గూటికి చేరే ముందు
Published Saturday, 6 July 2019ఇన్ని రోజులు గడిచాక
నెమ్మది నెమ్మదిగా చూపుల్ని నెడుతూ
ఒంటరి ఇల్లును వదిలి
స్వస్థలం చేరుకోడానికి ఆరుబయట ఊగే గాలిలా
మనసు నిలకడగా లేదు
చుట్టూ చూస్తున్నాను
ఆదరిచే ప్రపంచం నెలకొని ఉంది
ఒకచోట ఉండాలనే ఉంటుంది
వీచే గాలులు ఉరిమే ఉరుములు
ఏవీ నాలో నన్ను ఆట్టే ఉండనీయవు
ఏదో ముందుకు లాగినట్టు
గెలుపేదో ఒక మార్గం నిర్దేశిస్తున్నట్లు
కాలాన్ని ఆనుకొని స్థలాలు మారతాం.
నా వాకిలి రోడ్డును చూస్తూ
నా పెరటి చెట్టును ఆస్వాదిస్తూ
కాసిన్ని అడుగుల్ని ముందుకు నడిపాను.
నాలాగే దూరం వచ్చి
సొంతూరు పోవాల్సిన వారు కలిశారు
జీవతమూ మనసూ మారలేదు
కాస్త ఆర్థిక ప్రమాణాలు తప్ప.
ఇపుడొకటనిపిస్తుంది
ఉదయం ఎగిరిన పిట్టలు చెట్టునొదిలి ఉండలేవు
మళ్లీ గూటికి
అలసి సాయంకాలం వాలింది.