S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లెక్కలు - తిక్కలు

తొమ్మిదవ తరగతి అయిపోయింది. పదవ తరగతి నుంచి ఆపైన చదవబోయే రంగాన్ని ఎంచుకోవాలి. పదవ తరగతిలో మొదటి రోజు మామూలుగా గడిచిపోయింది. మరునాడు ఉదయానికి ఆప్షనల్స్ ఎంచుకునే అప్లికేషన్ ఇవ్వాలి. మా బడిలో అయిదు ఆప్షన్స్ ఉండేవి. వాటిలో ఒకటయిన వ్యవసాయం చదువుకోవాలని నాకు గట్టి కోరిక ఉండేది. మేము వ్యవసాయదారులం అని చెప్పుకోవడానికి నాకు ఇప్పటికీ చాలా సంతోషంగా ఉంటుంది. మట్టిలోకి దిగి పని చేయకున్నా మా పంట పొలాలను మేమే పండించుకునే వాళ్లం. కానీ మా వాళ్లు అంతా ఎందుకో నన్ను వ్యవసాయం చదువుకోవడానికి ప్రోత్సహించలేదు. మా ఇళ్లలో నాకంటే కొంచెం ఎక్కువ వయసు గల వాళ్లంతా లెక్కలు చదువుకుని మంచి పేరు తెచ్చుకున్నారు. నాకేమో మొదటి నుంచి అంకెల మీద అంతగా ప్రేమ లేదు. అట్లాగని లెక్కలు రావని మాత్రం కాదు. నూటికి నూరు మార్కులు తెచ్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. పరీక్షలు చేయమన్నవి ఆరు లెక్కలు అయితే ఏడు లెక్కలు చేసి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తొమ్మిదవ తరగతిలో కూడా లెక్కల్లో మంచి మార్కులు వచ్చాయి. మొత్తానికి ఆప్షనల్ ఎంచుకొన వలసిన రోజున నోటుబుక్కులో నుంచి కాగితం చింపి రాయవలసింది రాశాను. కానీ అందులో అడగవలసిన స్పెషలైజేషన్ పేరు మూడు ముక్కలుగా రాయవలసిన చోట మాత్రం ఖాళీ వదిలాను. లెక్కలు చదువుకోవచ్చు. గొప్ప విషయమేమీ కాదు. వాళ్లంతా ఏం తీసుకుంటున్నారు అన్నది నా ఆదుర్దా. నిజంగా మిత్రులు అనుకున్న వాళ్లు ముగ్గురు నలుగురు మాత్రమే ఉండే వాళ్లు. వాళ్లంతా బయాలజీ ఎంచుకున్నట్టు తెలిసింది. నేను కూడా అదే రాసి వెళ్లి ‘సి’ సెక్షన్‌లో కూర్చున్నాను. లెక్కలు తీసుకున్న వాళ్లు ‘బి’లో ఉంటారు. అప్పటికి మా ఊళ్లో మంచి పేరున్న లెక్కల పంతుళ్లు ఇద్దరు ఉండేవారు. ఇద్దరి పేరు సూర్యనారాయణ గారలే. కర్నూలు సూర్యనారాయణగారు మా బడిలో ఉండేవారు. ఆయన మాట తీరును మేమంతా ఆట పట్టించేవాళ్లం. ఆయన కర్నూలు ప్రాంతం మనిషి. నాన్న కూడా పేరున్న ఉపాధ్యాయుడే కనుక వీళ్లందరికీ మా కుటుంబాల గురించి బాగా తెలుసు. నాకు సూర్యనారాయణ గారు వెతుకుతూ ఒక్కొక్క క్లాసు చూస్తున్నారు. ‘సి’ సెక్షన్‌లోకి కూడా వచ్చారు. నేను మొదటి బెంచ్‌లోనే కూర్చున్నారు. ఆయన తనదైన కర్నూలు పద్ధతిలో, ఇక్కడ ఎందుకురా ఉన్నావు? దిట్టంగా లెక్కలు చేస్తావు కదా? పద మన తరగతిలోకి అన్నాడు. నేను మొండికెత్తాను. మంచి స్నేహంగా ఉండడం అప్పట్లో నా పద్ధతి. రాను కాక రాను అన్నాను. బయాలజీలో మిగిలిపోయాను. చివరికి పిహెచ్.డి దాకా చదువుకున్నాను. ఇవాళ నాకు జీవశాస్త్రంలో కూడా పెద్దగా ఆసక్తి లేదు. జంతు శాస్త్రంలో ఎమ్మెస్సీ చేసినట్టు లెక్క. కానీ అందులో మాకు చెప్పింది జన్యు శాస్త్రం. పరిశోధన కూడా మానవుల జంతువుల గురించి చేశాను. నా దారి వంకరటింకర. ఒక క్రమంలో సాగలేదు.
పుస్తకాలు పిచ్చిపిచ్చిగా సేకరించి చదవడం ఒక పద్ధతిగా సాగుతున్నది. రాన్ అహరోనీ పేరు గల ఒక పండితుడు నిజంగా పేరుగల వాడేమో. లెక్కలు, కవిత్వం, సౌందర్యం అని ఒక పుస్తకం రాశాడు. అది చదవాలని ముందు పెట్టుకున్నాను. నాలుగు పేజీలు చదివేసరికి మనసు ఎక్కడెక్కడికో పరుగులు పెట్టింది. ఎనె్నన్నో సంగతులు గుర్తుకు వచ్చాయి. జెర్మనీ దేశంలో డేవిడ్ హిల్బర్ట్ అని ఒక గొప్ప గణిత శాస్తవ్రేత్త ఉండేవాడు. ఒక మంచి విద్యార్థి ఈ మధ్యన తరగతులకు వరుసగా రావడం లేదు అని ఆయన గమనించాడు. మా సూర్యనారాయణ మాస్టారు గారి మాదిరే ఆయన శిష్యుడిని గురించి అడిగాడు. ఆ విద్యార్థి లెక్కలను వదిలేసి కవిత్వాన్ని ఎంచుకుని ఆ శాఖలో కొనసాగుతున్నాడు అని విషయం తెలిసిన వాళ్లు చెప్పారు. ‘నిజమే, ఆ అబ్బాయికి లెక్కలకు అవసరమైన ఊహాశక్తి లేదని నేను గమనించాను’ అన్నాడట ఆ గురువుగారు. అంటే కవులకు ఊహాశక్తి అవసరం లేదు అని ఆయన అంటున్నారా? మనం ఇక్కడ కొంత ఆలోచించాలి.
నేను సాహిత్యం చదవాలని తెలుగు విభాగంలో చేరాను. కొన్ని వారాల తర్వాత దాన్ని వదిలేసి జంతుశాస్త్రంలోకి మారాను. పిహెచ్‌డి కూడా తీసుకుని చివరకు రేడియోలో వెళ్లి ఉద్యోగం చేశాను. విశ్వవిద్యాలయం వాళ్లు నన్ను లెక్చరర్‌గా ఎంపిక చేయక పోవడానికి కొన్ని కారణాలున్నాయి. అందుకు నేను మాత్రం కారణం కాదు. మొత్తానికి నేను నువ్వు సాహిత్యం, సంగీతం, మాధ్యమాలలో పడిపోయాను. కవిత్వం రాయను అని ఏనాడో నిర్ణయించుకున్నాను కానీ కావలసినంత కవిత్వం రాశాను. పద్య కవిత్వం కూడా రాశాను. ఉర్దూలో కూడా షాయరీ చేశాను. ఊహా శక్తి వున్నది, లేనిది నాకు ఇవాళటి వరకు అర్థం కావడంలేదు. వందకు పైగా పుస్తకాలు రాశాను. కవిత్వంలోనూ, గణితంలోనూ గల సమాన లక్షణాలను గురించి తర్వాత మరెప్పుడో వివరంగా రాస్తాను కానీ కవిత్వం విషయంగా నేను చేసిన కొన్ని చిన్నచిన్న పనులు ముందుగా చెపుతాను.
ఉస్మానియా విశ్వవిద్యాలయం బస్టాప్‌లో అరుగు మీద కూర్చుని నేను కవిత్వం రాయను. రాసిన వాళ్ల కవిత్వం చదువుతాను. దాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ అని అన్నప్పుడు అక్కడ కవి మిత్రులు శీలా వీర్రాజుగారు, సాహితీ మిత్రులు చంద్ర మొదలైన వాళ్లంతా ఉన్నారు. చాలా కవిత్వాల పుస్తకాలను సమీక్షలు రాశాను. మిత్రుడు ఎన్.గోపీ కవితా సంకలనం మీద సమీక్ష రాసినప్పుడు ఆయన నన్ను మెచ్చుకున్న మాటలు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి. పరవాలేదు. నాకు కూడా సాహిత్య విమర్శ కొంత తెలుసు అనుకున్నాను.
మో అనే వేగుంట మోహన్ ప్రసాద్ గారి కవితా సంకలనం ఒకటి వచ్చింది. దాని పేరు సాంధ్య భాష, సమీక్ష కొరకు తమ పుస్తకాన్ని మామూలు పత్రికల వాళ్లకే కాక కేంద్ర సాహిత్య అకాడెమీకి కూడా పంపించారు. అకాడెమీ వారికి, అవును వాళ్లు తమ పేరు అలాగే రాసుకుంటారు. ఒక ఇంగ్లీషు పత్రిక ఉన్నది. దాని పేరు ఇండియన్ లిటరేచర్. అందులో అన్ని భాషల పుస్తకాల మీద సమీక్షలు కూడా రాస్తారు. అన్ని భాషల నుంచి అనువాదాలను వేస్తారు. ఆ పత్రికలో మో కవితా సంకలనం మీద రాయవలసిన అవకాశం నాకు దొరికింది. ఎట్లా అవే అని అడగకండి. నేను నిర్మొహమాటంగా ఒక సమీక్ష రాశాను. అది అచ్చు అయింది. తెలుగు సాహితీ ప్రపంచంలో ఎంతమందికి ఇండియన్ లిటరేచర్ అన్న పత్రిక చదివే అలవాటు ఉన్నది నాకు తెలియదు. తెలుగు సాహితీ ప్రపంచంలో ఎంత మందికి ఇండియన్ లిటరేచర్ అన్న పత్రిక చదివే అలవాటు ఉన్నది నాకు తెలియదు. సమీక్ష గురించి నన్ను ఎవరూ ఏమీ అనలేదు. స్థానిక పత్రికలలో రకరకాల కవుల పుస్తకాలను గురించి సమీక్ష రాసినప్పుడు కొంతమంది ఫోన్ చేసి మెచ్చుకున్నారు. నారాయణరెడ్డి గారి కవితా సంకలనం మీద సమీక్షలు రాసినప్పుడు మెప్పికోలు కాని మాటలు కూడా కొన్ని విన్నాను. కథాసంకలనాల మీద రాసిన సమీక్షల వల్ల తిట్లు తిన్నాను. సరే ఇక్కడ అది విషయం కాదు. మోహన్ ప్రసాద్ గారు హైదరాబాద్ వాసి కాదు. ఆయన ఒక సందర్భంలో హైదరాబాద్ వచ్చారు. మిత్రుడు పూర్ణచంద్రరావు ఇంట్లో ఉన్నారు. నన్ను గురించి ఆయన తెలుసుకోవాలని ఆసక్తి కనబరిచారు. వెళ్లి చూద్దాం పదా అని కూడా అన్నారట. పూర్ణచంద్రరావు మిత్రుడు. ‘మీరు పెద్ద మనుషులు. అంత దూరం వెళ్లనవసరం లేదు. అతను వచ్చే ఏర్పాటు చేస్తాను’ ఆయనను ఒప్పించాడు. నన్ను ఇంటికి పిలిపించాడు. మో గురించి నేను అంతకు ముందు విన్న సంగతుల కారణంగా నాకు మనసులో కొంచెం అనుమానంగా ఉంది. ఆయన కవితలో సంక్లిష్టత ఉంటుంది అని అందరూ అంటారు. దాన్ని ఆయన కల్పించుకుని పంచుతాడు తప్ప, సహజంగా ఆయనలో సంక్లిష్టత లేదు అని నేను రాసినట్టు జ్ఞాపకం. పెద్దాయన ఏమంటాడో అనుకున్నాను. నేను కాలు పెట్టగానే ఆయన ఎదురు వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకున్నారు. మొహమాటం లేకుండా నేను సమీక్ష రాసిన పద్ధతిని చాలా చాలా మెచ్చుకున్నారు. ఆయనకు ఎనభయి సంవత్సరాలు నిండే సందర్భంలో ఒక సన్మాన సంచిక వేస్తున్నారని, అందులో ఆయన మొత్తం కవితా సామాగ్రి గురించి నేను ఒక విస్తృత వ్యాసం రాయాలని ఆయన ప్రతిపాదన చేశారు. కానీ అన్యాయంగా అవేవీ జరగకుండానే ఆయన పోయారు.
నన్ను గురించి మాట్లాడుతూ మిత్రుడు ఆర్.వి.రామారావు బాగా రాస్తాడు, కానీ కొంచెం తిక్క అన్నాడట. ఎంత నిజం చెప్పాడు? ఈ ప్రపంచంలో ఎవరో నా గురించి అన్న మాట నా దాకా రావాలంటే మూడవ మనిషి ఒకరు కావాలి. రామారావుకు కూడా తిక్క ఉన్నది లేనిది నేను చెప్పను కానీ, నాకు చాలా తిక్క ఉన్నది, ఆ తిక్కకు ఒక లెక్క ఉన్నది, చిత్రంగా, ఈ రెండు సంగతులు నాకు తెలుసు, అని నేను ఆ మూడవ మనిషికి చెప్పాను. రామారావుకు కూడా చెప్పాను. గారు అనలేదని మా ఆర్ వి ఆర్ నన్ను తప్పుపట్టడన్న నమ్మకం నాకు ఉంది.

-కె.బి.గోపాలం