S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కలన యంత్రం

‘కంప్యూటర్’ అన్న మాటని తీసుకుందాం. సా.శ.1968లో, నా విద్యార్థి దశ చరమావస్థలో ఉన్న రోజులలో, కంప్యూటర్‌ని తెలుగులో ఏమనాలి అని అనుమానం వచ్చింది నాకు. దీనికి ఇంగ్లీషు వాడు ఈ పేరుని ఎలా ఎంపిక చేసేడు అని ఆలోచించాను. కలన యంత్రాలు వాడుకలోకి రాక పూర్వమే ‘కంప్యూటర్’ అనే మాట ఇంగ్లీషులోంది. ‘డ్రైవర్’ ‘కండక్టర్’ లాగే కంప్యూటర్ ఒక వ్యక్తి. ఖాతా కొట్లో లెక్కలు సరిచూసే (లేదా చేసే) మనిషిని ఆ రోజుల్లో ఇంగ్లీషు వాళ్లు ‘కంప్యూటర్’ అనేవారు.
అంతవరకు ఎందుకు? రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికాలో రాకెట్ల మీద ప్రయోగాలు జరుగుతూన్న కొత్త రోజులలో క్లిష్టమైన లెక్కలు చెయ్యడానికి నల్ల (African - American)) ఆడవాళ్లని విపరీతంగా ఉపయోగించేరు. ఈ అమ్మాయిలని ఆ రోజులలో ‘కంప్యూటర్లు’ (గణనం చేసేవారని అర్థం) ఈ విషయం మీద ఒక పుస్తకం, ఒక సినిమా కూడా వచ్చేయి.
అదే రకం పనిని చేసే యంత్రాన్ని అదే పేరుతో పిలవటం బాగుండదేమోనని మొదట్లో ఆ యంత్రాన్ని ‘కంప్యూటింగ్ మెషీన్’ అనటం మొదలెట్టేరు. మరి కొందరు ఈ కంప్యూటర్‌ని ‘కేలుక్యులేటింగ్ ఇంజన్’ అనీ, ‘బిజినెస్ మెషీన్’ అనీ అనేవారు. ఈ పేర్ల అవశేషాలే ఇప్పటికీ ‘అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషీన్స్’ (ఎ.సి.ఎం.) లోనూ, ‘ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్’ (ఐబిఎం)లోనూ మనకి కనిపిస్తున్నాయి. ఇన్ని రకాల ప్రయోగాలు చేసిన తరువాత చివరికి ‘కంప్యూటర్’ అన్న మాట స్థిరపడింది. అదైనా నిలకడగా ఉందా అంటే అదీ లేదు. సాంకేతిక రంగంలో వచ్చే మార్పుల వల్ల ఈ రోజుల్లో ‘కంప్యూటర్’ అనే మాట వాడుక కూడా తగ్గిపోయి దాని స్థానంలో లేప్‌టాప్, పి.సి. మేక్, ఐ-పేడ్, టేబ్లెట్, క్లౌడ్ వగైరా పేర్లు వాడుకలోకి వచ్చేస్తున్నాయి. ఇంగ్లీషులోకి ఇలా కొత్త మాట వచ్చేసరికల్లా మనం తల గోక్కోవలసి వస్తోంది.
నేను 1968లో ‘కంప్యూటర్లు’ అనే మకుటంతో రాసిన వ్యాస పరంపర అమెరికా నుండి వెలువడిన ‘తెలుగు భాషా పత్రిక’ అనే రాత పత్రికలో రెండున్నర ఏళ్లు ధారావాహికగా ప్రచురించటం జరిగింది. అప్పటికి తెలుగు వాళ్లకి ఇంకా కంప్యూటర్లు అలవాటు కాలేదు. కావున ‘కంప్యూటర్’కి ‘కలన యంత్రం’ అని నేను పేరు పెట్టినప్పుడు ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. మూడొంతులు నేను రాసినది ఎంతోమంది కళ్ల పడి ఉండకపోవటం ఒక కారణం కావచ్చు. ఇదొక్క మాటే కాకుండా ఆ రోజుల్లో ప్రచారంలో ఉన్న యంత్రాలని దృష్టిలో పెట్టుకుని డిజిటల్ కంప్యూటర్‌ని ‘అంక కలన యంత్రం’ అనీ, ఏనలాగ్ కంప్యూటర్‌ని ‘సారూప్య కలన యంత్రం’ అనీ, హైబ్రిడ్ కంప్యూటర్‌ని ‘సంకర (కంచర) కలన యంత్రం’ అనీ అన్నాను. అలాగే కంప్యూటింగ్ అన్న మాటని ‘కలనం’ అని తెలిగించేను. మనకి సంకలనం (addition),, వ్యవకలనం (subtraction), కలన గణితం (calculus), సమాకలన కలనం (integral calculus) మొధలైన తెలుగు మాటలు వాడుకలో ఉన్నాయి కనుక, వాటిని పోలిన మాటే ఇదీ కనుక సందర్భానుసారంగా ఈ మాట కూడ అర్థం అవుతుందనే ఆశతో చేసిన పని ఇది.
ఆ రోజులలోనే కంప్యూటర్‌ని ‘గణక్’ అనాలని మరొకరు సూచించేరు. అప్పటికే నా వ్యాస పరంపర ప్రచురితం అయిపోయింది. కనుక, ఇక నేను చెయ్యగలిగేది ఏదీ లేక ఊరుకున్నాను. ఇంతవరకు గణక్ అనే ప్రయోగం పుంజుకున్నట్లు కనిపించదు.
కాలచక్రం గిర్రున తిరిగిపోతోంది. సా.శ.2011 సెప్టెంబర్ నెల వచ్చేసింది. అమెరికాలో, మా ఊళ్లో, మా పెరట్లో ‘అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశం’ అంటూ హడావిడిగా ఒక సభ జరిగింది. ఆ సభలో మొట్టమొదటిసారి ‘సంగణకం’ అనే కొత్త మాట విన్నాను. దీనిని ‘కంప్యూటర్, కంప్యూటింగ్, కాంప్యుటేషనల్’ అన్న మూడు మాటలకీ సమానార్థకంగా వాడేరు కానీ భాషా భాగాలలో ఉండే తేడాలని లెక్కలోకి తీసుకున్నట్లు కనబడలేదు. అయినా సరే, ఇలా ప్రయోగాలు చెయ్యగా, చెయ్యగా మనకి అనువైన మాట స్ఫురించక మానదు.
మనం వాడుకునే భాష నుండి కంప్యూటర్ వాళ్లు తస్కరించిన మాట మరొకటి ఉంది. దాని పేరు ‘డ్రైవర్’. ఈ మాటని తీసుకుని ‘ప్రింటర్ డ్రైవర్’ వంటి మాటలు కంప్యూటర్ రంగంలో విరివిగా వాడతారు. ఈ సందర్భంలోనే మరొక సూక్ష్మాన్ని గమనిద్దాం. ‘ప్రింటర్ డ్రైవర్’ అన్నప్పుడు మనం ఒక ‘సాఫ్ట్‌వేర్’ని ఉద్దేశించి మాట్లాడుతున్నాం. ‘ప్రింటర్ డ్రైవ్’ అనేది ‘హార్డ్‌వేర్’ అవుతుంది. రథంకీ రథికుడు కీ తేడా లేదూ? తెలుగులో డ్రైవర్‌ని ‘చోదరి’ అంటారని మనం మరిచిపోయి ఉంటాం. చోదరి దేనిని నడుపుతున్నాడు? చోది ని! కనుక ప్రింటర్ డ్రైవర్ ముద్రణ చోదరి, ‘ప్రింటర్ డ్రైవ్’ ముద్రణ చోది అవుతాయి.
బండిని తోలే వ్యక్తి డ్రైవర్. ఆ బండి కారు కావచ్చు. రైలు కావచ్చు. ఎద్దుబండి కావచ్చు. చేసే పనిని సూచించే మాటలు ‘ఇ’ శబ్దంతో అంతం అవటం మనం చూస్తూనే ఉన్నాం కదా: చాకలి, మంగలి, కంసాలి, కమ్మరి, కుమ్మరి మొదలైనవి. ఇవి వృత్తుల పేర్లు; కులాల పేర్లు కావు. ఈ రోజుల్లో చాకలి వాడిని చాకలి అంటే కోపం వస్తోంది; కనీసం హిందీలో దోబీ అనాలిట. మంగలిని మర్యాదగా ‘బార్బర్’ అని ఇంగ్లీషులో అనాలిట. ఏ పేరుతో పిలిస్తేనేమి, ఈ పనులు మనుష్యులే చెయ్యాలని నియమం లేదు కదా. యంత్రాలు కూడ చెయ్యవచ్చు. అప్పుడు ఆయా యంత్రాలని కూడ అదే పేరుతో పిలవచ్చు కదా. ఈ రోజుల్లో బట్టలు ఉతికే మిషన్లు వచ్చేయి. వాటిని చాకలి అనో, ఉతకరి అనో అనొచ్చు. ఇంగ్లీషు వాడు చేసినది అచ్చంగా అదే! కానీ మనం అనం, ఛస్తే అనం. మనకి నామోషీ. ‘వాషింగ్ మెషీన్’ అనో ‘వాషర్’ అనో అంటాం.
మరొక ఉదాహరణ. ఇంగ్లీషులో ‘కౌంటర్’ అనే మాట ఉంది. మొదట్లో కౌంటర్ అంటే (డబ్బు) లెక్కపెట్టే వ్యక్తి. ఈ డబ్బు ఎక్కడ లెక్క పెడతాడు? ఒక బల్ల దగ్గర కూర్చుని లెక్క పెడతాడు. కనుక ఆ బల్లని కౌంటర్ అనటం మొదలుపెట్టేరు. కలన యంత్రాలలో లెక్కపెట్టే ఉపకరణం ఒకటి ఉంది. దాన్నీ కౌంటర్ అనే అంటారు. కనుక కౌంటర్‌ని ‘లెక్కరి’ అనో ‘లెక్కిణి’ అనో అనొచ్చేమో?
ఇక్కడ తెలుగు సేతలో కావలసిన సూక్ష్మం మరొకటి ఉంది. ఇంగ్లీషులో ఒక క్రియా వాచకాన్ని నామవాచకంగా మార్చాలంటే ‘అర్’ (ళూ) అనే తోక తగిలిస్తే సరిపోతుంది: కంప్యూట్, కంప్యూటర్, డ్రైవ్, డ్రైవర్; ప్రింట్, ప్రింటర్, వాష్, వాషర్ (compute, computer; drive, driver; print, printer; wash, washer) వగైరా ఉదాహరణలు. ఈ రకంగా క్రియా వాచకాన్ని నామవాచకంగా మార్చగలిగే సదుపాయం, ఉపాయం మనకి ఉంటే చాలా మాటలని పుట్టించవచ్చు. శోధించు అనే క్రియ నుండి శోధకుడు, శోధకురాలు అనే పలుకుబడులు ఉన్నాయి. లింగ విభేదం లేకుండా ఉండాలంటే ‘శోధరి’ ‘శోధకి’ లాంటి ప్రయోగం చేసి చూడవచ్చు. అప్పుడు ‘సెర్చి ఇంజను’ లాంటి మాటలని ‘శోధకి’ అనో, ‘శోధన యంత్రం’ అనో తెలిగించవచ్చు. ఈ పద్ధతిలో ఎన్నో ఇంగ్లీషు మాటలని సులభంగా స్వయంబోధకంగా ఉండే తెలుగులోకి దింపుకోవచ్చు.

- వేమూరి వేంకటేశ్వరరావు ప్లెజన్‌టన్, కేలిఫోర్నియా