S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శిథిలాక్షరాలు

ప్రేమించను - కానీ పువ్వందిస్తాను
ఎదలో పూయనపుడు కొనైనా ఇవ్వాలిగా
కోరిక అలాంటిది మరి.

నీతోటి సంతోషం - నాకేటి ఆనందం
చెల్లించుకో కాస్త స్నేహసుంకం
ఎదలో లేని కోలాహలాన్ని
అభినయంలోనైనా చూపాలిగా.

నీతోటి చెలిమి - నాకేటి కలిమి
అయినా చేస్తాను మాటల చెలిమి
పరిమళించని మాటలను
అవసరాల అత్తరులోనైనా ముంచి తీయాలిగా.

నీతోటి ఏడుపు - నాకెందుకు చెప్పు
అయినా ఏడుస్తాను - రేపటి నీ మెప్పు కోసం
గుండెలో లేని తడిని కళ్లలో చూపాలిగా.

నిన్ను నిన్నుగా ప్రేమించడానికి
నీలానే ఎవరూ వుండరు
నీకోసం రావడానికి
నీకు మల్లే వెర్రి ఎవరికీ ఉండదు.

కల్మషాల కడలియైనా
కడిగిన ముత్యాల నందిస్తుంది
సెగలు పొగలై రగిలే ఎడారులైనా
చెలమల చెలిమిని అందిస్తుంది
ప్రళయ మారుత ఝంఝారావాలైన
స్వాంతనల సమీరాలతో
తనువును పులకింపజేస్తుంది
ప్రకోపించే అగ్నిసైతం
వెలుగునిచ్చే దివ్వెగా మారుతుంది
శూన్యమనుకొనే ఆకసమైనా
జలమేఘాలతో జగతిని నడిపిస్తుంది.

రెండు విభిన్నాల మధ్య
అనుకూలతల అనుబంధాలు
రెండు ఏకత్వాల మధ్య
ప్రతికూలతల ప్రతిబంధకాలు.

ప్రాణం లేని శిలాజాలను సైతం
పనిగట్టుకొని గుర్తిస్తాం
భద్రించి భావితరాల కందిస్తాం
ప్రాణమున్న బుద్ధిజీవులం
మనుషులుగా మనల్ని మనం గుర్తించలేమా
శ్వాసించే విలువలతో
మలి తరానికి సంధానకర్తలుగా మనలేమా.

కష్టాలు కాస్తే మానవత్వం
కష్టాలను పంచుకొంటే స్నేహతత్వం
సౌఖ్యాన్ని కోరితే ప్రేమ తత్వం
వాత్సల్యాన్ని పెంచుకొంటే సోదరత్వం
మనిషికుండే తత్వమే
మానవత్వం అనుకొన్నాం ఇన్నాళ్లు
తత్వశుద్ధిలేని
నిషిద్ధపు మనోతత్వమే
మనిషి తత్వమని తెలుస్తోంది ఈనాడు.

ఊహల్లో సైతం
ఉనికిని కోల్పోయిన విలువలు
కొత్త తరానికి వింతగా తోస్తున్న
కొరుకుడు పడని పదజాలాలు
చెల్లని కాలంలో
కలసికట్టుగా కాలరాసుకొంటున్న
శిథిలాక్షరాలు.

-కె.రవీంద్రబాబు 9052778988