విజ్ఞత అంటే ఇదే..
Published Saturday, 14 September 2019మనిషి మ ఒదటి నుంచి విజ్ఞత, విజ్ఞానం అనే స్థాయి తెలివి గురించి తపన పడుతున్నాడు. ప్రతి వ్యక్తిలోను ఇంటలిజెన్స్ అనే తెలిలి కొంత ఉంటుంది అనుకొన్నారు. అందుకు ఆధారంగా అంతరాత్మ అని ఒకటి ఉంటుంది అనుకున్నారు. అంతరాత్మ బోధనతో మనిషికి తెలివి కలుగుతుంది అనుకున్నారు. కానీ చాలామంది లోపల గోల ఒకటే ఉన్నట్టు అనుభవాలు చెబుతున్నాయి. నిజమైన విజ్ఞతను సంపాదించాలంటే అందుకు మరో మార్గాలు ఉన్నాయని మానవులు వెదకసాగారు. విజ్ఞత లేనప్పుడు ఒకడు చదువుకుంటాడు అన్న మనిషి, కొంత విజ్ఞత కలిగిన తరువాత ఒకరు చదువుకుంటారు అని చెప్పడం నేర్చుకున్నాడు. ఇందులో పురుషాధిక్యత అన్నవిషయం మరుగున పడుతున్న తీరు కూడా ఉంది . విజ్ఞత అంటే ఇదే.
ప్రపంచంలో ఇతర దేశాల వారు విజ్ఞానాన్ని వెతికిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. వారి దృష్టిలో విజ్ఞానం అంటే పాతకాలపు పవిత్ర గ్రంథాలు. వాటిలోని తెలివిని తర్కం ద్వారా హెచ్చ వేస్తే మనిషికి మరేదో తెలుస్తుంది. అక్కడి వారు ఎవరికీ అనుమానం వచ్చినా వాటికి సమాధానాలు గ్రంథాలలో ఉంటాయి అనుకున్నారు. ఆ గ్రంథాలలో చెప్పిన మాటకు తమకు అనుకూలంగా అర్థాలు చెప్పుకునేందుకు గాను తర్కాన్ని వాడుకున్నారు. ఈ సందర్భంగా యువాల్ నోవా హరారి అందించిన ఉదాహరణలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. భూమి ఆకారం ఎలా ఉంది అన్న ప్రశ్న పుట్టింది. జవాబు కోసం బైబిల్ లో వెతక సాగారు. దేవుడు భూమి అంచులను ఒక చోట పట్టుకుని దుర్మార్గులను భూమి నుండి దులిపి వేయును అని పవిత్రగ్రంథంలో ఒక చోట రాసి ఉందట. ఏముంది? భూమి బల్లపరుపుగా ఉంది అని జవాబు దొరికింది అన్నమాట. భూమికి అంచులు ఉన్నాయి. అంటే అది బల్లపరుపుగా ఉండి తీరాలి. ఆ అంచులను దేవుడు పట్టుకుంటాడు. అయితే పరిశీలన జరుపుతున్న విద్వాంసులలోనే ఒకఅతను కాదు పొమ్మన్నాడు. బైబిల్ గ్రంథంలోని మరొక చోట భూమి గురింన వర్ణన ఇంకొక తీరుగాంది. దేవుడు భూవలయము మీద సింహాసనారూఢుడై ఉండును. అంటున్నది అక్కడి మాట. అంటే భూమి వలయాకారంగా ఉందన్నమాట.
అంటే గుండ్రంగా ఉందన్నమాట. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? ఇంతకూ ప్రశ్నకు జవాబు ఏమిటి? మనదేశంలో కూడా ఈ విషయం గురించి చర్చ ఇదే మార్గంలో నడిచింది. భూమిని చాప చుట్టిన విధంబున చుట్టి, అని మనవాళ్లు రాసుకున్నారు. భూమి వెలగపండు ఆకారంలో ఉన్నది అని మరొక చోట రాసుకున్నారు. ఈ రెండు సందర్భాలలోను విజ్ఞానం ఏమైంది అన్న ప్రశ్న వాసన కూడా మిగలలేదు.
పురాణ గాథలలో విజ్ఞానం సంశయాత్మకం. అది హోమరు రాసిన ఇలియడ్ కానివ్వండి మరొకరు రాసిన ఈనీడ్ కానివ్వండి కథను సూటిగానమ్మడానికి ఆధారం దొరకదు. ఇక మన రామాయణ, భారతాలు మరో మార్గంలో ఏమీ లేవు. మనుషులు బతకడానికి మార్గం చూప్చిడానికి కదా నీవు రాముడిగా పుట్టావు అంటాడు నారాయణ భట్టాద్రిపాద తన నారాయణీయంలో. ఆ రాముడిని చూసి ఏం నేర్చుకోవాలి తెలియదు. నేర్చుకోవాల్సింది చాలా ఉన్నా, అతనిలో మనకు అవసరం లేని లక్షణాలు కూడా చాలా కనిపిస్తాయి. అరణ్యవాసానికి బయలుదేరుతున్న సమయంలో సీతమ్మ రాముని పట్టుకుని, నీవు మగవాడినేనా అని ప్రశ్నిస్తుంది. మునులకు క్షేమం కలిగిస్తూ, శత్రువులను సంహరించి, గాయపడి వస్తున్న రాముని చూసి ఆమె చాల సంతోషపడింది అని చెప్పే శ్లోకాన్ని మా ఇంట్లో ప్రతినిత్యం పెరుమాండ్ల ఆరాధన అంటే దేవుని పూజ సమయంలో చదవడం విన్నాను.
అతగాడు శౌర్యం చూపించడం అట్లా చివరిలో మాత్రమే. ఇక భారతంలోశ్రీకృష్ణుడు చేసినదంతా కుతంత్రమే గదా. తనవారి కొరకు తప్పుడు పద్ధతులను కూడా ఆ దేవుడు జరిపించాడు. ఎప్పుడూ ఏమీ అడగనని బలరాముడు కూడా చివరకు దుర్యోధనుని చంపిన సందర్భంలో తమ్ముడిని చూసి ఈసడించుకున్నాడు. పెద్దాయన ఎవరో ఒకరు అనగా విన్నాను. పెళ్లి చేసుకున్న పిల్లలు దండం పెడితే సీతారాముల వలె ఉండడం అని మాత్రం ఆశీర్వదించకూడదట. ఆ సీతమ్మ తల్లి సుఖపడింది ఎన్నడు కనుక!
ఇంతకూ పక్కదారి తాకినట్టు ఉన్నాము. మనం విజ్ఞానం గురించి వెతుకుతున్నాము. పురాణాలలో తొంగి చూస్తే తెలుస్తుంది. పాతకకాలంలో పడమటి దేశాల వారు పురాణాలకు సంబంధించిన విషయం మరొకరు ముందుకు తెచ్చారు. ఒకరికి పురాణాల గురించి ఎంత తెలిసి ఉన్నప్పటికీ కూడా తెలియకుంటే ఆ పురాణాలు అతనికి అర్థం కాలేదు అనుకోవాలి అన్నారు. అదే రకంగా కేవలం తర్కం తెలిసి ఉండే పురాణాల గురించి తెలియకుంటే కూడా తెలివి లేనట్టే లెక్క అన్నారు. అంటే పురాణ జ్ఞానం, తర్కం అనేవి రెండూ ఒకదానికి ఒకటి హెచ్చు వేసుకుంటాయి అన్నమాట. తార్కిక బుద్ధి గల వారికి తెలివి ఉన్నట్టే అని ఇప్పుడు మనం అంగీకరిస్తున్నాము. వారికి పురాణాల గురించి తెలియ వలసిన అవసరం లేదు. కానీ ఆ కాలంలో ఈ పద్ధతిని అంగీకరించలేదు. పురాణం తెలియాలి. తర్కం కూడా తెలియాలి. అప్పుడే ఆ వ్యక్తి తెలివి గలవారి కింద లెక్క.
రాను రాను మనిషి సైన్సు నేర్చుకున్నాడు. అంటే ప్రపంచాన్ని వాస్తవ దృష్టితో చూడడం నేర్చుకున్నాడు అనవచ్చు. అంతకుముందు దృష్టిలో ఆలోచనలు వ్యక్తిగత అనుభవాల మీద ఆధారపడింది.
రాను రాను మనిషి ప్రపంచాన్ని పరిశీలించసాగాడు.ముందుగా ఈ ప్రపంచం భౌతిక లక్షణాలను గమనించాడు. దానితో పాటే నైసర్గిక లక్షణాలను కూడా చూశాడు. ప్రపంచంలోని జీవులను కూడా పరికించాడు. మొత్తానికి సైన్సు అన్న భావన బలంగా ముందుకు వచ్చింది. అప్పుడు తెలివిగలవారు అంటే ప్రకృతి గురించి తెలిసిన వారు అన్న అర్థం బలపడింది. ప్రకృతిలోని ఏదో విషయం గురించి తెలియాలంటే ముందు బోలెడంత సమాచారం సేకరించాలి. ఎన్నో ప్రశ్నలు అడగాలి. వాటన్నిటికీ జవాబులు ఒకచోట చేర్చి సమాచారం ఆధారంగా విశే్లషించాలి. ఆతరువాత లెక్కల సాయంతో సమాచారాన్ని తెలివి అనే రూపంలోకి మార్చాలి. ఈ ప్రశ్నలు అడిగేటప్పుడు ఎంత, ఎట్లా, ఎక్కడా లాంటివన్నీ రావచ్చు. ఎందుకు అన్న ప్రశ్న వస్తే మాత్రం సులభంగా జవాబు దొరకదు.
ప్రపంచం గురించిన జ్ఞానం అనుకున్నాము. భూమి ఆకారం ఏమి, అన్నప్రశ్న పుట్టింది. మళ్లీ పురాణాలకు వెళ్లితే కలిగిన గజిబిజి ఇప్పటికే తెలుసుకున్నాం. అది కాకుండా సొంత అనుభవం మీద ఆధారపడిన ప్రయోగాలు చేయాలి. భూగోళం మీద రకరకాల స్థానాల నుంచి సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు మొదలైన నిర్మాణాల స్థితిని గమనిస్తే భూమి రూపం తెలిసే అవకాశం ఉందని పరిశోధకులు అర్థం చేసుకున్నారు.
ఇటువంటి పరిశీలనలు ఎవరో ఒకరు చేస్తే చాలదు. ఒక చోటి నుంచి చేస్తే చాలదు. ఒకనాడు చేస్తే చాలదు. అందుకే సైన్స్ లో మొదట మామూలు విషయాలు కనుగొనడానకి కూడా సంవత్సరాల కాలం పట్టింది. అప్పటికీ వారికి పరికరాలు,గణితం కూడా అంతగా సాయంగా అందలేదు. లెక్కలు వచ్చిన తరువాత, ఈ పరిశీలను మరింత సులభం అయ్యాయి. త్రికోణమితి అదే గణితం ప్రకారం భూమి పరిమాణం వంటివి తెలుసుకోవడం సులభం అని తేల్చారు. ఒక భూమి గురించే కాదు, గ్రహాలు, నక్షథాల గురించి కూడా తెలుసుకోవచ్చు అన్నారు. తెలుసుకున్నారు కూడా. ఈ రకంగా ప్రకృతిలోనూ, పరిశోధనశాల లోనూ, సంవత్సరాల పాటు కృషి చేసిన సైంటిస్టులు ప్రపంచం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. భూమి గుండ్రంగా ఉంది అని చెప్పడానికి చాలా కష్టపడ్డారు. కానీ పురాణాల ప్రభావం లో మునిగి ఉన్న ప్రజలూ ఆ మాటలను నమ్మలేదు. నాలుగవ తరగతి పుస్తకంలో అది కూడా సైన్స్ పుస్తకంలో భూమి గుండ్రంగా ఉంది అని చెప్పడానికి ఒక పాఠం ఉండేది అది 60వ దశకం. సముద్రంలో దూరం నుంచి వస్తున్న ఓడ జండా ముందు కనిపిస్తుంది. తర్వాత మరింత కర్ర కనిపిస్తుంది. ఆ తరువాత తెరచాప కనిపిస్తుంది. అప్పుడుగాని పడవ కనిపించదు. కనుక భూమి అట్లా వంటి ఉంది అని మాకు బడిలో చెప్పారు. పల్లెటూరి బడిలో అప్పటికే భూగోళం నమూనా ఉండేదా? ఏమో నాకు జ్ఞాపకం అంతగా లేదు.
మొత్తానికి కొత్త విషయాలు తెలియాలంటేముందు కావలసినంత సమాచారం కావాలి అన్నది రుజువైంది. ఆ సమాచారానకి అర్థం సంపాదించాలంటే లెక్కలు తెలిసి ఉండాలని కూడా తెలిసింది. కేవలం లెక్కలు తెలిసిన వారిక విద్యను ఉన్నట్లు లెక్కకాదు. కేవలం సమాచారం సేకరించిన వారికి విజ్ఞానం అర్థంకాదు. ఇక్కడ కూడా ఈరెండు అంశాలు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఒకదాన్ని మరొకటి పెంచుతాయి. కనుకనే రాను రాను పరిశీలకులు తమ పరికరాలతో పాటు పద్ధతులను కూడా నిషిద్ధం చేయసాగారు.
ముందు సమాచారం అనుకున్నాము. దాన్ని సమన్వయ పరిస్తే తెలివి అనుకున్నాము. ఆ తెలివి విసృత్తమై పరస్పర సంబంధాలను చూడగలిగితే విజ్ఞానం అనుకున్నాము. ఇంతకు మించిన స్థాయికి కూడా ఒకటి ఉందని చెబుతున్నారు. ఈ ప్రపంచంలో జ్ఞానులు కొంతమంది అయితే, మహామేధస్సు కలవారు మరికొందరు. సంస్కృతంలో కూ వీరికి ప్రత్యేకంగా పేరు లేదు. ఇటువంటి వారికి ఉండే తెలివిని ఇంగ్లీషులో విస్డం అంటున్నారు. మనిషికి నోట్లో జ్ఞానదంతాలు అని ఉంటాయి. ఇంగ్లీషులో వాటిని విస్డం టీత్ అంటారు. అంటే దానికి కూడా పేరు జ్ఞానం అని అర్థం. కానీ అది ఉన్నత స్థాయిలో ఉంటుంది. నాలెడ్జ్ అనేవి జ్ఞానం కల వారందరికీ విస్డం ఉందా? ఉంటుందా అన్నది ప్రశ్న? కానీ ఆస్థాయికి చేరుకోవాలంటే ముందుగా విజ్ఞానము తీరాలి. అటువంటి విజ్ఞానం కలవారు అనుకోకుండానే అర్థవంతం, ఆదర్శవంతం అయిన మాటలను చెప్పేస్తూ ఉంటారు. వారి నోటి వెంట అటువంటి మాటలు పలుకుతాయి. అందుకు ప్రయత్నం అవసరం లేదు. జ్ఞానుల మాటలు అంతరార్థాలు కలవి, అనుమానానికి తావిచ్చే విధంగా ఉండవచ్చు. మహాజ్ఞానుల మాటలు అట్లా కాదు. అవి అక్షర సత్యాలు,. నిత్యసత్యాలు కాలంతో సంబంధం లేకుండా అనుసరణీయాలు