S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జిహ్వాగ్రే వసతే శ్రుతి!

హాయిగా నవ్వటం లేదా నవ్వించటం ఒక యోగం. ఈ రెండూ లేకపోతే అదో రోగం అన్నాడు జంధ్యాల.
పాట కూడా అంతే. కొందరి కంఠాల్లో పాట ఎంతో సహజంగా వచ్చేస్తుంది. మరి కొందరెంత తన్నుకున్నా పాడలేరు. కానీ ఉబలాటం మాత్రం ఊహ కందనంతగా ఉంటుంది. నిశే్చష్టులై విగ్రహాల్లా కూర్చుని వింటూంటారు కొందరు. ‘చిన్నప్పుడు మా అమ్మగారు చాలా బాగా పాడేవారండి! ఓ మాస్టారు ఇంటికొచ్చి మరీ పాఠం చెప్పేవారుట. మా తాతగారికంటే సంగీతం మా అమ్మమ్మకెంతో ఇష్టం. పెళ్లి కాకముందు శ్రావణ మాసం నోములకు ఎవరింటికెళ్లినా ఆమెను పాడకుండా వదిలేవారు కాదు’
‘మరిప్పుడు?’
‘ఏం చెప్పమంటారు? లంకంత ఇల్లు. బోల్డంత చాకిరీ. గంపెడు సంసారం. వచ్చే జనం.. వెళ్లే జనం. సంగీతం కాస్తా అటకెక్కింది. సంగీతాభిరుచి మాత్రం అలాగే సజీవంగానే ఉంది. మంచి సంగీతమైతే అన్ని పనులూ మాని వింటుంది. ఈ కాసె్తైనా పాడగలుగుతున్నానంటే ఆమె దయే’ అనేవారు మనకు తారసపడుతూంటారు. అనుకున్నది సాధించలేక ఉన్న దానితోనే సంతృప్తి పడేసి ఊరుకోవటం పాడలేక పోయామనే దిగులు, లేనిదాని కోసం ఏ విచారమూ లేకపోవటం కొందరి నైజం. నేర్చుకోవలసినదెంతో ఉందని తెలిసినా ఏదో తెలిసిపోయినట్లుగా ఏర్పడ్డ భావన, ఏదీ తెలియనివ్వకుండా చేస్తుంది. నా బాల్యంలో చదువుకునే రోజుల్లో ఈ ప్రపంచంలో దేనిని గురించి తెలుసుకోవాలన్నా నాలుగు సాధనాలున్నాయి, గుర్తుపెట్టుకోండి.
ప్రత్యక్షం, అనుమానం, ఉపమానము, శబ్దము.. అనేవారు మా తెలుగు మాస్టా. సంగీతానికి అన్వయం చేస్తే మనం తెలుసుకోవలసిన వస్తువు. దానిని గ్రహించే ఇంద్రియం, ఈ రెంటి వల్ల కలిగిన జ్ఞానం.
1.ప్రత్యక్షం: ఉదాహరణకు పాటను తీసుకోండి. ఒకరి పాట బాగుంటుంది. చెవులతో వింటాం. పాడేవారిని గమనిస్తాం. ఇది ప్రత్యక్ష జ్ఞానం. మనం పాడే స్థాయి కంటే ఒక మెట్టుపైనే ఉందో లేదో తెలియాలి. మంచి సంస్కారంతోనే ఇది సాధ్యం.
2.అనుమానం: మరొకరి గానంలో మనకు తెలియని గమకాలేవో వినిపిస్తూంటాయి. అవెలా పలికించలుగుతున్నాడో గ్రహించే మార్గం వెతకాలి.
తన పాటను మరొకరితో పోల్చుకుంటూ, లోపాలను వెదకగలిగే మార్గం.
3.ఉపమానమే స్వీయ లోపం తెలియటమే అసలైన విద్య. ‘షడ్జోజాతాది పంచ వక్త్రజ’ సరిగమపదని వర్ణ సప్త స్వర’ అన్నట్లు, శివుని ముఖాల నుంచే పుట్టుకొచ్చింది సంగీతం. అంతే కాదు ప్రపంచంలో తెలియవలసినవన్నీ శబ్ద రూపంలో వెలువడి శాస్త్ర ప్రమాణమై కూర్చున్నాయి. మనకదే ప్రమాణం.
నిగమ శిరోర్ధము కల్గిన నిజ వాక్కులతో స్వర శుద్ధముతో పాడే సంగీతానికున్న అర్థం చాలా పెద్దది.
పాడే పాటలో నిజాయితీ శ్రుతి శుద్ధత, ఒక్కటే సరిపోదు. భక్తి కలవాలి. భక్త్భివంతోనే పాడాలి. అదే లక్ష్యం కావాలి. గమ్యం కావాలి.
భక్తిలేని పూజ పత్రి చేటు. దీని కోసం దానికి కావలసిన సామగ్రిని సిద్ధం చేసుకోవాలి. వాతావరణాన్ని సృష్టించుకోవాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఎంత గొప్ప వాడికైనా ప్రమాణం అంతఃకరణే ఆత్మ సాక్షికి మించిన సాక్షి లేలడు. లోపలి వాణ్ణి అణగతొక్కేస్తే పైవాడికి మార్గం లేదు.
చాలా బాగా పాడుతున్నావమ్మారుూ! టీవీల్లోనో, రేడియోల్లోనో వెళ్లి ప్రయత్నించరాదూ?’ అని ఊరుకుంటే ఫరవాలేదు.. ఒక్కసారి ‘రామబాణంలా వాళ్లు నీకంటే ఉద్ధరిస్తున్నారేమిటి?’ అన్నాడనుకోండి. పర్యవసానం.. ఆత్మస్తుతి, సోత్కర్ష, ఆ తర్వాత పరనింద. అవలక్షణాలన్నీ ఒక దానివెంట మరోటి ప్రారంభమై పోతాయి. ఇంక సంగీతం పెరిగేదెలా? ఈమె ఉద్ధరింపబడేదెలా?
సంగీతం, మోక్ష సాధనం సంగతి దేవుడెరుగు. ముందు తనేమిటో తనకు తెలియాలిగా? అదే పెద్ద మాయ. లేకపోతే వీధి వీధికీ విద్వాంసులు పుట్టరూ? ఏమిటో మాస్టారూ? చక్కగా పాట ప్రారంభించే సమయంలో శ్రుతిలోనే ఉన్నట్టుగా ఉంటుంది. చరణానికి రాగానే చటుక్కున శ్రుతి తేడా వచ్చేస్తుంది. నాకేమో తెలియదాయె.
మరొకరు చెప్పేవరకూ ఆ సంగతి నాకు తెలియనే తెలియదు ఏమిటి మార్గం? అని అమాయకంగా అడిగేవారిని చూశాను. లోపం గురువుదే అనుకోవడం వీలులేదు. సాధనలో శిష్యుడి కపటం లేని ప్రయత్నం కూడా ముఖ్యం. గోడలకు సున్న వేయడానికి, గడపలకు సుతారంగా రంగు రంగులతో నగిషీలు చెక్కుతూ రంగు వేయటానికీ తేడా ఉంటుంది. రెండు దానికి ఏకాగ్రత ఉండాలి.
పాట కూడా అంతే. పాతికకు పైగా బోగీలతో వేలాది మైళ్లు ప్రయాణించే రైలింజన్ శక్తి, దానిపై వేళాడే విద్యుత్ తీగలపై ఆధారపడినట్లుగా సుస్వరంతో ఆలపించే గానానికైనా, అతివేగంగా పాడే పాటకైనా ఆధారం ఈ శ్రుతి జ్ఞానమే. మార్గమధ్యంలో రైలు ట్రాక్‌లెన్నిన్ని మారిపోతున్నా ఇంజన్‌కు తగిలించిన విద్యుత్తీగలు, రైలు ట్రాక్, చెక్కుచెదరకుండా గమ్యం చేరేదాకా కలిసి ఎలా ఉంటాయో, ఎటువంటి పాట పాడాలనుకున్నా శ్రుతి లయలు రెండూ మనిషి నీడలా.. అలా వెన్నంటే ఉండేలా చేసే సాధనే అసలైన సంగీత సాధన.
సామాన్య శ్రోతకు సినిమా పాట, రంజకమైన ఒక కాలక్షేప సాధనం మాత్రమే. అసామాన్య సంగీత సాధన చేసి గానం చేసే విద్వాంసులకు లభించే తరగని శాశ్వతమైన బ్రహ్మానందం. ‘శ్రుతి’ అనేది ఒక తీపి వస్తువు. గాయకులకు జిహ్వాగ్రం ఉంటుంది. నాదకుల వ్రేళ్లకుంటుంది. తీపి పదార్థానికి చీమలెలా దగ్గరై పోతాయో కమ్మని పాటకు కూడా మనిషి అలా ఆకర్షితుడౌతాడు. పులుపు, కారం, ఉప్పు సమపాళ్లలో ఉంటేనే ఆ పదార్థానికి రుచి. తినేవారికి కాదు. ఆ రహస్యం వండే వాళ్లకే తెలుస్తుంది. పాటైనా అంతే. వినటం వేరు. పాడటం వేరు. పక్కింటి వాళ్లు వండుకున్నది మనం తెచ్చుకుని తింటే ఆ వంట మనదౌతుందా? తృప్తినిస్తుందా?
ఎవరో పాడిన పాట మనం పాడినా అంతే. అందులో ఆనందాన్ని వెతకటమే ఆశ్చర్యం!
పిల్లి పిల్లల్ని మార్చేసి ఇంటింటికీ తిరిగినట్లుగా, వైద్యం కుదరక డాక్టర్‌ని మార్చేసినట్లుగా, సంగీత గురువును మార్చేసుకుంటూ పోతే, కుదురైన పాట పాడేదెలా? పాడినది నిలిచేదెలా?
మహావిద్వాంసుడు బాలమురళీకృష్ణకు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దొరికినట్లుగా త్యాగయ్యకు శొంఠి వెంకట రమణయ్యలా అందరికీ సద్గురువులు దొరక్కపోవచ్చు. స్వయంకృషే సద్గురు మార్గాన్ని చూపిస్తుంది.
ఎంత కష్టమైనా నేర్చుకోవాలనే చిత్తశుద్ధి, అంకిత భావం లేని వారికి దొరికే గురువులెవరైనా ఫలితం ఒకటే.
కాస్త లోతుగా చూస్తే మన దేశం యొక్క భౌగోళిక స్వరూపంలోనే గురుశిష్య భావం ఉందనిపిస్తుంది.
స్వచ్ఛమైన నదీ జలాలతో నిర్మలంగా ఎంతో ఎత్తులో ఉన్న హిమాలయ శిఖరం గురువుకు ప్రతీక.
ఆజానుబాహులై నిలిచిన ఆ గురుచరణ సన్నిధిలో కనిపించే శిష్యునికి ప్రతీక మన భారతావని.
అపరిమిత వాత్సల్యంతో శిష్యుణ్ణి పరవశింపజేస్తూ పలకరిస్తూ సాగే జ్ఞానవాహిని.. ప్రవహించే దివ్యమైన సంగీత గంగ. ఇలా ఉండాలి.. మన భావన...
‘గురుబ్రహ్మా, గురుర్విష్ణుః’ అని పొగిడినంత కాలం పొగిడేసి, ఆ గురువు నచ్చక, తన పాటను మెచ్చుకుంటూ బుజ్జగించే మరో గురువు నాశ్రయించటం.. అయినా దోషం లేదు. కానీ వదిలేసిన గురువును చులకన చేసి మరో గురువు సమక్షంలోనే హేళన చేసేవారు లేకపోలేదు. హిమాలయాల్లా ఎదగవలసిన అలాంటి శిష్యులు పరమాణువులై మిగిలిపోతారే గానీ, గురువులకొచ్చే లోటేమీ ఉండదు. మన సంగీతం ‘ఆత్మ’ రాగాల్లోనే ఉంది. ఆవేదనకైనా అనురాగానికైనా రాగాలే శరణ్యమనుకుని పాడిన భక్తులే దీనికి సాక్షులు.
కాంభోజి, ఖరహరప్రియ, కల్యాణి, భైరవి, తోడి వంటివి వంత తోడుకున్నా ఇంకా మిగిలే ఉంటాయి. కనిపించని యాగాశ్వం కోసం సగరులు భూమిని తవ్వినట్లుగా, కనిపించని తరగని నిధి ఈ రాగనిధి. తరతరాలుగా, ఎందరు ఈ రాగాలు గానం చేసినా, ఎంత పాడినా, పాడవలసినది ఇంకా ఉందని హెచ్చరిస్తూ, బుజ్జగిస్తూ బులిపిస్తూ మళ్లీ పాడమని ఉసికొలుపుతూనే ఉన్నాయి. వింటూనే ఉన్నాం. పాడుతూనే ఉన్నారు.
‘ఇంక చాలనే భావం గాయకులకూ, ఇటు శ్రోతలకూ లేనంత కాలం రాగాలన్నీ కల్పతరువులే, కామధేనువులే. ఒక్క మాటలో చెప్పాలంటే, ‘రాగాలాపన’ గాయకుల సమర్థతకు గీటురాళ్లు. ‘మాయామోహంలా, ఎండమావిలా కనిపిస్తూ ఏదో తెలిసిపోయినట్లుగా అనిపిస్తూనే ఉంటుంది గానీ, రాగాన్ని అర్థం చేసుకుని పరిపూర్ణంగా ఆవిష్కరించటానికి ఒక్క జీవిత కాలం సరిపోదని పెద్దల వాక్కు. చిట్టి పొట్టి అల్లిబిల్లి పాటలేవో నాలుగు కంఠస్థం చేసి, పాడేస్తూ, ఎగిరి గంతులేసే జనాన్ని చూసి మురిసిపోతూ, అదే సంగీతమనే, భ్రాంతిలో ఉన్నవారికి ‘రాగసాగర మథనం’ ఒక కల.

- మల్లాది సూరిబాబు 90527 65490, 9182718656