఉన్నదానితో తృప్తిపడలేక పోయినవాళ్లు.
2. జీవితంతో రాజీపడగల మనస్తత్వం లేనివాళ్లు.
3. అసూయ, ఈర్ష్య, ద్వేషం- మానవ లక్షణాలే అనుకునేవాళ్లు.
4. దుఃఖంనుంచి శాంతి స్థాపనకు వెదుక్కునేవాళ్లు.
5. దిగుల నుంచి నవ్వుల వర్షం కురిపించగలవాళ్లు.
6. చేతనయిన సహాయం చేసి, చేతులు దులిపేసుకునే వాళ్లు.
ఇలా రకరకాల మనుషులు, ప్రతిక్షణమూ తపనపడుతూ వుంటారు. వాళ్లలో వున్న మరో ఒక లక్షణం, అవలక్షణం, కథకు మూల వస్తువుగా వాడుకోగలగడం కథకుడికి చేతకావాలి.
చెబుతున్న విషయం మన భాషలో చెబుతున్నామా - లేక పాఠకుడికి అర్ధం అయ్యేశైలిలో, పద్ధతిలో చెబుతున్నామా అనేది ఎంతో ముఖ్యం.
అయిన విషయం నుంచి సంగతులను, చెడ్డ్ధోరణిలో చెప్పిన కథనంతటినీ ఆమోదయోగ్యం కాకుండా చేసే కథకులు కొందరున్నారు. వ్యభిచారం చేయడం మంచిది కాదని చెబుతూనే వ్యభిచారంచేసే మనుషుల్ని పొగడి కీర్తించడం యిలాంటి ప్రక్రియే. లంచగొండితనం సరికాదంటూనే లంచగొండులను సమర్ధించే పాత్రలను ప్రవేశపెట్టడం యిలాంటి అవకతవక పద్ధతే.
కథ మొత్తం కథకుడి తత్త్వాన్ని ఎత్తిచూపుతుంది. ‘పాత్రలో’ను గమనానికి తీసుకువస్తుంది.

- శ్రీవిరించి