S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సుస్వర నాద వినోది.. వోలేటి

‘దేశాహై తేరీ ఆంఖోఁ మే ప్యార్ హి ప్యార్ బేశుమార్..
పాయా హై తేరీ బాతోఁమే ప్యార్ హి ప్యార్
చేశుమార్..’ బాల్యం నుంచి బాగా విన్న నాకిష్టమైన పాట.
1969లో విడుదలైన ప్యార్ హి ప్యార్ చిత్రంలోది. హిందీ చలనచిత్ర రంగాన్ని సుస్వరంతో నింపిన దర్శకులు శంకర్ జైకిషన్ జంట మహ్మద్ రఫీ చేత పాడించిన ఈ పాటలో ‘శంకరాభరణం’ రాగంలోని స్వరాలు ఎంతో పసందుగా వినబడతాయి. పాటంతా నాదమే. ఓ రోజు వివిధభారతి స్టూడియోలో డ్యూటీలో ఉండగా ‘మన్‌చాహే గీత్’లో ఈ పాట వినగానే హాయిగా గొంతెత్తి స్టూడియోలో పాడేస్తున్నాను. బయట డ్యూటీ రూమ్‌లో వచ్చి కూర్చున్న వోలేటి గారికి నా గొంతు వినబడింది. అక్కడున్న వారితో స్టూడియోలో పాడుతున్నదెవరు? బాగా పాడుతున్నాడనటంతో, ఆ మాట నా చెవిన పడింది.
మరుసటి రోజు ఉదయం వోలేటిగార్ని కలిసి నమస్కరించి నిలబడ్డాను.
‘మీ గొంతు బాగుంది సార్. సినిమా పాటలు అనుకరిస్తే ఏమిటి లాభం? (అందర్నీ ‘సార్’ అని పిలవటం ఆయనకలవాటు) బాగా సంగీత జ్ఞానం సంపాదించాలి. మీకున్న అభిరుచిని చక్కగా కర్ణాటక సంగీతం వైపు మళ్లించరాదా? అన్నారు.
ననే్నం చేయమంటారని అడిగాను. ‘బుధ శుక్రవారాల్లో ఉదయం ప్రసారమయ్యే సంగీత శిక్షణ కార్యక్రమంలో కూర్చుని కీర్తనలు నేర్చుకోండి’ అన్నారు.
ఆయన వాక్కులోని ఆశీర్వాదమో, లేక నా పుణ్యమో ఆ క్షణం లగాయితూ ఆ కార్యక్రమంలో పాల్గొనటం వల్ల అప్రయత్నంగా అపురూపమైన మూర్తిత్రయం వారి కీర్తనలు 300 నేర్చుకునే అదృష్టం దొరికింది.
నా జీవితానికదే పెద్ద వరమైంది.
ఏ శిష్యునికీ లభించని అవకాశం. ఓ మహా విద్వాంసుడు తనకు తానుగా కోరి బోధించటం నేను చేసుకున్న సుకృతం. ఆయన సాహచర్యంతో రెండున్నర దశాబ్దాలు ఎలా గడిచాయో ఊహిస్తే ఆశ్చర్యమే.
శ్రుతికి మూలం, భావానికి సంగీతార్థం, నాదానందం, ఈ మూడూ ఆయనలో చూశాను. తన్మయత్వంలో పాడుతూ వోలేటిగారు వెదికి అనుభవించే నాదసుఖంలోని మర్మం అవగతమవుతూండేది. ఆ అనుభవం అక్షరబద్ధం చేసి నేను చెప్పలేనిది విని ఆనందించవలసినది మాత్రమే ఆణిముత్యాల వదిలేసి, నత్తగుల్లల్ని ఏరినట్లు మహాసముద్రం లాంటి సంగీతాన్ని ఉపాసించిన విద్వాంసులు వారి గానం వినగలిగే అవకాశాలు ఒక్క రేడియోలోనే సాధ్యం. అది వదిలేసి సినిమా పాటలను, ఛాన్సు దొరికిందని అనుకరించి పాడుతూ ఆనందపడటం కంటే అవివేకం మరోటి లేదని చాలా కొద్దికాలానికే తెలిసింది.
నిజానికి సినిమా పాటలు వినిపించే ఉద్యోగమే. అయినా వినిపించటం వరకే సరిపెట్టుకున్నాను. ప్రసారమవుతూండగా వినటమే తప్ప ఆ సినిమా పాటలపై మోజు లేదు. పాడే ప్రయత్నమూ చేయలేదు. క్రమంగా అనుకరించి పాడాలని కూడా అనిపించేది కాదు. సంప్రదాయ కర్ణాటక సంగీతంలోని మాధుర్యం క్రమంగా తెలిసే కొద్దీ మిగతా బాణీలన్నీ సూర్యుని ముందు దివిటీలే అనుకుంటూ వచ్చాను. దివ్యమైన సంగీతం నేర్చుకునే భాగ్యం కలుగుతోందనుకునేవాణ్ణి.
విచక్షణా జ్ఞానంతో పాడే ప్రయత్నం చేయనారంభించాను. రకరకాల సంగీతం విసుగు లేక వినేవాణ్ణి. అలా నా సంగీత యాత్ర ప్రారంభమైంది. విజయవాడ ఆకాశవాణి కేంద్రం వైభవానికి ముఖ్య కారకుడు డా.బాలాంత్రపు రజనీకాంతరావు.
వైవిధ్యమైన కార్యక్రమాలను ఊహించి ప్రసారం చేయటంలో ఆయనకాయనే సాటి. ముఖ్యంగా సంగీత కార్యక్రమాల విషయంలో ఆయన రూపొందించినవన్నీ దక్షిణాది కేంద్రాలన్నిటిలోనూ తలమానికంగా నిలిచిపోయినవే. భక్తిరంజని, యక్షగానాలు, సంగీత రూపకాలూ మొదలైనవనేకం. కాళహస్తి సంస్థానంలోని మునిపల్లె సుబ్రహ్మణ్య కవి రచించిన ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు వెలుగులోకి రావటానికి కారణం ఒకరు రజనీ మరొకరు వోలేటి. వెనకటి రోజుల్లో ఆ నోటా ఈ నోటా పడి ప్రసిద్ధమై, మన ఇళ్లల్లో అమ్మమ్మలు బామ్మలు కాలక్షేపంగా పాడుకున్న అలనాటి ఆధ్యాత్మ రామాయణ కీర్తనలకు సంప్రదాయ సంగీత రూపాన్ని తెచ్చి, వాటిని పక్కాగా స్వరసహితం చేసి నేదునూరి కృష్ణమూర్తి, ఎం.ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మ, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, వి.బి.కనకదుర్గ, బలిజేపల్లి రామకృష్ణ శాస్ర్తీ, ఎన్.సి.వి. జగన్నాథాచార్యులు, పెమ్మరాజు సూర్యారావు, ఎం.వి.రమణమూర్తి మొదలైన ఉద్దండులైన విద్వాంసుల చేత బాగా రిహార్సల్స్ చేయించి రికార్డు చేయటంలో వోలేటి గారు పడిన శ్రమకు విలువ కట్టలేం. పాడైపోయినవి పోగా మిగిలినవి చాలా తక్కువే. కేవలం ఆడియో టేపుల్లోనే ఉండిపోవటం, అత్యాధునిక సౌకర్యాలు ఆ రోజుల్లో లేకపోవటం కారణంగా చాలా వరకూ ప్రసార యోగ్యతను కోల్పోయాయి. ఈ వేళ ఈ కీర్తనలు మళ్లీ అదే స్థాయిలో పాడించే లేదా పాడే ప్రయత్నం చేయటం చాలా కష్టం.
1956 నాటి మాట.
విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో సాహిత్య కార్యక్రమాల ప్రయోక్త పింగళి లక్ష్మీకాంతంగారు, నాటక ప్రయోక్త బందా కనకలింగేశ్వర్రావు, వోలేటి గారలు కూచిపూడి యక్షగాన కార్యక్రమాల ఆదర్శ పరిణామాలకు ముఖ్య కారకులు.
గంగా గౌరీ విలాసమనే తెలుగు యక్షగానం పిఠాపురంలోని త్యాగరాజ స్వామి సమకాలికుడైన మద్దిరాల వెంకట రాయకవి రచించిన ‘ఏకాంత సేవా విలాస’మనే యక్షగానానికి సంగీతం వోలేటియే.
ఆయన సంగీత నిర్వహణలో కూచిపూడి యక్షగానాలు, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు, ఈ రోజుకీ మీరు రేడియోలో వింటూనే ఉన్నారు.
సంగీతానికైనా, సాహిత్యానికైనా, ఉన్నత ప్రమాణాలంటూ ఉంటాయి. వీటిని కాపాడటంలో రేడియోకున్న శక్తి పరిమితం కాదు. పండిత పామర జనరంజకమై, యోగ్యమైన పద్ధతిలో ప్రసారం చేయటంతోనే రేడియోకు గౌరవం ఏర్పడింది. దానికి కారణం ఉత్తమ విలువల పట్ల సదవగాహన వ్యక్తులు. అలాంటి అరుదైన వారిలో వోలేటి వంటి విద్వాంసులు చాలా అరుదు. సంగీతంలో రెండు రకాల వారుంటారు. సంగీతం కోసమే సంగీతం నేర్చేవారు కొందరైతే, సంగీతాన్ని జీవనోపాధి కోసం వినియోగించుకునేవారు మరి కొందరు. మొదటి రకం వారు పాడేది దివ్యమే సంగీతమే. ఇందులో వోలేటి మొదటి కోవకు చెందుతారు.
సంగీతానందం అంటే ఏమిటో ఆయనకు తెలుసు. అందులోని రుచి తెలియని వారి ఎదుట ఆయన పాడరరు. నాద సుఖంలోని అనుభవం ఆయన సొంతం. వేదికనెక్కి సామాన్యంగా ఎవరు పాడినా శ్రుతిలో పాడతారు. కొందరి కంఠాల్లో సహజంగా శ్రుతి పెట్టె గొంతులో అమర్చే ఉంటుంది. అలాంటి గాయకులలో వోలేటి అగ్రస్థానంలో ఉంటారు. మాధుర్యం నిండిన గొంతు ఆయనది. ఆయన గానం చేస్తోంటే, మన చెవిన పడే మాటలన్నీ నాదాన్ని మోసుకొస్తూ వీనుల విందు చేస్తూంటాయి. ఎంతసేపు పాడినా విసుగు పుట్టదు. మరి కొందరు ఎంత పాడినా మనసులోకి చేరదు. కారణం? నాద రహితమైన పాట. అందులో జీవముండదు. పాడి ప్రయోజనం ఏముంది? నాదలోలుడై తనలోనే తాను రమిస్తూ పాడుకున్న నాదమయమైన గానం వోలేటిది. కాగితంతో చేసిన పూతరేకులు తినగలమా? అలాగే నాదశుద్ధి లేని పాట కూడా వినలేం. సంగీతమే ఊపిరిగా జీవించిన విద్వాంసుడు. తమిళనాడులో, వోలేటి గారిని గాఢంగా అభిమానించిన సంగీత రసికులున్నారు. ఆయన పాటలో ప్రముఖంగా కనిపించేది హిందూస్థానీ సంగతుల ప్రయోగం. కర్ణాటక సంప్రదాయంలో ఈ సంగతులు పలికించగలిగిన విద్వాంసులు చాలా అరుదు. వోలేటి గారితో సహకారం వాద్యంగా, లాల్‌గుడి జయరామన్, అన్నవరపు రామస్వామి, ఎం.ఎస్. గోపాలకృష్ణన్‌లను మినహాయించి ఇతర వయోలిన్ విద్వాంసులు ఆయన హిందూస్థానీ శైలిలోని సంగతులు పట్టుకోగలిగినవారు చాలా అరుదే. ఆయన పాటపై హిందూస్థానీ సంగీత ప్రభావం ఎలా ఏర్పడింది? ఒకటే కారణం. ప్రాథమిక సంగీత విద్యాభ్యాసం అంతా కాకినాడలోని మునుగంటి వెంకట్రావు పంతులు గారి దగ్గరే జరిగింది. పంతులుగారికి అన్ని సంగీత బాణీలూ ఇష్టమే. ఆ అలవాటే వోలేటి గారికబ్బింది. నాక్కూడా హిందూస్థానీ సంగీతం పట్ల రుచి కలిగింది. సిసలైన తంజావూరు బాణీ మన ఆంధ్రదేశంలో ప్రచారమవ్వాలనే భగీరథ ప్రయత్నం చేసి కృతకృత్యుడైన మహా విద్వాంసుడు డా.శ్రీపాద పినాకపాణి. సంప్రదాయ సంగీతంలో డా.శ్రీపాద పినాకపాణి మూల విరాట్టైతే, ఉత్సవ విగ్రహాలు ఇద్దరు. ఒకరు వోలేటి, మరొకరు నేదునూరి. ఈ ముగ్గురి సాన్నిహిత్యంతో సంప్రదాయ సంగీతంలోని మాధుర్యం తెలుసుకోగలిగాను. అనుస్వర సహిత గమక సౌందర్యానికున్న విలువ అవగతమైంది. పొడి పొడి స్వరాలతో పాడే పాటకు ప్రయోజనం లేదని తెలిసింది. విద్వాంసులంతా అధ్యాపకులు కారు. అధ్యాపకులందరూ విద్వాంసులు కాకపోవచ్చు. నేనెరిగిన నా గురువు వోలేటి గారికి సంగీత బోధనలో ఆసక్తి ఎక్కువ. ఆయన చాలా ఇష్టపడి చేసిన కార్యక్రమం సంగీత శిక్షణ. రేడియోలో ఆ కార్యక్రమం ఇంచుమించు రెండున్నర దశాబ్దాలపాటు సాగింది. సంగీతమూర్తు లనతగిన - పాణి, వోలేటి, నేదునూరి గార్లకు సన్మానాలు సత్కారాలు బిరుదులు పట్ల మోజు లేదు. పటాటోప ప్రదర్శన ఎరుగరు. వారి ఆత్మానంద హేతువు వారి సంగీతమే. అదే వారి స్థిరాస్తి. వారిని ఆశ్రయించిన వారికి మాత్రమే దక్కిన తరగని ఆస్తి.

- మల్లాది సూరిబాబు 90527 65490, 91827 18656