S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పరివర్తనం

ఆరు సంవత్సరాలుగా ‘ఓ చిన్న మాట’ రాస్తున్నాను. కొంతకాలం తరువాత దానికి తోడు ‘సండే గీత’ కూడా మొదలైంది. ఎక్కడో నాకు నచ్చిన రెండు చిన్న కథలను తెలుగు అనువాదం చేసి రాశాను. అలా మొదలైన ఈ ఫీచర్ అలా నడుస్తూనే వుంది. ఇప్పటికి ఇవి రెండు పుస్తకాలుగా వచ్చాయి. ఇంకా రెండు పుస్తకాలు రావల్సి వుంది.
ఇంకా రాయడం అవసరమా? అని అనుకున్నప్పుడల్లా ఏదో ఒక ఫోన్ వస్తుంది. మీ రచనలు బాగుంటున్నాయి. నేను వాటిని కట్ చేసి దాచుకుంటున్నాను అని. మళ్లీ రాయడానికి ఉత్సాహం వస్తుంది. అన్ని వయస్సుల వాళ్లు ఫోన్ చేస్తుంటారు. ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వ్యక్తులు, ముసలి వాళ్లు, యువకులు ఇట్లా ఎందరో ఫోన్లు చేస్తూ వున్నారు. ఆ ఫోనే్ల లేకపోతే బహుశ నేను ఇవి రాయడం మానేసేవాణ్ణేమో.
అనువాదం దగ్గర మొదలైన ఈ కథనాలు, నా అనుభవంలోకి, నా మిత్రుల అనుభవాల నుంచి కథనాలుగా రాయడం మొదలైంది. ఇప్పటికి ఎన్ని రాశానో తెలియదు కానీ ఒక్క వారం కూడా క్రమం తప్పలేదు. దానికి కారణం నేను కాదు. భూమి సంపాదక వర్గం. ఒక రెండు రోజులు ఆలస్యం అయినా వాళ్లు నన్ను అడిగి వ్రాయిస్తూనే వున్నారు. వాళ్లకు నమస్కారాలు చెప్పడంతో సరిపోదని అన్పిస్తుంది.
నా అనుభవాలు, ఊహలు, ఆలోచనలు, వారం వారం అలా వస్తూనే వున్నాయి. ఇవి రాయడం కోసం మనుషులని చూసే దృష్టి మారిపోయింది.
ఎన్నో కొత్త పుస్తకాలని చదవడం, వెతకడం.
ఎక్కడికి పోయినా ఆ దృష్టి మారలేదు.
నేను నేర్చుకున్నవి, నేర్చుకోవాలని అనుకుంటున్నవి ఈ కాలమ్స్‌లో రాస్తున్నాను.
నాకేదో అథారిటీ వుందని నేను అనుకోవడం లేదు. మీరు అనుకుంటున్న విషయాలకే నేను అక్షర రూపం ఇస్తున్నాను.
ఈ రాతలు చదివిన వాళ్లకే కాదు.
నాకూ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.
నా లక్ష్యం వైపు నన్ను తీసుకొని వెళ్తున్నాయి.
ఈ రచనల వల్ల
ప్రపంచం మారుతుందా?
చదివిన వాళ్లు మారుతారా?
మారవచ్చు.
మారకపోవచ్చు.
కానీ
నాలో మాత్రం ఈ రచనలు పరివర్తనం తెస్తున్నాయి.
చాలామందిలో కూడా తెస్తున్నాయని వింటున్నప్పుడల్లా రాయాలన్న కాంక్ష ద్విగుణీకృతం అవుతుంది.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001