S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రోడ్డున పడేసే పొరపాట్లు

ఒక పొరపాటుకు యుగములు వగచేవు అనే పాట వినే ఉంటారు. ఈ పాటలో జీవిత సత్యం ఉంది. ఒక జీవితాన్ని నిర్మించుకోవాలి అంటే ఎంతో కాలం శ్రమించాల్సి ఉంటుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. దెబ్బతినాలి అంటే మాత్రం ఒక్క చిన్న పొరపాటు చాలు. అందుకే ఒక పొరపాటుకు యుగములు వగచేవు అన్నాడు సినీ కవి. ప్రపంచంలో కెల్లా దురదృష్టవంతుడు ఎవరు అనే ఓ ప్రశ్నకు ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరి పేరు చెప్పారు. ఈ రోజుల్లో ఇండియాలో ఐనా, అమెరికాలో ఐనా ఐ ఫోన్ కలిగి ఉండడం అంటే ఓ హోదాగా భావిస్తారు. మరి అలాంటి ఐ ఫోన్ కంపెనీ వ్యవస్థాపకుల పరిస్థితి ఎలా ఉండాలి. మొత్తం ముగ్గురు వ్యవస్థాపకులు ఆ కంపెనీని ప్రారంభిస్తే, వారిలో ప్రారంభంలోనే కేవలం ఎనిమిది వందల డాలర్లకు తన పది శాతం వాటాను అమ్ముకున్నాడు. అంటే కనీసం ఆ ఎనిమిది వందలతో ఒక ఐ ఫోన్ కూడా రాదు. అలా తొందర పడి ఉండకుండా ఉంటే పది శాతం వాటా అంటే లక్షల కోట్ల ఆస్తి కలిగి ఉండేవాడు.....
ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అదృష్టలక్ష్మి తలుపు తడుతుంది. ఒక ప్లాట్ రూపంలో కావచ్చు, ఉద్యోగం రూపంలో, స్టాక్ మార్కెట్ రూపంలో ఏదో ఒక రూపంలో మనకు అవకాశం కల్పించేందుకు అదృష్టలక్ష్మి తలుపు తడుతుంది. దాన్ని సరిగా ఉపయోగించుకోక పోతే ప్రపంచంలో మనంతా దురదృష్టవంతులు లేరని నిరాశ పడాల్సి వస్తుంది. జీవితానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మంచి చెడు, లాభనష్టాలు బేరీజు వేసుకోవాలి.
లగడపాటి రాజగోపాల్‌కు చెందిన ల్యాంకో ఇన్‌ఫ్రా తెలుసు కదా? రాజకీయాల్లో ఆయన వెలిగిపోతున్న కాలంలో దీనిని ప్రారంభించారు. స్టాక్ మార్కెట్‌లో ఒక వెలుగు వెలిగింది. షేర్ ధర దాదాపు రెండు వేల రూపాయల వరకు వెళ్లింది. ఇప్పుడా కంపెనీ ధర ఎంత ఉంటుందో ఊహించగలరా? ఆ షేర్ ధర కేవలం 35 పైసలకు పడిపోయింది. మరీ ఇంత ఘోరంగా పడిపోతుందని ఊహించగలమా? ఎన్నికల ఫలితాలపై జోస్యాలు, పందాలతో మీడియాలో ఎప్పుడూ హడావుడిగా ఉండే ఆయన మీడియాలో స్థానం సంపాదించారు కానీ, వ్యాపారంలో మెళుకువలు చూపలేక పోయారు. ఆయన హడావుడి చూసి చాలా మంది మోసపోయారు. ఆయన్ని నమ్మి పందాలు కాసిన జూదగాళ్లు దెబ్బతిన్నారు. ఆయన్ని నమ్మి ల్యాంకో ఇన్‌ఫ్రా స్టాక్స్ కొన్న వారు నిండామునిగిపోయారు. ఆస్తినంతా తాకట్టు పెట్టి పది లక్షల స్టాక్స్ కొన్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటీ అని ల్యాంకో బాధితుడు బిజినెస్ మీడియాలో తన గోడు వెళ్లబోసుకున్నాడు. వ్యాపారాన్ని బాధ్యతగా నిర్వహించాలి, వ్యాపారాన్ని గాలికి వదిలి రాజకీయాల్లో హడావుడి చేసిన వ్యక్తి తాను మునిగిపోయారు. తనను నమ్మిన వారిని ముంచేశాడు. ఒక స్టాక్‌లో ఇనె్వస్ట్ చేసేప్పుడు ప్రమోటర్ల గుణగణాలను సైతం చూడాలనే పాఠం చెబుతోంది ల్యాంకో...
సంపాదించిన దానిలో కొంత పొదుపు చేసి ఇనె్వస్ట్ చేయాలి కానీ, అప్పు చేసి ఇనె్వస్ట్ చేయకూడదనే పాఠం ఈ స్టాక్ నేర్పించింది. ఎంత గొప్ప కంపెనీ అయినా ఒకే స్టాక్‌లో ఇనె్వస్ట్ చేయవద్దని నేర్చుకోవాలి.
కంపెనీని సక్రమంగా నిర్వహిస్తున్నా, ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగినా కంపెనీలపై ప్రభావం పడే కాలమిది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఒకే కంపెనీని ఎప్పుడూ నమ్ముకోవద్దు. వివిధ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఊహించని పరిణామాలతో ఒకటి రెండు కంపెనీలు ఇలా దెబ్బతిన్నా, మిగిలిన కంపెనీలు ఆదుకుంటాయి. ఇనె్వస్ట్‌మెంట్ అనే కాదు జీవితానికి సంబంధించి ఏ నిర్ణయంలోనైనా ఏమరుపాటు పనికిరాదు.
చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, జీవితానికి సంబంధించి ముడిపడి ఉండే ఏ నిర్ణయం అయినా మంచి చెడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒక సినిమాకు వెళ్లే ముందు అది బాగుందా లేదా? అని పత్రికల్లో రివ్యూలు చదువుతారు. చూసి వచ్చిన వారిని అడుగుతారు. రెండు గంటల పాటు చూసే సినిమా విషయంలోనే ఇంతగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు జీవితానికి సంబంధించి విషయాలు, ఆర్థిక వ్యవహారాలపై ఇంకెంత జాగ్రత్తగా ఆలోచించాలి.... సినిమా నచ్చక పోతే మహా అయితే రెండు గంటల సమయం వృధా అవుతుంది. కానీ కష్టపడి సంపాదించిన డబ్బుకు సంబంధించి అజాగ్రత్తతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు జీవితాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తాయి. ఇనె్వస్ట్ మెంట్ కావచ్చు, ఉద్యోగంలో మార్పులు, మిత్రులకు ష్యూరిటీ సంతకాలు కావచ్చు, అప్పులు చేయడం కావచ్చు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేప్పుడు అన్ని కోణాల్లో జాగ్రత్తగా ఆలోచించాలి.
అమితాబ్ బచ్చన్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న కాలంలో అమితాబచ్చన్ కార్పొరేషన్‌ను ప్రారంభించి, అనుభవం లేని వ్యాపారం కావడంతో రోడ్డున పడ్డారు. చివరకు ఉన్న ఇంటిని సైతం అమ్ముకోవలసి వచ్చింది. చుట్టూ అప్పులు, ఆదాయం లేదు, సినిమాల్లో అవకాశాలు లేవు, చేతిలో డబ్బు లేదు. రోడ్డున పడ్డ అమితాబ్ తిరిగి తనకు తెలిసిన నటన ద్వారానా తిరిగి సంపాదించి కోలుకున్నారు. అప్పులు తీర్చారు. అందరికీ అమితాబ్‌లా అవకాశాలు వచ్చి పడవు. ఒక్కసారి రోడ్డున పడితే కోలుకోవడం కష్టం. మళ్లీ జీరో నుంచి జీవితాన్ని ప్రారంభించాలి అని వ్యక్తిత్వ వికాస తరగతల్లో చెప్పడం వరకు బాగానే ఉంటుంది. కానీ అలా ప్రారంభించడం అంత ఈజీ కాదు. ప్రారంభించినా తిరిగి పూర్వ స్థితికి చేరుకోవడం అంత ఈజీ కాదు.
ఒక మనిషితో మనకున్న సంబంధం కొనసాగాలి అంటే ఆ వ్యక్తికి తగిన గౌరవం ఇవ్వాలి. అలా గౌరవం ఇస్తేనే సంబంధం నిలుస్తుంది. డబ్బు కూడా అంతే అది మన చేతిలోకి వచ్చినప్పుడు తగిన గౌరవం ఇవ్వాలి నిర్లక్ష్యం చేస్తే మీ చేయి దాటి పోతుంది. డబ్బుది సున్నిత మనస్తత్వం, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మీ వద్ద నిలువదు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చేయి దాటిన డబ్బు తిరిగి రాదని గ్రహించాలి.

- బి. మురళి